సారస్వతం - పుస్తకపరిచయం
గ్రామీణశైథల్య చిత్రీకరణ - నామిని మూలింటామె
- మన్నవ గంగాధరప్రసాద్
ప్రముఖ రచయిత నామిని ఇటీవల "మూలింటామె " అని ఓ నవల రాశారు. ఈ నవల్లో కొత్తగా ఏమీ లేదు. అన్నీ అవే 56 తెలుగు అక్షరాలే ఉండాయి. నామిని కొత్తగా అక్షరాలు ఆవిష్కరించలేదు. కానీ నాకే నవల చదువుతూ ఉంటే, కడుపులో తిప్పుతూనే ఉంది. పలుమార్లు వెక్కి వెక్కి ఏడస్తూ ఉంటే, మూలింటామేమో యాస్టపోయి. కొడకా, నా కంటే ఇదిగా కుమిలిపోతావుండావే, కాసేపు చదివేది పక్కనబెట్టి, నాలుగురోజుల్లో కాలేజీకి పోబోతా ఉండే నీ బిడ్డతో నాలుగు మాటలు మాట్లాడు, మనసు నెమ్మదిస్తాది. నాయనా, నేనేడికిబోతా? పుస్తకం బోర్లాపెట్టిపో నాయనా, ఈడ్నే ఉంటాలే అని ఓదార్చేది.
వరుసగా ఐదుపేజీలు చదివే సరికి నాకు ఊపిరాడేది కాదు. గుక్క తిప్పుకోలేకపోయేవాణ్ని. ఈ నవల్లో ఏం ఉందంటే, చిత్తూరు జిల్లా గ్రామీణ జీవితం ఉంది. ఓ సిగ్గుమాలిన బాసాలి మనసుపడే ఘోష ఉంది. ముప్పై సంవత్సరాల క్రితం మా గ్రామాల వద్ద నరికేస్తా ఉండిన భారీ వృక్షాల కింది జాడలేని నీడ ఉంది. బాయికాడ మడికి నీళ్లు పారతా ఉంటే. గెనింమీద గొంతు కూచోని గుక్కెడు నీళ్లుతాగి, ముంజేత్తో మూతి తుడుచుకున్న పల్లెల పాతకాలం జ్ఞాపకాలుండాయి. నిజానికి ఇది పుస్తకం కాదు. దారుణంగా మోసపోయిన పల్లె లంజాముండ. ప్రపంచం అంతా మారిపోతా ఉందని నమ్మి, ఊరుచుట్టూ ఉండే పచ్చని చెట్లుకొట్టేసుకున్న బోడిలంజ. బంగారం పండగలిగిన మంచి నేలలను రియలెస్టోడికి తెగనమ్మిన మిండగోడిచేత దగాపడ్డ బాసాలి. ఇది నవల అంటారే అటువంటి మామూలుగా చెప్పిన కథగాదు. నాయాల్ది, మా చిత్తూరు జిల్లా మాటల్తో మనిషిలోతు కొలిచిన పసందైన తొలుబొమ్మలాట. ఇది కథ కాదు.. కళ్లముందర నుంచీ నడుచుకుంటా వెళ్లిపోయిన పల్లె బతుకు. ఇది వట్టి నామిని పైత్త్యం గాదు... డబ్బు కళ్లజూడాలన్న మనుషుల వికారపు కోరికలు షికారు తిరిగే మరుభూమి.. ఇది కాగితాల్లో నల్లరంగేసి అమ్మేసుకోవడానికి తెచ్చిన కథ కాదు. ఒక కాలంలో ఒక ఊరు, ఆ ఊర్లో చొక్కాలు, పంచెలు, చీరా-జాకెట్టూ తగిలించుకోని తిరిగిన మనుషుల ఆనవాలు ఈ నవల. దీనికే బహుమతీ వద్దు. ఇవ్వొద్దు. ఏదిచ్చినా తక్కవే కదా. అందుకే ఏదీ ఇవ్వకపోతేనే బాగుంటుంది.
ఒక గ్రామంలో, ఒక మూలింట్లో, ఒక ఆడమనిషి పడిన జీవన వేదనానాదం అంతా పెన్నులోకి దించి, కాగితాలకు అతికించిపచుతున్న నామినే.. సేద్యగాడు. మనిషి మనసులో, అనుభూతుల మొలకలెత్తించిన కృషీవలుడు కాదూ నామిని!? ఒక కుటుంబం కథను ఆయన నడిపించిన తీరు చూసినపుడు కళ్లలో నీళ్లు తిరిగినాయి. ఈ మాదిరిగా ఎదుటి మనిషిని కళ్లమ్మట నీళ్లు బెట్టించడం గతంలో ముళ్లపూడి రమణ చేసేవాడు కోతీ కొమ్మచ్చిలో.. ఇపుడు నామిని అందుకున్నాడు. డబ్బిచ్చి పుస్తకం కొని చదవుతూ ఏడ్చి దొబ్బించుకోవడం ఎందుకంటే.. మనం మనుషులం కదా, మడిసన్నాక కాస్త కలాపోసనుండాల కదా!.. అందుకు. కూసోని తినేసి, పక్కనోడిమీద చీమిడేసి పోతే ఏ మొస్తాది. మూలింటామె అన్ని పిల్లులను ఎందుకని కనిపెట్టుకున్నట్లు. వాటితో అన్ని మాట్లు అన్ని నంగనాచి మాటలు ఎందుకు మాట్లాడినట్లు. కథ చదువుతూ ఇవన్నీ ఏలా ఆలోచించాలి.
నారాయణ లాంటివాణ్ని నేను స్వయంగా చూశాను. నామినికూడా చూసే రాసుంటాడు. అందువలననే ఈ నవల్లో జీవం ఉబుకుతూ ఉంది. నారాయణ వంటి మౌనమునులు గుంభనంగా జీవించి, తనువుచాలించినపుడు వారి మనోగతం వారికే ఎరుక, వాళ్లను పుట్టించిన బ్రహ్మదేవునికి ఎరుక. పక్కన పిడుగులుపడ్డా, బెదరకుండా ఉండే నారాయణ గుణం మనుషుల్లో లేదని ఇప్పటి తరం అంటే మనం చేయగలిగేది ఏమీ లేదు. ఇప్పటికీ ఉంటారు. ఎక్కడో ఒక చోట ఉంటానే ఉంటారు. మరి నడిపమ్మి. ఈ అమ్మి అనడం ఎంత సొంపుగా ఉందో, పెద్దమ్మి, చిన్నమ్మి.. అనే పేర్లు ఇంకెక్కడన్నా ఉంటాయా! అమ్మీ అని పిలవడం మధురంగా లేదూ... సరే. ఈ మూలింటామె నవల్లో పందొసంత, నడిపామె,రంగబిళ్ల, రంజకం గానీ, ఎవరైనా నామిని చెప్పినట్టు నడుచుకోలేదు. అట్టా జరిగుంటే, మరోలా ఉండేది. ఇదంతా నిజానికి గ్రామీణజీవనచిత్రరచన (ఎ లైవ్ పెయింటింగ్ ఆఫ్ విలేజ్ లైఫ్) అందులో చిత్రకారుడి పాత్ర ఎంతుంటది? ఈ నవల్ల్లో నామిని పాత్రగూడా అంతే ఉంటుంది. అనుభవించిన జీవన సౌందర్యాన్ని తులం తగ్గకుండా కాగితంపై పెట్టడం నామిని సాహసం, లేదా ప్రత్యేకత. కాదంటే లక్షణం. కన్యాశుల్కంలో మధురవాణి, బుచ్చెమ్మ లంజరికం జేయలేదా, అవి క్లాసిగ్గా మిగల్లేదా... మరి నామిని నవల్లో మాత్రం అంతా ప్రతివొతలే ఉండాలా. ఇదేం విడ్డూరం?
నారాయడు సంగతేమో, లేచిపోయిన నారాయణ పెళ్లాం సంగతేమో గానీ, మూలింట్లో ఉన్న ముసలామె, ఆమె కూతురు, కడుపులో కుళ్లి కుళ్లి ఏడ్చిన తీరు, వారి పరిణితికి తార్కాణం. గ్రామీణ మహిళల జీవితాన్ని ఇంత లోతుగా చిత్రించడం నామినికే చెల్లింది. చాలా చిన్న వయసులో భర్తపోయినపుడు, మూలింటామె, తన ఇద్దరు బిడ్డలను పెంచుకున్న తీరు. కుటుంబాన్ని నిలుపుకున్న తీరు పట్టుదలకు, దీక్షకు గుర్తు. కష్టేఫలే అన్న నానుడికి చిహ్నం. ఏమో, తన మనవరాలిపై అవ్యాజమైన ప్రేమబంధం కారణంగా చివరికి మూలింటామె తన శీలానికీ మచ్చ ఆపాదించికోని ఉండవచ్చు. ఒక గీత ముందు మరింత పెద్ద గీత గీయడానికి ఆ ముసల్ది ప్రయత్నించి ఉండవచ్చు. తద్వారా మనవరాలి తప్పును చిన్నదిగా చూపెట్టాలనుకుని ఉండవచ్చు. ఆ వయసులో ఆ నిజం వెలుగు చూడ్డం, అందువలన ఆమెకు వచ్చేనష్టం ఏమిటి? తను పెంచుకునే పిల్లి పిల్లలకోసం తను వక్కా, ఆకు వేసుకోవడం మానుకున్న మనిషి మనసు అర్థంజేసుకోగలగాలి. తాంబూలం కోసం పెట్టే ఖర్చుతో పిల్లులకు కోడిగుడ్డో, ఉప్పుచేపో కొనిపెట్టాలనుకునే మూలింటామె ఒబ్బిడి తనం పాఠకున్ని కదలించివేస్తుంది. గ్రామ జీవితంలో ఒకనాడు ఉండేది. ఈ ఆధునిక నగర జీవితంలో నేడు లేనిది ఈ ఇబ్బిడి కదా. ఆ ఒబ్బిడి తనం లేని పందొసంత వలన జరిగిన అనర్థం ఏమిటో ఈ నవల చివర్లో తెలుస్తుంది.
కేవలం ఓ ఏడాదిలో మూలింటిపరిసరాల్లో వచ్చిన మార్పులు. ఈ ముప్పై ఏళ్లలో జిల్లా అంతటా వచ్చేసింది. ఈ మార్పు గుర్తించాలంటే, పరిశీలన అవసరం. ఇపుడు జిల్లాలో పెద్ద మాన్లు ఎక్కడా లేవు. ఏ గ్రామంలోనూ బండి, ఎద్దులూ లేదు, ఎవరూ సంగటి తినడం లేదు. అసలు చేయడానికి చాలా మందికి తెలియదు. అన్ని వంట గదుల్లోనూ మిక్సీలు, వొవెన్లూ, ఇడ్లీలు, దోశలే.. అంతువల్లా వాతవారణంలో ఎంత మార్పు వచ్చింది. వేసవి తీవ్రత ఎంత పెరిగింది. బూముల్లో నీళ్లు ఎంత కిందకు పోయాయి ఇవన్నీ పందోసంత బృందం వంటి వారి అకృత్యాల వలనే కదా. ఇది గుర్తించాలి ఈ నవల్లో ....
చిత్తూరు జిల్లా గ్రామీణజీవనం. నాస్టాల్జియా రేకెత్తించే మూలింటామె . . . నామిని రచనా చమత్కృతిమయత్వం అందుకుని ఆవష్కృతమైన ఆందమైన నవలా భవనం ఈ మూలింటామె. కన్నుచెదిరే జిల్లా మాండలికాల సొగసు జిలుగు చూసి అవాక్కు కావలసిందే. తెలుగు నుడికారానికి ఆకారాన్నిచ్చి నవరత్న ఖచిత కిరీట ధారణ చేయించిన సామెతలు, జాతీయాలు, పలుకుబళ్ల ప్రయోగయోగవిద్యా విశారదుడు నామిని.
ఈ నవల్లో కనిపించే ప్రధాన పాత్రలు - మూలింటామె, నడిపమ్మి, కొనమ్మి, చినమ్మి, నారాయణుడు, ఇద్దరు మగ, ఆడ బిడ్లు. వీరు కాకుండా ఎర్రక్క, పందొసంత, రంజకం, చీమంతమ్మ, గుడుగుడుచంద్రం వంటి కొన్ని పాత్రలు. కథ.. .. ప్రధానంగా మూలింటామె కుటుంబానికి చెందింది. ఈ ఇంటికి చెందిన మొదటి ముసలిది, ఆమె కూతురు, ముసలామె మనవరాలు, కొడుకు నారాయణనాయుడు, అతని రెండో పెళ్లాం పందొసంతలే కథ నడిపిస్తాయి. కాబట్టి వీళ్లనే చూద్దాం.
కథాగమనం ప్రకారం ముసల్ది, మనవరాలు, రెండో కోడలు, అక్క ఎర్రక్క మొగుడితో పాటూ ఇతర వ్యక్తులతో కూడా శారీరిక సంబంధాలు పెట్టుకుంటారు. అవన్నీ వివరంగా చెబుతాడు నామిని. బహుశా నారాయుడి శృంగార రాహిత్యం ఎవరూ గుర్తింలేదు. తాను తన భార్యలను తగిన విధంగా రమించడం లేదనే నగ్నసత్యం నారాయుడికే బాగా తెలిసుండాలి.. మొదటి భార్య (అక్క కూతురు) మరొకడితో వెళ్లిపోయినపుడు గాని, ఆ తరువాత పెళ్లయిన కొన్ని రోజులకే రెండో భార్య ఇంకో మగాడితో ఉండడాన్నిగానీ అతను పెద్ద ఇబ్బందిగా చూడకపోవడం గమనించాలి. ఏ బలహీనత కారణంగా నారాయుడు మౌనంగా ఉండేవాడో. నవల్లో రెండు వ్యభిచార వృత్తాంతాల మధ్య వెలుగెత్తిన మహిళల మనోవికాసం పాఠకుడు గుర్తిస్తాడు. మనవరాలి సిగ్గుమాలిన పనిని మూలింటామె ఎందుకు కడుపులోనే దాచుకుంది, నడిపామె ఒక్క మాటతో కన్నకూతుర్ని ఎందుకు చచ్చినదానితో సమంగా భావించుకుంది. ఒక మహిళకు సంబంధించిన సంఘటన, ఒకే ఇంట్లో ఉండే ఇద్దరు ఆడవారిలో రెండు పరస్పర విరుద్ద భావాలు ఎందుకు కలిగించింది? దీని నేపథ్యం ఏమిటి? ఇదే ఈ నవలకు సంబంధించిన మనోవైజ్ఞాక విశ్లేషణ. కథ చిన్నది. అందులో నామిని నడిచి వెళ్లిన జాడ తీరు తెన్నులు లెక్కించ వలసి ఉంది. చివర్లో ముసలమ్మమరణం, మనవరాలి ఆత్మహత్య వంటివి లోతైన వ్యక్తిత్వాలకు నిదర్శనం.
నా వరకూ వ్యభిచారాంశాలు ఈ కథలో పెద్దగా ప్రాముఖ్యంలేనివి. కూరలో ఉప్పు వంటివి. కుటుంబంపైన, జీవితం పైనా మూలింటామెకున్న దృష్టి, రైతు కుటుంబాల్లో ఉండే మట్టిపై ప్రేమ, కారుణ్యమూ వెలకట్టలేనివి. అంతేనా.. ఒక దశకంలో గ్రామీణ జీవితం ఎంత వేగంగా పతనమయిందో నామిని కూడా కథలో అంత వేగంతో ఆ పతనాన్ని చివర్లో చూపెట్టిన తీరు గ్రామాలు శిథిలమైపోయిన రీతిని, మనిషిలోని అత్యాశ విశ్వరూపమెత్తిన సందర్భాలను ఆవిష్కరిం చింది. తన కళ్లెదుట కుప్పకూలిన గ్రామాలయాల విగత జీవితాన్ని చూచిన నామిని, నిలువెళ్లా కుంగిపోయి, మొదలంటా కదిలిపోయి రాసుకున్న మనోవేదనే ఈ మూలింటామె నవల. ప్రపంచం అంతా విస్తరించిన విచ్చల విడి మార్కెట్ శక్తుల విషపు కత్తులు లేత పల్లెబాలికలను హతమారుస్తున్న దృశ్యాలను, హెచ్చరికలూ నామిని యొక్క మూలింటామె నవలలో చూడలేక పోతే, ఇక పుస్తకాలు చదవడం వృధా. నవలలోని 73వపేజీలో చివరి పేరా చదవండి. ఇవ్వాళ నడుస్తున్న నయా మార్కెట్ పోకడలన్నీ పందొసంత రూపంలో నామిని ఎట్లా చెప్పాడో తెలుస్తుంది. మనిషిని మోసగించే కళకు ఏ విధంగా పేరు పెట్టారో అవగతమవుతుంది. ఇవన్నీ చూడకుండా చీకటే, వెలుతురు లేదనడం చూస్తున్న కళ్ల నాణ్యతపై అనుమానాలు కలిగిస్తుంది. అనాదిగా వస్తున్న జనపదాలు ఆధునిక ఆర్థికప్రలోభాలకోసం అనాధలుగా మారి, మరణించడం, ఆ సమయంలో ఆ పల్లెలోని మనుషుల మధ్య చోటు చేసుకున్న సంఘర్షణకు అక్షర రూపమే నామిని, మూలింటామె. Transformation form heaven to hell అన్నదానికి అక్షరరూపం ఈ మూలింటామె నవల.
ఈ నవల తెలంగాణ, అంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని అన్ని విశాలాంధ్ర బ్రాంచీలలో దొరుకుతుంది.
మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)
|
|
గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)