కవితా స్రవంతి
మట్టిపువ్వు
- యస్. స్రవంతి
మట్టి పువ్వును మట్టి వాసనే నా పరిమళం
వే వేల పాదాల కింద నలిగి నలిగి
నా రూపును మార్చుకున్న
కమిలిపోయిన నలుపు వర్ణం నా రంగు
మట్టిపువ్వునన్న చులకనతో
నేలకేసి బద్దలుకొట్టిన
నాపాదాల గుర్తులను నాతోనే పూడిపించిన
సుగంధాల పువ్వుల్లో
నీళ్ళకు నోచుకోని
మట్టిపువ్వును
గులాబీల ముల్లులకు చిక్కుకుపోయి
బలైపోయిన మట్టిపువ్వును
మల్లెల సువాసనల ముసుగులో
పిగిలిపోయిన మట్టిపువ్వును
జాజుల తీగల్తో ఉరి వేయబడిన
మట్టి పువ్వును
కాకడాల కాగడాలకు
కరడు గట్టిన మట్టి పువ్వును
కాగితంపూలు చింపేసిన
మట్టి పువ్వును
కనకంబ్రాల చేతుల్లో
ఆహుతి అయిన మట్టి పువ్వును
వేవేల రంగులన్ని కలిసి
నెట్టివేయబడి
ఊరి చివరి తోటలో పరిమళించిన
మట్టి పువ్వును
తులసి చెటు వేర్లను నాలో పాదుకొన్న
మట్టి పువ్వును
అడివిలో ఆరబోసిన
అడివి పువ్వును
ఎండకు పండిన దానను
పంటలను పండించేదానను
విశ్రాంతి లేక రాలిపోయిన
మట్టి పువ్వును
భూ అంతర్భాగాల్లో ఉత కుత
ఉడికిపోయి పొగలు చిమ్ముతున్న
వేదనావేదనను అణచుకొని
అణచబడినదానను
తిరిగి ఎన్నో అవాంతరాలను
అధిగమించి వేర్లను
పదిలపరచుకుంటూ
ఇప్పుడిప్పుడు మొలకెత్తి పూస్తున్న
మట్టి పువ్వును
మేరెప్పటికీ రాలేని అట్టడుగు స్థాయిలో
పూసిన మట్టి పువ్వును
శ్రీకృష్ణుడు పెకలించడానికి ప్రయత్నించిన
దేవలోక పారిజాతాన్ని కాను
కారంచేడులో పూసిన మట్టి పువ్వును
వీలైన మట్టి పువ్వును
నా బిడ్డల ఆకలి ఆక్రోదనలు వింటూ
పూసిన మట్టి పువ్వును
నా అస్థిత్వాన్ని నిలబెట్టుకోడానికి
పూసిన మట్టి పువ్వును
ఊసరవెల్లిలాంటి రంగు రంగుల
పువ్వులకు బలైపోతూ
బ్రతుకునీడ్చిన మట్టి పువ్వును
నా వర్ణాన్ని నిలబెట్టుకోడానికి
పూస్తున్న మట్టి పువ్వును
మీ స్థాయికి రావడానికి
కాదు! కాదు!
నా స్థాయిని పదిలపరుచుకోడానికి
పరిమళిస్తున్న మట్టి పువ్వును
నేను మీ వాసనలకుబలైపోయినట్లు
మరొకరిని బలి కానివ్వని
చిన్న మట్టి పువ్వును
ఇప్పుడిప్పుడే పూస్తున్న
మట్టి పువ్వును
మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)
|
|
గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)