సారస్వతం

సాహిత్యంలో చాటువులు

- ‘విద్వాన్’ తిరుమలపెద్దింటి.నరసింహాచార్యులు

ఈ నెల చాటువులని నవ్వుతూ, నవ్వుతో ప్రారంభిద్దాం. పూర్వం “నవ్వు నాలుగు విధాల చేటు” అనేవారు. ఆ సామెత ఎందుకు వచ్చిందో ముందుగా తెలుసుకొందాం. “ రామాయణంలో రావణ వధానంతరం శ్రీరామ పట్టాభిషేకం వశిష్టుడు, వామదేవుడు, జాబాలి ,కశ్యపుడు మొదలగు పెద్దలందరూ అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఆ నిండు సభలో సీతారాములు సుగ్రీవ, ఆంజనేయ, జాంబవంత, విభీషణాదులను తగిన రీతిలో సత్కరిస్తూ ఉంటారు. ఆ సమయంలో అక్కడే ఉన్న లక్ష్మణుడు ‘పకపక’ మని నవ్వుతాడు. ఆ నవ్వు చూసి ఈ నలుగురు ఇలా అనుకొంటారు.

సుగ్రీవుడు- “ అన్నని అన్యాయంగా రామునిచేత చంపించి రాజ్యాన్ని సంపాదించి, రామునిచేత ఎలా సత్కరింపబడుతున్నడో ! కదా అని నన్నుచూసేనవ్వుకొంటున్నాడు.” అని అనుకొంటాడు.

విభీషణుడు – “ఇంటిగుట్టు లంకకి చేటు” అన్నవిధంగా అన్నగారి ప్రాణ రహస్యం రాముడికి చెప్పి, అన్నగారిని చంపించి లంకకి రాజైన తననుచూసి లక్ష్మణుడు నవ్వుకొంటున్నడేమో” అని బాధపడతాడు.

సీత- “సంవత్సర కాలం పర పురుషుడైన రావణుని వద్ద ఉండి ఇప్పుడు పట్టమహిషిగా రామునిప్రక్కన చక్కగా కూర్చొని, మర్యాదలుపొందుతున్న నన్నుచూసే నవ్వుతున్నా డేమో” అని అనుకొంటుంది.
భరతుడు –“ తల్లిద్వార అన్నగారిని అడవులకి పంపి, పదునాలుగు సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించి, ఇపుడు అన్నగారికి ఇవ్వడం తనకి ఇష్టం లేదని” అనుకొని నవ్వుకొంటున్నాడేమో!” అని అనుకొంటాడు.

ఇలా నలుగురు నాలుగువిధాలుగా అనుకొంటుంటే, అసలు విషయం తెలిసిన శ్రీ రాముడు చిరునవ్వులు చిందిస్తూ “ లక్ష్మణా! నువ్వు ఇప్పుడు నవ్వేవుకదా! ఆనవ్వుకి కారణం ఏమిటి? ఎవరిని చూసి నవ్వేవు?.” అనిఅడుగుతాడు. అపుడు లక్ష్మణుడు “ అయ్యో!అన్నా! నేనుఎవరిని చూసికూడా నవ్వలేదు, పదునాలుగు సంవత్సరాలు నన్నువదలి నాభార్య ఊర్మిళను ఆవహించిన ‘నిద్ర’ ఒక్కసారిగా నన్ను ఆవహించింది. క్షణకాలం నారెప్పలు మూతపడ్డాయి. అందుకని నాలోనేనే నవ్వుకొన్నాను.” అని లక్ష్మణుడు చెప్పిన సమాధానం విని పైనలుగురు ‘అమ్మయ్య మనల్ని చూసి నవ్వలేదు’ అని తృప్తి పడతారు.

ఇది “నవ్వు నాలుగువిధాల చేటు” అన్న సామెత వచ్చిన కథ, అనవసరంగా నవ్వకూడదు అని తెల్పుతుంది కాని, ఎప్పుడు నవ్వకూడదు అని చెప్పదు. కనుక హాయిగా, ఆనందంగా ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి. అందుకనే సినీ దర్శకుడు జంధ్యాల “ నవ్వడం యొక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వక పోవడం ఒక రోగం” అని నవ్వుని నిర్వచిస్తాడు. కనుక మనంకూడా హాస్యరస పూరితమైన చాటువులని చదివి హాయిగా నవ్వుకొందాం. రండి చదివి ఆనందించండి----

“ఎద్దీశునకశ్వంబగు?
గ్రద్దన నేదడవి తిరుగు ఖరకంటకియై
హద్దుగ నేవాడు ఘనుడు
పద్దుగ నుత్తరము లిందే పడయంగానౌ”


ఇది కూడా ప్రశ్నలోనే జవాబు ఉన్న చాటువు. ఎలాగో తెలుసుకొందాం—


ఎద్ది= ఏది. ఈశునకు= ఈశ్వరునకు. అశ్వంబగు=వాహనం అగును.(అశ్వం అంటే గుర్రం. కాని ఇక్కడ కవి వాహనం అనే అర్థంలో వాడాడు.)

ప్రశ్న- ఏది ఈశ్వరుని వాహనము? పదవిభజన కొంచం మార్చితే ప్రశ్నలోనే జవాబు దొరుకుతుంది. ఎద్ది+ఈశ్వరునకు.అనేపదాన్ని ఎద్దు+ఈశ్వరునకు, అనిమార్చి చదివితే “ ఈశ్వరునికి ఎద్దు వాహనము.” అనేజవాబు లభిస్తుంది.

అట్లే, రెండవపాదం – గ్రద్దన= త్వరితగతిని. ఖరకంటకియై=వాడియైన ముళ్ళు కలదై, ఏది= ఏ జంతువు. అడవితిరుగు= అవిలోతిరుగుతుంది. ముళ్ళతోకూడిన ఏజంతువు తొందర,తొందరగా,అడవిలో తిరుగుతూ ఉంటుంది? అన్నది ప్రశ్న.

ఏది+ అడవి. అనే పదాన్ని ఏదు + అడవి అని మారిస్తే జవాబు వస్తుంది. ఏదు =అంటే ముళ్ళపంది. శరీరం చిన్నగా ఉండి పెద్దపెద్ద ముళ్లుండే ముళ్ళపంది అడవిలో తిరుగుతూ ఉంటుంది అనిజవాబు.

హద్దుగ నేవాడు =బాగుగఎవడు. ఘనుడు =గొప్పవాడు.? అన్న ప్రశ్నకి
హద్దుగ = తనహద్దు తాను తెలిసినవాడు, ఎవడో వాడే ఘనుడు. అనిజవాబు.

 

నాల్గవ పాదానికి అర్థం- చక్కని జవాబులు ప్రశ్నలోనే ఉన్నాయి.అని.ఇది ఈచాటువు గొప్పతనం. ఇంకో చక్కని చాటువు చూద్దాం—

“కరచరణంబులు గల్గియు
కరచరణ విహీనుచేత కరమరుదుగ తా
జలచరుడు పట్టు వడెనని
శిర విహీనుడు చూచి నవ్వె చిత్రము గాగన్.”

ముందుగా పై పద్యభావం తెలుసుకొందాం. “ కాళ్ళు చేతులు ఉన్న జలచరుడు (నీళ్ళల్లో తిరిగేవాడు) కాళ్ళు చేతులు లేనివాడిచేత చంపబడే చిత్రమైన దృశ్యాన్నిచూసి, శిరస్సు లేనివాడు నవ్వేడట! ఎంత అద్భుతం! అని భావం. ఇప్పుడు వివరణ – కాళ్ళు చేతులు ఉండి నీటిలో సంచరించేది ‘కప్ప’. కాళ్ళు చేతులు లేనివాడు ‘పాము’, కప్పని పాము మింగుతుంటే, శిరస్సు లేనివాడు అంటే ఎండ్రకాయ (క్రాబ్) చూసి నవ్వింది. అన్న చిత్రమైన భావం పైచాటు పద్యంలో దాగి ఉంది.మీ పెదవులపై కూడా చిన్న చిరు నవ్వు వస్తోంది కదా! ఇంకెందుకు ఆలశ్యం హాయిగా నవ్వండి.

(సశేషం.)




మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)