సారస్వతం

తెలుగు ప్రబంధాలలో సామాజిక విలువలు

- గంగిశెట్టి లక్ష్మీనారాయణ

పరిశోధక విద్యార్థి

హైదరాబాద్ విశ్వవిద్యాలయం

ప్రపంచీకరణ ముసుగులో బుసలు కొడుతున్న దుర్గుణాల విషసర్పాల కోరల కొనకొనల్లో మనిషి ప్రళయ తాండవం చేస్తున్నాడు. దీనికి కారణం మననీయమైన మానవీయ నైతిక విలువల్ని పంచభూతాల్లో కలిపివేయడమే. మనిషిని మనీషిగా తీర్చిదిద్దగల సాధనం సాహిత్యం. సమాజంలో సామరస్యతను పెంపొందించేందుకు సాహిత్యాన్ని మించిన సాత్త్విక సాధనం మరొకటి లేదన్న యువభారతి మాట అక్షరసత్యం. సామాజిక విలువల్ని పెంపొందించేందుకు మన విశిష్టవిలక్షణ విస్తృతసాహిత్యాన్ని వినియోగించాల్సిన తరుణం ఆసన్నమైంది. ఇందులో భాగంగానే ఈ వ్యాసంలో తెలుగు ప్రబంధాలలోని సామాజిక విలువల్ని పరిశీలించడం జరుగుతుంది. పత్రపరిధిని దృష్టిలో ఉంచుకొని మనుచరిత్ర, వసుచరిత్ర, పారిజాతాపహరణం, ఆముక్తమాల్యద, పాండురంగ మహాత్మ్యం ప్రబంధాలకు మాత్రమే ఈ వ్యాసాన్ని పరిమితం చేసుకుంటున్నాను.

ప్రబంధసాహిత్యం అలనాటి రాజకీయ, ఆర్థిక సాంస్కృతిక వైవిధ్యాల సమాహారరూపానికి ఒక దర్పణం. కవనీయ అంశాన్ని కమనీయంగా తీర్చిదిద్దగల నైపుణ్యం ప్రబంధకవులకు వెన్నతో పెట్టిన విద్య.

మనుచరిత్ర అల్లసాని పెద్దనచే రచించబడిన ప్రబంధరాజం. కావ్య ఆరంభంలో గణపతిని స్తుతించిన పెద్దన, వెంటనే “కొలుతున్ మద్గురు విద్యానిలయున్” (మనుచరిత్ర 1-6) అంటూ తన గురువైన శఠకోపయతిని స్తుతించాడు. విద్యాభ్యాసం అయిన తరువాత గురువుల్ని మరువరాదు అని తెలుస్తుంది.

“వ్యాసరచిత భారతామ్నాయమాంధ్రభాషగ నొనర్చి..........” (మనుచరిత్ర 1-8) అని కవిత్రయమైన నన్నయ, తిక్కన, ఎఱ్ఱనలను స్తుతించాడు. దీనిద్వారా ఎవరి గ్రంథాల్ని అధ్యయనం చేసి పాండిత్య గరిమను సంపాదించామో అటువంటి వారిని విస్మరించరాదని తెలుస్తుంది.

ప్రవరుని పాత్ర ద్వారా ఈ దేశానికి ఎన్నో సందేశాలు ఇప్పించాడు పెద్దన. కానీ మన దేహాల సందేహాల వలన వాటిని అర్థం చేసుకోలేకపోతున్నాం. ప్రవరుడు తన ఇంటికి వచ్చిన సిద్ధుణ్ణి గౌరవించి అతిథి మర్యాదల్ని చేశాడు. మనం ఇంటికి వచ్చిన వారిని ఎలా గౌరవించాలో తెలియచేయటం ఈ సంఘటన ఉద్దేశ్యం.

“వండనలయదు నేవురువచ్చిరేని నన్నపూర్ణకు నుద్దియౌనతని గృహిణి

యతిథులేతేర నడికి రేయైనఁబెట్టువలయు భోజ్యంబులింట నవ్వారి రాగ” ప్రవరుడి భార్య అతిథులకు భోజనం పెట్టడంలో అన్నపూర్ణాదేవికి సమానురాలు. అర్ధరాత్రి అతిథులు వచ్చినప్పటికీ వారికి ఇష్టమైన పదార్థాల్ని వండి వడ్డిస్తుంది. నేడు అతిథులు వస్తే హా! ఎందుకు వాళ్ళు తాపరించారు, వంటచేయాలి తంట అని భావించే నేటి గృహిణులకు ఆదర్శగృహిణిని ప్రవరుని భార్య పాత్ర ద్వారా అల్లసాని దర్శింపచేశాడు.. అతడావాతపరంపరా పరిమళ వ్యాపార లీలన్ ................. (మనుచరిత్ర-2-25)

అనే పద్యంలో పెద్దన వరూథిని అందాన్ని వర్ణించాడు. బహుశా విశ్వసుందరికి ఉండాల్సిన యోగ్యతలకంటె ఎక్కువ యోగ్యతలు వరూథినిలో ఉన్నట్లు తెలుస్తుంది.

వరూథిని మెరుపు తీగ లాంటి శరీరం, పద్మాల లాంటి కళ్ళు, తుమ్మెదల్లాంటి కురులు, చంద్రుడు వంటి ముఖం కల గంధర్వకన్య అంటున్నాడు పెద్దన. ఇంతటి అందాన్ని చూచిన ప్రవరుడి మనోగతం నేటి ప్రపంచంలోని యావత్తు యువతకు ఆదర్శనీయం. అంతటి అందాన్ని చూచి ఉళుకుబెళుకు లేక ప్రవరుడు
“ఎవ్వతెవేవు భీత హరిణేక్షణ ........ (మనుచరిత్ర-2-39)”

లేడి చూపులతో ఉన్న ఓ లేడి (స్త్రీ) ఎవరవమ్మా నువ్వు? ఈ అరణ్యంలో ఒక్కదానివే సంచరిస్తున్నావు. నేను ప్రవరాఖ్యుడిని. నా ఊరికి మార్గమెటో చెప్పమని అంత అందాలవదనము చూచి కూడా సుదనపుచందాలను ఆలోచిస్తున్నాడు. మరినేటి యువత కొద్దిపాటి అందంగా ఉన్న అమ్మాయిలను చూచినంతనే మాయలో పడుతున్నారు.

“చెడునే సతుల మాయల్ ధీరచిత్తంబుల్” (మనుచరిత్ర2-68) మాయాస్త్రీల కపట కృత్యాలు మనోనిగ్రహం గల పండితుల్ని ఏమీ చెయ్యలేవు.

“ననునిముసంబు గానక యున్న నూరెల్ల” ......... (మనుచరిత్ర2-17) ఈ సీస పద్యం సామాజిక విలువల్ని ఒకచోట చేర్చిన రసఖండిక. ప్రవరుడు ఊళ్ళో లేకపోతే ఆ ఊరంతా తల్లడిల్లిపోతుంది. ఉత్తమపౌరుడిగా మెలగాలనటం ఉద్దేశ్యం, ప్రవరుడు ఒక్క నిమిషం లేకపోతే అతని తల్లిదండ్రులు అల్లాడిపోతారు. భార్య కుమిలిపోతుంది, తన విద్యార్థులు బాధపడతారు. ఈ పద్యం ఉత్తమపౌరుడిగా, ఉత్తమ కుమారుడిగా, ఉత్తమ భర్తగా, ఉత్తమ అధ్యాపకుడిగా ప్రవర్తించాల్సిన ధర్మాన్ని విశ్లేషిస్తుంది.

వసుచరిత్ర మనుచరిత్రలో సమానమైన వయస్సు, యశస్సు ఉన్న ప్రబంధం. సరసభూపాలీయం అనే లక్షణగ్రంథాన్ని, వసుచరిత్ర అనే లక్ష్యగ్రంథాన్ని రచించిన లక్ష్యలక్షణసవ్యసాచి రామరాజభూషణుడు.
సామాజిక విలువల్లో ప్రధానమైన వసుధైక భావనని ఈ ప్రబంధంలో సమన్వయించేందుకు ప్రయత్నిస్తాను.
“మాతాభూమిః పుత్రోsహం పృథివ్యాః” అంటుంది అథర్వణ వేద పృథ్వీసూక్తం.

అయం నిజః పరోవేతి గణనా లఘుచేతసామ్ | ఉదారచరితానాం తు వసుధైవ కుటుంబకమ్ || (హితోపదేశం-మిత్రలాభం-71) సంకుచిత మనస్తత్వం కలవారు ఇతడు నావాడు, అతడు పరాయివాడు అని భావిస్తారు. ఉదారభావంకలవారు ఈ భూమిపై కలవారందరూ ఒక కుటుంబీకులు అని భావిస్తారంటోంది హితోపదేశం. మా నవత అంటున్న మనిషి మానవతను మర్చిపోతున్నాడు. పక్క మనిషిని మనిషిగా చూసే విశాలభావం అలవర్చుకోవాలి.

“ఆత్మవత్ సర్వభూతాని యః పశ్యతి స పండితః” (చాణక్య నీతి దర్పణం 12-13)
“గిరిరాజ తనయ కైవడి ”................(వసుచరిత్ర-3-26)

ఈ పద్యంలో పర్వతరాజు హిమవంతుడి కుమార్తె అయిన పార్వతి లాగా ఉంది గిరిక అన్నాడు కవి. గిరిక తండ్రి కోలాహలుడు. కొందరు కోలాహలుణ్ణి హిమవత్ పుత్రుడు అంటారు. ఈ సంబంధంతో ఈ ప్రబంధాన్ని చూస్తే పార్వతి, గిరికలు అత్తాకోడళ్ళు అవుతారు. ఇలా అత్తా కోడళ్ళు సమానంగా ఉన్నారంటూ అత్తాకోడళ్ళ మధ్య ఐక్యభావాన్ని చూపిస్తున్నాడు కవి.

“మందయానము నేర్పు నిందింది రాజీవ (వసుచరిత్ర-3-28) గిరికాదేవికి సరోవరాల్లో విహరించే హంసలు నడకల్ని నేర్పుతున్నాయి. మనోహర పరీమళాల్ని వెదజల్లే వనాలలోని చిలుకలు ముద్దు పలుకుల్ని నేర్పుతున్నాయి. ఆలోచిస్తే ఒకరికి వచ్చిన విద్య మరొకరికి నేర్పే ఈ జీవులన్నీ వసుధైక భావనకు ఆదర్శప్రాయమయ్యాయి. మన మనుషులలో మాత్రం విద్య పక్కవాడికి నేర్పని స్వార్థం ఉంది. కవి మూగజీవులతో మోదభావాన్ని చెప్తుంటే మనం ఆమోదించక తప్పదుకదా!

“ఆ నగజాత యీ తరుణి ................... (వసుచరిత్ర-3-35) కోలాహలుని కుమార్తె అయిన గిరికకు వన దేవతలే చెలికత్తెలు. పర్వత శిఖరంపై గుహలే గృహాలు, క్రింద ప్రవహించే ప్రవాహాలు సరోవరాలు. ఇలా ప్రకృతి ఆకృతితో చెలిమి చేసింది గిరిక. ఇది మాకెవ్వరూ లేరని బాధపడేవారికి ప్రకృతి ఆకృతే సర్వస్వం అనే విశ్వ భావనని తెలియచేస్తుంది.

మాతర్మేదిని! తాతమారుత సఖే తేజ” ..............(భర్తృహరి వైరాగ్య శతకం -100) భూమి తల్లి, గాలి తండ్రి, అగ్ని మిత్రుడు అని భర్తృహరి చెప్పిందీ ఈ భావమే! వసురాజు, గిరికలు కలవడానికి సహాయక పాత్రలైన నర్మసచివ, మంజువాణిల సహాయం ఎన్నదగింది. తమ మిత్రులకు సహాయం చేయాలన్న భావన, వసుధైక భావనాతరంగమే. ఈ రెండు పాత్రలూ భట్టుమూర్తి కల్పించినవే.

వసురాజు పెళ్ళికి వరుణుడు ముక్తాహారాన్ని, నలకూబరుడు కెంపుల పెండేరాన్ని, దేవేంద్రుడు అమ్లాన సరోజ మాలికల్ని బహూకరించారు. ఇతరులకు వారి శుభకార్యాలలో వస్తువుల్ని ఇవ్వటం ద్వారా స్నేహసౌధం నిర్మించబడుతుంది.

ఆముక్తమాల్యద శ్రీకృష్ణదేవరాయలచే రచించబడిన ప్రబంధం. మొట్టమొదటి పద్యంలో రాయలవారు శ్రీవేంకటేశ్వరుణ్ణి స్తుతించాడు.

“శ్రీకమనీయహారమణిఁజెన్నుగ ........................ (ఆముక్తమాల్యద1-1) శ్రీదేవి ధరించిన కమనీయహారంలో శ్రీనివాసుడు, శ్రీనివాసుడి కౌస్తుభమణిలో శ్రీదేవి కనిపిస్తున్నారు అనడం ద్వారా భార్యాభర్తలు తమ హృదయ సింహాసనాల్లో ఒకరినొకరు ప్రతిష్ఠించుకున్నారు అని తెలుస్తుంది. ఆదర్శదాంపత్యానికి ప్రతీక ఈ పద్యం. కోట్లు సంపాదించి పెట్టడం కన్నా గుండె కోటలో గుడి కట్టడమే భాగస్వామికి అమితానందం అని తెలుస్తుంది.

“ఎదురేగి సాష్టాంగ మెఱిఁగి పాద్యం బిచ్చి.....” (ఆముక్తమాల్యద. 1-76)
భాగవతులకు అతిథులకు చేసే గౌరవ మర్యాదలు తెలుస్తున్నాయి. భక్తి అంటే భజ్ సేవాయాం - వీలైనంత సేవ చేయటం అని కదా అసలైన అర్థం.


“మన కనురక్తి హెచ్చనిదెమందని ..............” (ఆముక్తమాల్యద-1-90) పద్యం పరోక్షంగా ఆదర్శ దాంపత్యాన్ని మనకు తెలియజేస్తుంది. ఆముక్తమాల్యదలోని షష్ఠాశ్వాసంలోని మాలదాసరికథ భక్తితత్త్వంలో పతాకస్థాయికి ప్రబల ఉదాహరణ. పారిజాతాపహణం నందితిమ్మనచే రచింపబడిన మధురరస ప్రబంధం.

సంస్కృతహరివంశంలోని వజ్రనాభుని వధ, యమకథలకు సంబంధం ఉన్న ప్రబంధం పారిజాతాపహరణం. కావ్యంలోని ఇతివృత్తం సర్వసాధారణమైన గాథ అవటమే కాకుండా కుటుంబ గాథతో నాటకీయ విధాన సంవిధానంతో మధురపద గుంఫనంతో అలరారుతుంది. సత్యభామాకృష్ణుల సాంసారిక ప్రణయం లోక ప్రసిద్ధం. దీనినే కావ్యేతివృత్తంగా తీసుకోవడంలో తిమ్మన కృతకృత్యుడయ్యాడు.

పారిజాతాపహరణ కావ్యరచన వెనుక ఒక ఐతిహ్యం సమాజంలో వినిపిస్తుంది. ఆనాటి కాలంలో ప్రభువులు వచ్చేవరకూ రాణులు ప్రభువుల పాదాలవైపు వేచి ఉండడం సహజం. కానీ వేచి వేసారి రాయల రాణి కునుకు తీసింది. ఇంతలో రాయలవారు వచ్చి, నిద్రిస్తున్న రాణికి నిద్రాభంగం కలిగించకుండా ఉండాలనుకొని అలాగే నిద్రిస్తాడు. నిద్రలో రాణిపాదం రాయల తలకు తగులుతుంది. కినుకతో కునుకు నెపంతో తనను అవమానించడానికే ఇలా చేసిందని అనుమానంతో రాయలవారు అప్పటినుండి ఆమె పడకగది గడప తొక్కడంలేదు. ఈ సమస్యను ఆమె ఎవ్వరికైనా ఎలా చెప్పుకుంటుంది. రాజ్యాన్ని కాపాడే రాజే సంసారాగ్నిలో ఆజ్యాన్ని పోస్తే ఆమె ఎవరికి చెప్పుకోవాలి. ఇంతలో అరణపుకవి అయిన తిమ్మన ఈ విషయాన్ని తెలుసుకొని కావ్యవిషయంగా గ్రహించి పారిజాతాపహరణం కావ్యాన్ని రచించి రాయలకు ఇచ్చి ఆమెను పరిగ్రహించేలా చేశాడు. ఇలా కృష్ణరాయలకు కర్తవ్యోపదేశాన్ని అన్యాపదేశం చెప్పాడు తిమ్మన.

దీనిద్వారా కన్నీళ్ళను కర్చీఫులతోనే కాదు, కావ్యాలతో కూడా తుడవవచ్చని కావ్యప్రయోజనాన్ని ప్రత్యక్షంగా నిరూపించిన ప్రబంధకవి నంది తిమ్మన.

కవి వంశవివరణని కావ్యాదిలో కాకుండా కావ్యాంతంలో చెప్పినవాడు తిమ్మన. ఆకులందున అణిగి కవితకోకిల పలుకుతుందన్న విశాలభావాన్ని పరోక్షంగా చెప్పకనే చెప్పాడు తిమ్మన.

"శౌరి యిదె పారిజాతముఁ ...... భూరుహములు మధురసాశ్రుపూరము నిండెన్”
తమ స్నేహితుణ్ణి తీసుకెళ్ళి పోతున్నాడని నందనవనంలోని ఇతర వృక్షాలన్నీ ఏడుస్తున్నాయి. ఇది స్నేహ సౌరభం అంటే!

"జలరుహనాభుడిట్లు ...........................
కల్పలతికలెల్ల; వల్లభలు ప్రాణవిభుం బెడఁబాయ నేర్తురే!”
(పారిజాతాపహరణం 4-54)

తమ భర్తని విడవడానికి ఆ కల్పలతలు ఏడుస్తున్నాయి అంటున్నాడు కవి. అది ఆదర్శ దాంపత్యం అంటే! పాండురంగ మహాత్మ్యం తెనాలి రామకృష్ణకవి కమనీయ వర్ణనా చాతుర్యానికి తార్కాణమైన భక్తిరస ప్రవాహం.

విశ్వశ్రేయః కావ్యం, వాక్యం రసాత్మకం కావ్యం అన్న ఆలంకారిక సూక్తులకు అక్షరరూపం పాండురంగ మాహాత్మ్యం. సకల జనావళికి ఆదర్శప్రాయుడైన గృహస్థుడు పరమ భాగవతోత్తముడైన పుండరీకుని ఆదర్శస్వభావం ఈ కావ్యంలో హృద్యంగా వర్ణించబడింది. కావ్య ప్రారంభంలో గురుశిష్య సంబంధాన్ని, అనుబంధాన్ని అమోఘంగా వర్ణించిన ఘనత తెనాలి రామకృష్ణ కవికే దక్కుతుంది.

నిగమశర్మ కథలోని అక్క పాత్ర తెలుగు సాహిత్యంలో పేరులేని పేరున్న పాత్రగా ప్రసిద్ధం. నిగమశర్మ అక్క పక్కదారి పట్టిన చెడు బాటలోనున్న తన తమ్ముణ్ణి తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తుంది. నిగమశర్మ అక్కపాత్రలో తెలుగింటి ఆడపడుచుని మనోహరంగా తీర్చిదిద్దాడు తెనాలి రామకృష్ణకవి.

ఈ భక్తిరస ప్రబంధాన్ని శాంతరసోన్ముఖంగా నడిపించాడు తెనాలి రామకృష్ణకవి. విష్ణువు గొప్పదనాన్ని శివుడి చేత కవి కావ్య ఆరంభంలోనే చెప్పించాడు. దేవుళ్ళ మధ్య లేని భేదాలు మనమధ్య ఎందుకు అని నినదించిన కవి రామకృష్ణకవి. వ్యాస పరిమితిని దృష్టిలో ఉంచుకొని ఈ ఐదు కావ్యాల్ని రేఖామాత్రంగా స్పృశించాను. ఇంకా ఎన్నో ప్రబంధాల్ని పరిశీలించాల్సి ఉంది. తెలుగు ప్రబంధాలలో అంగాంగ వర్ణనలే కాదు సంఘాంగ వర్ణనలూ ఉన్నాయి. వాటిని మన జీవితాలకి అన్వయించి ఆచరిస్తే ఆదర్శ వ్యక్తిత్వం కలవారిగా తీర్చిదిద్దబడతామని భావిస్తున్నాను. ఇది ఈ వ్యాసానికి ముగింపు అయినా ప్రబంధ సాహిత్య అధ్యయనానికి నిరంతర సాగింపు.

ఆధార గ్రంథాలు
1. ఆముక్తమాల్యద - శ్రీకృష్ణదేవరాయలు
2. మనుచరిత్ర - అల్లసాని పెద్దన
3. వసుచరిత్ర - రామరాజభూషణుడు
4. పారిజాతాపహరణం - నంది తిమ్మన
5. పాండురంగమాహాత్మ్యం - తెనాలి రామకృష్ణకవి
6. కావ్యలహరి - దివాకర్ల వేంకటావధాని
7. తెలుగుసాహిత్యచరిత్ర - ద్వా.నాశాస్త్రి
8. తెలుగు సాహిత్య సమీక్ష - జి. నాగయ్య



మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)