సకల జన మనోరంజని ‘సుజనరంజని’ పాఠకులకు నమస్సులు.గత మాసంతో “సాహిత్యంలో చాటువులు” శీర్షిక ముగిసింది. ప్రథాన సంపాదకులు సూచన మేర ఈ నెల నుండి “ కావ్య లహరి” అనే శీర్షికతో మరల మీ ముందుకు వస్తున్నాను. ఎప్పటివలే నారచనలు చదివి మీ స్పందన తెలిపి నన్ను ప్రోత్సహించి, ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ అరంభిస్తున్నాను. సంపాదక వర్గానికి ముందుగా ధన్యవాదాలు.
“ మంచు చినుకు ముత్యంబై – లే చివురుల మెరసినట్లు
బిందువులో సింధువులే – గమ్మత్తుగ చేరినట్లు.
పసి పాపల నవ్వులలో – పడతుల వాల్జూపులలో
విడీ విడని కన్నె పెదవి దరహాసపు సొగసులలో
ఉదయించే కిరణంలో – వికసించే కుసుమంలో
మందార మరందబిందు సందోహపు చషకంలో
తేనెలూరు తెలుగు పలుకు తీయదనపు భంగిమలో
మేళవించి నట్టి కవిత మరపు రాని మధుర చరిత.” ( స్వీయ రచన)
అన్న చందాన మానవ హృదయాలను స్పందింప జేసేది, ఎంత అనుభవించినా తృప్తి కలగనిది. మన నడవడికి ఒరవడులు దిద్దేది, సంస్కార వంతమైన జీవితానికి మెరుగులు పెట్టేది, పరుగులిడే నవ నాగరికతకి పగ్గాలు వేసి హద్దులు దాటకుండా రక్షించేది, మన సంప్రదాయ సాహిత్యం అనుటలో సందేహమే లేదు. అట్టి గొప్ప సంప్రదాయ సాహిత్య సంపదని సదా రక్షించుకోవడం మనకర్తవ్యం. రక్షించుకోవడం అంటే మనం కొద్దిగా నైనా, మన కావ్యాలను గూర్చి తెలుసుకొని పిల్లలకు తెలపి,మరుగు పడకుండా వాటిని కాపాడుకోవడం మనవిధి. కనుకనే ఈ “ కావ్య లహరి” శీర్షిక ద్వారా తెలుగు కావ్యాలని పరిచయం చేస్తాను. ఇది సాహిత్య చరిత్ర కాదు. తెలుగు కవులని, వారికావ్యాలలో ఉండే గొప్పతనాన్ని , కావ్య సౌందర్యాన్ని,రసస్వరూపాని, అలంకార విన్యాసాలని, వర్ణనా వైశిష్ట్యాన్ని, పరిచయం చేయడమే ఈ శీర్షిక ముఖ్యోద్దేశం.
“ఆదికవి” నన్నయ మహాభారత రచనా విన్యాసాలని, “కవి బ్రహ్మ” “ఉభయకవిమిత్రుడైన” తిక్కన రచనా వైదుష్యాన్ని, “ప్రబంధ పరమేస్వరుడిగా” వాసిగాంచిన ఎర్రన కవిత్వంలోని పటుత్వాన్ని, “కవిసార్వభౌముడైన” శ్రీనాధుని కవితా భంగిమలలోని సౌందర్య లహరులని, “ సహజ కవి” భక్తకవి” అయిన పోతన కవిత్వం లోని మందార మకరందాలని, అల్లసానివారి “ మనుచరిత్రలోని “ అల్లిక జిగిబిగిని, రామరాజభూషణుని “వసుచరిత్ర” లోని సుక్తిమతీ కోలాహలుల, గిరికా వసురాజుల ప్రణయ గాధలని, ముక్కు తిమ్మనార్యుని ముద్దు ముద్దు పలుకులని, ధూర్జటి పలుకుల మాధురీ మహిమల్ని, తెనాలి రామకృష్ణుని పాండురంగ లీలలని , ఇలా ఎందరెందరో మహాకవుల కావ్యాలని ఈ “ కావ్య లహరి” శీర్షిక ద్వారా చదివి ఆనందించి తరిద్దాం. ఆగండాగండి! తొందర పడకండి. “ అల్పారంభః క్షేమ కరః” అన్న ఆర్యోక్తిని పాటించి వచ్చే నేలలో కలుద్దాం. సరేనా!
( మిగిలినవి వచ్చే సంచికలో)
( సశేషం)