ప్రపంచంలోని ప్రాథమిక ,మాధ్యమిక మరియు ఉన్నత విద్యాలయాలలోని పాఠ్య ప్రణాళిక,బోధనా పద్దతులు,యోగ్యతా నిర్ధారణ తదితర అంశాలను క్షుణ్ణంగా తనఖీ చేసి గుర్తింపు నిచ్చే సంస్థలలో అత్యంత విశ్వసనీయత కలగిన సంస్థ ‘WASC’ (వెస్ట్రన్ అసోషియేషన్ ఆఫ్ స్కూల్స్ అండ్ కాలేజస్). చాలా విద్యా సంస్థలు WASC గుర్తింపు పొందటం ప్రతిష్టాత్మకం గా భావిస్తుంటాయి. ప్రపంచంలోనే అలాంటి గుర్తింపు పొందిన ఏకైక తెలుగు బోధనా కార్యక్రమం సిలికానాంధ్ర మనబడి.
మనబడి డీన్ మరియు అధ్యక్షులు రాజు చమర్తి గారి నాయకత్వంలో దాదాపు 18 నెలలుగా ఎంతో మంది మనబడి కార్యకర్తలు ఈ గుర్తింపు కోసం అహర్నిశలు పనిచేసారు. ఈ గుర్తింపు సాధించే ప్రక్రియలో వాస్క్ (WASC)అధికారులు మనబడి లోని విద్యార్ధులకు,ఉపాధ్యాయులకు మరియు తల్లీ తండ్రులకు మౌఖిక పరీక్షలు నిర్వహించడమే కాకుండా కాలిఫోర్నియా లోని సాండి యాగో మరియు అర్కాడియ లాంటి కొన్ని కేంద్రాలలో ఆకస్మిక పర్యటనలు కూడా జరిపారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిధి గా హాజరయిన ‘వాస్క్’ సంచాలకులు డాక్టర్ జింజర్ హవ్నిక్ మాట్లాడుతూ తాను ఎన్నో కేంద్రాలకు తనఖీలకు వెళ్తుంటానని, కాని మనబడి లో తెలుగు నేర్చుకొంటున్న విద్యార్ధుల, నేర్పిస్తున్న ఉపాధ్యాయుల మరియు తల్లీ తండ్రుల అభిరుచి నన్ను ఎంతగానో ఆకట్టుకొన్నదని తెలిపారు.శాన్ జోసె లోని పార్క్ సైడ్ హాల్ లో అత్యంత కన్నుల పండుగగా జరిగిన ఈ కార్య క్రమానికి భారత దేశం నుంచి ముఖ్య అతిధులుగా పద్మభూషణ్ పురస్కార గ్రహీత డా.యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ గారు, సీనియర్ పాత్రికేయులు శ్రీ.కే.రామ చంద్ర మూర్తి గారు మరియు జగన్ బుద్ధవరపు, సిలికానాంధ్ర మరియు మనబడి కార్య వర్గ సభ్యులు ఆనంద్ కుచిభోట్ల,రాజు చమర్తి, దీన బాబు కొండుభట్ల, దిలీప్ కొండిపర్తి, శ్రీదేవి గంటి, భాస్కర్ రాయవరం , సంజీవ్ తనుగుల , ప్రభ మాలెంపాటి , శాంతి కుచిభోట్ల తదితరులు హాజరయ్యారు.
ప్రతిష్టాత్మకమైన WASC గుర్తింపు లభించడం ద్వారా, అమెరికా లోని అనేక స్కూల్ డిస్ట్రిక్ట్ లలో తెలుగు కు ప్రపంచ భాష గుర్తింపు (ఫారిన్ లాంగ్వేజ్ క్రెడిట్) లభించడం మరింత సులభతరం అవుతుందని, మనబడి అద్యక్షులు రాజు చమర్తి తెలిపారు. అమెరికా లోని 35 రాష్ట్రాలు ,12కి పైగా దేశాలు , 6200 మంది విద్యార్ధులతో క్రమబద్ధమైన పాఠ్య ప్రణాళికతో తెలుగులో వారాంతపు బోధనా తరగతులు నిర్వహిస్తున్న సిలికానాంధ్ర మనబడి, ఇప్పటికే కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఫ్రేమోంట్ యూనిఫైడ్ స్కూల్ డిస్ట్రిక్ట్ , నార్త్ కరోలినా రాష్ట్రంలోని వేక్ కౌంటీ స్కూల్ డిస్ట్రిక్ట్ లో, ఇల్లినాయిస్ మరియు మిచిగాన్ రాష్ట్రాలలోని వివిధ స్కూల్ డిస్ట్రిక్ట్ లలోని ఉన్నత పాఠశాల లలో చదివే విద్యార్ధులు కళాశాలలో ప్రవేశానికి అర్హత సంపాదించటానికి కావలసిన ఫారిన్ లాంగ్వేజ్ క్రెడిట్ గా తెలుగుకు గుర్తింపు సాధించిందని మనబడి సంచాలకులు (గుర్తింపు) శ్రీదేవి గంటి తెలిపారు.