ఈ క్రింది "ప్రశ్న"కు పద్య రూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖులోపలపంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేటతెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము.
ఈ మాసంప్రశ్న:
(వాగమూడి లక్ష్మీ రాఘవరావుగారు పంపిన సమస్య)
మంచినంతయు మాటలందున మార్చివేయుచుఁ చంపుచున్
గతమాసం ప్రశ్న:
జలమును పారవోయుటయె చక్కని కార్యము వేసవందునన్
ఈ ప్రశ్నకు మాకు అందిన క్రమములో పూరణలు ఇలా వున్నాయి.
రాజేశ్వరి నేదునూరి, న్యూజెర్సీ
బలిమిని దూరభారమగు బావులనుంచియె తోడితెచ్చి నన్
జలమును పారవోయుటయె ?,చక్కని కార్యము వేసవందునన్
విలువ నెరింగి నీతరుల బీటలువారిన నేల తల్లికిన్
కలకల మందునన్ ప్రజకు గాడుపు వేళల చుక్కనీ రిడన్
సూర్యకుమారి వారణాసి, మచిలీపట్టణం
కలవర మొందజేయుచు ను కన్నులు మండెడు సూర్య రశ్మి లో
కలకల లాడు మొక్కలట కానగ వచ్చిన వాడి పోవుచున్
విలవిల లాడు దాహము నవేగు చు జీవులు ఆర్తి నుండగా
జలమును పారవోయుట యె చక్కని కార్యము వేస వందు నన్
వాగమూడి లక్ష్మీ రాఘవరావు, కరీంనగర్
కొలనులయందు, కాలువల కూటమియందు, తటాకమందునన్
సలిలము లేకమానవులశక్తులమంచును చేతులెత్తగన్
యిలజధారఁ బెంచుటకు నింకుడుగుంటలుఁ ద్రవ్వ వానిలోఁ
జలమును పారవోయుటయె చక్కని కార్యము వేసవందునన్
జంధ్యాల కుసుమ కుమారి, హైదరాబాదు
పలుచన సేయ నేమి కలుపంగ దగున్ శుచియైన పాలకున్
తలపగ వర్షసిక్తమగు ధాన్యమునేమి యొనర్పగావలెన్
జలమిడుటెట్టి కర్జము,నిజార్క విజృంభణమెన్నడోజుగన్
జలమును, పారవోయుటయె ,చక్కని కార్యము, వేసవందునన్.
(ఓజు=వరుస)
ఇంద్రగంటి సతీష్ కుమార్, చెన్నై
మలమల మాడుటెండలకు మానవ చేతలె కారణంబగున్;
వెలవెలబోయె చెట్లు కడు వేసవి తాపము వల్ల మానవా;
పలుకులు మాని మొక్కలకు పాదులు గట్టుము, అందు వ్యర్ధమౌ
జలమును పారబోయుటయె చక్కని కార్యము వేసవందునన్!
శివప్రసాద్ చావలి, సిడ్నీ, ఆస్ట్రేలియా
జలమును కూడబెట్టుటయు చాల శుభం బది లెస్స! త్రాగగన్
జలమది లేని జీవనము చాల నికృష్ట మగున్! మరీమహీ
తలమున దప్పికిన్ యనుచితంబగుచున్ నిఖిలంబు వ్యర్థమౌ
జలమును పారవోయుటయె చక్కని కార్యము వేసవందునన్!