బాల రంజని
వినయం విజయానికి చిహ్నం.
- ఆదూరి.హైమవతి

పూర్వం ఒక అడవిలో ఒక నదీ తీరాన చాలా వృక్షాలు ఉండేవి. వాటన్నింటిలోకీ చాలా పొడవైనది బూరుగు చెట్టు. నదీ తీరంలో పచ్చని పచ్చిక ఉండేది. నీటి అలలు వచ్చినప్పుడల్లా ఆ గడ్డి పోచలు తలలు వంచి అవి పోయాక లేస్తుండేవి. ఒక రోజున వర్షం పడటంతో నదికి ప్రవాహ వేగం పెరిగింది. దాంతో గడ్డి పోచలు తలలు వంచి నీటి ప్రవాహం వాలుకు ఉండి పోవలసి వచ్చిం ది. సాయం కాలానికి నదీ ప్రవాహం తగ్గింది.అప్పుడు పచ్చిక మొక్కలు హాయిగా తల లెత్తి నవ్వు కుంటూ చుట్టూ చూడ సాగాయి.

నది గట్టు పక్కనే ఉన్న బూరుగు చెట్టు వాటి వైపు చూసి ఫక్కున నవ్వింది. ఆ సవ్వడికి గడ్డి మొక్క లన్నీ తలలు తిప్పి ఆ సవ్వడి వచ్చిన వైపు చూశాయి. వాటిని చూసి బూరుగు చెట్టు తిరిగి పక పకా నవ్వింది.

పక్కనే ఉన్న మిగిలిన చెట్లు దాని వైపు చూసి , "ఎందుకు నవ్వుతున్నావ్?" అని అడిగాయి.

దాని కి బూరుగు చెట్టు " గమనిస్తే మీరంతా కూడా ఫక్కున నవ్వు తారు.చూడండీ ఉదయం నుండీ ఈ గడ్డి పోచలు నీళ్ళకు భయ పడి తలలు వంచుకుని ఉన్నాయి . ఇప్పుడు నీరు తగ్గాక తల లెత్తాయి. వాటిని చూస్తే నవ్వు కాక మరే మొస్తుందీ! పాపం చిరుప్రాణులు! వాటి భయం చూసి నాకు ఆగని నవ్వు వస్తున్నది " అంటూ ఇంకా నవ్వ సాగింది బూరుగు చెట్టు.

మిగతా చెట్లు " తప్పుకాదూ ? ఇతరులను చూసి అలా నవ్వడం ! అవి వింటే ఏమను కుంటాయి. చెట్ల జాతి మన మంతా ఒక్కటే కదా!"అన్నాయి.

"ఏంటీ! ఆ గడ్డి పోచలూ మనమూ ఒక్కటేనా! ఆ గడ్డి పోచలు మన జాతా? మాట్లాడకండి , నాకు అసహ్య మే స్తుంది." అంది ఠీవిగా తలెత్తి.

"గడ్డిపోచలూ మన జాతే ! పెద్ద చిన్న అంతే తేడా! మనలో వట వృక్షం ఎంత పెద్దదీ! మనం కేవలం చెట్లమే, వృక్షాలం కాదు కదా! అలాగే ఆ గడ్డి పోచలూనూ, ఎవరి గొ ప్పవారిదే!" అంది వేప చెట్టు.

" గడ్డిపోచలన్నీకలిసి ఏనుగునే కట్టేస్తాయి అనే విషయం నీవు విన్నట్లు లేదు." అంది రాగిచెట్టు.

"చాలించండి ! మీ మాటలు మన వృక్ష జాతికే అవమానం . పసి పిల్లలు వేలితో తుంపితే తెగే ఈ గడ్డి పోచలూ మనమూ ఒక జాతా!" అంటూ అట్ట హాసంగా అరిచింది బూరుగు చెట్టు.

ఇంతలో గాలి వీచడం మొదలైంది. రాను రానూ క్షణాల్లో గాలి వేగం హెచ్చింది. చూస్తుండ గానే తీవ్రమైన గాలి గా మారింది .ఆ గాలి తాకిడికి చెట్ల తలలన్నీ ఊగసాగాయి .ఆకులు తెగి పడ సాగా యి. రెమ్మలు విరగ సాగాయి , కొన్ని చెట్ల కొమ్మలు సైతం తెగి క్రింద పడ సాగాయి. ఉన్నట్లుండి బూరుగు చెట్టు మధ్యకు విరిగి పడి మొండెం మాత్రమే మిగిలింది. మరి కాస్సేపటికి గాలి తగ్గింది. చెట్లన్నీ తెప్పరిల్లి చూట్టూ చూశాయి. అన్నిచెట్లకూ కేవలం కొన్నికొమ్మలూ రెమ్మలూ మాత్రమే పోగా బూరుగు చెట్టు సగానికి తెగి ఉండటం చూసి , సానుభూతిగా పలక రించాయి.

"బూరుగు వృక్షమా! క్షేమమేకదా! " .బూరుగు విచారంగా ,బలహీన స్వరంతో , " గర్వించిన దాని ఫలితం వెంటనే తగిలింది. చిన్న తనంలో మా అమ్మ 'గర్వం తీయనైన విషం.ఎవ్వడూ దేనికీ గర్వించకు, పెద్ద వారి ముందు, మన కన్నాశక్తి వంతుల ముందూ తలవంచడం మంచిది. డాంబికం చేటు చేస్తుంది, గొప్పలకు పోకు, వినయంగాఉండు ' అని చెప్పింది, నేనే మీ అందరి కంటే ఎత్తుగా ఉన్నానని గర్వించి , మిమ్మూ , ఆ గడ్డి పోచ లనూ తక్కువ చేసి మాట్లాడాను. నేను మధ్యకు విరిగాను కానీ,ఆ గడ్డి పోచ ల లాగే తలలు ఊపు కుంటూ ఉన్నాయి.అంతా నన్ను , నా గర్వాన్నీ మన్నించండి." అంది.

మిగతా చెట్లన్నీ' మిత్రమా! తెలీక జరిగిన పొరపాటు మర్చిపో. పశ్చాత్తాపమే దానికి విరిగిడు. కొద్ది రోజు ల్లోనే తిరిగి చిగురిస్తావులే ,కొమ్మలు తొడుగు తావులే దిగులుపడకు.. బాధపడకు." అంటూ బుజ్జ గించాయి.

నదీ తీరం లోని గడ్డి పోచలు మాత్రం ఎప్పటిలా అలాగే హాయిగా నవ్వుకుంటూ, నీరు వచ్చినపు డు తల లు వంచు కుంటూ ,తర్వాత ఎత్తుకుంటూ ఉన్నాయి. వినయం విజయానికి చిహ్నం కాదూ!

నీతి- గర్వం విష తుల్యం.
ప్రశ్నలు:-

1. బూరుగుచెట్టు ఎలాంటిది?
2. గడ్డిపోచలు ఎలాఉండేవి?
3. మిగతా చెట్లు బూరుగు చెట్టుకు ఎమి చెప్పాయి?
4.పెనుగాలికి ఎమి జరిగింది?
5. విరిగిన బూరుగు స్నేహితులతో ఏమంది?


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)