(గత సంచిక తరువాయి)
వచ్చిన అతిధులందరూ వెళ్ళిపోయాక గాని రేంజర్ సాబ్ తో ప్రశాంతంగా వ్యాపార విషయాలు మాటాడడం మంచిపని కాదని గైడ్ చెప్పడంతో రెండు రోజులు స్తబ్దంగా ఉండక తప్పదన్న నిర్ణయానికి వచ్చేశాడు అమరేంద్ర. ఖెడ్డా చూసి వచ్చాక మానసికంగా అలసిపోయినట్లు అనిపించడంతో ఆ మరునాడు విశ్రాంతిగా ఉండిపోయి ఆవలిరోజున పిక్నిక్ కి వెళ్ళడం బాగుంటుంది అనుకున్నాడు. తెలుగు తెలిసిన గైడ్ ఒకడు ఉన్నాడంటే, అతన్ని తమకు సాయంగా పంపించమని గార్డుకి చెప్పి కొంత సొమ్ము అడ్వాన్సుగా ఇచ్చివచ్చాడు అమర్.
మరునాడు గాని పిక్నిక్ లేదుకనుక ఆ రోజు మధ్యాహ్నం అందరూ భోజనాలు అయ్యాక తీరుబడిగా అరుగు మీద కూర్చుని పిచ్చాపాటీ కబుర్లు చెప్పుకోసాగారు.
యామిని, "బాస్! రేంజర్ని కలవడానికి మీరు ఎప్పుడు వెళ్ళాలి" అని అడిగింది అమర్ ని.
"ఈ ఖెడ్డా హడావిడి కొంచెం తగ్గాక గాని రేంజర్తో మాటాడడం కుదరదు. మనం వతనుగా గంధపుచెక్కల్ని తీసుకోదలచినప్పుడు, అతను మంచి మూడ్ లో ఉండగా మాటాడడం మంచిపని కదా! ఎలాగా మనం అడవి చూడాలనుకుంటున్నాముగా, రేపే పిక్నిక్ కి వెడదాం. ఈ రోజు రెష్టుగా ఉందాం" అన్నాడు అమర్.
"అదేమిటి! నిన్నటితో ఐపోలేదా ఖెడ్డా హడావిడి? ఏనుగుల్ని బంధించేశారుకదా" అంది యామిని ఆశ్చర్యంగా.
అక్కడే ఉన్న వేన్ డ్రైవర్ జవాబు చెప్పాడు. "బంధించడంతో పని ముగుయదమ్మా! అసలు కష్టమంతా ఇప్పుడే ఉంది. అడవిలో స్వేచ్చగా తిరిగే అంత పెద్ద జంతువులను పట్టి బంధించి, వాటిని మచ్చిక చేసుకుని, తాము చెప్పినట్లు చేసే కట్టు బానిసలుగా మార్చాలంటే చాలా శ్రమే ఉంటుంది. ఖెద్డాలో చిక్కినా ఆ ఏనుగులు తప్పించుకుపోడానికని చాలా ప్రయత్నం చేస్తాయి. ఆ మండకోటను ఛేదించుకుని బయటికి వెళ్ళిపోవాలని ఎంతగానో ప్రయత్నిస్తాయి. చుట్టుపక్కల చెట్లమీద, ఆ స్టాకేడ్ కి ఆనించి ఉన్న నిచ్చెనల మీదా కనిపెట్టుకుని ఉన్న జనం గాలిలోకి తుపాకులు పేల్చీ, బాకాలూ, బూరాలూ ఊదీ, అరిచి కేకలుపెట్టీ, బాణసంచా వెలిగించీ, బాజాలువాయించీ ..... ఇలా రకరకాలైన సబ్దాలనిచ్చే ప్రక్రియలతో వాటిని బెదిరించి, అవి ఖెడ్డాని పడదొయ్యకుండా ఆపుతూంటారు. అంతేకాదు, వాటికి తిండీ నీళ్ళూ కూడా ఇవ్వకుండా, నిద్ర పోనీయకుండా చేసి రోజులతరబడీ హింసిస్తారు. ఒకేసారిగా 150 లీటర్ల నీరు తాగీ, ఒకరోజులో 150 కిలోలకు మించిన ఆహారం - గడ్డీ, ఆకులూ వగైరాలు తినీ బ్రతికే ఆ అడవి ఏనుగులు తిండీ, నిద్రా, నీళ్ళూ కూడా లేకపోవడంతో రెండు మూడు రోజుల్లో నీరసించిపోయి, శక్తి ఉడిగి, క్రమంగా నడపీనుగుల్లా మారిపోతాయి. అక్కడ కాపలాగా ఉన్న మనుష్యులు తరచూ మారిపోతారుగాని, ఏనుగులకుమాత్రం ఏపాటి విశ్రాంతీ ఇవ్వరు. అలా ఎడతెగని అలజడివల్ల, ఆకలి, దాహమూ పీడిస్తూండడం వల్ల ఆ ఏనుగులు పీనుగులుగా మారాక "కుంకీ"లను రంగం లోకి దింపుతారు."
"కుంకీలా! అంటే ఏమిటి" అడిగాడు అమరేంద్ర.
"ముందుగానే మచ్చిక చేసిన ఆడఏనుగులను "కుంకీలు" అంటారు. ప్రతి కుంకీ వెంట, దానిని తన ఆజ్ఞలతో నడపించీ మావటీ వుంటాడు. ఖెడ్డాలో ఉన్న ఏనుగులు పూర్తిగా నిస్తేజమైనాయన్న నమ్మకం కుదిరాకే ఖెడ్డా తలుపులు. తెరుస్తారు. వెనువెంటనే ఇద్దరు మావటీలు రెండు కుంకీలను ఖెడ్డాలోకి ప్రవేశపెట్టి, ఒక్కొక్క ఏనుగునీ ఆ కుంకీల నడుమ ఉండీలా చేసి బయటికి నడిపించుకుని వస్తారు. ఖెడ్డాలో చిక్కిన ఏనుగులు ఏపాటి స్వతంత్రం చూపించినా, మావటీ ఆజ్ఞ మేరకు కుంకీలు వాటిని తలతో మోది, తొండంతో బాది దారికి తెస్తాయి. శక్తి ఉడిగి ఉన్న ఆ అడవి ఏనుగులు విధిలేక, కుంకీలు నడిపించినట్లుగా నడిచి బయటికి వస్తాయి. కుంకీలు దానినొక బలమైన చెట్టు దగ్గరకు తీసుకువచ్చి నిలబెడతాయి. సాహసి ఒకడు, బలమైన ఇనపగొలుసులను ఏనుగు వెనక కాలికి తగిలిస్తాడు. దానిని చెట్టుకు బంధించాకనే కుంకీలు దానిని వదిలి వెడతాయి."
గాఢం గా నిట్టూర్చి అడిగాడు అమర్, "ఈ ఖెడ్డాలో ఎన్ని ఏనుగులు చిక్కాయిట!"
రాజు ఉబలాటపడ్డాడు. " నేను లెక్కెట్టా సార్! మూడు ఏనుగులు, రెండు చిన్నవి పడ్డాయి. వాటిలో ఒకదానికి చిన్నచిన్న దంతాలు ఉన్నాయి" అన్నాడు.
"పాపం, ఆ గున్నలు ఏమైపోతాయో ఏమిటో?" విచారపడింది యామిని.
" తల్లితోపాటే పిల్లలూ లొంగిపోయినట్లే! ఎప్పుడూ తల్లిని అంటిపెట్టుకుని ఉండే పిల్లలుకదా అవి - అన్నాడు డ్రైవరు."
"అక్కడితో అయినట్లేగా ఆపరేషన్ ఖెడ్డా" అని అడిగింది యామిని.
"లేదమ్మా, ఇంకా ఉంది! అంత పెద్ద జీవం మరీ అంత తేరగా మనిషికి లోంగిపోతుందా ఏమిటి? దానికి చాలా తిప్పలు పడాలి మరి! చెట్టుకి కట్టాక, భవిష్యత్తులో దానికి మావటీడుగా ఉండదలచిన వ్యక్తి, ముందుగా పెద్ద బకెట్టు నిండా నీరు తెచ్చి దాని ముందు ఉంచుతాడు. అది ఆ నీరు తాగడం ఐనాక, చెరుకు గడలు తెచ్చి దూరం నుండే దాని తొండానికి అందిస్తాడు. ఇంకా దానికి సకల ఉపచారాలూ తానే చేస్తూ, తన శ్రేయోభిలాషి అతడే నన్న అభిప్రాయం దానికి కలిగేలా చేస్తాడు. అలా కొన్ని రోజులు గడిచాక అది అతన్ని తనను ముట్టుకోనిస్తుంది. కాని దానిని గొలుసు విప్పి, స్నానానికి తీసుకెళ్ళేటప్పుడు కుంమ్కీలు, చాలా రోజుల వరకూ దాని వెంట ఉండక తప్పదు . అది తనను పూర్తిగా నమ్మిందని నమ్మకం కలిగాకే మావటీ దాని మీద ఎక్కి కూచోడం, దానికి మసాజ్ చెయ్యడం లాంటి పనులు చెయ్యడం మొదలుపెడతాడు."
" అబ్బా! అలా దానికి మావటీ చేరువుగా మసలడం స్సాహసమే కదా" అని అడిగింది యామిని.
"నిజానికి అది చాలా పెద్ద సాహసం! ఏనుగు తల్చుకుంటే మనిషెంత, వాడి బ్రతుకెంత! తరచూ కాకపోయినా, అరుదుగా ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి! కాని, తాను ఆకలి దప్పికలతో నకనకలాడుతున్న సమయంలో తనకు తిండీ, నీళ్ళూ ఇచ్చిన వ్యక్తిని అది మనసారా నమ్మి, అతనికి విధేయత చూపిస్తుంది. అది అతని స్వార్ధం కోసమన్న ఆలోచన దానికి రాదు. తను జీవించి ఉన్నంత కాలం అది అతని వెంట నడుస్తుంది. అది ఇంకెవ్వరినీ అంత తేలికగా నమ్మదు. అందుకే మావటీని మార్చడమన్నది సాధారణంగా జరిగే పనికాదు. అదో విచిత్రబంధం! ఆ ఏనుగుకే కాదు, క్రమంగా ఆ మావటికి కూడా ఆ ఏనుగుతోడిదే లోకం ఔతుంది ! విడదీయరాని బంధం వాళ్ళది. ఏనుగుని అమ్మినప్పుడు, సాధారణంగా దాని మావటీ కూడా దాని వెంట, అది వెళ్ళినచోటికల్లా, సకుటుంబంగా, వెళ్ళడం జరుగుతుంది" అని చెప్పడం ఆపాడు డ్రైవరు.
"అబ్బా! ఇంత కథ వుందా దీని వెనకాల" అన్నాడు అమర్ భారంగా.
"ఇంతే కాదు సార్! ఇంకా కొంతవుంది" అన్నాడు డ్రైవర్. " ఏనుగులు చెట్ల ఆకులు, చొప్ప, వెదురు చిగుళ్ళు లాంటివి తింటాయని మనందరికీ తెలుసు. కాని మచ్చిక చేసుకున్న ఏనుగులకు అవిమాత్రమే కాకుండా బియ్యం, పప్పులు, కూరగాయలు, బెల్లం లాంటి రుచికరమైన పదార్ధాలన్నీ కలిపి ఉడికించి, దానిలో నల్లమందు కూడా కలిపి ముద్దచేసి, ప్రతిరోజూ ఒకే సమయానికి దానికా ముద్ద తినిపిస్తాడు మావటీ. కొన్నిచోట్ల ఆ ముద్దను "బోనం" అంటారు. దానికి అలవాటు పడిన ఏనుగు, ఇక తప్పించుకు పారిపోతుందన్న భయం ఉండదు ఎవరికీ! అది ఎక్కడెక్కడ తిరిగినా వేళకి ఆ భోనం కోసం బసకు రాకమానదు. ఆ ముద్దకోసం అది మనిషికి బానిసగా మారి ఊడిగం చేస్తుంది" అంటూ చెప్పడం ముగించాడు ఆ డ్రైవర్.
* * *
అనుకున్న విధంగా ఆ మరునాడు వాళ్ళు పిక్నిక్ కి వెళ్ళడం కుదరలేదు. ఆ సాయంకాలం రేంజర్ దగ్గరనుండి కబురువచ్చింది, మరునాడు మధ్యాహ్నం వచ్చి తనని కలుసుకోమని.
ఖెడ్డా జరిగి రోజుపూట గదిచింది అప్పుడే! చూడడానికి వచ్చిన ఘనులైన అతిధులు వెళ్ళిపోయారు. రేంజరుకి కొంత తీరిక ఏర్పడింది. వెంటనే అతడు గార్డు చేత అమరేంద్రకు కబురు పెట్టాడు.
ఖెడ్డాని పర్యవేక్షించి తిరిగి వచ్చిన రేంజర్ కి, ఆఫీస్ దగ్గర తన కోసం ఎదురుచూస్తున్న అమరేంద్ర కనిపించాడు. అమరేంద్ర తన వెంట విమలాచార్యను కూడా తీసుకువచ్చాడు.
అమరేంద్ర, తనతో తీసుకువెళ్ళిన, కన్సర్వేటర్ ఇచ్చిన పరిచయపత్రం, చందనపు చెక్క కొనుగోలుకై తీసుకున్న పర్మిట్, మిత్రాగారు ఇచ్చిన ఆధరైజేషన్ లెటర్ రేంజర్ కి చూపించాడు. అవి పరిశీలించిన తరువాత రేంజర్ వాళ్ళని తీసుకుని చందనపు కలప ఉంచిన గోదాము దగ్గరకు తీసుకువెళ్ళాడు.
ఆ ప్రదేశమంతా చందనపు పరిమళంతో గుబాళించి పోతోంది అక్కడ ఉన్న చందనపు దుంగల్ని చూసి, తప్పిపోయిన బిడ్డను తిరిగి కనుగొన్న తల్లిలా, విమలాచార్య ఆనందంతో పరవశిoచిపోయాడు. వాటిని తడుముతూ, తట్టి చూస్తూ కొంతసేపు వాటిమధ్య తిరిగి, చివరకు ఒక దుంగదగ్గర నిలబడి దానిని మరీమరీ పరిశీలించి చూశాడు. దాన్ని తట్టి, " సారూ! నమ్మ వేలైక్కు ఇదిదా నల్ల శందనం కట్టె " అన్నాడు ఉత్సాహంగా.
వెంటనే "ఇది నేను కొంటా" అన్నాడు అమరేంద్ర . వాళ్ళ సంభాషనంతా తమిళంలోనే సాగింది.
రేంజర్ ఆ దుంగను అటూ, ఇటూ తిప్పి చూసి, "కుదరదు సామీ! ఇది ఆల్రడీ అమ్ముడు పోయింది. దానికి ఇది గుర్తు" అంటూ దుంగమీద సుద్దతో గీయబడిన గీతల్ని చూపించాడు.
విమలాచార్య ఉసూరుమన్నాడు. "అడడడా, నమ్మ రాశి! వేరేదీ నాకు నచ్చలేదు" అన్నాడు.
రేంజర్ అతనివైపు అదోలా చూశాడు. అమరేంద్ర వైపుకి తిరిగి, " సారీ సార్! మంచి చేవగల చందనాన్ని ఎంచి, మొన్ననే చందనతైలం తయారు చేసీ కంపెనీ వాళ్ళు మొత్తం కొనుక్కుపోయారు. ఇంతకీ మీరు దీనితో ఏం చెయ్యాలని అనుకుంటున్నారు" అని అడిగాడు.
"ఈ విమలాచార్య ఉన్నారు చూడండి, ఈయన ఒక దారుశిల్పి! రాజులూ, రాజ్యాలూ పోయాక, మన దేశపు కళలను పట్టించుకునీవారే లేకపోయారు! దాంతో గొప్పగొప్ప కళాకారులందరూ అనాధలై, అడ్డమైనపనులూ చేసి పొట్ట పోషించుకోవలసి వస్తోంది. అందమైన శిల్పాలు తీర్చి దిద్దగల చేతులతో ఈ విమలాచార్య మా ఫేక్టరీలో చెక్కలు చిత్రిక పడుతున్నారు. అది తెలిసి నాకు బాధకలిగింది. మా కంపెనీ చేస్తున్నది ఎలాగా చెక్కపనే కదా, దానిలోనే మరో విభాగంగా, ఈయన చేత చిన్నచిన్న చందనపు శిల్పాలను చెక్కించి, వాటిని జ్ఞాపికలుగా టూరిష్టులకు అమ్మితే అందరికీ బాగుంటుందనిపించింది. అలా చెయ్యడం వల్ల నా వంతుగా కనీసం ఒక్క కళాకారుల కుటుంబానికైనా సాయపడినట్లు ఔతుంది దానివల్ల మా కంపెనీకి కూడా మేలే జరుగుతుంది కదా - అనిపించి, వెంటనే ఆ సంగత మా సుప్రీం బాస్ మిత్రాగారికి చెప్పాను. దానికి ఆయన ఆమోదముద్ర పడింది. ఇప్పుడు మేము ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాము" అన్నాడు అమరేంద్ర.
రేంజర్ చాలా సంతోషించాడు. "నా కెంతో ఆనందంగా ఉంది సార్! చాలా మంచి ఆలోచన వచ్చింది మీకు! నన్నుకూడా మీ వాడిగా చూసుకోండి. మీ సదుద్దేశానికి నేను నావంతు సాయం చేస్తాను. నాణ్యమైన చెక్క మీకు అందిస్తాను, అదీ కన్సెషన్ రేటుకి. మీరు తలపెట్టిన ఈ పని వృద్ధిలోకి రావాలని ఆ ఆండవన్ని సదా ప్రార్ధిస్తాను! మీకు ఈ చందనం వద్దు. రేపటెల్లుండిల్లో కొత్తస్టాకు వస్తోంది, దాంట్లోంచి మీకు కావలసినంత తీసుకుందురుగాని. ఇంత చిన్నవయసులోనే నీకు ఇంత సద్భుద్ది కల్గినందుకు నాకు నిండా సంతోషంగా ఉంది అప్పా" అన్నాడు ఉద్వేగంతో.
" రేంజర్ సర్! మీరు మాపై చూపిస్తున్న ఈ అభిమానానికి కృతజ్ఞతలు" అన్నాడు అమర్ సంతోషంగా.
* * *
గెష్టుహౌస్ కి తిరిగి వచ్చిన అమరేంద్రకి అక్కడ యామిని కనిపించలేదు. వళ్ళియమ్మ నడిగితే, యామిని, రాజు అడవిలోకి వెళ్ళారని చెప్పింది. అతనికి చాలా భయం వేసింది. "అడవిలో వీళ్ళు దారి తప్పితే ....... " అన్నభావం అతన్ని కలవరపెట్టింది.
సూర్యుడు అపరాద్రికి మళ్ళాడు. చెట్ల నీడలు పొడుగ్గా సాగి, చీకటిని సృష్టించే ప్రయత్నంలో ఉన్నాయి. నిజానికి ఇది పులులు తిరిగే వేళ. కాని ఇప్పుడు పులుల సంఖ్య చాలావరకూ తగ్గిపోయింది. సాధారణంగా పులులు మనిషిని చూసి చాటుకి తప్పుకుని దూరంగా వెళ్ళిపోవాలనే చూస్తాయి. అవి తిండికోసం, ప్రాణరక్షణ కోసం వేట చేస్తాయి కాని మనిషి జోలికి రావు. మనిషి భయపడవలసిం ఒక్క మనిషిని తినమరిగిన పులులకు మాత్రమే! అది అలా మేనీటర్గా మారడానికి కారణం చాలావరకూ మనిషే అని చెప్పవచ్చు! గవర్నమెంట్ దగ్గర అనుమతి పత్రం తెచ్చుకున్న వేటగాళ్ళే కాదు, విలువైన పులిగోళ్ళూ, పులి చర్మం, పులి చమురు సంపాదించడంకోసం పోచర్లు కూడా పులిని చంపాలని చూస్తారు. ఒక్కొక్కప్పుడు వాళ్ళు పేల్చిన తుపాకీ గుండు పులిని చంపదు, గురితప్పిపోడంవల్ల పులిని తీవ్రంగా గాయపరిచి వదులుతుంది. అలాంటప్పుడు అది , పులి అజ తెలియగానే శరవేగంతో పారిపోయే జింకలవంటి తన సహజ ఆహారాన్ని వేటాడలేక, తన ఆకలిబాధను చల్లార్చుకోడం కోసం, తనకంటే వేగంగా పరుగెత్తలేని మనుష్యులనూ, గుంజకు కట్టబడి ఉన్న జంతువులనూ వేటాడాలని చూస్తుంది. అటువంటి అవసరం వచ్చినప్పుడుగాని పులి ఊరి వైపుకి రాడానికి ఇష్టపడదు.
అమర్ ని ఏవేవో భయంకరమైన ఆలోచనలు కలవరపెట్టడంతో, యామినినీ రాజునూ వెతుక్కుంటూ అతడు అడవిలోకి బయలుదేరాడు. అతనివెంట తానూ నడిచాడు డ్రైవరు. విమలాచార్యమాత్రం ఆగిపోయాడు, వల్లియమ్మకు సాయం చెయ్యడం కోసం.
వళ్ళియమ్మ చూపించిన వైపుగా వాళ్ళు నడవసాగారు. సుమారు ఒక మైలు దూరం వెళ్ళేసరికి అక్కడ రకరకాల పరిమాణంలో ఉన్న బండరాళ్ళు పడి ఉన్నాయి.. ఆ బండరాళ్ళ మీద కూర్చుని జామకాయలు కొరుక్కు తింటూ, కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు యామినీ, రాజూను. . వాళ్ళు కనిపించగానే అమరేంద్రకు మనసు కుదుటపడింది.
అతన్ని చూసి, కంగారుగా బండదిగి తలలు వంచుకుని నిలబడ్డారు ఇద్దరూ. తప్పు చేశామన్న భావం కొట్టొచ్చినట్లు కనబడింది వాళ్ళ ముఖాల్లో. అమర్ దగ్గరగా రాగానే, "క్షమించండి! బోర్డం భరించలేక ఇటు వచ్చాము" అంది యామిని తలవంచుకుని.
అమర్ కి నవ్వొచ్చింది. కాని కోపం నటిస్తూ, " ఇది అడవి! ఇక్కడ కౄర జంతువులుంటాయి, విష సర్పాలుంటాయి, అన్నింటికీ మించి దుష్టులైన ఆటవికులుంటారు, జాగ్రత్తగా ఉండాలని తెలియదా? మీరు తిరిగి మీ ఇళ్ళకు వెళ్ళేవరకూ మీ పూచీ నాదే కదా! ఎంత భయపడ్డానో ....! ఇంకెప్పుడూ ఇలా నాతో చెప్పకుండా ప్రమిసిస్ దాటి వెళ్ళొద్దు. గుర్తుంచుకోంది. ఇది అసలే పులులు తిరిగే వేళ, తెలుసా" అన్నాడు.
"పులులు సాధారణంగా మనుష్యులు తిరిగే చోటికి రావు, ఒక్క మేనీటర్సు తప్ప! అయినా అవి చాలా అరుదు" అంది యామిని తలవంచుకునే నెమ్మదిగా.
అమర్ కి నవ్వొచ్చింది. "సర్లే! నీ బుక్ నాలేడ్జికి నా జోహార్లు గాని, ఇది విను ...... థియరీకి ప్రాక్టీస్ కి మధ్యలో "ప్రాక్టికల్ ఎర్రర్" అని ఒకటుంది, తెలియదా? లోతు తెలియకుండా నీటిలో దిగకూడదు, చోటు తెలియకుండా ఎక్కడకూ చొరవచేసి వెళ్ళకూడదు. ఈ చోటు గురించి నీకేం తెలుసని ఇంత సాహసం చేశావు? దారి తప్పితే ..... ?"
ఒక్కసారిగా అర్థమయ్యింది యామినికి అదెంత ప్రమాదకరమైన విషయమో! " ఈ ఒక్కస్సారికీ క్షమించండి" అంది తలెత్తకుండానే చెవులు పట్టుకుని.
అమరేంద్రకి నవ్వు ఆగలేదు. "ఇక చాల్లే! మళ్ళీ ఎప్పుడూ ఇలాచెయ్యకు మరి" అన్నడు నవ్వుతూ. "ఇంతకీ ఈ జామికాయలు మీకు ఎక్కడ దొరికాయి" అని అడిగాడు వాతావరణాన్ని తేలిక పరుస్తూ.
"నాకు తెలుసు సార్! నేను కోసి తెస్తా" అంటూ బయలుదేరాడు రాజు. రాజు వెంట నడిచాడు డ్రైవరు కూడా.
తల వంచుకునే నిలబడిపోయింది యామిని. "యామినీ! నీ కిక్కడ బోరుగా ఉంది కదూ" అని అడిగాడు అమర్ మృదువుగా.
" అలా ఏం లేదు. బయట కాలుపెడితే బోలెడు కాలక్షేపమ్. గదిలో కూర్చుని ఉన్నప్పుడే ఏమీ తోచడు. ఇలా కొంచెం సేపు బయటికి రావడం బాగుంటుంది కదా సర్! కిటికీలోంచి రోజంతా ఒకే సీమరీ చూస్తూ కూచోడం అంతగా బాగుండడంలేదు. వళ్ళియమ్మకు భాష రాకపోవడంతో నేను మరీ ఒంటరినైపోయాను. మీరు మీ "వుడ్ బి .... " ని కూడా మీతో తీసుకు వచ్చివుంటే బాగుండేది" అంది యామిని సాహసించి .
యామినినే చూస్తూ, " తీసుకురాలేదని ఎందుకనుకుంటున్నావు" అంటూ సన్నగా గొణిగాడు అమర్.
తెల్లబోయింది యామిని. "దీని భావమేమి తిరుమలేశా" అనుకుంది. రకరకాల ఆలోచనలు చెలరేగాయి ఆమె మనసులో. మళ్ళీ తనని తానూ సంభాళించుకుని, తాను సరిగా వినలేదేమో - అనుకుని మనసు సరిపెట్టుకోవాలని చూసింది.
అమర్ నవ్వి, " దానికంత ఆలోచన చేసి బుర్రపాడుచేసుకోడం ఎందుకు? నిజంగా నీ మనసును ఎవరైనా ఆక్రమించి ఉంటే, వాళ్ళు ఎప్పుడూ నీతో కూడా ఉన్నట్లే ఉంటుంది కదా!" అంటూ ఆమె ముఖంలోకి చూశాడు.
అంతలో చేతులనిండా దోర దోర జామకాయలు పట్టుకుని వచ్చారు డ్రైవరూ, రాజూను. వాటిలోంచి ఒక జామికాయ తీసుకున్నాడు అమర్. అందరూ గెస్టుహౌస్ దారి పట్టారు. గెష్టుహౌస్ సమీపించిందన్నదానికి గుర్తుగా వల్లియమ్మ వండుతూన్న సాంబారు ఘుమ ఘుమలు గాలిలో తేలి రాసాగాయి. వాళ్ళు ఇల్లు చేరేసరికి, విమలాచార్య గది గదికీ దీపాలు వెలిగిస్తూ కనిపించాడు.
రాత్రి పెట్రోమాక్సులైట్ కాంతిలో అందరూ భోజనాలు చేస్తూండగా చెఫ్ఫడు అమరేంద్ర, రేపు తెల్లవారేసరికి అందరినీ సిద్ధంగా ఉండమనీ, అంతాకలిసి పిక్నిక్ కి వెళ్ళబోతున్నామనీను. మళ్ళీ వళ్ళియమ్మకు ప్రత్యేకంగా తమిళంలో చెప్పాడు - ఆమెకూడా అందరితో పాటుగా వస్తోందని. వళ్ళియమ్మ చాలా సంతోషించి అమర్ కి "నన్రి" చెప్పింది.
అందరిలోనూ, ముఖ్యంగా యామిని,. రాజుల్లో ఉత్సాహం ఉప్పొంగింది. మరునాడు వెంట ఏమేమి తీసుకెళ్ళాలన్నదానిమీద చాలా సేపు తర్జన భర్జనలు పడి కడకు ఒక నిర్ణయానికి వచ్చరు. "లెస్ లగేజ్ గివ్సు మోర్ కంఫర్ట్" అన్న దానిని పురస్కరించుకుని సామాను సద్దుకోవాలని అనుకున్నారు.
నాడెమైన సరుకు రావడానికి ఆలస్యం ఉందని రేంజర్ చెప్పగానే అమరేంద్ర పిక్నిక్ కి ఆ మరునాడే వెళ్ళడానికి ప్లాన్ వేశాడు. రేపు ఉదయం తొందరగా రమ్మని గైడ్ కి చెప్పమని గార్డుకి చెప్పేడు. ఊరికే ఒకచోట కూచోడమంటే అతనికీ బోరే!
* * *
మరునాడు గైడ్ వచ్చేసరికే అందరూ స్నానాధికాలు ముగించి, సిద్దంగా ఉన్నారు. వళ్ళియమ్మ సూక్ష్మంలో మోక్షంగా అండరికీ ఉప్మా, కాఫీ ఇచ్చింది. మధ్యాహ్న భోజనానికి "బిస్సిబేళా బాత్" చేసింది. మంచినీళ్ళు, భోజనం, చిరుతిళ్ళు, పళ్ళూ - అన్నీ బాస్కెట్లలో సద్దింది లెక్క ప్రకారం. నేలమీద పరుచుకుని కూచునేందుకు బ్లాంకెట్లు, చేతులు తుడుచుకునీందుకు రెండు తువ్వళ్ళూ ఉంచింది. వడ్డించేందుకు పెద్దపెద్ద బాదం ఆకులూ. రెండు గరిటలూ, కొన్నిస్పూన్లూ కూడా వాటికి చేర్చబడ్డాయి. ఈ పాటి సామాను ఉంటేగాని పిక్నిక్ రక్తికట్టడనిపించింది యామినికి. అన్నీ తీసుకుని వేన్ ఎక్కేరు అందరూ. అమరేంద్ర కెమేరాతోపాటుగా మరినాలుగు స్పేర్ రీళ్ళు వెంట ఉంచుకున్నాడు.
వేన్ నడిచినంత వరకూ వేన్ మీద వెళ్ళి, ఆ పైన కాలినడకను పిక్నిక్ స్పాట్ కి వెళ్ళాలన్నది ప్లాను. కడకంతా వెన్ నడిచే దారి లేదు మరి! వేన్ ఒకచోట ఆగిపోయింది ఆపైన రోడ్డు లేకపోడంతో. అందరూ సామాను తీసుకుని క్రిందకు దిగారు. ఇంకా ఒక మైలుకి పైగా నడిచాకగాని రాదు పిక్నిక్ స్పాట్ - అని చెప్పాడు గైడ్.
అలవాటుగా అందరినీ హెచ్చరించాడు గైడు, " అందరూ వినండి, తమరు ప్రతి అడుగూ నేలను చూసుకుని వెయ్యాలి. మనం ఇప్పుడు వెలుగైనా సరిగా చొరలేని కీకారణ్యం లోకి వెళ్ళబోతున్నాము. . దారి రాళ్ళూ రప్పలుతో ఎగుడుదిగుడుగా ఉండడమేకాకుండా, దారిలో ముళ్ళు ఉండవచ్చు. అంతే కాదు, ఇక్కడ పాముల సంఖ్య కూడా ఎక్కువే! ఏమాత్రం ఏమరినా అవి దారికి అడ్డంగా వచ్చి మనల్నిఇట్టే కాటు అందుకోగలవు. ఈ ప్రాంతంలో, ఏటా ఎంతోమంది అడవిజాతివాళ్ళు పాముకాటుకు గురై చచ్చిపోతూనే ఉంటారు. భద్రం! చూసి నడవండి" అంటూ తానే ముందు జాగ్రత్తగా దారి చూసుకుంటూ నడవసాగాడు విశ్వాస పాతృడైన ఆ గైడు. అందరూ అతని వెనుక నడవసాగారు నిర్భయంగా .
అలా ఒక మైలు వెళ్ళాక దారి రెండుగా చీలింది. గైడు ఏ దారికి మళ్ళాడో ఆ దారి వెంటే నడిచారు అందరూ. చెట్ల మధ్య నుండి, పొదలను తప్పించుకుంటూ వాళ్ళు ఇంకొంత ముందుకి వెళ్ళగానే అక్కడ సహజంగా ఏర్పడిన అతి సుందరమైన ప్రదేశం కనిపించింది. కళ్ళు చెదిరే దాని అందాన్ని చూస్తే ఎవరికైనా స్వర్గం లో ఉందని వర్ణించబడే వైజయంతీ వనం గుర్తుకి రాకమానదు. అది ఊహా జనితమెమో గాని, ఇది మాత్రం నిజం! చెట్లచాటునుండి బయటపడ్డ ఆ కొండవాలు సొగసు వర్ణనాతీతం! కొండకొమ్మునుండి క్రిందికి దూకుతున్న జలపాతం ధారపోస్తున్న జలధారలవల్ల అక్కడ ఒక అందమైన సరస్సు ఏర్పడింది. ఆ సరస్సులో విరిసిన కలువలమధ్య ఈడుతున్నాయి అడవి బాతులు. కొంగలు, క్రౌంచపక్షులు, నీటికాకులు - ఇలా ఎన్నో రకాల నీటిపక్షులు ఉన్నాయి అక్కడ. నీటిపక్షులు నీటిలో ఈదుతూ , ములుగుతూ తేలుతూ చేపల్ని వేటాడి కడుపు నింపుకుంటున్నాయి. ఒడ్డునున్న చెట్టుకొమ్మమీద పొంచి ఉన్న లకుముకి పిట్ట, నీటిలో చేప పోలకువ కనిపించగానే సర్రున దూసుకుపోయి దాన్నిఒడుపుగా ముక్కుతో పట్టి తీసుకుపోయి, చెట్టుకొమ్మమీద పెట్టుకుని పలహారం చేసి, మళ్ళీ మరో చేపకై మాటు వేస్తోంది. చెరువు వార దట్టంగా పెరిగిఉన్న పొదలలో కాపురముంటున్న ముంగిసలూ, చెవులపిల్లులూ లాంటి చిన్న చిన్న జంతువులు, మనిషి అలికిడికి భయపడి ఈ పొదనుంది ఆ పొదకీ, ఆపొదనుండి ఈ పొదకీ పరుగులు పెడుతున్నాయి. జనాన్ని చూసిన కంగారులో చెట్లకొమ్మలపై నున్న కోతులు కొమ్మలపై పరుగులు పెడుతూ అరిచి సందడి చేస్తున్నాయి. ఇంద్ర ధనస్సు వర్ణాలతో విరిసిన పూలతో ఉన్న చంద్రకాంతపు మొక్కలు ఆక్కడ నాటుకుని ఉన్నాయి. వాటి పైన ఎగిరే, విడిచిన పువ్వుల్లాంటి, సీతాకోక చిలుకలు పూలపై వాలి తేనెలు తాగుతూ వినోదిస్తున్నాయి. అంతవరకూ నేలపై వాలి మేత ఏరుకుంటున్న అడవి పక్షులు, మనుష్యుల రాకచూసి, కువ కువ లాడుతూ చెట్ల కొమ్మల్లోకి చివ్వున ఎగిరిపోయాయి.
చెట్ల కొమ్మల్లో చేరిన పిట్టలు అలజడి పడుతూ కుయ్యడం మొదలెట్టగానే, చెట్ల గుబురుల్లో కూర్చున్న కోతులుకూడా, కొమ్మల్ని గుంజుతూ, ఎలుగెత్తి అరవసాగాయి.
" చూశారా సారూ! ఈ కోతులూ, ఆ పిట్టలూ కూడా గోలచేసి అరిచి, వాటి చోటుల్లోకి మనిషి ప్రవేశించాడని అవి వనాన్ని ఎలా హెచ్చరిస్తున్నాయో! పులిని చూసినా కూడా, జాగ్రత్తగా ఉండమని, ఇవి ఇలాగే అడవిని హెచ్చరిస్తూ అల్లరి చేస్తాయి" అన్నాడు గైడు.
"ఐతే ఇక్కడ పులులు ఉన్నాయంటావా?" అడిగాడు అమర్.
" ఇంకా లోతట్టు అరణ్యంలో కొద్దిగా ఉన్నాయంటారు గాని, ఎవరూ ఈమధ్య వాటిని చూసింది లేదు. అప్పుడప్పుడు ఒకో చిరుతపులి మాత్రం వస్తుంది ఊళ్ళోకి. ఊరి జనం దాన్ని ఆ క్షణంలోనే తరిమి కొడతారు. పర్మిట్లతో వచ్చిన వేటగాళ్ళు, పోచర్లు వాటినికూడా మిగలనిస్తారనిపించడం లేదు. ఇక ఈ అడవి జంతువులని ఆ భగవంతుడే కాపాడాలి" అంటూ అతడు చేతులూ జోడించాడు.
ఎగిరే సీతాకోకచిలుకల్నీ, తూనీగల్నీ తరుముతూ కొంచెం సేపు, వాటి వెంట చిన్నపిల్లల్లా పరుగులు పెట్టారు రాజూ, యామినీను. ఎగిరే పక్షుల్నీ, దూకే జలపాతాన్నీ చూస్తూ, అక్కడున్న కొండ రాళ్ళమీద కూచున్నారు అందరూ. పట్టరాని ఆనందంతో రీలు ఐపోతే మరో రీలు మారుస్తూ, అక్కడి ప్రకృతిని, పూచిన పూలనీ , కనిపించిన ప్రతి జంతువునీ ఫొటోలు తీశాడు అమరేంద్ర. పనిలో పనిగా తనతో వచ్చిన వారందరినీ కూడా ఫొటోలు తీశాడు. యామిని, కెమెరా అడిగి తీసుకుని, అందమైన ఆ పరిసరాల్లో వివిధ భంగిమల్లో అమరేంద్ర ఫొటోలు తీసింది.
అక్కడ ఖాళీ జాగా చూసి, పచ్చిక పైన తను తెచ్చిన దుప్పట్లు పరిచి అందరినీ కూచోమని, బాదమాకుల్లో, తను వండి తెచ్చిన "బిస్సిబెళాహుళియన్న" - అనే తను వండితెచ్చిన పుష్టికరమైన వంటకాన్ని, వడ్డించింది వళ్ళియమ్మ. ఆకలిమీద ఉన్నారేమో, అందరూ అది తృప్తిగా తిన్నారు. లంచ్ అయ్యాక కొంతసేపు విశ్రమించి, ఆపై కొండమీదున్న చందనపు చెట్లని చూడడానికి వెళ్ళాలన్నది అమర్ ప్లాను. కాని ముందుగా అతను కెమేరా తీసుకుని చెరువు దగ్గరకు వెళ్ళాడు; చెరువునీ, చెరువు నిండా వికసించి ఉన్నరకరకాల పూలనీ, ఆ పూలమధ్య ఈదుతూ, ఆడుతూ, వ్చేపల్ని వేటాడుతున్న నీటి పక్షుల్నీ, పొదల మాటున పొంచివుండి, చెరువులో నీళ్ళు తాగడానికి వచ్చిన జంతువులనీ , ఫొటోలు తియ్యడానికి!
"చాలా అందమైన ఆల్బం తయారయ్యీలా ఉంది! నాకూ ఒక కాపీ ఇమ్మని అడగాలి " అనుకుంది యామిని.
కొంతసేపు విశ్రాంతి తీసుకున్న తరవాత గైడ్ అడిగాడు, "కొండ మీదకు వచ్చేది ఎవరు" అని.
వళ్ళియమ్మ, విమలాచార్య, డ్రైవరూ ఎటువంటి ఉత్సాహమూ చూపించ లేదు. "ఫెమిలియారిటీ బ్రీడ్సు కంటెమ్టు" అన్న ఇంగ్లీషు సామెతను వాళ్ళు మరో మారు రుజువు చేశారు. వాళ్ళు ఆ ప్రాంతపువాళ్ళు కావడంతో చందనపు చెట్లు వాళ్ళకు కొత్తేమీ కాదు. ప్రాచీన కవులు ఎప్పుడో గుర్తించారు ఆ విషయాన్ని! మలయపర్వతం మీద నివసించే ఆటవిక స్త్రీలు చందనపు కట్టెలు మండించి వంట చేసుకుంటారు - అని! అమరేంద్ర ,యామిని, రాజు మాత్రమే గైడ్ వెంట బయలుదేరారు చందనపు చెట్లను దగ్గరగా చూడాలన్న ఉబలాటంతో. కొండమీదికి కాలిదారి ఏమీ లేకపోవడంతో వాళ్ళు తుప్పల్ని తప్పించుకుంటూ నడవాల్సి వచ్చింది. హఠాత్తుగా ముందు నడుస్తున్న గైడ్ ఆగి, వెనక్కి తిరిగి, నోటిమీద చూపుడు వేలు ఉంచుకుని శబ్దం చెయ్యొద్దన్న సైగతో స్థాణువులా కదలకుండా నిలబడిపోయాడు. అదేమిటో అడిగి తెలుసుకోవాలనిపింసినా అక్కడ అతను చెప్పింది పాటించడమే తెలివైనపని అనుకుని తక్కిన వాళ్ళు కూడా అలాగే స్థాణువుల్లా నిలబడిపోయారు.
అంతలో సుదీర్ఘమైన "బుస్సు" మన్న శబ్దం వినిపించింది. ఆ శబ్దం వచ్చిన దిక్కుగా చూశారు వాళ్ళు. అల్లంత దూరంలో రెండు పెద్ద పెద్ద పాములు ఒకదానితో ఒకటి కలబడి పోట్లాడుకుంటున్నాయి. వాటీకి కూడా త్రాచుపాములకున్నట్లు పడగ ఉంది కాని అంతకంటే ఇవి చాలా పెద్దవి. రంగు రూపు కూడా కొంతవరకూ వ్యత్యాసంగానే ఉంది. అవి నలుపుకి దగ్గరగా ఉన్న నాచు రంగులో ఉన్నాయి. ఒకటి ఆరు గజాల చీరంత పొడవు ఉంటే, మరొకటి అంతకన్నా కొంచెం పెద్దదిగా ఉంది. ఏది ఏమైనా, పొడవులో ఆ పాములు రెండూ కూడా చాలా పెద్దవే! అవి పట్టరాని కసితో వెర్రెత్తిపోయి ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఎదుటి దానిని కరిచి చంపడం కోసం ఆత్రపడి పడగ విసురుతూ, ఒకదాని నొకటి పెనవేసుకొంటూ, అంతలోనే విడిపోతూ బుసలు కొడుతూ భయంకరంగా పోరాడుకుంటున్నాయి. ఆ పోరాటంలో గాలిలోకి రెండడుగులకు మించిన ఎత్తుకి విశాలమైన పడగల్ని నిట్టనిలువుగా లేపుతున్నాయి. వాటికి పరిసరాలను గురించిన స్పృహ ఉన్నట్లు లేనే లేదు. చూపరులకు మాత్రం అదొక అద్భుత, భయానక దృశ్యంలా, భయంతో ఒళ్ళు నిలువునా గగుర్పొడిచీలా ఉంది.
చిన్నపాము చాలా చురుకుగా ఉంది. కాని పెద్దపాము నేర్పరితనంతో దాని కాటుకి దొరక్కుండా తప్పించుకుంటోంది. కాని ఒక దశకు వచ్చేసరికి పెడ్డపాము కొద్దిగా నీరసపడ్డట్లు కనిపింఛింది. అంతలో, చూస్తూండగా రెండు కృష్ణ జింకలు అటుగా పరుగెత్తుకుంటూ అటుగా వచ్చి, తమదారిన తాము వేగంగా వెళ్ళిపోయాయి. వెళ్ళిపోయాయి. పాములు రెండో విడిపోయి చెరోపక్కకీ పాకిపోయాయి. .
అవి "హేమడ్రియాడ్" అనబడే సర్పజాతి పాములు . మనవాళ్ళైతే వాటిని "రాచనాగులు" అంటారు. ఇంగ్లీషులో "కింగ్ కోబ్రా" అంటారు. కోబ్రా - అంటే అదే - త్రాచుపాము కీ; వీటికీ పోలికలు కొన్ని వున్నా, చాలా విభేదాలూ ఉన్నాయి. ఈ పాములు దట్టమైన అడవుల్లో ఉంటాయి. నేలమాళిగలు లాంటి ఏకాంతప్రదేశాల్లో కోడా ఇవి నివసిస్తాయి. మరో విశేషం ఏమిటంటే ......, వీటికి నచ్చే ఆహారం పాములు! ఏజాతి పామైనా సరే, దొరికితే చాలు ఇవి ఇట్టే పలహారంచెసేస్తాయి. ఒక్కొక్కప్పుడు ఆకలి ఎక్కువైతే ఇవి తమ పిల్లల్ని తామే తినేస్తాయి! పదహారు అడుగుల వరకూ పోడవు పెరుగుతాయి. ముదురు నాఛురంగులో ఉండి, చూడడానికి నల్లగా కనిపిస్తాయి. ఇవి గాలిలోకి పడగెత్తి రెండడుగులకు మించి పైకి లేవగలవు. ఇవి పాకే వేగం అమోఘం! మనిషి పందెం వేసి వీటిని గెలవడం అసంభవం. తప్పించుకు తిరగడమే మంచిది.
కొంచెం సేపటికి అందరూ తెలివి తెచ్చుకుని, గైడ్ ఆ పాములను గురించి చెప్పిన విషయాలు విని ఆశ్చర్యపోయారు. గైడ్ వాళ్ళని, దారి మార్చి, వేరే వైపునుండి కొండమీదికి నడిపించాడు. దారిలో చెప్పాడు, " ఆ పాములు మంచి కసిమీద ఉన్నాయి సారూ! దగ్గరలోనే ఏ రాతి కిందో దాగి ఉంటాయి.
మనం ఇప్పుడు అటు వెళ్ళకపోడమే మంచిది. జతకట్టే రోజుల్లో రెండుపాములు ఇలా దెబ్బలాడుకుంటూ ఉంటాయి. పాము విషం పాముకి కూడా విషమే! మొదట కాటుతిన్న పాము చచ్చిపోతుంది. రెండవది గెలుస్తుoది. ఈ పోరాటాలు మేము ఈ ఋతువులో తరచూ చూస్తూనే ఉంటాము!"
"అబ్బా! మహా భయంకరం! నిన్న ఖెడ్డా, ఈవేళ ఇది" అనుకుంది యామిని.
ఆ ప్రదేశాన్ని వదిలి, వేరే వైపున వున్నా కాలిదారి మీదుగా వాళ్ళని కొండమీదకు నడిపించాడు
దారిలో కనిపించిన ఒక చెట్టుని చూపించి అడిగాడు అమర్, " ఈ చెట్టు ఆకులు వెడల్పుగా, తమాషాగా చీలి ఉన్నాయి, ఇదేం చెట్టు?"
"ఇది టేకు చెట్టు. దీని కలప చెక్క పనికి చాలా శ్రేష్టం. మన దేశపుటడవుల్లో ఇది విరివిగా దొరుకుతుంది. చెక్క సామాను తయారీకి ఇది ప్రసిద్ధమైన కలప, మంచి నాణ్యత కలది" అన్నాడు గైడు.
" ఔను, అంతవరకూ నాకు తెలుసు, కాని చెట్టుని చూడడం ఇదే మొదటిసారి! ఐతే ప్రజోపకరణంగా గంధపు చెట్టుకంటే ఇదే విలువైనదన్నమాట" అన్నాడు అమరేంద్ర .
"ఔనుసార్! మాటల ధోరణిలో పడి మనం, మనకి తెలియకుండానే రావలసిన చోటుకి వఛ్ఛేశాము. అదిగో ఆ కనిపించేదే చందనపు చెట్టు" అంటూ ఒక చెట్టువైపు వేలెత్తి చూపించాడు గైడ్.
వాళ్ళు మరి నాలుగు అడుగులు ముండుకు నడిచి చందనపు చెట్టుని సమీ పించారు. దట్టమైన ఆకుపచ్చని ఆకులమధ్య గుత్తులు గుత్తులుగా పూచిన చిన్న చిన్న ఎర్రని పూలతో మానుకట్టి అందంగా ఉంది ఆ చెట్టు. గట్టిగా గాలిపీల్చి వదులుతూ చందనపు పరిమళం కోసం వెతగసాగారు వాళ్ళు. కాని దాని జాడే లేదు ఎక్కడా.
గైడ్ కి నవ్వొచ్చింది. "ఏంచేస్తున్నారు సారూ" అని అదిగాడు.
"చందనపు చెట్టు తన చుట్టూ ఉన్న చెట్లకన్నింటికీ తన పరిమళం పంచుతుందనీ, ఆ పరిమళానికి పాములువచ్చి చందనపు చెట్టుకి చుట్తుకుని ఉంటాయనీ అంటారు. ఇక్కడ అల్లంటిదేమీ కనిపించడంలేదు, ఎందుకని?' అడిగాడు అమరేంద్ర.
"కొంచెమున్నదానిని కొండంత పెంచి చెప్పడం మనవాళ్ళకున్న పాడు అలవాటు. అవేం నిజాలు కావు, చూస్తున్నారుకదా! ఇక్కడ పాముల బెడద ఎక్కువన్నది నిజం. ఎక్కడపడితే అక్కడ అవి కనిపిస్తూనే ఉంటాయి. వాటికి గంధపు చెట్టైనా, గంగరావి చెట్టైనా ఒకటే!"
"మలయ పర్వతం మీద నివసించే ఆటవిక స్త్రీలు చందనపు కట్టెల్ని పొయ్యిలో పెట్టి మండించి వంట చేసుకునీ వారని రాశారు ప్రాచీన కవులు. అదీ అబద్దమేనేమో" అంది యామిని.
అమరేంద్ర నవ్వి అన్నాడు, " ఇది అబద్ధం కాకపోవచ్చు. అన్నీ అవే ఐనప్పుడు అవసరానికి వాటినే వాడుకోవాలి కదా!"
కొంతసేపు అక్కడే ఉండి, మనసుకు తృప్తి కలిగేవరకూ గంధపు చెట్లని చూసి, తనివితీరాక వెను తిరిగారు వాళ్ళు. మళ్ళీ లంచి తిన్నచోటుకి వచ్చారు. అక్కడ వాళ్ళరాకకోసమే ఎదురుచూస్తూ ఉన్నారు వల్లియమ్మ, విమలాచార్య, డ్రైవరూను.
వాజుల్లో పెడతానంటూ కొన్ని అడవి పూల గుత్తులు కోసుకుంది యామిని. అందరూ మళ్ళీ వెనక్కి, వేన్ దగ్గరకి నడవడం మొదలుపెట్టారు.
కొండ మీది దారి రెండుగా చీలినచోటుకి రాగానే, పుట్టింటికి వెళ్ళే సంబరంలో ఉన్న వళ్ళీయమ్మ మనసు ఉప్పొంగింది. ఈ పక్క దారివింట వెడితే ఒక కొండ వస్తుందనీ ఆ కొండకావల ఉన్నదే తన పుట్టినింటివారి ఊరనీ, తన అన్న తనకోసం ఆదారివెంటే, తనను తీసుకు వెళ్ళడానికి వస్తాడనీ చెప్పింది, తమిళంలో. అమర్ దానిని తెలుగులోకి తర్జుమాచేసి చెప్పాడు యామినికి.
వేన్ గెష్టు హౌస్ చేరుకునీ సరికి అక్కడ వాళ్ళ రాకకోసం ఎదురుచూస్తూ ఉన్నాడు సెల్వసామి, వళ్ళీయమ్మ అన్న! గైడ్ చేతిలో వంద నోటు ఉంచి అతన్ని వేన్ మీద ఇంటికి పంపించేశాడు అమర్. గైడ్ చాలా సంతోషించాడు.
అన్నగారిని పలకరించి, కుశలమడిగి, భర్తను చూసుకోమనిచెప్పి అప్పగించి వంట చెయ్యడానికి వెళ్ళింది వళ్ళియమ్మ. అమర్ యామినీ వరండాలో ఉన్న పేం కుర్చీల్లో కూచున్నారు. సెల్వసామి తాను తెచ్చిన చందనపు చెక్కను చెక్కి చేసిన బొమ్మలూ, గంధపు చెక్కలూ అమరేంద్రకు, ఇచ్చి, వాటిని చెక్కింది విమలాచార్యేనని చెప్పాడు. ఆ బొమ్మలని పైకి తియ్యగానే ఆ ప్రదేశమంతా చందనపు పరిమళంతో నిండిపోయింది.
బొమ్మలు చాలా అందంగా ఉన్నాయి. ఆవుని ఆనుకుని నిలబడి మురళీ వాయిస్తున్న కృష్ణుడూ, నెమిలి వాహనం మీది కుమార స్వామి, రాజహంసమీద కూర్చుని వీణ వాయిస్తున్న సరస్వతీ మరీ అందంగా ఉన్నాయి. విమలాచార్య పనితనానికి అవి నిదర్శనాలుగా ఉన్నాయి. గంధపు చెక్కలకు కూడా పైభాగంలో పూలతో, కాయలతో, ఆకులతో అందమైన లతలు చెక్కబడి, పట్టుకోడానికి వీలుగా రెండువైపులా పిడులు ఉండి చక్కగా, ప్రత్యేకంగా ఉన్నాయి. అమరేంద్ర వాటిని యామినికి ఇచ్చి దాచి ఉంచమని చెప్పాడు. వెంటనే లేచి వాటిని తీసుకెళ్ళి తన బాగ్ లో మెత్తని బట్టలమధ్య పదిలంగా ఉంచింది యామిని.
ఆ సాయంకాలం రేంజర్ దగ్గరనుండి వార్త వచ్చింది. శాండల్ ఉడ్ కొత్త స్టాకు వచ్చిందనీ, రేపు ఉదయమే వచ్చి తీసుకెళ్ళవచ్చుననీ కబురు పంపాడు రేంజర్.
రేపు భోజనాలు అవ్వగానే మనం హైదరాబాదు వెళ్ళిపోతున్నాము. అక్కరలేనివన్నీ వదిలేసి, ముఖ్యమైనవి మాత్రం సద్ది ప్రయాణానికి సిద్ధంగా ఉండండి" అని చెప్పాడు అమరేంద్ర అందరికీ.
ఆ రాత్రికి సెల్వసామి అక్కడే ఉండి, అందరితోపాటుగా తనూ ప్రయాణమై చెల్లెల్ని తీసుకుని వాళ్ళ ఊరికి వెళ్ళేలా ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు కూడా.
ఉదయమే తయారయ్యి, రేంజర్ వద్దకు ప్రయాణమయ్యాడు అమరేంద్ర. అతనితో పాటుగా విమలాచార్య, సెల్వసామీ కూడా వేన్ ఎక్కారు. ఆ రోజు వాతావరణం ఏమీ బాగా లేదు. ఆకాశంలో మేఘాలు ఒకదానినొకటి తరుముకుంటూ పరుగులు తీస్తున్నాయి. మేఘాల మాటున దోబూచులాడుతూన్నట్లుగా కనీ కనిపించకుండా ఉన్నాడు సూర్యుడు. తేమతో కూడిన చల్లని గాలి బరువుగా వీస్తోంది. ఆ వాతావరణాన్ని చూస్తూంటే ఏ క్షణాన్నైనా వాన పడవచ్చు ననిపిస్తోంది.
వేన్ వెళ్ళే సరికి రేంజర్ వీళ్ళకోసం గొడౌన్ దగ్గర కనిపెట్టుకుని ఉన్నాడు, ముండుగా ఈ పని పూర్తిచేసి, తరవాతే "ఖెడ్డా" దగ్గరకు వెళ్ళవచ్చు నన్న ఉద్దేశ్యంతో.
"ప్రస్తుతానికి మాకు 500 కిలోలకు మాత్రమే దొరికింది పర్మిట్. దాంతో పని మొదలౌతుంది. తరవాత మళ్ళీ వచ్చి ఎక్కువ తీసుకుంటాము. అవసరాన్ని బట్టి పర్మిట్ వాల్యూ పెంచుకుంటూ పోతాము" అన్నాడు అమరేంద్ర రేంజర్ తో.
"నల్లాదు తంబీ, నల్లాదు! ఆండవన్ దయ నీ మేల నిండా ఉండాది. మీ ఆర్డర్ వచ్చినప్పుడు నాన్ కండిప్పా సగాయం చేసి పూడుస్తా" అన్నాడు వచ్చీ రాని తెలుగులో , స్నేహపూర్వకంగా అమరేంద్ర వైపు కరచాలనం కోసం చెయ్యి చాపి.
(సశేషం)