వీక్షణం 36 వ సాహితీ సమావేశం ఆగస్టు 9, 2015 న డా॥ వేమూరి వెంకటేశ్వరరావు, ఉమా దేవి గారి స్వగృహమున జరిగింది. మూడు సంవత్సరముల క్రిందట, వీక్షణం మొదటి సమావేశం వీరి గృహమునందే జరుగుట ప్రస్తావించదగిన విశేషం.
డా ॥ అక్కిరాజు సుందర రామకృష్ణ గారు సభాధ్యక్షత వహించారు. సభ ప్రారంభము కాకముందే, అధ్యక్షుడు అంటే అధి+అక్షుడు, అనగా పైన ఉండి అంతా సక్రమముగా జరుగుతున్నదో లేదో పరిశీలనచేసే వాడని వివరించారు. ఇంకొంచెము వ్యంగ్యముగా చెప్పాలంటే "కళ్లు నెత్తికెక్కిన వాడ"ని చెప్పారు.
సమావేశం అధ్యక్షులవారి "పాల సంద్రమునందు ..." పఠనముతో, రాజ రాజేశ్వరి దేవి ప్రార్ధనా వాఖ్యములతో ప్రారంభమయ్యింది.
తదుపరి, అధ్యక్షులవారు ముఖ్య అతిధి శ్రీమతి తంగిరాల మీరా సుబ్రహ్మణ్యం గారిని సభకు పరిచయము చేసి, వారి రచనా వ్యాసంగం గురించి ప్రసంగించవలసిందిగా కోరారు.
మీరాబాయి గారి ఉపన్యాసము (సంక్షిప్తం):
మా స్వగ్రామము అనంతపురం జిల్లాలోని "గుత్తి". కర్నూలు ప్రభుత్వ మహిళా కళాశాల నుండి Reader గా పదవీ విరమణ పొందాను. నేను శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయం నుండి ఆంగ్ల సాహిత్యం లో M.A., Ph.D. పట్టాలు పొందాను. నా సిద్ధాంత గ్రంథం " Women's Voices". నేను వృత్తి రీత్యా ఉపాధ్యాయినిని. కానీ ఎక్కువగా తెలుగు కథలు వ్రాస్తాను. ఇప్పటి దాకా నాలుగు నవలలు, రెండు వందల పైన కధానికలు ప్రముఖ పత్రికలలో వచ్చాయి. ఆరు కథా సంకలనాలు వెలువడినాయి. ఆకాశవాణి లో స్త్రీ సమస్యల గురించిన ప్రసంగాలు ప్రసారమయ్యాయి. నేను రాసిన కొన్ని నాటికలు కూడా ఆకాశవాణిలో ప్రసారమైనాయి.
1962లో కాకినాడ పి.అర్. కళాశాల లో డిగ్రీ మొదటి సం|| చదువు తున్నప్పుడు మా ఇంగ్లీష్ మాస్టరు బులుసు వెంకటేశ్వర్లు గారు అడిగితే కాలేజ్ మాగజైన్ కోసం చిన్న కథలు రెండు రాసాను. నా మొదటి కథానిక "పసి మనసులు". 15-3-1963 ఆంధ్ర ప్రభ వార పత్రిక లో వచ్చింది..
నేను మొదటిసారి అమెరికా 15 సం|| క్రితము వచ్చినప్పుడు, ఆమెరికా జీవితం గురించి రాసిన కథ " వేడివెన్నెల" 27-6-2003 లో ఆంధ్ర ప్రభ వార పత్రికలో వచ్చింది. ఆ రోజులలో ఇక్కడి పరిస్థితులను గమనించి వ్రాసిన కథ. తరువాత ఇక్కడికి పలుమార్లు రావటము జరిగింది. ఈ 15 సం|| ఇక్కడ జరుగుతున్న మార్పులు గమనించాను. ఇప్పుడు ఇక్కడ తెలుగు వాతావరణం బాగుంది. నిజం చెప్పాలంటే, ఇటువంటి సాహితీ, సంస్కృతిక సమావేశములు ఇక్కడే ఎక్కువ జరుగుతున్నవేమో. బహుశా nostalgia వలన, దూరాన ఉన్నటువంటి వాటిని కౌగలించుకోవాలని కోరిక ఎక్కువ ఏమో? అందువలనే ఇటువంటి కవితా, కథా సమావేశాలు ఎక్కువ ఏమో? నేను కథా రచయిత్రిని. కానీ, కవితలు, నవలలు కూడా రాశాను. కాకినాడ పి. ఆర్ కాలేజీలో చదువుకుంటున్నప్పుడు, బులుసు వెంకటేశ్వర్లుగారు కథలు వ్రాయమని ప్రోత్సహించేవారు. రాయటానికి స్పందన జీవితములో జరిగిన ఏదో ఒక సంఘటనతో కథలు మొదలవుతాయేమో? ఉదాహరణకి ఈ వీక్షణంలో జరిగే సంఘటనలు, పరిచయాలు ఎప్పటికో "ఆ "కారము ధరించి కథగా వ్రాయబడతాయి. ఒక కథ చదివితే, ఒక కిటికీ తెరిచి ఆ సంఘటనలను దర్శించుతాము.
ప్రముఖ విశ్లేషకులు వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు నా మొదటి కథా సంకలనం " ఆశల మెట్లు" ఆవిష్కరించారు. ఆయన అన్నారు "మీరాబాయి గారు చిన్న కథ రచనా శిల్పాన్నికరతలా మలకం చేసుకున్నారు" అని.
ఇదివరకు కలం కాగితముతో వ్రాస్తే, ఇప్పుడు కంప్యూటరు మీద టైపు చేస్తాను. మా అమ్మాయి ప్రచురణకు పంపుతుంది.
మీరాబాయి గారి రచన "చివరకు మిగిలేది" కథా పఠనము తో వారి ప్రసంగము ముగిసింది. మనకు కావాల్సింది, కావాల్సిన మనుష్యులను దూరం చేసుకుంటున్నామేమో అనే అభిప్రాయముతో వ్రాసిన కథ అని వివరించారు. ఈ కథ ఏప్రిల్, 2007 రచన. ఇంటింటి మాస పత్రికలో ప్రచురింపబడి , కథా పీఠం పురస్కారం పొందింది.
తరువాత, అధ్యక్షులవారు రచయిత్రి అద్దేపల్లి ఉమాదేవి గారిని పరిచయము చేసి, వారిని ఉపన్యసించవలసిందిగా కోరారు.
అద్దేపల్లి ఉమా దేవిగారి ప్రసంగం:
మా తండ్రిగారు భాగవతుల సుబ్బారావుగారు. మా పెద తండ్రి గారు భాగవతుల సదాశివ శంకర శాస్త్రి గారు. నేను 7,8 సం|| వయసునుండే రచనలు చేస్తున్నాను. చిన్నప్పుడు వ్రాసినవి మా తమ్ముడి పేరుమీద మీద పత్రికలకు పంపుతుండేదాన్ని. ఆ వచ్చే పారితోషకము వాడికి సరదా. వ్రాయటము ఒక అభిలాష. నేను ఐదవ తరగతి వరకే తెలుగు చదువుకున్నాను. తరువాత మేము ఒరిస్సాలో ఉండటము వలన ఎక్కువగా ఒరియా, బెంగాలీ సాహిత్యము చదివాను.
ఇప్పుడు ఎక్కువగా ఆధ్యాత్మిక వ్యాసాలు వ్రాస్తాను. మేము ఉండేది పాండిచ్చేరీలో. శ్రీ అరబిందో philosophy, spirituality ప్రభావము ఉంది. ఎమెస్కో వాళ్లు సామాజిక కథలు, వ్యాసాలు వ్రాయమని ప్రోత్సాహించారు. అప్పటినుంచి కథలు కూడా వ్రాస్తున్నాను. స్త్రీ ఉత్తేజం గురించి కూడా వ్రాస్తాను. ఒకొక్కసారి ఆవేశం పెల్లుబుకుతుంది. అప్పుడు అది అక్షర రూపం చేరుతుంది. "కుమార సంభవం" అనే సాంఘీక నవల వ్రాసాను. అమెరికాలో శ్లోకాలు, పద్యాలు చర్చించుకుంటున్నారు. అది చూస్తే సాహిత్యము మీద ప్రేమ ఇక్కడే ఉందేమోనని అనిపిస్తున్నది.
విందు తర్వాత జరిగిన కవి సమ్మేళనం లో భాగంగా శ్రీ రావి రంగారావు మనవడి పై అద్భుతమైన కవితలను చదివారు. డా ॥ కె. గీత గారు "ఇంటిని వదలలేని బెంగ" అనే చక్కని కవితను చదివారు.
ప్రతి సమావేశములో శీర్షికలాగా జరిగే కిరణ్ ప్రభ గారి క్విజ్ కార్యక్రమము జరిగింది.
పిల్లలమఱ్ఱి కృష్ణకుమార్ గారు పెండ్లి వేడుకలో వధూవరులు అరుంధతీ నక్షత్రము చూడటానికి గల ప్రాశస్త్యమును వివరించారు. అరుంధతి, వసిష్ఠ అనేవి సప్తర్షి మండలములోని (Big Bear Constellation) జంట నక్షత్రాలు (Dual Stars). అవి ఒకటి చుట్టూ ఒకటి తిరుగుతూ ఉంటాయి. మనకి ఒకే నక్షత్రములాగా కనిపిస్తాయి. వధూవరులు అలాగే తమ జీవతాన్ని కలసి ఒక్కటిగా గడపాలనే సంకేతానికి అరుంధతీ, వసిష్ఠ నక్షత్రములు సంకేతములని వివరించారు.
అధ్యక్షుల వారు శ్రీ చరణ్ గారిని వేద పఠనము గురించి ప్రసంగించ వలసిందిగా కోరారు.
శ్రీ చరణ్ గారి వేద పఠనము ప్రౌఢముగా జరిగింది. వారు వేదము అధ్యయనము చేసే పద్ధతిని వివరించారు. ఉపనయనము చెందిన బాలురు 7వ ఏటను మొదలు పెట్టితే, 15వ ఏట వరకూ చదువుతారని, ఇది వేద పాఠశాలలో జరిగే కార్యక్రమము. వేద పాఠశాలలు నిర్వహించటము, ఈ బాలురను పోషించటము ఖర్చుతో కూడినది. నిర్వాహుకులు విరాళములు అడిగినప్పుడు, వారు commercialize అయ్యారనే విమర్శ తప్పు అని వివరించారు.
ముంతాజ్ బేగం గారు చక్కని ఉచ్చారణతో భర్తృహరి సుభాషిత పద్య పఠనము చేసారు.
సభ ముగిస్తూ, అధ్యక్షులు అక్కిరాజు గారు శ్రీ కృష్ణ తులాభారములోని పద్యాలను, రాయబారములోని పద్యాలను పద్య నాటక బాణీ ల్లో ఉత్తమముగా పఠించారు. పఠనా ప్రయుక్తములను వివరించి, ఉదాహరణకు, ప్రేయసి ప్రేమను కోరే పద్యాన్ని ఎలా పఠించకూడదో కూడా చెప్పారు. కాళిదాసు శాకుంతలములో కణ్వుడు శకుంతలను దుష్యంతుని దగ్గరకు పంపుతూ చెప్పిన నాలుగు శ్లోకాలు నాటకములో చక్కగా పఠించటము ఎంత ముఖ్యమో, రాయబారములోని పద్యాలు నాలుగు అంత ముఖ్యమని చెప్పి, వారి పఠనా చాతుర్యాన్ని ప్రదర్శించి, సభను రంజింపచేశారు. ఆ నాలుగు పద్యాలు చెల్లియో చెల్లకో, అలుగుటయే యెరుంగని,
జండాపై కపిరాజు, సంతోషంబున సంధిచేయుడు.
ఈ సభలో శ్రీ ఇక్బాల్, వారి తల్లిదండ్రులు, సహోదరి, శ్రీ పిల్లలమఱ్ఱి కృష్ణ కుమార్, శ్రీమతి శాంత, శ్రీమతి వందన, శ్రీ శివ చరణ్, శ్రీమతి కాంతి కిరణ్, శ్రీమతి రమణ తదితరులు పాల్గొన్నారు.
సభాంతర ప్రకటన చేస్తూ, గీత గారు తదుపరి సమావేశము వార్షిక సమావేశమని,అందరూ తప్పక విచ్చేసి సభను జయప్రదం చేయవలసిందని కోరుతూ ఆ వివరాలను తెలిపారు.
వీక్షణము 3వ వార్షిక సమావేశము:-
సెప్టెంబరు 6, ఆదివారము, ఉ|| 11 గంటలనుండి, సా|| 4 గంటల వరకు.
వేదిక: స్వాగత్, మిల్పిటాసు