ఈ క్రింది "ప్రశ్న"కు పద్య రూపములో జవాబు పంపాలి. మీజవాబులు విద్యుల్లేఖద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖులోపలపంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేటతెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము.
ఈ మాసంప్రశ్న:
క్రుళ్ళిన వంకాయ మేలు కూరకు యెపుడున్!
(గమనిక: 'ళ' కు 'ల' కు ప్రాస చెల్లును)
గతమాసం ప్రశ్న:
(మత్తకోకిల) గోటితో సరిపోవుదానికి దానికి గొడ్డలేటికి? వద్దురా!
ఈ ప్రశ్నకు మాకు అందిన క్రమములో పూరణలు ఇలా వున్నాయి.
వారణాసి సూర్యకుమారి, మచిలీపట్నం
సాటివారిలొ మేటి యైనను చాకచక్యము లేకనే
మాటిమాటికి నేడిపించెడు మానవాథము లేరికిన్
థాటిగా నెదురాడలేక లతాంగి ప్రాణము లొ గ్గెనే
గోటితో సరిపోవు దానికి గొడ్డ లేటికి ?వద్దురా
చావలి విజయ, సిడ్నీ
మాటకే సరిపెట్టకే వొకమారు పెంచెడు కయ్యముల్
దీటుగా పరికించి మేధతొ తీరు కష్ట సమస్యలున్
గోటితో సరిపోవుదానికి గొడ్డలేటికి వద్దురా!
సాటి పోలికలా స్ఫురించె గ సామెతే సరి చూడగన్.
గుండు మధుసూదన్, వరంగల్లు
మాటతో సరిపోవుదానికి, మంత్రమేటికి? వద్దురా!
పాటతో సరిపోవుదానికి, పద్యమేటికి? వద్దురా!
చేటితో సరిపోవుదానికి, శ్రేష్ఠ యేటికి? వద్దురా!
గోటితో సరిపోవుదానికి, గొడ్డలేటికి? వద్దురా!
డా.రామినేని రంగారావు యం,బి,బి,యస్,.పామూరు,ప్రకాశం జిల్లా.
కోటికొక్కరు ఉగ్రవాదులు కుంభినిన్ భయ పెట్టగా,
ఓటు కోసము రాక్షకీయులు ఉగ్రవాదుల దన్నుగా
దీటుగామరి పట్టి వారికి తీవ్ర శిక్షలు వేసినన్,
సాటి ఉగ్రులు భయము నందరె,శాంతి యొప్పదె పృధ్విలో
గోటితో సరిపోవు దానికి గొడ్డలేటికి? వద్దురా!
గండికోట విశ్వనాధం, హైదరాబాద్
చేటు మాటలు మాని మంచిని చేయు నేతలె గొప్పరా
కోటి కార్యములైన నేర్పున గూర్చ వాదము లేలరా
ధాటిగా నెరవేర్చ గల్గు విధాన మెంచుము ధీరుడా
గోటితో సరిచేయు దానికి గొడ్డలెందుకు ధీరుడా!
చావలి శివప్రసాద్, సిడ్నీ, ఆస్ట్రేలియా
గోటితో పెరుకంగవచ్చును కూడదేనను మోటికన్
దాటవేయగ కష్టమౌనది దారువై తొలగింపగన్
మాటిమాటికి చెప్పు పెద్దల మాట మారెను సామెతై
గోటితో సరిపోవుదానికి గొడ్డలేటికి? వద్దురా!
(మోటిక: అంకురము లేదా మొలక; దారువు: మ్రాను)
సుమలత మాజేటి, క్యూపర్టీనొ, కాలిఫోర్నియా
సాటిలేరని విర్రవీగుచు సామరస్యము లేకయే
పాటికెక్కిన జీవనంబుల పాత వాసన లేహ్యమై
బోటి బుట్టగ, మంచి బుద్దులు బోవదెంచుచు మాటికిన్
గోటితో సరిపోవుదానికి గొడ్డలేటికి? వద్దురా!
పుల్లెల శ్యామసుందర్, శాన్ హోసే, కాలిఫోర్నియా
పూటుగాతిన పొట్టలోపల పోటులొచ్చెనొ, చెప్పరా
నోటనల్లపు ముక్కనుంచిన నొప్పితగ్గును, ట్రిక్కురా
మాటిమాటికి ఇంగిలీషువి మందులెందుకు, ఖర్చురా
గోటితో సరిపోవుదానికి దానికి గొడ్డలేటికి? వద్దురా!
రాజేశ్వరి నేదునూరి, న్యూజెర్సీ
మాటిమా టికిమాట మార్చెడి మాయలోకము నందునన్
రాటుదే లినమాన వాళికి రాజస మ్ముల భోగముల్
నీటిమూ టలబాస లందున నిక్కమే గతి పోరినన్
గోటితో సరిపోవు దానికి గొడ్డలేటికి వద్దురా