సారస్వతం - సద్గురువాణి
దు:ఖానికి పట్టం కట్టకండి

- సద్గురు శ్రీ జగ్గీ వాసుదేవ్

ఈరోజు, ప్రపంచంలో చాలా మంది, ముఖ్యంగా యువత ఆధ్యాత్మికత పట్ల ఒక రకమైన విముఖత పెంచుకున్నారు. ఆధ్యాత్మికతను సరైన పద్ధతిలో అందివ్వక పోవడం వల్లే ఇలా జరిగింది. ‘ఆధ్యాత్మికత అంటే సరిగా తినకపోవటం, రోడ్డుపక్కన కూర్చొని భిక్షాటన చేయటం అని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఆధ్యాత్మికత అంటే - కఠినమైన జీవితాన్ని గడపడమనీ, తమని తాము శిక్షించుకోవడమనీ, అన్నిటికంటే మించి జీవిత-వ్యతిరేకిగా ఉండడమనీ, అంటే మీ జీవితాన్ని సంతోషంగా గడపకుండా, వీలైనంత దుఃఖాన్ని అనుభవించడమనీ - అర్థం చేసుకుంటున్నారు’.

ఆధ్యాత్మికంగా ఉండటానికీ, మీ బాహ్య జీవితం ఎలా ఉందన్న దాంతో సంబంధం లేదు. ఓ గుడిసెలో ఉన్నా లేదా ఓ బంగళాలో ఉన్నా ఎలా ఉన్నా మీరు ఆధ్యాత్మికంగా ఉండచ్చు. ఓ గుడిసెలోనో లేదా బంగళాలోనో ఉండడమనేది మీ సామాజిక, ఆర్థిక పరిస్థితుల పై ఆధారపడిఉండే విషయం. దానికి మీ ఆధ్యాత్మికతతో ఎలాంటి సంబంధం లేదు.

ఆధ్యాత్మికంగా ఉండటమంటే “నా ఆనందానికి నేనే మూలం” అని అనుభవపూర్వకంగా తెలుసుకోవడం. మీ ఆనందానికి మరెవరో కారణమని ఇప్పుడు మీరు అనుకుంటున్నారు, దీంతో ఆనందంకోసం మీరెప్పుడూ వారిపై ఆధారపడి ఉంటారు. మీ ఆనందానికి మీరే మూలమని అనుభవపూర్వకంగా తెలుసుకుంటే, మీరెప్పుడూ ఆనందంగా ఉండరా? అసలు జీవితమే ఆనందంగా ఉండాలని కోరుతుంది. మీ జీవితాన్నే చూస్తే – మీకు చదువు, డబ్బు, ఇల్లు, ఓ కుటుంబం, పిల్లలు కావాలనుకుంటారు – అవన్నీ మీకు ఆనందాన్ని తెచ్చిపెడతాయని మీరు వీటిని కావాలనుకుంటున్నారు. మీ వద్ద అవన్నీ ఉన్నామీరు ఆనందమనే విషయం మరిచిపోయారు.

ప్రజలు బాధలలో ఉండడానికి కారణం, వారు జీవితం అపార్థం చేసుకోవడమే. మీరు “లేదు! నా భర్త, నా భార్య, మా అత్త...” బాధలకు కారణం అనవచ్చు, వాళ్ళందరూ అలా ఉన్నా, దుఃఖంగా ఉండాలని మీరే ఎంచుకున్నారు. దుఃఖంలో పెట్టుబడి పెట్టింది మీరే. దుఃఖంగా ఉండడంవల్ల ఏదో ఒరుగుతుందని మీరనుకుంటున్నారు. ఉదాహరణకి, మీరు చేయకూడదనుకున్న దానిని, మీ కుటుంబంలో ఒకరు చేయడం మొదలుపెడతారు. మిమ్మల్ని మీరు దుఃఖపెట్టుకుని, ఏడుపు మొహంతో ఏదో ఫలితమొస్తుందని ఆశిస్తూ తిరుగుతారు. ఏదో మార్పు వస్తుందన్న ఉద్దేశంతో మీకు మీరే దుఃఖ పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అలా మీరు దుఃఖంతో ఉంటే, మీ చేతిలో స్వర్గముండి కూడా ఏం లాభం? అదే మీరొక సంతోషమైన వ్యక్తిఅయితే మీ చేతిలో ఏది లేకపోయినా, ఎవడిక్కావాలి? మీరు నిజంగా ఆనందంతో ఉంటే, మీ దగ్గర ఏముంది, ఏం లేదు, ఎవరున్నారు, ఎవరు లేరు అన్న విషయాలు అంత ముఖ్యమైనవా? దయచేసి అర్థం చేసుకోండి, మీరు శ్రద్ధ చూపించడం, ప్రేమించడం, అదో, ఇదో కావాలనుకోడం, ఇవన్నీ అవి మీకు ఆనందాన్ని తెచ్చిపెడతాయన్న ఆశతోనే కదా.

చాలామంది ఎప్పుడూ “ఆధ్యాత్మికవాదికి, భౌతికవాదికి తేడా ఏమిటి?” అని నన్ను అడుగుతుంటారు. ‘‘ఒక భౌతికవాది కేవలం తన ఆహారాన్ని మాత్రమే సంపాదించుకుంటాడు. మిగిలిన అన్నిటిని– ఆనందం, శాంతి, ప్రేమ- వీటన్నిటిని అర్థించాల్సిందే. ఒక ఆధ్యాత్మికవాది ప్రేమ,శాంతి, ఆనందం,అన్నీ తనే సంపాదించుకుంటాడు అతను కేవలం ఆహారాన్ని మాత్రమే అర్థిస్తాడు, కావాలనుకుంటే, దాన్ని కూడా సంపాదించుకోగలడు’’ అని నేను అంటాను.


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)