సారస్వతం
అన్నమయ్య కీర్తనలు
- జి.బి.శంకర్ రావు
ఈ పాదమే కదా
ఈ పాదమే కదా యిలయెల్ల గొలచినది
ఈ పాదమే కదా యిందిరా హస్తముల కితవైనది
ఈ పాదమే కదా ఇందరును మ్రొక్కెడిది
ఈ పాదమే కదా యీ గగనగంగ పుట్టినది
ఈ పాదమే కదా యెలమి పెంపొందినది
ఈ పాదమే కదా యిన్నిటికిని యెక్కుడైనది
ఈ పాదమే కదా యిభరాజు దలచినది
ఈ పాదమే కదా యింద్రాదులెల్ల వెదకినది
ఈ పాదమే కదా యీ బ్రహ్మ కడిగినది
ఈ పాదమే కదా యెగసి బ్రహ్మాండమంటినది
ఈ పాదమే కదా యిహపరము లొసగెడిది
ఈ పాదమే కదా ఇల నహల్యకు కోరికైనది
ఈ పాదమే కదా యీక్షింప దుర్లభము
ఈ పాదమే కదా యీ వేంకటాద్రిపై నిరవైనది
శరణాగతుడైన భక్తుడు భగవంతుని పాదాలను ఆశ్రయిస్తాడు. అందుకే వైష్ణవ సిద్ధాంతములో పాదపూజకు ప్రాధాన్యత ఎక్కువ. అన్నమాచార్యులవారు స్వామి వారి పాదాలను పలువిధాలుగా కొనియాడుతున్నారు. వామనౌడు త్రివిక్రముడైనప్పుడు స్వామివారి పాదాన్ని బ్రహ్మకడిగాడట! ఈ పాదస్థానము నుండే పాపాల్ని పరిహరించే ఆకాశగంగ పుట్టినది. ఈ మానవ మాత్రులకు వీక్షింపటానికే దుర్లభమైన ఈ స్వామిపాదం కలియుగంలో మాత్రం స్వామివారి పాదాలను ఇప్పుడు తిరుమలలో వీక్షించడం కొంచెం కష్టమైన విషయమే! అందుకే అన్నమయ్య పాటలో దర్శించి తరిద్దాం!
యిభరాజు = గజరాజు
ఉగ్గువెట్టరే ఓయమ్మా
ఉగ్గువెట్టరే వోయమ్మా చె
య్యొగ్గీనిదె శిశు వోయమ్మా
కడుపులోని లోకమ్ములు గదలీ
నొడలూచకురే వోయమ్మా
తొడికెడి సరుగన తొలగదీయరే
వుడికెడి పాలివి వోయమ్మా
చప్పలు పట్టుక సన్నపు బాలుని
నుప్పర మెత్తకురోయమ్మా
అప్పుడే సకలము నదిమీ నోరనె
వొప్పదు తియ్యరె వోయమ్మా
తొయ్యలు లిటు చేతుల నలగించక
వుయ్యల నిడరే వోయమ్మా
కొయ్యమాటలను కొండల తిమ్మని
నొయ్యన తిట్టకురోరమ్మా
అన్నమయ్య యశోదమ్మయై పాడిన పాట యిది! ఓ అమ్మలారా! బాలకృష్ణునికి ఉగ్గుపెట్టండే! అలా అని మీ ఇష్టానుసారంగా ఉగ్గు పెట్టవద్దు. ఈ బాలుడు సామాన్యుడు కాడు. జాగ్రత్తలు తీసుకోండి. ఉగ్గుపెట్టిన తర్వాత గట్టిగా ఊపకండి. కడుపులో నిక్షిప్తమైన పదునాలుగు భువనాలు కదిలిపోతాయి. వేడి పాలతో ఉగ్గుపెట్టకండి సుమా! బాలుడు తట్టుకోలేడు. ముద్దుగా ఉన్నాడని కదా యని చిన్ని బాలుని నెత్తిన మొత్తకండే! అమ్మలారా! మీ మీ చేతులతో ఆకాశంలో బాలుని ఎగరేస్తూ అలసటకు గురిచేయక ఉయ్యాలలో పరుండబెట్టండే! కొండాల తిమ్మయయైన ఈ బాలుని తిట్టకుండా ఉయ్యాలలో ఊపండమ్మా!
ఒడలు = శరీరము, దేహము
సరుగున = వెంటనే
ఉప్పరము = ఆకాశము
సన్నపు = లేత
చప్పలు = జబ్బలు
తొడికెడి = పొంగి పొరలు
చెయ్యొగ్గీని = చెయ్యి అడ్డు పెడుతున్నాడు
వొప్పౌ = తగదు
తొయ్యలులు = స్త్రీలు
అలగించక = అలసిపోవునట్లు చేయక
కొయ్యమాటలు = కటువైన మాటలు
ఒయ్యన = నేరుగా, వరుసగా
సరుగన = వేగముగా
మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)
|
|
గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)