(గత సంచిక తరువాయి)
కం. ఈ విధి మ్రొక్కిన నైనను
పావని శాంతిల్లకుండ ప్రబలుచు నగ్రా
హ్యావేశముతోడను నా
కావేదన కల్గ పల్కె నభియోగముగా.
కం. హనుమంతుని మాటలు నా
మనోంతరాళ జనిత ఘన మంద్ర స్వనమో
యన వినబడె - నే తత్తర
మున శాంతింపుము మహాప్రభూ! యనుచుండన్.
తే.గీ. ఉఱిమి చూచుచు నా దెస నోకరించి,
పండ్లు బిగియించి పటపటా పటకరించి,
పలికె బంధురంబైన నిస్వనము తోడ,
తలకి నా హృదంతరము సంతాపమొంద.
ఆ.వె. "దొంగ దొంగ యనుచు నంగలార్చెదవేల
దొంగ వస్తువేది; దొంగ యెవడు;
నిజము నరయకుండ నిందమోపుట తప్పు -
కేవల మనుమాన భావమునను.
తే.గీ. వందలాది వత్సరముల ముందు నుండి
ఊరు పాలించిన ప్రభువు లుల్లమందు
భక్తి రాఘవేంద్రుని పైన పరిఢవిల్లి,
మించు మణిమాన్యముల సమర్పించినారు.
తే.గీ. అందుచే నవి రాముని ఆస్తులగును,
కాని పొలము లమ్ముకొని జమీనుదారు
తనయు డాపైన సొమ్ముల తస్కరించె
దుండగమున - వాడు మొదటి దొంగకాడొ!
తే.గీ. ధర్మకర్తయి గూడ బాధ్యతను వఱచి,
దైవసేవకు సుంతైన ధనము నీక,
జీత మెగగొట్టె పాపమా జియ్యరునకు,
అట్టి దొంగను మీరేల పట్టబోరు!
కం. ఆదరువు పోయిగూడను
ఈ దేవళమును వదలక నెంతయొ భక్తిన్,
సాదరమున మమ్ము గొలిచె
మోదముతో దేవలుండు మునుపటి రీతిన్.
కం. ఆలో రోజులు మారెను,
ఏలిగ దౌష్ట్యంబుతోడ నెన్నికలగుచున్,
మీలో మీ రేలికలై,
పాలించితి రూరు క్రొత్త పద్ధతితోడన్.
తే.గీ. కాని నాయకు లెవ్వరు పూనరైరి
ఊరిలోని సమస్యల కోరితీర్చ,
చిన్న విషయంబులవి మాకు చెందవనిరి,
పట్టణంబున బసజేసి ప్రజల మఱచి.
తే.గీ. ఏటి కా యేడు చెఱువులో మేట తీయు
పని నిలిచిపోయె, కొన్నేళ్ళు చనగ కొలను
పూడె, నీరు లేకను చేలు బీడులయ్యె,
పంటపండక రైతు లిబ్బందిపడిరి.
తే.గీ. ఈ విషయములన్నియును నీ వెఱిగినవియె,
స్నేహితుడు మున్ను నీతోడ చ్ప్పె గాదె -
వనరులుండియు ఊరెట్లు పాడుపడెనొ
చాకచక్యాన వర్తించు చదురులేక.
తే.గీ. కొలను సత్వరముగ ద్రవ్వదలచి గూడ
కాలయాపన చేసిన కలుషులెవరు -
వారె అసలైన దోషులు; వారి గుర్తు
పట్టి శిక్షవేయుము నీవు పట్టుబట్టి.
ఉ. పాలకులందు కొందఱకు పాలన చేయుట రాదు, కొందఱో
బేలరుపై ప్రజాధనము ప్రీతి భుజించెడు వారు, కొంద ఱ
శ్లీలురు, భ్రష్టవర్తనులు, స్వీయ జప్రియులున్ - నిబద్దిగా
పాలన చేయు నాయకులు పట్టున నుండరు నైదు శాతమున్.
కం. లాలాటికు లధికారుల
లో లెక్కకు మించు నెందరో; శ్రమపడకే
కాలక్షేపము చేయుట
మేలని కొందఱు తలతురు మేధాహీనుల్.
కం. పనిచేతకాని వారలు,
పనిచేయగ లంచమడుగు భ్రష్టాచారుల్,
పనియందు నుదాసీనులు
పనివారలలోన కలరు పాలకసంస్థన్.
కం. ప్రజలిచ్చు వినతిపత్రము
’సజావు’గ కదలుట కొఱకు జతగాదానన్
నిజము ’కరెన్సీ’ పత్రము
’వజనె’ఱిగి సరిపడ పెట్టవలయును సుమ్మీ.
తే.గీ. ప్రజకు నధికార్లకును మధ్య, రాజకీయ
నాయకులకు ప్రజలకును నట్టనడుమ,
’పైరవీ’కారులను పేర వారది వలె
పుట్టెనొక సంస్థ పురువుల పుట్ట వోలె.
మ. ప్రభుపక్షప్రియ రాజకీయ పరులన్ ప్రార్ధించి ఉబ్బించి, వీ
క భళా యంచును వీర లెంగిళుల నాకంజూతు రాద్యూనులై,
అభిమానంబును వీడి జంబుకతతుల్ హర్యక్షనిర్ధూతమౌ
అభిమృష్టామిషమున్ గ్రసించు విధి, ఆహా! ఎంత సంపాతమో!
శా. స్వార్థంబే గుణమయ్యె నేడు, ధనమే ప్రాణంబు మానంబుగా
అర్థోపార్జన సాగె, దుర్నయము లత్యంతంబు సామాన్యమై,
వ్యర్థ స్పర్ధ మదాది పాశములతో పాఱాడె లోకంబు, పా
పార్థ వ్యాజము ప్రబ్బె నెల్లెడల, అవ్యాఘాతమై దుష్కృతుల్.
మం. తలమున్గంగ ధనార్జనల్, నిరత కాంతానీక సంపర్కముల్
కలుషవ్యావృత రాజకీయములు, కక్షాగ్రస్త హింసాక్రియల్
చెలరేగెన్, దురితంబు లెల్లెడల కార్చిచ్చట్లు వ్యాపించె, మీ
రలసత్వంబును వీడి మాన్పవలె నయ్యా ఇట్టి దుర్మార్గముల్.
తే.గీ. సుగుణవంతులు పతనమై సోమరులుగ,
చదువు సంధ్యలు లేనట్టి చవటలుగను,
దుష్ట సావాసములు పట్టి భ్రష్టులుగను,
మారినట్లైన దేశ మేదారి పట్టు!
తే.గీ. ఈ విధిని దేశయంత్రాంగ మావులించ,
పౌరు లీరీతి నీతి సంపాతు లైన,
ఎవ్వరిని దోషులుగను నీ వెంచగలవు,
ఎవరికి గుణాఢ్యులను ’కితా బి’వ్వగలవు!