సారస్వతం
తెలుగు సినీ గీతాలలో ‘గోదావరి’
- డాక్టర్ తన్నీరు కళ్యాణ్ కుమార్

దక్షిణ భారతదేశంలోనే అతి పెద్దనది గోదావరి. మహారాష్ట్రలోని నాసిక్ దగ్గర త్రయంబకం దగ్గర పుట్టి, ఆంధ్ర- తెలంగాణా రాష్ట్రాలలో ప్రవహించి చివరకు గౌతమిగా, వశిష్టగా బంగాళాఖాతంలో సంగమించే పవిత్ర పావని గోదావరి. తెలుగు ప్రాంతాన్ని అన్నపూర్ణగా చేయడంలో ప్రధానపాత్ర పోషించిన ఈ నది తెలుగు వారి జీవితాలతో పెనవేసుకుపోయింది. తెలుగు సంస్కృతిలో గోదావరి ఓ సమగ్రభాగం. తెలుగువారి జలసిరిగానే గాక జీవసిరిగా కూడా వర్ధిల్లుతున్న నదీమతల్లి గోదావరి. సంస్కృత – తెలుగు, ప్రాచీన – ఆధునిక కవులు, రచయితలుతో పాటు జానపదులు సైతం తమ సాహిత్యంలో గోదావరికి సముచిత స్థానం ఇచ్చారు. గోదావరి తీరాన్ని నేపథ్యంగా తీసుకొని అనేక సినిమాలు వచ్చాయి. వస్తున్నాయి. ఈ నది తెలుగు సినిమా రంగాన్ని స్పందింపజేసింది. తెలుగు సినీ గేయ రచయితలను పరవశింపజేసింది. తెలుగు సినీ పాటలను ఉరకలెత్తించింది. శ్రోతలలో ఉత్తేజాన్ని నింపింది.

1952వ సంవత్సరంలో వచ్చిన ‘మరదలు పెళ్ళి’ చిత్రంలో శ్రీశ్రీ రాసిన “పిలిచే గోదారొడ్డు, నోరూరించే బందరు లడ్డు” అనే పాటలో తొలిసారి గోదావరి ప్రస్తావన కన్పిస్తుంది. ‘పెద్ద మనుషులు’ చిత్రంలో కొసరాజు “కుక్కతోక పట్టి గోదావరీదితే, కోటిపల్లి కాడ తేలేనయా” అనీ, ‘చిరంజీవులు’ చిత్రంలో ఆరుద్ర రాసిన “నీ ఆశ అడియాస.....నీ బ్రతుకు అమావాస” అనే పాటలో “కన్నులలో గోదారి కాలువలే కట్టింది” అని కన్పిస్తుంది. అట్లే ‘పల్లెటూరు’ చిత్రానికి వేములపల్లి శ్రీకృష్ణ రాసిన ‘చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా’ అనే పాటలో “కల్లోల గౌతమి, వెల్లువల కృష్ణమ్మ, తుంగభద్ర తల్లి పొంగి పొరలిన చాలు” అని గోదావరి ప్రస్తావన కన్పిస్తుంది. ‘విచిత్ర కుటుంబం’ సినిమాలో ఆంధ్రదేశ వైభవాన్ని వర్ణిస్తూ డా. సి. నారాయణరెడ్డి రాసిన “ఆడవే జలకమ్ములాడవే....’అనే పాటలో “ఆంధ్ర సంస్కృతికి తీయని క్షీరధారలై, జీవకళలొలుకు గోదావరి తరంగాల....”అంటూ గోదావరి ప్రాశస్త్యాన్ని ప్రస్తావించారు. ‘మూగమనసులు’ చిత్రంలో ఆరుద్ర రాసిన “గోదావరి గట్టుంది, పిట్ట మనసులో ఏముంది” అనే పాట తెలియని తెలుగు శ్రోత ఉండరనడం అతిశయోక్తి కాదేమో.

‘ఉయ్యాల – జంపాల’ చిత్రంలో ఆరుద్ర రాసిన “కొండగాలి తిరిగింది.....గుండె ఊసులాడింది...గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది” అనే పాట విస్తృత ప్రజాదరణ పొందింది. ఈ పాట వింటుంటే పడవలో గోదావరి నదిపై విహరిస్తున్న అనుభూతి కలుగకమానదు. ‘చిల్లరకొట్టు చిట్టెమ్మ’ చిత్రంలో డా.సి.నారాయణరెడ్డి రాసిన “తల్లి గోదారికే ఆటుపోటుంటే...తప్పుతుందా మనిషికీ తలరాత” అనే పాట చిన్నపాటి గీతోపదేశంలా అనిపిస్తుంది. 'ఎదురీత' చిత్రంలో వేటూరి వ్రాసిన "గోదావరి వరదల్లో, రాదారి పడవల్లే నీ దారి నీదేనన్నా.... ఉయ్యాలలూగే ఈ జగమంతా ఊహల కందని వింత...ఈ లాహరిలో నీవెంతా?" అనే పాటలో అంతర్లీనంగా ఎంతో తాత్త్వికత దర్శనమిస్తుంది. గోదావరి నది ప్రక్కన వున్న రాజమండ్రి పట్టణాన్ని గూర్చి, దాని చారిత్రక- సాంస్కృతిక- సాహిత్య- సంస్కరణ నేపథ్యాన్ని తీసుకొని 'ఆంధ్రకేసరి' చిత్రంలో ఆరుద్ర రాసిన పాట మనస్సులను ఉప్పొంగింపజేస్తుంది. "వేదంలా ఘోషించే గోదావరి, అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి" అనే పాట రాజమండ్రి వైభవాన్ని కళ్ళముందు ఆవిష్కరింపజేస్తుంది. గోదావరి నది గలగల శబ్దాన్ని వేద ఘోషలతో పోలుస్తూ ఈ పాట నదికి పవిత్రతను కలిగించింది. 'అందాల రాముడు' చిత్రానికి సినారె రాసిన "కురిసే వెన్నెల్లో మెరిసే గోదారిలా......మెరిసే గోదారిలో విరబూసిన నురగలా....నవ్వులార బోసెపడుచున్నది" అనే గీత వీక్షణలో హృద్యంగా చిత్రీకరించబడిన అందమైన వెన్నెల రేయిలో గోదావరి అందాలు ప్రేక్షకులకు కనువిందు చేస్తాయి.

'రాధమ్మ పెళ్ళి' చిత్రానికి సినారె రాసిన పాట "పారే గోదావరిలా పరుగెత్తేదే వయస్సు....పొడిచే తొలి పొద్దులా" అంటూ సాగుతుంది. 'మా ఊరి కథ' చిత్రానికి ఆత్రేయ రాసిన "గోదావరి ఏ ఒడ్డు అయినా నీరు ఒక్కటే......ఈ కుర్రదానికి ఏ వైపైనా అందమొక్కటే" అనే పాట కుర్రకారును గిలిగింతలు పెడుతుంది. గోదావరి నేపథ్యంలో పాటలు అనగానే తెలుగు వారికి గుర్తొచ్చే సినీ గేయ రచయిత వేటూరి సుందర్రామూర్తి. తెలుగు సినీ గేయ సాహిత్యంలో గోదావరి పై ఆయన రాసినన్ని పాటలు ఇంకేవరు రాయలేదు. 'జడ గంటలు' చిత్రంలో వేటూరి వ్రాసిన "పున్నమిలాగా వచ్చి పొమ్మని జాబిల్లడిగింది, పుష్కరమల్లే వచ్చి పొమ్మనీ గోదారడిగింది...నువ్వు రావాలా, పువ్వు పూయాలా" అనే పాట విటుంటే చల్లని గాలి తిమ్మెరలను ఆస్వాదిస్తూ గోదావరి ఒడ్డున సాగుతున్న అనుభూతి కలుగుతుంది. 'దేవత' చిత్రంలో వేటూరి రాసిన "ఎల్లువొచ్చి గోదారమ్మా ఎల్లాకిల్లా పడ్డారమ్మా, ఎన్నెలొచ్చి వెల్లుపూలే ఎండి గిన్నెలయ్యేనమ్మా" అనే పాట ఇప్పటికీ వెల్లువొచ్చిన గోదారమ్మలా పరవళ్లు తొక్కుతూనే ఉంది. 'సిరి సిరి మువ్వ' చిత్రంలో వేటూరి రాసిన "గోదారల్లే.. ఎన్నెట్లో గోదారల్లే, ఎల్లువ గోదారల్లే...ఎన్నెట్లో గోదారల్లే" అనే పాట ఒక మూగ పిల్ల హృదయం ఆలపించే ప్రకృతి గీతం.

'ప్రేమించు - పెళ్ళాడు' చిత్రంలో వేటూరి వ్రాసిన "వయ్యారీ గోదారమ్మా వళ్ళంతా ఎందుకమ్మా కలవరం.....కడలి ఒడిలో కలిసిపోతే కలవరం" అనే పాటలో సంగీత దర్శకుడు ఇళయారాజా చేసిన చిత్ర విచిత్ర స్వర ప్రయోగాలు ఎన్నో. 'అభిలాష' చిత్రానికి ఆత్రేయ రాసిన "ఉరకలై గోదావరి ఉరికే నా ఒడిలోనికి, సొగసులై బృందావనీ విరిసే నా సిగలోనికీ" అనే గీతంలో ప్రేమికులలో ఉప్పొంగే ప్రణయ భావాలను పాట రూపంలో పొందుపర్చిన తీరు ప్రశంసనీయం. 'సితార' చిత్రానికి వేటూరి రాసిన "వెన్నెల్లో గోదారి అందం...నది కన్నుల్లో కన్నీటి దీపం" అనే పాటను లీనమై వింటే ఎంతటి వారికైనా హృదయం ద్రవించి, కన్నులు చెమర్చుతాయి. ఇదే చిత్రంలో వేటూరి రాసిన మరో పాట "కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి, విశ్వనాథ కవితై అది విరుల తేనె చినుకై, కూనలమ్మ కులుకై అది కూచిపూడి నడకై". ఈ పాటలో గృహ నిర్భందం నుండి స్వేచ్ఛ ప్రపంచంలోకి అడుగిడిన కథా నాయిక సంతోషాన్ని గోదావరి ఉపనది అయిన కిన్నెరసాని పరవళ్ళుతో పోల్చుతూ కవి పాట కట్టిన తీరు శ్రోతలను ఆనంద తీరాల అంచున నిలుపుతుంది. 'సీతారామయ్య గారి మనుమరాలు' చిత్రానికి వేటూరి రాసిన "బద్దరగిరి రామయ్య పాదాలు కడగంగ, పరవళ్ళు తొక్కింది గోదారిగంగ, పాపి కొండలకున్న పాపాలు కడగంగ, పరుగల్లు తీసింది భూదారి గంగ" పాట భక్తితో గోదావరి నదికి ప్రణమిల్లేలా చేస్తుంది.

వేటూరి కలం నుండి జాలువారిన మరో చక్కని గీతం 'సరిగమలు' చిత్రంలోని "గోదావరి పయ్యెద...కృష్ణమ్మ నీ వాల్జడ, నిండారి తెలుగింటి అందాల వెలిగించె నండూరి వారెంకిలా" అనే పాట. అట్లే 'రుక్మిణీ' చిత్రంలో సిరివెన్నెల రాసిన "గోదారి రేవులోన రాదారి నావలోన నా మాట చెప్పుకుంటు ఉంటానంట" పాట గోదావరి జిల్లా పల్లెటూళ్ళో పడుచుపిల్ల కోరికల చిట్టాను తెల్పుతుంది. 'రాజకుమారుడు' చిత్రానికి చంద్రబోసు రాసిన పాట "గోదారి గట్టు పైనా, చిన్నారి చిలక వుంది. చిలకమ్మ మనస్సులోన చిగురంత మెలిక ఉంది". భాస్కరభట్ల 'కబడ్డీ కబడ్డీ' చిత్రంలో "గోరువంక గోదారి వంక ఈతకెళ్దాం వస్తావా" అనే పాటను రాసి గోదావరిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. 'ఖుషీ ఖుషీగా' చిత్రంలో వేటూరి "గోదారి గట్టుంది ఎవరూ లేరంటుంది...అదిగో ఆ కొబ్బరితోట ఆడుకోను రమ్మంది" అనే పాటలో వయస్సుకొచ్చిన ఒక నవ జంట ఊసులను చక్కని పదాల పొందికతో తెలుపుతారు. గోదావరి పల్లెటూళ్ళో జరిగే వేడుకలను గూర్చి, ఆ ప్రాంత కల్మషంలేని మనష్యులను గూర్చి, గ్రామాలలో వెల్లివిరిసే ఆనందాన్ని గూర్చి తెల్పుతూ కులశేఖర్ 'శ్రీను వాసంతి లక్ష్మీ' చిత్రంలో రాసిన "గోదారి నవ్వింది తుమ్మెదా, నిండు గోదారి నవ్వింది తుమ్మెదా" అనే పాట అంతటి ఆనందం శాశ్వతంగా ఉంటే ఎంత బాగుంటుందని అన్పిస్తుంది.

1974 సంవత్సరంలో విడుదలైన 'గౌరి' చిత్రంలో దేశానికి ఆయువుపట్టులైన పల్లెటూళ్ళును గూర్చి వర్ణిస్తూ దాశరథి "గలగల పారుతున్న గోదారిలా, రెపరెపలాడుతున్న తెరచాపలా" అనే పాటను రాశారు. ఈ పాట పంట పొలాలను గూర్చి, ప్రకృతి సౌందర్యాన్ని గూర్చి, యువత బాధ్యతను గూర్చి తెలుపుతుంది. 2006 సంవత్సరంలో విడుదలైన 'పోకిరి' చిత్రంలో కందికొండ రాసిన "గలగల పారుతున్న గోదారిలా, జలజల జారుతుంటే కన్నీరలా" అనే పాట ప్రేమ కోసం కన్నీరు పెట్టిన ప్రియురాలని వేదనకు ప్రియుడు స్పందించిన తీరును తెల్పుతుంది. గోదావరి హొయలను కలంతో పలికించగల గీత రచయిత వేటూరి సుందరామ్మూర్తి 'గోదావరి' చిత్రానికి రాసిన "ఉప్పొంగెలే గోదావరి, ఊగిందిలే చేలో వరి, భూదారిలో నీలాంబరి, మా సీమకే చీనాంబరి" అనే పాటను ఎంత ప్రశంసించినా తక్కువే అవుతుంది. గోదావరి ప్రవహించే ప్రాంతాలను, గోదావరి హోయలను, సోయగాలను గొప్పతనాన్ని వర్ణిస్తుంది ఈ గీతం. గోదావరి నదిని ఎంత ప్రాణ పదంగా అభిమానిస్తేనో గానీ ఇటువంటి పాట రాయడం సాధ్యం కాదు. ఇలా రాయడం వేటూరికి తప్ప అనితురలకు అసాధ్యం. 'శ్రీరామదాసు' చిత్రంలో రామభక్తుడు రామదాసు భద్రాచలానికి వస్తున్నప్పుడు రాముల వారి దేవాలయానికి పట్టబోతున్న అదృష్టాన్ని గూర్చి శుభసూచికగా గోదావరి నది పొందుతున్న ఆనందాన్ని సుద్దాల అశోక్ తేజ "ఏటయ్యిందీ గోదారమ్మా, ఎందుకీ ఉలికిపాటు గగుర్పాటు, ఎవ్వరో వస్తున్నట్టూ ఎదురు చూస్తున్నది గట్టు ఎమైనట్టూ" అనే పాటను తేట తెలుగు పదాలతో కూర్చిన తీరు అభినందనీయము.

గోదావరి ప్రేమికుడు వేటూరి రాసిన యుగళగీతం 'గోపాల కృష్ణుడు' చిత్రంలోని "అదీ గోదావరి గట్టంట వయ్యారి పిట్టంట, రివ్వుమంటే జివ్వుమంది నాకు మక్కువ" అనే గీతం. 'జీవనజ్యోతి' చిత్రంలో సినారె "సిన్నీ ఓ సిన్నీ...ఓ సన్నజాజుల సిన్ని, కల్లబొల్లి మాటలతో అల్లరి పెడితే..నన్నల్లరి పెడితే, వెల్లువ గోదారిలా కమ్మేస్తాను...నిన్ను కమ్మేస్తాను.., గోదారి పొంగల్లే నా మీదికి వురికొస్తే, రాదారి పడవల్లే తేలి తేలి పోతాను " అంటూ ఆయన రాసిన పాట ముందుకు సాగుతుంది. తెలుగు నాట పచ్చని పంటల సిరులను కుమ్మరించిన లక్ష్మి గోదావరి. అందుకే 'సంకీర్తన' చిత్రంలో సిరివెన్నెల "ఓ గంగమ్మో పొద్దెక్కి పోతాంది తొరగా రాయే....ఓ తల్లీ గోదావరి తుళ్ళి తుళ్ళి పారేటి, పల్లె పల్లె పచ్చాని పందరీ...., నిండు నురేళ్ళు పండు ముత్తైదువల్లే వుండు ... "అంటూ రాశారు. ఆరుద్ర చక్కని శబ్దాలంకారాలతో 'స్నేహం' చిత్రంలో "నవ్వు వచ్చిందంటే కిలకిల, ఏడు పోచ్చిందంటే వలవల, గోదారి పాడింది గలగల, దాని మీద నీరెండ మిలమిల" అంటూ పాట గట్టారు.

'కృషి' చిత్రంలో సాయి శ్రీహర్ష "గోదారి గట్టుపై గోరింక..గోరింక, గోల గోల చేయనా నేనింకా" అనే కొంటె పాటను రాశారు. ప్రేమను ఎందరో కవులు గోదావరితో పోల్చడం పరిపాటి. 'నువ్వు లేక నేను లేను' చిత్రంలో కులశేఖర్ "నిండు గోదారి కదా ఈ ప్రేమ, అందరికీ బంధువుగా ఈ ప్రేమ" అంటూ సాగిపోయే చక్కని పాటను రాశాడు. గోదావరి నదీ జలాలలో కొద్ది నీరు మాత్రమే మనం ఉపయెగించుకోగలుతున్నాం. సరియైన ఆనకట్టలు లేక లక్షల క్రూసెక్కుల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతుంది. తన బిడ్డలకు పూర్తి స్థాయిలో ఉపయోగపడలేని ఆ గోదావరి తల్లి గుండెకోతను, పాలకుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ సుద్దాల అశోక్ తేజ 'బన్నీ' చిత్రంలో "కనపడలేదా గోదారి తల్లి కడుపుకోత, వినబడలేదా గోదారి నీళ్ళ రక్త ఘోషా, గుండె నిండ పాలున్న బిడ్డల కందించలేని తల్లి బ్రతుకు దేనికని, బీళ్ళు నింపే నీళ్ళున్న సముద్రాన పడిపోయే శాపం తనకెందుకని" అని రాసివ పాట మనస్సున్న ప్రతి వారిని కదిలిస్తుంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనిపిస్తుంది.

ఆనందంతో మనస్సు ఉప్పొంగినప్పుడు కలిగే సంతోషాన్ని గోదావరి నదితో పోల్చుతూ కులశేఖర్ "గోదారల్లే పొంగే నాలో సంతోషం, గోరింటల్లే పూచే నాలో ఆనందం" అనే పాటను 'వసంతం' సినిమాకు రాశారు. గోదావరి టైటిల్ తో గల మరో చిత్రం 'గోపి గోపిక గోదావరి'. ఈ చిత్రంలో పడుచు యువతి హృదయంలో పరవళ్ళు తొక్కుతున్న ఆనందాన్ని గీత రచయిత రామజోగయ్య శాస్త్రి "బాలగోదారి ఉలికి పడుతుంది ఎందుకో..."అనే పాట ద్వారా వెల్లడిస్తారు. ఈ చిత్రంలోనే రామజోగయ్య శాస్త్రి రాసిన మరో పాట "గో గో రై రై గోదావరిపై, హ్యాపీ అలవై అలవై". ప్రియురాలి అభిమానాన్ని పొందిన ప్రేమికుని మనస్సును, తొలి ప్రేమ అనుభూతిని 'మస్కా' చిత్రంలో కందికొండ "గుండె గోదారిలా....చిందులేస్తోందిలా" అనే పాటలో వ్యక్తీకరించారు. గోదావరి నదీమతల్లి అందరి ఆకలిని తీర్చే తల్లి. ఆ నది పై ఆధారపడి ఎందరో జాలరులు జీవిస్తున్నారు. చేపలవేటలో జాలర్లులకు ఆ తల్లి గురువై వారికి జీవన పాఠాలను నేర్పుతుంది. ఈ విషయాన్ని చంద్రబోస్ 'గుండెల్లో గోదారి' చిత్రంలో "గుండెల్లో గోదారి పొంగి పొరలుతోంది, గోదారే రాదారై నన్ను నడుపుతుంది, గురువులిక తెలపని పాఠాలే తెలిపినవి అలలే, వరములకు దొరకని భాగ్యాలే వెదికినవి వలలే" అంటూ పాటగా మలిచారు. ఈ చిత్రంలోనే అనంత శ్రీరామ్ "నను నీతో నిను నాతో కలిపింది గోదారి, నను నీలో నిను నాలో చూపింది తొలిసారి" అనే పాటను రాశారు.

ఇట్లు గోదావరి తన వంపులతో, సొంపులతో తెలుగు పాటల పూదోటలను పూయించింది. హృదయంలో ఎగిసిపడే ప్రతి భావాన్ని గోదావరితో పోల్చూతూ సినీ కవులు అద్భుతమైన పాటలను సృజించారు. వేటూరి, ఆరుద్ర, సినారె, సిరివెన్నెల, కులశేఖర్, చంద్రబోసు, భాస్కర్ భట్ల తదితర తెలుగు సినీ కవులు తమ గేయాలలో గోదావరికి అగ్రస్థానమిచ్చి తెలుగు గడ్డపై పుట్టినందుకు ఋణం తీర్చుకున్నారు. గోదావరి నది గొప్పతనం, సౌందర్యం ఏ కొద్ది పాటల్లోనో, కవితల్లోనో, పద్యాల్లోనో ఇమిడ్చితే సరిపోయేది కాదు. గోదావరి జీవనదిగా ప్రవహిస్తున్నంత కాలం తెలుగు సాహిత్యాన్ని, తెలుగు కవులను ప్రభావితం చేస్తూనే ఉంటుందనటం అతిశయోక్తి కాదు. స్పందించే హృదయం కవులకు ఉన్నంత వరకు గోదావరి నేపథ్యంతో పాటలు వస్తూనే ఉంటాయి.


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)