కథా భారతి
గ్రీన్ కార్డ్
రచన:ఇర్షాద్ జేమ్స్
పవన్ టెక్సాస్‌లో వున్న ఆస్టిన్ నగరంలో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆ కంపెనీలో చాలామంది అమెరికన్లే కాకుండా, ఇతర దేశాల నుంచి రకరకాల వీసాల మీద వచ్చిన వారు కూడా పని చేస్తున్నారు. పవన్ మూతి మీడ మీసం వున్న మగాడు మాత్రమే కాదు. పాస్‌పోర్టులో వీసా వున్న మొనగాడు.
ఆ రోజు ఉదయం నుంచి జావాలో వ్రాసిన ఫైల్ ప్రాసెసింగ్ ప్రోగ్రాంని డీబగ్ చేసి అలసిపొయాడు పవన్. ఒకసారి కంప్యూటర్ స్క్రీన్ క్రింది భాగంలో కుడివైపు వున్న గడియారం వైపు చూసాడు. సమయం పన్నెండున్నర కావస్తోంది. లంచ్ టైం అయింది.
తన ఎడం చేతి బొటన వేలు, మధ్య వేలు, కుడి చేతి చూపుడు వేలు ఒకేసారి కీబోర్డ్ మీద పెట్టి కంట్రోల్-ఆల్ట్-డిలీట్ నొక్కాడు పవన్. ఆ తరువాత ఎంటర్ కీ నొక్కి స్క్రీన్ లాక్ చేసాడు. తన కుర్చీని వెనక్కి తోసి, లేచి నిలబడి, కేఫెటేరియా వైపు నడిచాడు.
కేఫెటెరియా చాలా సందడిగా వుంది. రకరకాల వంటకాల సువాసనలతో నిండి వుంది.
ఖాళీగా వున్న టేబుల్ కోసం కొంతసేపు వేచి చూసాడు పవన్. చివరికి ఒక ఖాళీ టేబుల్ కనిపించింది. దానిని శుభ్రం చేస్తూ కనిపించాడు అలెహాంద్రో.
ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళి "హలో అలెహాంద్రో!" అని పలకరించాడు పవన్.
"హలో!" అన్నాడు అలెహాంద్రో, తల పైకెత్తి చూసి.
అలెహాంద్రోకి ఇంగ్లీషు అంత బాగా రాదు.
అతను మెక్సికో లో పుట్టి, పెరిగి, ఈమధ్యనే అమెరికా వచ్చాడు.
కొంత కాలం నుంచి అలెహాంద్రో ఆ కేఫెటేరియాలో పని చేస్తున్నాడు.
పవన్ లంచ్ టైంలో అలెహాంద్రో కనిపించినప్పుడు పలకరించి, కొంతసేపు మాట్లాడుతూంటాడు.
"ఎంజాయ్ యువర్ లంచ్!" అని వేరే టేబుల్ శుభ్రం చెయ్యడానికి వెళ్ళిపొయాడు అలెహాంద్రో.
పవన్ టేబుల్ దగ్గర కూర్చుని లంచ్ బాక్స్ తెరిచాడు.
టేబుల్ మీద ఒక న్యూస్ పేపర్ పడివుంది.
దాని మీద వ్రాసి వున్న ఒక హెడ్‌లైన్ పవన్ దృష్టిని ఆకర్షించింది:
New Limits on H-1B Visas
పేపర్ని దగ్గరకి లాక్కొని ఆసక్తిగా చదవసాగాడు.
ఇంతలో ఎవరో "హలో" అంటే తలెత్తి చూసాడు పవన్.
ఎదురుగా కళ్యాణ్ నిలబడి వున్నాడు.
"హలో కళ్యాణ్! రా, కూర్చో!!" అని న్యూస్ పేపర్ పక్కన పెట్టాడు పవన్.
"ఏమిటి సార్, సీరియస్‌గా చదివేస్తున్నారు?" అడిగాడు కళ్యాణ్.
"హెచ్ వన్ బీ వీసాల గురించి !"
"అవునా! ఏంటంట?" ఆత్రుతగా అడీగాడు కళ్యాణ్.
"కొత్త లిమిట్స్ పెడుతున్నారు. ఇంక హెచ్ వన్ వీసాలు దొరకడం కష్టం!"
"నేను ఇంకా ఎఫ్ వన్ వీసా మీదే వున్నాను."
"మరి హెచ్ వన్‌కి అప్లయ్ చెయ్యలేదా?"
"చేసాను సార్! కాని చాలా టైం పట్టేలా వుంది! ఈ లోపల నా ఎఫ్ వన్ వీసా ఎక్స్‌పైర్ అయిపోతుందేమోనని భయంగా వుంది!" చెప్పాడు కళ్యాణ్.
"ఏమిటో ఈ వీసా గొడవలు!"
"ఇన్ని అవస్థలు పడాల్సి వస్తుందని ముందే తెలిస్తే బావుండేది. చక్కగా ఇండియాలోనే ఉండిపొయేవాడిని!" కొంచెం బాధగా అన్నాడు కళ్యాణ్.
"నీకు అలెహాంద్రో తెలుసా?" అడిగాడు పవన్.
"తెలుసు! ఎందుకు?"
"అలెహాంద్రో అసలు వీసాయే లేకుండా అమెరికా వచ్చాడు. ఎలా వచ్చాడని అడక్కు! మొత్తానికి వచ్చాడు! తన పనేదో చేసుకుంటూ హాయిగా బ్రతికేస్తున్నాడు!"
"లేటుగా వచ్చినా లేటెస్టుగా వచ్చాడా?" నవ్వుతూ అన్నాడు కళ్యాణ్.
"అవును. అలెహాంద్రోకి ఏ వీసా గొడవా లేదు. మనకే ఈ సమస్యలన్నీ!"
"మీ గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ ఎంత వరకు వచ్చింది?" అడిగాడు కళ్యాణ్.
"నా గ్రీన్ కార్డా? ఈ జన్మలో వచ్చేటట్టు లేదు. ఇంకా లేబర్ సర్టిఫికేషన్ లోనే పడి వుంది!"
"ఎందుకంత డిలే?"
"ఇంతకుముందు నేను పని చేసిన కంపెనీ వాళ్ళు నా గ్రీన్ కార్డ్ స్పాన్సర్ చేస్తారని చెప్పారు. చేస్తాం, చేస్తాం అంటూ, మూడు సంవత్సరాలైనా చెయ్యలేదు. చివరికి ఆ కంపెనీని ఇంకో కంపెనీ కొనేసింది. కొత్త మేనేజ్‌మెంట్ వచ్చాక అసలు ఎవరికీ గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ చెయ్యం అని చెప్పారు. అప్పుడు ఆ కంపెనీ వదిలేసి ఈ కంపెనీలో చేరాను" చెప్పాడు పవన్.
"అరెరె, చాలా బ్యాడ్ లక్!"
"అవును!"
"పొనీలేండి. కనీసం మీకు మూడు సంవత్సరాలు ఎక్స్‌పీరియెన్స్ వచ్చింది. ఆ ఎక్స్‌పీరియెన్స్ తో అప్లయ్ చేస్తే మీకు త్వరగా గ్రీన్ కార్డ్ వస్తుంది!"
"నేనూ అలాగే అనుకున్నాను. కాని ఇంకో సమస్య వచ్చి పడింది!" కొంచెం బాధగా అన్నాడు పవన్.
"ఏమిటది?"
"ఆ మూడు సంవత్సరాల ఎక్స్‌పీరియెన్స్ చూపించాలంటే, పాత కంపెనీ నుంచి లెటర్ కావాలి. కానీ పాత కంపెనీలో కొత్త మేనేజ్‌మెంట్ వచ్చాక, పాత వాళ్ళని తీసేసారు !"
"సో?"
"ఇప్పుడు నాకు లెటర్ ఇచ్చేవాళ్ళు ఎవరూ అక్కడ లేరు!"
"ఓ, నో!! ఇప్పుడేం చేస్తారు?"
"ఏమో తెలియదు. మా లాయర్‌తో మళ్ళీ మాట్లాడాలి!" అంటూ తన వాచ్ వైపు చూసాడు పవన్.
అప్పుడు సమయం మధ్యాహ్నం ఒంటిగంటన్నర కావస్తోంది.
"ఓ!! నాకు మీటింగ్ వుంది. వెళ్ళాలి!" అంటు లేచాడు పవన్.
"ఓకే, సీ యూ లేటర్!" చెప్పాడు కల్యాణ్.
********** ********** ********** **********
కొన్నాళ్ళ తరువాత...
కేఫెటేరియా ఎప్పటిలాగే సందడిగా వుంది.
టేబుల్ దగ్గర కూర్చుని లంచ్ తింటూ న్యూస్ పేపర్ తిరగేస్తున్న పవన్ దృష్టిని ఆకర్షించింది ఒక ప్రకటన.
USA Grants Amnesty to Undocumented Workers
పవన్ ఆసక్తిగా చదవసాగాడు.
ఇంతలో కళ్యాణ్ వచ్చి పలకరించాడు.
"హలో పవన్ గారు!"
"హాయ్ కళ్యాణ్! ఇది చూసావా?" అంటూ పేపర్ అందించాడు పవన్.
"అవును, చూసాను!"
"ఇది అన్యాయం! ఘోరం !!" కోపంగా అన్నాడు పవన్.
"బై ద వే..." అంటూ ఏదో చెప్పబోయాడు కళ్యాణ్.
కానీ పవన్ వినే పరిస్థితిలో లేడు.
"ఏ డాక్యుమెంటూ లేకుండా బార్డర్ దాటి వచ్చిన వాళ్ళకి గ్రీన్ కార్డులు ఇచ్చేస్తున్నారు. మనం ఇంత కష్టపడి, లీగల్‌గా అన్ని అప్లికేషన్లూ నింపి, ప్రొసీజర్ ప్రకారం వెళ్తున్నాం. కాని మనకి ఏ దిక్కూ లేదు !" కోపంగా అన్నాడు పవన్.
"బై ద వే... నేను ఇప్పుడే అలెహాంద్రో తో మాట్లాడాను!" చెప్పాడు కళ్యాణ్.
"అవునా? ఏంటంట?"
"ఈ కొత్త ప్రణాళిక వల్ల అలెహాంద్రోకి గ్రీన్ కార్దు వచ్చేసింది. అతను మెక్సికోలో ఉన్నప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉద్యోగం చేసేవాడట. ఇప్పుడు అలెహంద్రోకి క్యాలిఫోర్నియాలో ఒక పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్ ఉద్యోగం వచ్చింది. ఈరొజే వెళ్ళిపోతున్నాడు!" చెప్పాడు కళ్యాణ్.
పవన్ ఆశ్చర్యంగా చూస్తూండిపొయాడు.
మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)
|
|
గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)