వానర వీరుల వారధి నిర్మాణం
శ్రీరాముడి ఆనతి మేరకు కోట్ల సంఖ్యలో వానరులు వారధి నిర్మాణం ఆరంభించారు. నలుడు దగ్గరుండి వానరులచేత ఆ వారధిని నిర్మింపచేయడంలో నిమగ్నుడైనాడు. ఆ మహాకాయులైన వానరులు మొదటిరోజు పధ్నాలుగు యోజనాలు, రెండోరోజు ఇరవై, మూడోరోజు ఇరవైఒకటి, ఆ తరువాత రోజు ఇంకో యోజనం అదనంగా సువేలాద్రి హద్దుగా ఆ సేతువు నిర్మించారు. ఆ మహాప్రజ్ఞాశాలి నలుడు నిర్మించిన సేతువు ఆకాశంలో స్వాతిపథంలా విరాజిల్లింది. తన తండ్రి విశ్వకర్మ కీర్తిని సార్థకంగా నిలిపాడు నలుడు. దేవతలంతా దాన్ని చూసి ఎంతో అబ్బురపడ్డారు. మెచ్చుకున్నారు. ఇటువంటి పరమాద్భుతం ఇదివరలో ఎప్పుడూ ఎక్కడా కనీవినీ ఎరిగింది కాదు. విభీషణుడు చేతిలో గద ధరించి దక్షిణతీరంలో దానికి కావలి కాస్తున్నాడు. ఆ వారధి సముద్రానికి పాపిటలా భాసించింది. సుగ్రీవుడి విన్నపం మేరకు శ్రీరాముణ్ణి హనుమంతుడూ, లక్ష్మణుణ్ణి అంగదుడూ వాళ్ళ భుజాల మీద ఎక్కించుకొని కదిలారు. అమిత వేగంతో ఆ వానరమహాసేన అవతలిగట్టు చేరింది.
అప్పుడు రాముడు తమ్ముడితో ''ఇప్పుడు అన్నీ శుభశకునాలే కనపడుతున్నాయి, ఇక్కడ మన వానరసేనకు స్థలం, జలం, వసతి, ఆహారం కొల్లలుగా లభిస్తుంది. ఇప్పుడు తోచే శకునాలను బట్టి మహా భయంకర యుద్ధం సంభవించనుంది. నాయనా! ఇప్పుడు గరుడవ్యూహం రచించి మనం సిద్ధంగా ఉందాం. ఈ ప్రదేశమంతా రక్తమాంసపంకిలం కాబోతున్నది'' అని చెప్పాడు, ''హనుమంతుడూ, అంగదుడూ, సుగ్రీవుడూ మొదలైన వానర ప్రముఖులతో కలిసి ఇప్పుడు మనం లంక ఆనుపానులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం'' అని అన్నాడు. అప్పుడు వానరులు విడిసిన ఆ సముద్రతీరం చంద్రుడితోపాటు కిక్కిరిసిన నక్షత్ర కాంతులతో ఆకాశంలా విరాజిల్లింది. ఇంతలో లంకలో యుద్ధభేరీలు, నగారాలు, డప్పులు, శంఖధ్వానాలు పెచ్చరిల్లాయి. ఇవతలి తీరంలో వానరుల నుంచి మహామేఘ గర్జనలను తలపింపజేసే భయంకర గర్జనలు లంకలోనివారికి వినిపించాయి.
ఆ లంకా పట్టణాన్ని రాముడు చూశాడు. ఆయనకు సీతాదేవిని గూర్చిన చింత, దిగులు ఎక్కువైనాయి. అప్పుడిక వానరులు తమదగ్గర ఇప్పటివరకు బంధించి ఉంచిన రావణుడి వేగులవాడైన శార్దూలుణ్ణి విడిచిపెట్టారు. వెంటనే ఆ రాక్షసుడు రావణుడి సన్నిధికి పోయి వానరులు తనను ఎలా మర్దించిందీ, వాళ్ళు ఎటువంటి ఆగ్రహంతో ఊగిపోతున్నదీ, సీతాదేవి ఎక్కడ ఉన్నదో వెంటనే తెలుసుకోవాలని ఉద్యుక్తులవుతున్నదీ, ఇదంతా రావణుడు తనను వట్టి పనికిమాలినవాడిగా ఎంచుతాడేమోనన్న సందేహంతో చిలవలు పలవలుగా చెప్పాడు. ''వెంటనే ఏదో ఒకటి నిర్ణయించాలి యుద్ధమో, లొంగిపోవడమో'' అని కూడా రావణుణ్ణి ఆ గూఢచార దళాధిపతి రెచ్చగొట్టాడు.
శుకసారణుల గూఢచర్యం
రావణుడు అందుకు కోపం తెచ్చుకొని తన మంత్రులైన శుకసారణులను పిలిపించి ''శ్రీరాముడి యుద్ధవ్యూహం మీరు ఒరులెరుగకుండా తెలుసుకొని, బాగా కనిపెట్టి రావాలి'' అని ఆజ్ఞాపించాడు. ''వాళ్ళ సైనికదళాలు, వాటి దళపతులు, ఎవరెవరు? వాళ్ళు సేతువును ఎలా నిర్మించారు? ఈ విషయాలన్నీ వెంటనే నాకు వచ్చి చెప్పాలి. వాళ్ళ అస్త్రశస్త్రబలాలు కూడా అంచనా వేసి నాకు చెప్పాలి'' అని తన మంత్రులను ఆజ్ఞాపించాడు.
అప్పుడా గూఢచారులు వానరవేషాలు ధరించి శ్రీరాముడి సైన్యంలో కలిసిపోయినారు. ఆ సైన్యసముద్రాన్ని చూసి హడలిపోయినారు. వారధి దాటుతూ అంతులేని సేన ఇంకా అక్కడికి చేరుతూనే ఉంది. వాళ్ళు మారువేషాలలో ఎంత జాగ్రత్తగా ఆ వానరసేనలో సంచరిస్తూ ఉన్నా విభీషణుడు వాళ్ళను గుర్తించి పట్టి బంధించి శ్రీరాముడికి అప్పగించాడు.
వాళ్ళు ఏ దురుద్దేశంతో, కపటంతో వచ్చారో రాముడికి చెప్పి వాళ్ళను కఠినంగా శిక్షించవలసిందిగా రాముడితో విన్నవించాడు విభీషణుడు. ఆ శుకసారణుల ప్రాణాలు పైపైనే ఎగిరిపోయాయి. వాళ్ళు రాముణ్ణి తమను వదిలిపెట్టవలసిందిగా దీనంగా వేడుకున్నారు. యధార్థం చెప్పారు. రాముడు వాళ్ళను కరుణించి ''ఇంకా మీరు తెలుసుకోవాల్సిన విషయాలుంటే అన్ని సంగతులూ పరిశీలించి మీ రాజుకు వివరించండి'' అని చెపుతూ, విభీషణుడికి నచ్చచెప్పి వాళ్ళను వదిలేశాడు. వాళ్ళు బతుకుజీవుడా అంటూ లంక చేరుకున్నారు. అవతలితీరంలో జరిగినదంతా రావణుడికి వివరించారు. విభీషణుడు తమను బంధించటం, రాముడు దయతో వదిలిపెట్టడం గూర్చి కూడా చెప్పారు. ''సీతాదేవిని వాళ్ళకు ఇచ్చివేస్తేనే శుభం కలుగుతుంది. లేకపోతే పెనుముప్పు పొంచి ఉంది'' అని కూడా భయపడుతూనే చెప్పారు.
రావణుడు వాళ్ళు చెప్పిన విషయాలు ఒక క్షణం పర్యాలోచన చేసి వాళ్ళతో తన భవనపు పై అంతస్తు పైకి చేరి, వానరసేనను తేరిపార చూసి 'ఇందులో ప్రముఖ సేనానాయకులెవరు? సేనావిభాగ దళాధిపతులెవరు? వాళ్ళు ఎక్కడెక్కడనుంచి ఈ వానరసైన్యాలను సమీకరించుకొని వచ్చారు? చెప్పవలసిందని తన మంత్రులను కోరాడు. అప్పుడు సారణుడు తన ప్రభువుకు వానరసైన్యంలో ప్రముఖ సేనాపతులను గూర్చి, వాళ్ళ బలపరాక్రమాలను గూర్చి విశదంగా చెప్పాడు.
శుకరసారణులు సుగ్రీవుడి సేనానివేశాన్ని గూర్చి రావణుడికి చెప్పటం
నీలుడు సమస్త వానరసేనాధిపతి అనీ, అతడు సాటిలేని బల పరాక్రమోత్సాహశాలి అనీ, అతడే సేనాదళానికి నాయకత్వం వహిస్తున్నాడనీ, సుగ్రీవుడు పురోభాగంలో ఉంటాడనీ, అలాగే అంగదుడు లంకలో ఎప్పుడు ప్రవేశిస్తానా అని పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ పర్వత సన్నిభాకారంతో తన పొడవాటి తోకను భూమిమీద భయంకరంగా తాడిస్తూ నడుస్తున్నాడనీ, అడుగో కనపడుతున్న హనుమంతుడు తేరిచూడరాని మహా పరాక్రమవంతుడనీ, అతడే సీతాదేవిని చూసి మాట్లాడి పోయినవాడనీ, అంగదుడికి వెనుక ఉన్న నలుడు లంకాపట్టణాన్ని కూలదోయడానికి సంరంభిస్తున్నాడనీ, అతడే మహాసాగరంపై వంతెన కట్టినాడనీ, అతడి వెనక సేనావిభాగంలోని వానరులు సింహనాదాలు చేస్తున్నారనీ, ఆయన పార్శ్వాలలో శ్వేతుడు, కుముదుడు, రంభుడు, శరభుడు, పనసుడనే నడిచే కొండలవంటి మహావానరులున్నారనీ, వినతుడు, క్రోధనుడు, గవయుడు ప్రచండ పరాక్రమశాలులనీ వాళ్ళు తమ సేనావిభాగాలతో కదలి వస్తున్నారనీ, వాళ్లు ఒక్కొక్కరు నేల ఈనినట్లు వస్తున్న తమ తమ లక్షలాది, కోట్లాది వానరాయుధాలతో నీపై ఎప్పుడు దుముకుదామా అని వేగోద్ధతులవుతున్నారనీ ప్రముఖ సేనానాయకులను గురించి ఆ మంత్రి రావణుడికి ఎరుకపరచాడు.
ఆ తరువాత ప్రత్యేక దళాధిపతులను గూర్చి వేర్వేరుగా చెప్పాడు. ''హరుడనే వానరుడు సుగ్రీవుడి ఇష్టసేనాని. ఈ హరుడు అసంఖ్యాక సేనలతో వస్తున్నాడు. ఇక తరువాత భల్లూక సేనావాహినిని గూర్చి చెపుతున్నాను. వీళ్ళు ఒక్కొక్కరు నీలమేఘాల మాదిరిగా, కాటుక కొండల మాదిరిగా విజృంభించి వస్తున్నారు. వీళ్ళంతా మహా భయంకరులు. ధూమ్రుడూ, వాడి తమ్ముడు జాంబవంతుడూ భల్లూకసేనా సమూహంతో లంకనెప్పుడెప్పుడు మట్టుపెడదామా అని ఉగ్రవీరులుగా వస్తున్నారు. ఇక జాంబవంతుణ్ణి గూర్చి వేరే చెప్పనేలేము. దేవాసుర యుద్ధంలో దేవేంద్రుడికి గొప్ప అండగా నిలిచాడు జాంబవంతుడు. ఇంద్రుడీ భల్లూకరాజుకు ఎన్నో వరాలిచ్చాడు. దంభుడనే భల్లూక ప్రముఖుడు ఎగిరెగిరి గంతులు వేస్తూ వస్తున్నాడు. సన్నాదుడు వానరులందరికీ పితామహుడివంటివాడు. ఒకప్పుడు ఈ వీరుడు ఇంద్రుడితో కూడా యుద్ధం చేశాడు. ఇంద్రుడీతణ్ణి జయించలేకపోయినాడు. క్రథనుడూ, ప్రమాథి అనే వీరులు శత్రువినాశకులు. పూర్వం ఒకప్పుడు శంబసాదనుడనే క్రూర రాక్షసుడు గజరూపంతో మునులను హింసల పాల్జేస్తుండగా కేసరి అనే మహావానరుడు శంబసాదనుణ్ణి సంహరించాడు. అందువల్ల వానరులకూ, ఏనుగులకూ వైరం వచ్చింది. ఆ ప్రబల వైరాన్ని సాధించేందుకు ప్రమాథి ఇప్పుడు కూడా తన కంటపడ్డ మదపుటేనుగులను చరచి చంపివేస్తాడు. లేదా పర్వతాలకు కొట్టి చంపుతాడు. అటు చూడు; గోలాంగూల (కొండముచ్చుల) సేనాధీశుడు గవాక్షుడు, కోటిమందిని తనజాతి వారిని వెంటబెట్టుకొని సేతువు మీద వస్తున్నాడు.
ప్రమాథి ఒక్కడే తన సేనతో లంకాపట్టణాన్ని సర్వనాశనం చేస్తానని వీరాలాపాలు పలుకుతున్నాడు. మహావీరుడు కేసరిని చూడు. ఈ వానరులంతా పెద్దపులులలాంటివారు. ఉగ్ర సర్పాలు వాళ్ళకు సాటిరావు. అటు చూడు; శతవలి ఆ వానరవీరుల మధ్య ప్రకాశిస్తున్నాడు. ఆ వానరుడు అమిత బల పరాక్రముడు, సూర్యోపాసకుడు. వీళ్లు కోట్లాది సంఖ్యలో లంకను ముట్టడించబోతున్నారు.'' ఆవిధంగా సారణుడు చెప్పి ముగించిన తర్వాత శుకుడు కూడా ఆ వానరవీరుల అతులితపరాక్రమాన్ని విస్తరించి చెప్పాడు. ''వీళ్ళు దేవతలు, గంధర్వుల అంశలతో పుట్టిన వాళ్లు'' అని చెప్పాడు. తన ఎదిరి పక్షాన్ని, శత్రువులను స్తోత్రపాఠాలతో అభిమానించటం రావణుడికి నచ్చలేదు. ఆ మంత్రులపై రావణుడు మండిపడ్డాడు. వాళ్ళు పరాభవంతో క్రుంగిపోయి రావణుణ్ణి జయస్తోత్రాలతో పొగడిన తర్వాత అక్కడనుంచి నిష్క్రమించారు.
అప్పుడు రావణుడు శార్దూలుణ్ణి ఆ వానరవీరుల జన్మ వృత్తాంతాలు, బాహుబల పరాక్రమాలు చెప్పవలసిందిగా కోరాడు. 'మహారాజా! అదుగో చూడు, అక్కడ మదించిన ఏనుగులా కనపడుతున్నవాడే కేసరి కుమారుడు హనుమంతుడు. సీతాదేవిని చూసి ఆ వృత్తాంతం వాళ్ళకు తెలిపిన మహావీరుడితడే. మొదటిసారిగా సముద్రలంఘనం చేసిన అద్భుత బలవంతుడు. ఈ హనుమంతుణ్ణి మొదటినుంచీ ఎరిగిన మిత్రుడొకడున్నాడు. అతడు నాకు హనుమంతుడి గూర్చి చెప్పాడు. ఇతడు పుట్టటమే అమిత జవసత్త్వాలతో, బలదర్పాలతో పుట్టాడు. ఒకరోజు సూర్యోదయం చూసి పండు అనుకొని ఆ సూర్యుడిని పట్టుకోవటానికి ఎగిరిపోయినాడు. కాని ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టగా ఉదయపర్వతంపై పడిపోయినాడు. ఒక కొండచరియపై పడి ఆయన గవద (హనువు) చితికిపోయింది. అప్పటినుంచీ హనుమంతుడనే పేరు వచ్చింది ఈ అంజనాపుత్రుడికి".
అదుగో ఆ హనుమంతుడి సమీపంలోనే ఉన్నారు రామలక్ష్మణులు. రాముడు ఎటువంటివాడంటే అన్ని దివ్యాస్త్రాలూ ఆయన అధీనంలో ఉన్నాయి. ఆయన వర్ణం శ్యామసుందరం. ఆయన పక్కనే ఉన్న లక్ష్మణుడు బంగారు చాయమేనివాడు. కోపం వస్తే గగనాన్ని సైతం చీల్చగలడు. రాముడికి లక్ష్మణుడు బహ్ణిప్రాణం, కుడిభుజం. వాళ్ళ సమీపంలోనే వినయంగా మసలుకొంటున్నవాడు విభీషణుడు. ఇప్పటికే విభీషణుడికి రాముడు లంకారాజ్యపట్టాభిషేకం చేశాడు. అందువల్ల విభీషణుడు వాళ్ళకు సర్వశక్తులా సాయపడుతున్నాడు. ఆ రామలక్ష్మణుల మధ్య పెద్ద కొండలాగా కనపడుతున్నవాడున్నాడే, వాడే సుగ్రీవుడు. అతడు కిష్కింధకు ప్రభువు. వానరవీరులూ, రాజులూ, ఇతడి వశవర్తులు'' అని శుకుడు చెపుతుండగా రావణుడు ఆలోచనలో పడ్డాడు.
"జాంబవంతుడి సోదరుడు ధూమ్రుడు. మహా పరాక్రమవంతుడు. సుషేణుడు, వరుణుడూ, సుముఖుడూ, దుర్ముఖుడూ, వేగదర్శీ అనే వాళ్ళు వానర రూపంలో ఉన్న సాక్షాత్తు మృత్యుదేవత ప్రతిరూపాలు. వాళ్ళను బ్రహ్మదేవుడే సృష్టించాడు. అగ్నిహోత్రుడి పుత్రుడు నీలుడు. ఇంద్రుడి పుత్రుడు వాలి. శ్వేతుడూ, జ్యోతిర్ముఖుడూ సూర్యుని పుత్రులు. వాళ్ళు జయించనలవికాని మహా పరాక్రమవంతులు" అని శార్దూలుడు రావణుడికి చెప్పాడు.