శీర్షికలు - సంగీతరంజని

"నాదతనుమనిశం.." (భాగం - 4)

రచన : శ్రీమతి కాజ సుభాషిణి శాస్త్రి

గత భాగములలో వాయిద్య సంగీతము యొక్క ప్రాధాన్యతను , వీణకు సంబంధించిన విశేషతలను తెలుసుకున్నాం కదా! ఈ భాగములో , ఈ వాయిద్యములో పేరు ప్రఖ్యాతలు గడించిన కొందరు విద్వాంసుల గురించి తెలుసుకుందాం.

వీణ , కర్ణాటక సంగీతానికి సంబంధించిన అత్యంత ప్రాచీనమైన వాయిద్యమైనప్పటికి ఎందరో మహనీయులు తరతరాలుగా ఈ వాయిద్యముపై తమ ప్రతిభను చూపుతూ సంగీతచరిత్రలో వారు ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోవడమేకాక ఈ కళను తమ ముందు తరాల వారికి అందించడంలో సఫలీకృతులయ్యారు. అట్టి వారిలో మన ముందుతరానికి చెందిన, తెలుగు వారైన కొందరు వీణ విద్వాంసులు - మా గురువులైన శ్రీ వాసా కృష్ణమూర్తి గారు , శ్రీ మంచాల జగన్నాధ రావుగారు మరియు శ్రీ ఈమని శంకర శాస్త్రి గారు.

శ్రీ వాసా కృష్ణమూర్తి గారు(1923-1974):

నాకు తొలి గురువైన శ్రీ వాసా కృష్ణమూర్తిగారు విజయనగర వాస్తవ్యులు. వీణానాదములో తనకంటూ ఒక ప్రత్యేక బాణీని ఏర్పరచిన ఘనత శ్రీ వాసాగారికి దక్కుతుంది. ఈయన అటు హిందుస్తానీ సంగీతములోను ఇటు కర్ణాటక సంగీతములోను దిట్ట. ఈ రెండు రకాల సంగీత విధానాలను తన కచేరిలలో జోడించి శ్రోతలను మంత్రముగ్ధుల్ని చేసేవారు. వీణపై తానము అత్యంత అద్భుతముగా పలికించవచ్చని అనుకున్నాము కదా. అట్టి తానము వాయించడములో శ్రీ వాసాగారు ఎన్నో ప్రయోగాలు చేసారు. లయవిన్యాసము , పల్లవిప్రస్థారములలో ఈయన ఎనలేని ప్రతిభను కనబరిచేవారు. సాధారణముగా సితార వాయిద్యములో వాడే మెళకువలను శ్రీ వాసాగారు వీణపై ఉపయోగించి వైవిధ్యమును ప్రదర్శించేవారు. నాసికా భూషణి , రఘుప్రియ, రాగవర్ధిని వంటి క్లిష్టమైన రాగాలలో పల్లవులను , గతిభేద పల్లవులను కూర్చడములో ఈయనకు సాటిలేరని చెప్పవచ్చు.

శ్రీ వాసావారు విజయనగరములో గురుకుల విధానములో సంగీతపాఠశాలను నిర్వహించేవారు. సంగీతము పట్ల తన శిష్యులకు మక్కువ కలిగించడముతోపాటూ అది శ్రద్ధ గా అభ్యసించే విధముగా వారిని ప్రోత్సహించేవారు.



శ్రీ వాసా కృష్ణమూర్తిగారి గురుకులములో వీణతో నేను

తమ శిష్యుల పట్ల ఎంతో ఆప్యాయత కలిగియున్నప్పటికీ విద్య విషయములో మాత్రము చాలా ఖచ్చితంగా ఉండేవారు. ఒక విద్యార్ధికి నేర్పిన పాఠం క్షుణ్ణంగా వచ్చిందని నిర్ధారించుకున్న తరువాతే ఆ తరువాతి పాఠంను వారికి నేర్పేవారు. అందుకుగాను ఆయా విద్యార్ధులకు వారి వారి ప్రతిభను బట్టి తగు సమయమును కేటాయించేవారు. అందువలన ఆయన శిష్యులు ఏకాగ్రతతో విద్యను అభ్యసించటమే కాక వారి సంగీత జ్ఞానము కూడా సరైన రీతిలో దినదినాభి వృద్ధి చెందేది. వీరి గురుకులములో సంగీతవిద్యను అభ్యసించిన ఎందరో నేటికీ ఈ రంగములో సేవలనందిస్తూ అందరి మన్ననలూ పొందుతున్నారు.

వీరి గురుకులములో నేను వీణను నేర్చుకోవడమనేది నా అదృష్టంగా భావిస్తాను.

శ్రీ మంచాళ జగన్నాధ రావు గారు: (1921-1985)


వైణిక విద్వాంసులలో సంగీతముతో పాటు పలు సంగీత సంబంధమైన రచనలు సాగించి పేరు గడించిన ప్రముఖులలో ఒకరు శ్రీ మంచాళ జగన్నాథ రావు గారు. వీరు చీపురుపల్లి లో జన్మించి ఉద్యోగరీత్యా హైదరాబాద్ లో స్థిర పడ్డారు. వీరికి కూడా వాసా వారి వలే కర్ణాటక మరియు హిందుస్తానీ సంగీతములందు చక్కటి ప్రావీణ్యము ఉంది. అందుకనే వీరి కచేరీలు ఇరు వర్గాల ప్రేక్షకులని ముగ్ధుల్ని చేసేవి. వీరు కీర్తనలను ఎంత వేగముగా వాయించినప్పటికీ అందున్న స్వరాలను స్పష్టంగా పలికించడం వీరి ప్రత్యేకత అని చెప్పవచ్చు. వీణ వాయించడములో ప్రత్యేక పద్ధతులను అవలంబించి సంగీతజ్ఞులను ఆకట్టుకునేవారు. ఈయన ఆల్ ఇండియా రేడియో , హైదరాబాద్ శాఖ లో మ్యూజిక్ ప్రొడ్యూసర్ గా పదవి బాధ్యతలు నిర్వహించారు. సంగీత ప్రపంచములో వీరి సేవలు ఎన్నదగినవి.


తిరుమల తిరుపతి దేవస్థానము వారి సౌజన్యముతో వీరు అన్నమాచార్య కృతులను స్వరపరచడమే కాక , క్షేత్రయ్య పదాలను గురించి అలాగే రామదాసు కీర్తనల పైన రచనలు సాగించి పుస్తకాలను అందించారు. ఆధునిక సంగీతముపై అధ్యయనము చేసి అనేక రచనలు చేసారు. వీరు రచించిన పుస్తకాలెన్నో నేడు సంగీత విద్యార్థులకు ఉపయోగ పడుతూ వాడుకలో ఉన్నవి(ఉదా.:ఆంధ్రుల సంగీత కళ www.barnesandnoble.com ద్వారా లభిస్తున్నది). వీణ కచేరీలు , రచనలతో పాటు వీరు సంగీతానికి సంబంధించి అనేక ప్రసంగాలు కూడా ఇచ్చేవారు.

వీరు హైదరాబాద్ లో నివాసమున్నప్పుడు నేను ఈయన వద్ద శిష్యరికము చెయ్యడము జరిగింది.

శ్రీ ఈమని శంకరశాస్త్రి గారు(1922-1987):|

శ్రీ ఈమని శంకర శాస్త్రి గారి పేరు సంగీత ప్రపంచములో వినని వారుండరు. ఆంధ్ర లోని ద్రాక్షారామంలో జన్మించిన వీరు వైణిక విద్వాంసులుగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తెలుగు వారు. వీణ వాయించడములో ఒక ప్రత్యేక శైలిని కనుగొని శ్రోతలకు నూతన అనుభూతిని కలిగించడమే కాక 'ఈమని' బాణీగా అది జనములో ప్రాచుర్యమును పొందు విధముగా తగు కృషిని చేసిన ఘనత ఈయనకు దక్కుతుంది. ఆల్ ఇండియా రేడియో , న్యూ ఢిల్లీలో వీరు మ్యూజిక్ ప్రొడ్యూసర్ గా పని చేసారు. మద్రాసులో సినీ సంగీతమునకు కూడా దర్శ క త్వ ము వహించారు . వీణతో సంగీతానికి ఎనలేని కృషి చేయ్యడమేకాక ఈ వాయిద్యానికి సహవాయిద్య బృందములో ప్రత్యేక స్థానాన్ని కల్పించారు. అత్యంత ప్రాచీన వాయిద్యమైన వీణ యొక్క ప్రాముఖ్యత యావత్ ప్రపంచానికి తెలిసేలా చేసారు.


శ్రీ ఈమని శంకరశాస్త్రి గారితో నేను


శ్రీ ఈమనిగారు ఎందరో శిష్యులను వైణిక విద్వాంసులుగా తీర్చిదిద్ది , భావితరానికి ఈ కళలో తమ వారసులుగా అందించారు. 1986 సంవత్సరములో , విశాఖ పట్టణములో నివసించునప్పుడు , ఈ మహనీయుని వద్ద శిష్యరికము చేసే అవకాశము నాకు లభించింది. వచ్చే సంచికలో , ఈ శీర్షికలోని చివరి భాగములో వీణ తయారి గురించిన వివరాలను తెలుకుందాం.

(రచన సహకారం : శ్రీమతి కళ్యాణి సచీంద్ర)




మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)