ధారావాహికలు
సుందరకాండ
- డా.అక్కిరాజు రమాపతిరావు

(గత సంచిక తరువాయి)

సీతారాముల ఏకాంత వృత్తాంతం

''చిత్రకూటపర్వతంపై మందాకినీనది సమీపంలో ఒక సిద్ధాశ్రమం ఉంది. ప్రభూ! శ్రీరామా! ఆ ఆశ్రమంలో చాలాసేపు మనమిద్దరం విహరించాం. అప్పుడు నాకు చాలా అలసట కలిగింది. ఆ ఆలసట తీరటానికి నీవు నన్ను నీ ఒడిలో చేర్చావు. అప్పుడు ఒక కాకి వచ్చి నన్ను పొడవాలనుకుని పదేపదే ప్రయత్నించింది. అది ఆ సమీపంలోనే నా చుట్టూ తిరుగుతూ అవకాశం కోసం చూస్తున్నది. నేను మట్టిబెడ్డలను విసిరినా అది పోలేదు. నేను నా మేఖలను సరిచేసుకుంటూ వస్త్రాన్ని సరిదిద్దుకుంటూ ఉండటం చూసిన నీకు నవ్వు వచ్చింది. కాకి మీద కోపం చూపుతున్న నన్ను చూసి నీవు నవ్వటం నాకు సిగ్గైంది. అప్పుడు నీవు నన్ను బుజ్జగించావు. నా కళ్లు చెమర్చాయి. అప్పుడు నన్ను నీవు లాలించావు. తరువాత నేను నీ ఒడిలో తలపెట్టుకొని శ్రమ తీరేటట్లుగా నిద్రించాను'' అఇ నేను చెప్పినట్లు చెప్పు. నేను మేల్కొన్న తరువాత శ్రీరాముడు నా ఒడిలో తాను తల ఉంచి నిద్రించాడు. తరువాత కొంతసేపటికి ఆ కాకి మళ్లీ అక్కడకు వచ్చింది. అది నా దగ్గరకు వచ్చి పొడిచింది. ఈ సమయంలో శ్రీరాముడు సేదతీరుతున్నాడు కదా అని నేను దానిని అదిలించలేదు. నా పయ్యద నుంచి రెండు మూడు నెత్తుటి బొట్టు కిందికి జారాయి. శ్రీరాముడికి మెలకువ వచ్చింది. నా దీనావస్థను చూసి ఆయనకు పట్టరాని కోపం వచ్చింది. ఒక గరికపోచను తీసుకుని బ్రహ్మాస్త్రంగా మంత్రించి దానిపై ప్రయోగించాడు శ్రీరాముడు. అప్పుడది పరుగు పరుగున వెళ్లి దిక్పాలకులను, సకలదేవతలను శరణు కోరింది. కాని వాళ్లెవరూ శ్రీరాముడి అస్త్రాన్ని మర్లచలేకపోయినారు. ఆ కాకి ఇంద్రుడి కుమారుడట. ఈ రూపంతో సంచరిస్తున్నాడట. అప్పుడా కాకి ప్రాణభయంతో వచ్చి శ్రీరామచంద్రుణ్ణే శరణు వేడింది. ఆయన శరణత్రాణతత్పరుడు కదా; 'బ్రహ్మాస్త్రం నిష్ఫలం కావటానికి వీల్లేదు, నీ అవయవాన్నేదైనా ఛేదించక తప్పదు' అని రాముడు చెప్పగా తన కుడికంటిని పెకలించమని కోరి ఆ కాకి బతికిపోయింది.

శ్రీరాముడికి సీతమ్మ సందేశం

''నాయనా! ఆంజనేయా! ఒక కాకి నాకు అపకారం చేసిందని బ్రహ్మాస్త్రంతో దానిని శిక్షించాడు కదా! నా రాముడు. మరి నన్ను ఆ దుష్టరావణుడి చెరలో ఉండగా ఉపేక్ష చేస్తున్నా డెందుకు?'' అని సీతాదేవి కన్నీరు కార్చింది. 'హనుమా! లక్ష్మణుడు ఎట్లా సహిస్తున్నాడయ్యా ఈ దుర్మార్గాన్ని' అని నొచ్చుకుంటూ అడిగింది. ఆ లక్ష్మణుడి వల్ల మా ఇద్దరికీ దశరథమహారాజు లేడనే లోటు తీరింది కదా! నన్ను మామగారికంటే ఆదరంగా చూసుకుంటాడు కదా! రాముడికి తండ్రిలేడనే దుఃఖం మరిచిపోయేట్లు చేశాడు కదా! ఆ లక్ష్మణుడు. నా మరిదిని మరీ మరీ అడిగాననీ, ఎప్పుడూ నాకు జ్ఞాపకం వస్తున్నాడనీ అతడి కుశలవార్త అడిగానని అతడికి చెప్పు'' అని సీతాదేవి హనుమంతుణ్ణి కోరింది. ''ఒక నెలరోజులు తర్వాత నేను జీవించి ఉండటం కల్ల అని శ్రీరాముడికి పదే పదే బోధించు'' అని విలపిస్తూ సీతాదేవి హనుమంతుణ్ణి ప్రాధేయపడింది.

అంతటితో ఆమె మనసు కుదుటపడలేదు. ఆశ తీరలేదు. తనకొంగు ముడివిప్పి అత్యంత శోభాన్వితమైన దివ్యచూడామణిని హనుమంతుడి చేతిలో పెట్టి 'నా ప్రభువుకు దీనిని సమర్పించు' అని చెప్పింది. అది భుజం మీద పెట్టుకోవటానికి కుదరదు కనుక హనుమంతుడు దానిని అంగుళీయకంగా అమర్చుకొని ఆమెకు ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు. 'నాయనా! ఈ ఆనవాలు ఆయనకు నిస్సందేహంగా నీవు నన్ను చూశావన్న విషయం చెబుతుంది. ఈ మణిని చూడగానే శ్రీరాముడికి నా తల్లితండ్రులు, దశరథ మహారాజూ కళ్లలో కదులుతారు. నన్ను తలచకుంటా''డని చెప్పింది సీతాదేవి. వాయుసుతు డప్పుడు తిరుగు ప్రయాణానికి బయలుదేరాడు. ఆయన ప్రయాణోన్ముఖుడు కావటం చూసి సీతాదేవి ఎంతగానో వగచింది. ఇప్పటివరకూ ఆమె సంతోషంగా, దైన్యం లేకుండా ఉన్నది. తన ఆత్మబంధువు తిరిగి వెళుతుంటే మళ్లీ ఆమెకు తన దుఃస్థితి కళ్లకు కట్టినట్లయింది. ఆ దుఃఖోద్వేగాన్ని నిగ్రహించుకోలేకపోయింది.

''అమ్మా సీతాదేవీ! చింతించవద్దు. భల్లూక వానరసేన సర్వసంసిద్ధంగా ఉంది. నేను వెళ్లి నీ విషయం వాళ్లకు చెపపడమే ఆలస్యం, వాళ్లంతా దండెత్తివస్తారు. భూమి మీదకాని, ఆకాశంమీద కాని వాళ్లను నిరోధించగలవారు ఎవరూ లేరు. ఇంకోమాట చెబుతాను. విను తల్లీ! సుగ్రీవుడి దగ్గర నాకంటే తక్కువ వాళ్లెవరూ లేరు. నాతోసమానులు, నాకంటే విశిష్టమైన వాళ్లు అక్కడ ఉన్నారు. వాళ్లంతా బలపరాక్రమాలు కలవారు, ఉత్సాహశీలులు. వగవనేల తల్లీ నీవు! నేనే సముద్రం దాటి లంకలో ప్రవేశించగలిగినప్పుడు ఇక వాళ్ల సంగతి ఏం చెప్పేది! శ్రీరామలక్ష్మణులు నా బుజాలమీద కూర్చొని ఉదయించిన సూర్యచంద్రులు లాగా నీ సన్నిధికి వస్తారమ్మా! లంకానగరాన్ని బాణవర్షంతో ముంచి వేస్తారు. రావణుణ్ణి పరిమారుస్తారు. నీకు సమస్త సన్మంగళాలు చేరువలో ఉన్నాయి జానకమ్మా' అని హనుమంతుడు సీతాదేవిని ఊరడించాడు.

''ఇదిగో రావణుడు హతం కావటం దగ్గరలోనే ఉంది'' అని చెప్పాడు ఆమెతో. ''మా వానరసేనలు పర్వతాల మాదిరిగా, మేఘాల మాదిరిగా లంకను చుట్టుముట్టబోతున్నాయి'' అని సీతాదేవికి ఊరట కలిగించాడు హనుమంతుడు. ''నీ చెర వదులుతుంది. ఈ భయంకరస్థితినుంచి నీకు విడుదల సమీపంలోనే ఉంది'' అని ఆమెను ఓదార్చాడు.

''నాయనా! నీ మాటలు వింటుంటే అంకురించిన పైరుకు సకాలవర్షంలాగా నా హృదయం హర్షోల్లాసం పొందుతున్నది. నా స్వామిని ఎప్పుడెప్పుడు చూస్తానా! ఆయన నా కన్నీరు ఎప్పుడెప్పుడు తుడుస్తాడా;'' అని శోకాతిరేకంతో ఉన్నాను. ఇందాక నేను చెప్పిన కాకికథ ఆయనకు చెప్పు. ఇంకొక కమనీయమైన సన్నివేశం చెబుతాను. దీనినికూడా ఆయనకు వినిపించు. ''ప్రభూ! ఒకరోజున ఏమైందనుకున్నావు? నా నుదుటిపైన తిలకం చెదిరిపోగా నీవు మణిశిలగంధతిలకాన్ని నా ముఖంపై దిద్దటానికి బదులు నా చెక్కిలి మీద అలంకరించావు గుర్తులేదా'' అని ఆయనను నేను అడిగినట్లు గుర్తు చేయి. ఈ చూడామణిని అందుకో అని చెప్పి,'' అని పరిపరి విధాల చెప్పిందే చెప్పింది సీతాదేవి హనుమంతుడికి. ''నాయనా! శ్రీరామలక్ష్మణులతో పాటు సుగ్రీవుణ్ణి కూడా అడిగానని చెప్పు. మరిచిపోయేవు'' అని విహ్వలంగా పలికింది సీతాదేవి.

'నన్ను శోకసముద్రం నుంచి రక్షిస్తున్నవాడివి నీవే నాయనా!' అని హనుమంతుణ్ణి ఎంతో మెచ్చుకుంటూ ఆయనకు వీడ్కోలు పలికింది. ఆమెనుంచి సెలవు తీసుకుని లంకనుంచి తిరుగు ప్రయాణమైన హనుమంతుడు ఇట్లా ఆలోచించాడు.

లంకాదహనం-రాక్షస సంహారం

'వచ్చిన పని దిగ్విజయంగా ముగిసింది. ఇక నా బలపరాక్రమాలేమిటో ఈ రాక్షసాధములకు తెలియాలి. ప్రముఖులైన వాళ్లను మట్టుపెట్టితే ఇక లంకను వశం చేసుకోవడం అదెంతపని! ఈ మూర్ఖులు సామదానభేదోపాయాలకు లొంగరు. దండోపాయమే వీళ్లకు బుద్ధి చెబుతుంది. వీళ్లంతా నాదెబ్బకు కకావికలైపోతారు. అసలు నేను లంకకు వచ్చినట్లు ఈ క్రూరరాక్షసులకు తెలియాలి కదా! నా పరాక్రమం వీళ్లకు చవిచూపాలి. అదే ఇప్పటి నా ముఖ్యకర్తవ్యం'' అని గట్టిగా నిశ్చయించుకొని ఇంకా ఇట్లా ఆలోచించాడు హనుమంతుడు.

కార్యే కర్మణి నిర్దిష్టే యో బహూన్యపి సాధయేత్‌,
పూర్వకార్యావిరోధేన స కార్యం కర్తు మర్హతి
న హ్యేకః సాధకో హేతుః స్వల్పస్యాపీహ కర్మణః,
యో హ్యర్థం బహుధా వేద స సమర్థో ర్థసాధనే (సుందర.41-5, 6)

ఏదైనా ఒక పని చేయాలని (యజమాని) ఆజ్ఞాపించినప్పుడు, ఆ పనికి విరుద్ధం కాని అనేక కార్యాలు సాధించేవాడే కార్యసాధనలో సమర్థుడు. ఎంత చన్నిపనైనా దాన్ని సాధించేందుకు ఒకే ఉపాయం ఉండదు. కాబట్టి ఆ కార్యం సాధించటానికి చాలా ఉపాయాలు తెలిసినవాడే కార్యాన్ని సాధించటంలో కుశలుడు.''

''బలప్రయోగం చేస్తే ఈ దుష్టరాక్షసుడి బలాబలాలేమిటో తెలుసుకోవచ్చు. వీడి సత్తువ ఏమిటో అంచనా వేయనూ వచ్చు కదా! ఈ అశోకవనం రావణుడికి చాలా ప్రియమైంది. ఇది వాడికి నందనవనం కన్నా రమ్యం. బహు ఇష్టం. దీన్ని కనక ధ్వంసం చేశానా వాడు క్రుద్ధుడై నన్ను బంధించడానికి మేటి వీరులను ససైన్యంగా పంపిస్తాడు. అట్లా వచ్చిన రాక్షసుల్ని బాగా మర్దిస్తాను'' అని అప్పుడు హనుమంతుడు ప్రళయకాలంలోని వాయువువలె విజృంభించి అశోకవనాన్ని ధ్వంసం చేయడం ప్రారంభించాడు. హనుమంతుడు సీతాదేవి ఉన్న ప్రదేశం జోలికి మాత్రం పోలేదు. తక్కిన అశోకవనాన్నంతా నేలమట్టం చేశాడు. అది చూసి అక్కడివారంతా వణికిపోయారు. భీతిల్లిన పక్షుల ఆర్తనాదాలు లంకాపురవాసులలో గగ్గోలు పుట్టించాయి. చెట్లు కూలుతున్న, విరిగిపడుతున్న చప్పుళ్లు వాళ్ల గుండెల్లో గుబులు పుట్టించాయి. లంకంతా భయంతో వణికిపోయింది. అప్పుడు తన శరీరాన్ని పర్వతమంతగా పెంచాడు హనుమంతుడు. కావలి ఉన్న రాక్షసస్త్రీలంతా సీతాదేవిని బతిమిలాడారు ఈ మహావిధ్వంసకు డెవరో చెప్పవలసిందని. ''నీతో ఇందాక సంభాషించాడుకదా వీడెవడో నీకు తెలియకుండా ఉంటుందా?'' అని వాళ్లు సీతాదేవిని గుచ్చి గుచ్చి అడిగారు. అప్పుడామె ''పాము జాడ పాముకే తెలుస్తుంది. కామరూపుడైన రక్కసుడేమో ఇతడు మీకే తెలియాలి'' అని వాళ్లకు ప్రత్యుత్తరమిచ్చింది.

ఆ భయంకర వికృతశరీరలైన రాక్షసాంగనలు భయంతో తత్తరబిత్తరై పరుగుపరుగున పోయి రావణుడి కీ విషయం విన్నవించారు. ''ప్రభూ! భయంకర రూపం కలిగిన వానరు డొకడు అశోకవనంలో సీతమ్మతో మాట్లాడి ఇంకా అక్కడే ఉన్నాడు. మే మెంతగా అడిగినా సీతమ్మ అతడెవరో ఎందుకొచ్చాడో ఏమీ చెప్పటం లేదు. అతడు ఇంద్రుడో, కుబేరుడో పంపిన దూత కానీ లేక సీతను వెదకటానికి రాముడే పంపిన దూత గానీ కావచ్చు. నీ కిష్టమైన అశోకవనాన్ని అతడు సర్వనాశనం చేశాడు. ఆ మహాకపి సీత ఉన్న ప్రదేశాన్ని మాత్రం భద్రంగా ఉంచాడు. కాబట్టి సీతను తీసుకుని పోవటానికి లేదా సీతాదేవి జాడ తెలుసుకుని పోవటానికి వచ్చిన గూఢచారి అయి ఉండవచ్చునని మేము అనుకుంటున్నాము. నీ అందాలతోట కాస్తా విధ్వంసమైపోయింది. నీవు మనసు పడ్డ సీతతో మాట్లాడి అశోకవనం పాడుచేసిన ఆ భయంకర రూపుడైన వానరుడికి, నీ వేదైనా తీవ్రదండనం విధించాలి,'' అని రాక్షసస్త్రీలు రావణుడికి చెప్పారు. ఆ మాటలు వినగానే రావణుడు కోపంతో మండిపడ్డాడు. వెలగిఏ రెండు దీపాలనుంచి మండే నూనె బొట్టు పడినట్లు అతని కళ్లు కోపంతో భగభగ మన్నాయి. కోపబాష్పా లొలికాయి. వెంటనే అతడు 'కింకరులు' అని ప్రసిద్ధులైన తన వంటి పరాక్రమశాలురైన ఎనభై వేలమందిని ఆ కోతిని పట్టుకోవడానికి పంపాడు. అట్లా పంపిన భయంకర రాక్షసులు మారణయుధాలతో హనుమంతుడిని ఎదుర్కొన్నారు. వాళ్లను చూసి తేజశ్శాలియైన హనుమ తన తోకను నేలపై కొట్టి ఇట్లా సింహనాదం చేశాడు-

జయ త్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః.
దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః,
హనుమాన్‌ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః.
న రావణసహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్‌,
శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః.
అర్దయిత్వా పురీం లంకా మభివాద్య చ మైథిలీమ్‌,
సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్‌. (సుందర 42.33-36)

'శ్రీరామప్రభువుకు జయము. ఆయన తమ్ముడు లక్ష్మణుడికి జయము. శ్రీరాముడికి శరణాగతుడైన కిష్కింధా ప్రభువైన సుగ్రీవుడికి జయము జయము. సాటిలేని పరాక్రమశాలి, కోసలేంద్రుడు అయిన శ్రీరాముడి దాసుణ్ణి నేను. నేను పవనకుమారుణ్ణి. హనుమంతుడంటారు నన్ను. శత్రుసైన్యాన్ని నిశ్శేషం చేస్తాను. వేయిమంది రావణులైనా నన్ను ఎదిరించలేరు. వేలకొద్దీ శిలలు విసరీ, వృక్షాలు విసరీ లంకనంతా సర్వనాశనం చేస్తాను. రాక్షసులంతా బేల ముఖాలతో నన్ను వీక్షిస్తారు గాక. నేను వచ్చిన పని ముగించుకుని సీతాదేవికి నమస్కారం పెట్టి తిరిగి వెళుతున్నాను' అని నినాదం చేస్తూ తనను పట్టి బంధించాలని వచ్చిన రాక్షసబలాన్నంతా సంహరించాడు హనుమంతుడు. చావగా మిగిలినవాళ్లు రావణుడి సన్నిధికివెళ్లి గోలు గోలున ఏడ్చారు. అప్పుడు రావణుడు మండిపడి తన మంత్రి అయిన ప్రహస్తుడి కొడుకు, మహాబలపరాక్రముడయిన జంబూమాలిని వేలసైన్యంతో హనుమంతుడితో యుద్ధం చేయడానికి పంపించాడు.

ఆ సమయంలో హనుమంతుడు ''అశోకవనమంతా నాశనం చేశాను గాని ఇక్కడ ఒక పెద్ద చైత్యగృహం ఉంది. దీన్ని మాత్రం ఎందుకు వదిలిపెట్టాలి'' అని తన మహాకాయంతో దాని మీదకు లంఘించాడు. అప్పుడాయన ఉదయపర్వతం మీద బాలభానుడిలా వెలుగొందాడు. చైత్యశిఖరంమీద నిలచి భుజాలు గట్టిగా చరచుకున్నాడు. ఆ భయంకరధ్వనికి ఆకాశంలో ఎగురుతున్న పక్షులు కూడా బిక్కచచ్చి నేలగూలాయి. ఆ చైత్యగృహం కావలి కాసే రాక్షసులు మూర్ఛపోయినారు. అప్పుడు హనుమంతుడు మళ్లీ గర్జించాడిలా- ''అస్త్రవిద్యా కౌశలంలో సాటిలేని శ్రీరాముడికి జయం! అసదృశ బలపరాక్రమ శోభితులు రామలక్ష్మణులకు జయం! శ్రీరామచంద్రుడి అనుగ్రహంతో వైభవాన్ని పొందిన సుగ్రీవుడికి జయం! అసాధ్యమైన కార్యాన్ని అవలీలగా నెరవేర్చగల శ్రీరామప్రభువుకు నమ్మినబంటును నేను. కోసలేంద్రుడు ఆయన. వాయుపుత్రుణ్ణి నేను. నన్ను హనుమంతుడంటారు'' అని చాటించుకుంటూ రాక్షససేనపై విరుచుకుపడ్డాడు హనుమంతుడు. అప్పుడు రాక్షసులు ఎన్నో మహాయుధాలతో ఆ వీరపరాక్రముణ్ణి ప్రహరించారు. అవన్నీ ఆయనకు గడ్డిపరకతో సమానం కాగా అప్పుడు పవనకుమారుడు ఆ మహాసభాభవనపు ఆధారస్తంభాన్ని ఊడలాగి దానితో రాక్షసులందరినీ మర్దించాడు. హతమార్చాడు. ఆ తరువాత ఆయన ఆకసాని కెగిసి- ''మేము మహౄబలశాలులైన కపులం. మాలో పది, వంద, వెయ్యి ఏనుగుల బలం కలవారున్నారు. లక్షలు కోట్లమందిమి సుగ్రీవుడి ఆనతిపై వస్తున్నాము. మీరు శ్రీరాముడి చేతిలో సర్వనాశనం కాబోతున్నారు'' అని అంటూ మళ్లీ గర్జించాడు.

రావణ సేనాపతులను హనుమ సంహరించటం

రావణుని మంత్రి కుమారుడు జంబుమాలి భీకరవజ్రాయుధం లాంటిది ధరించి హనుమంతుడితో తలపడటానికి యుద్ధభూమికి వచ్చాడు. శతసహస్ర అస్త్రశస్త్రాలు హనుమంతుడిపై ప్రయోగించాడు. అవన్నీ హనుమంతుడి మహాకాయాన్ని గాయపరిచాయి. కోపంతో అప్పుడు హనుమంతుడు పెద్ద మద్దిచెట్టును పెకలించి, జంబుమాలిపై విసిరాడు. దాని తన బాణాలతో మ్కులు చేసి జంబుమాలి హనుంతుడిపై పెద్దగదను విసిరాడు. దానినే హనుమంతుడు ఒడిసిపట్టి జంబుమాలిని చావమోదాడు. రథం, గుర్రాలు, సారథి నుగ్గునుగ్గు కాగా జంబుమాలి నేలకూలి ప్రాణాలు విడిచాడు. ఇంతటి బలపరాక్రముడు దిక్కులేని చావు చావటం విని రావణుడు కోపోద్రిక్తుడై కళ్లనుంచి నిప్పులు కక్కాడు. తన అమాత్యపుత్రులను పిలిపించి హనుమంతుడితో తలపడటానికి పంపించాడు. ఆ మంత్రుల కుమారులు ఏడుగురు. అప్పుడు వాళ్లు యుద్ధానికి వచ్చి హనుమంతుణ్ణి శరవర్షంతో ముంచివేశారు. హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరి ఆ రాక్షసుల పీచమడచాడు. వాళ్లందరినీ చంపివేశాడు. ఎదిరించటానికి అలవికాని మంత్రిపుత్రులు ఏడుగురు హతులైనారని విని రావణుడు కుంగిపోయినాడు, కాని తన భీతిని పైకి తెలియనివ్వలేదు.

అప్పుడు బాగా మథనపడి రావణుడు విరూపాక్షుడు, దుర్థరుడు, ప్రఘనుడు, భాసకర్ణుడు అనే తన ప్రముఖ సైన్యాధిపతుల్ని హనుంతుడితో యుద్ధం చేయడానికి పంపించాడు. ''మీరంతా రథగజతురగపదాతిదళాలతో వెళ్లి ఆ దుష్టకపిని బంధించి తీసుకొనిరం''డని ఆజ్ఞాపించాడు. ''చూడబోతే ఆ వానరుడు సామాన్యవానరుడుగా లేడు'' అని వాళ్లను హెచ్చరించాడు. ''నా మీద పగపూని ఉన్న శత్రువులంతా నాకు గొప్ప అపకారం వాంఛిస్తున్నట్లుగా నాకు అనిపిస్తున్నది. ఆ ఇంద్రుడే ఈ వానరుణ్ణి నాపైకి ఉసిగొలిపాడేమో నని అనుకుంటున్నాను నేను. నేను ఇదివరలో వాలిసుగ్రీవుల వంటి వానరవీరుల్ని చూశాను. కాని ఇంతటి పరాక్రమశాలీ, ఇంతటి తేజో బలపరాక్రమ సంపన్నుడూ అయిన యోధుణ్ణి మాత్రం చూడలేదు. కాబట్టి వీణ్ణి తప్పక బంధించి తీసుకుని రండి'' అని వాళ్లకు ధైర్యం చెప్పాడు రావణుడు. వాళ్లంతా హుటాహుటిన వెళ్లి మహా ఆర్భాటంతో హనుమంతుణ్ణి ఎదుర్కొన్నారు. అందరూ ఆయనప బాణాలు వందలకొద్దీ ప్రయోగించారు. శరత్కాలమేఘాలను వాయుదేవుడు చెల్లాచెదరు చేసినట్లు ఆ బాణాలన్నిటినీ హనుమంతుడు తోసి పారేసాడు. దుర్థరుడి రథం మీదికి దూకి అతడిని చంపివేశాడు. దానితో ఆగ్రహజ్వాల లెగయజేస్తూ తక్కిన మంత్రిపుత్రులు హనుమంతుడిపై ఆకాశంలో తలపడ్డారు. వాళ్లదరినీ కొట్టి చంపివేశాడు హనుమంతుడు. ఆ తర్వాత వాళ్లతో వచ్చిన సేనాసమూహాన్నంతా రూపుమాపాడు. ఐదుగురు సేనాధిపతులూ, అంతకుముందు వచ్చిన మంత్రిపుత్రులు యుద్ధంలో చనిపోవడం చూసి మహోగ్రవీరావేశపూరితుడైనాడు రావణుడు.

రావణుడి ఈ కోపాటోపతీవ్రసంరంభాన్ని చూసి అప్పుడు అక్కడున్న అక్షకుమారుడు విర్రవీగుతూ రణకండూతి ప్రదర్శించాడు. అప్పుడు రావణుడు హనుమంతుడితో యుద్ధం చేయటానికి అక్షకుమారుణ్ణి పంపించాడు. గొప్పరథం ఎక్కి అక్షకుమారుడు యుద్ధభూమికి బయలుదేరాడు. హనుమంతుడితో అక్షకుమారుడు మహాభయంకరయుద్ధానికి తలపడ్డాడు. నిండుమేఘం గొప్పపర్వతంపై గొప్ప వర్షం కురిపించినట్లు తన అస్త్రాలతో హనుమంతుణ్ణి ప్పివేశాడు అక్షకుమారుడు. అప్పుడు హనుమంతుడు భూమ్యాకాశాలు దద్దరిల్లేట్లు మహాభయంకరగర్జన చేసి ఆకాశానికి ఎగిరాడు. అక్షకుమారుడు ప్రయోగించే మహాస్త్రశస్త్రాలన్నీ పర్వతశిఖరంపై పడే వడగండ్లలాగా నీరుకారిపోయినాయి. హనుమంతుడు అక్షకుమారుడి యుద్ధకౌశలాన్ని మెచ్చుకున్నాడు. ''వీణ్ణి వధించటం నా ప్రథమకర్తవ్యం'' అని నిశ్చయించుకున్నాడు ఆ వజ్రకాయుడు హనుమంతుడు. అక్షకుమారుడి ఎనిమిది రథాశ్వాలను చేతిచరుపుతో ఆకాశంలోనే చంపివేశాడు హనుమంతుడు. ఇట్లా రథం తునాతునకలు కావడం, గుర్రాలు నేలకలడం చూసి కుపితుడై ధనుస్సు, ఖడ్గం తీసుకుని ఆకాశంలోకి ఎగిసి హనుమంతుడితో తలపడ్డాడు అక్షకకుమారుడు. అప్పుడు అక్షకుమారుడి కాళ్లు రెండూ దొరకపుచ్చుకొని గరుత్మంతుడు మహావిషసర్నాఇ్న ఒడుపుగా పట్టుకున్నట్లు ఆ అక్షకుమారుడిని చాలాసార్లు గిరా గిరా తిప్పి నేలపైకి విసిరికొట్టాడు. అట్లా ఆ అక్షకుమారుడు హతుడైనాడు. అతడి శరీరం నుగ్గు నుగ్గయింది. ముద్ద ముద్ద అయింది. ఆకాశసంచారులైన మహర్షులు, యక్షులు, నాగులు, ఇంద్రుడు మొదలైన దేవతలు పరమవిస్మయంతో హనుమంతుణ్ణి వీక్షించారు.

 

(సశేషం)

 


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)