సిలికాన్ వ్యాలీలో కన్నుల పండువగా ‘మనబడి’ స్నాతకోత్సవం
తెలుగు భాషా పరిరక్షణ కోసం సిలికానాంధ్ర, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అనుబంధంగా నిర్వహిస్తున్న ‘మనబడి’ స్నాతకోత్సవం అమెరికాలోని శాన్‌హోసేలోని పార్క్ సైడ్ కన్వెన్షన్ సెంటర్‌లో వైభవంగా జరిగింది. పద్మభూషణ్ పురస్కార గ్రహీత డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ప్రముఖ పాత్రికేయులు కొండుభట్ల రామచంద్రమూర్తి ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. అమెరికా, కెనడా, హాంకాంగ్ తదితర దేశాల నుంచి 1019 మంది విద్యార్థులు 2015-16 విద్యాసంవత్సరంలో ఉత్తీర్ణులయ్యారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ మనబడి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం అందరికీ ఆదర్శ ప్రాయమైనదన్నారు. సీనియర్ పాత్రికేయులు రామచంద్రమూర్తి మాట్లాడుతూ ఆంధ్రుల్ని ఆరంభ శూరులు అంటారు.. కానీ, సిలికానాంధ్రులు ఏదైనా మొదలు పెడితే దానిలో విజయం సాధించే వరకు వెనుదిరగరని కొనియాడారు. 150 మందితో మొదలైన ఈ విద్యా వ్యవస్థను ప్రస్తుతం 6000 మందికి పైగా విద్యార్థులు చదువుకునే విధంగా తీర్చిదిద్దారని ప్రశంసించారు. 2015-16 విద్యా సంవత్సరానికి తెలుగు విశ్వవిద్యాలయం నిర్వహించిన పరీక్ష విశేషాలను రిజిస్ట్రార్ ఆచార్య తోమాసయ్య వివరించారు. ‘మనబడి’ విద్యార్థులు భాషను లోతుగా అధ్యయనం చేయడంలో చూపిస్తున్న అంకితభావం తమను ముగ్ధుల్ని చేసిందన్నారు. ‘మనబడి’ 2007లో ప్రారంభమై అంచెలంచెలుగా ఎదుగుతూ అనతి కాలంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద తెలుగు భాషా బోధన కార్యక్రమంగా రూపొందిందని సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూఛిబొట్ల ఆనంద్ అన్నారు. మనబడి అధ్యక్షుడు రాజు చామర్తి మాట్లాడుతూ మనబడి ప్రపంచవ్యాప్తంగా 10 దేశాల్లో, అమెరికాలోని 35 రాష్ట్రాల్లో 250కి పైగా శాఖలతో 1000 మందికి పైగా భాషా సైనికులతో ఒక భాషా ఉధ్యమంలా వ్యాపిస్తోందన్నారు. మనబడి ఉపాధ్యక్షుడు దీనబాబు కొండుభట్ల మాట్లాడుతూ తెలుగు విశ్వవిద్యాలయం నిర్దేశించిన ప్రమాణాలను పాటిస్తూ మనబడి కొనసాగుతోందని, ఈ కోర్సు చదివిన వారికి అమెరికాలోని వివిధ స్కూల్ డిస్ట్రిక్ట్లలో ఫారిన్ లాంగ్వేజ్ క్రెడిట్‌లు లభిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య థోసామయ్య, అంతర్జాతీయ తెలుగు కేంద్రం అధిపతి డా. మునిరత్నం నాయుడు, పరీక్షల విభాగం అధిపతి డా. వై. రెడ్డి శ్యామల, ప్రజా సంబంధాల అధికారి డా. జుర్రు చెన్నయ్య, సిలికానాంధ్ర వైస్ ఛైర్మన్ దిలీప్ కొండిపర్తి, అధ్యక్షులు సంజీవ్ తనుగుల, రవీంద్ర కూచిభొట్ల, కిషోర్ బొడ్డు, ప్రభ మాలెంపాటి, మృత్యుంజయుడు తాటిపామల, శ్రీరాం కోట్ని, మనబడి ఉపాధ్యక్షులు శాంతి కూచిభొట్ల, భాస్కర్ రాయవరం, శ్రీదేవి గంటి, శిరీష చామర్తి, శ్రీవల్లి కొండుభట్ల, ప్రియ తనుగుల, స్నేహ వేదుల, అనిల్ అన్నం, జయంతి కోట్ని, పాత్రికేయులు బుద్ధవరపు జగన్ తదితరులు పాల్గొన్నారు.