కవితా స్రవంతి
లేదు..లేదంటావెందుకు?
- యం.శ్రీవల్లి
డబ్బు డాబు పులుముకున్న చలువటద్దపు మేడల్లో విలాసముండే
నీకు..మండుటెండలో, పేదరికపు సహవాసం చేస్తూ, నీ సుఖానికి, తమ
కాయకష్టపు సోపానాలేసి ..దీన ప్రాణులున్నారని తెలిసీ..
ఇంకా ఏదో లేదు లేదంటావెందుకు??
జివ్హ చాపల్యం నిన్ను ఖరీదైన పూటకూళ్ళ ఇంటికి దారిపట్టిస్తే..
డొక్కవీపుకంటుకున్న ప్రాణాలు నాలుగు మెతుకులకై
"కరువు" పొలిమేర పయనం సాగిస్తున్నారని తెలిసీ..
ఇంకా ఏదో ..లేదు లేదంటావెందుకు???
మమకారపు వెగటులో బంధాలకు తిలోదకాలిచ్చిన నీకు...
తామే ప్రేగుబంధమో తెలియని అనాధలున్నారని తెలిసీ..
ఇంకా ఏదో..లేదు లేదంటావెందుకు???
అధికార దావార్తి, ధనకాంక్ష క్షుద్భాధలతో అలమటించే నీకు ..
ఆకలిదప్పులు తీరే పున్నమి కోసం..
తమ ఛాయలోనే తలదాచుకునే అన్నార్తులున్నారని తెలిసీ..
ఇంకా ఏదో లేదు లేదంటావెందుకు ???
తిండిలేని వారికి..తిన్నదరగని వారికి ఒకడే దేవుడు..
ఎవరి దండానికెంత విలువో మరి!!
ఏ త్రాసులో తూగునో పేదవాడి న్యాయం..
నిలువెత్తు అవినీతిని తూచి హుండీలో వేసి చేతులు దులుపుకుంటూ..
ఇంకా ఏదో..లేదు లేదంటావెందుకు???
మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)
|
|
గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)