కథా భారతి

దొంగ

- ఆర్. శర్మ దంతుర్తి

పాండీబజార్లో బస్సు కోసం చూస్తున్నాడు ఆనందరావు. వెధవ బస్సు 12-బి వస్తే మూడేసి బస్సులు ఒక్కసారి వస్తాయి. లేకపోతే గంటకో బస్సొస్తే గొప్ప. సూర్యుడు మకరంలోకి వచ్చిందివాళే అని బస్సులమీద అలంకరణలన్నీ చెప్తున్నాయి. దానికి తోడు అప్పుడే ఈ ఎండలొకటి. పండగ పూట కాబోలు, రోడ్లు అన్నీ చాలామటుక్కు నిర్మానుష్యంగా ఉన్నాయి.

ఏదో కలకలం అయితే వెనక్కి తిరిగి చూసేడు ఆనందం. ఎవరో ఇద్దరు - తెల్లటి డ్రెస్సులో, మర్చంట్ నేవీ కాబోలు - ఒక సైకిల్ మీద ఉన్న ముసలాయనిని గద్దిస్తూ చేయి చేసుకోడానికి ప్రయత్నం చేస్తున్నారు. హిందీలో మాట్లాడుతూ ముసలాయన చొక్కా పట్టుకుని కొట్టబోతున్నారు. ఆనందం వెంటనే వెళ్ళి అడ్డుకున్నాడు.

వాళ్ళు చెప్పడం ప్రకారం కధ ఏమిటంటే, ఈ మర్చెంట్ నేవీ వాళ్ళు రోడ్డు పక్కన నడుస్తూంటే ముసలాయన సైకిల్ మీద వెనకనుంచి గుద్దేసాడు. దెబ్బలు తగల్లేదు గానీ వీళ్ళిద్దరికీ కోపం వచ్చింది. ముసలాయన కధ ప్రకారం ఆయన సైకిళ్ళు - ఈమధ్యనే రోడ్డుమీద పక్కగా వేరేగా ఏర్పాటు చేసిన - వెళ్ళే దారిలో మాత్రమే ఆయన వెళ్తున్నాడు. వీళ్ళిద్దరూ అక్కడ నడుస్తూంటే బెల్లు కొట్టి బ్రేక్ వేసేడు కానీ ఆలశ్యం అయింది. వీళ్ళు బెల్లు వినిపించుకోలేదో మరొకటో కారణం. చూసుకోనండుకు ఆయన వినిపించుకోనందుకు వీళ్ళిద్దరికి సమానంగా ఉంది భాధ్యత. ఆనందం వెళ్ళి కల్పించుకునేసరికి వాళ్ళు హిందీలో తిడుతూంటే ముసలాయన తమిళంలో చెప్తున్నాడు. ఒకరి భాష ఒకరి అర్ధం కాకపోయినా తగువెందుకో తెల్సిందే రెండు పార్టీలకీ.

ఆనందం ముసలాయన్ని వెనకేసుకొచ్చి చెప్పేడు హిందీలో. "చూడండి అబ్బాయిలూ, ఇది సైకిళ్ళు వెళ్ళే దారి. మీరిక్కడ నడవకూడదు. మీరి నడవాల్సింది ఫుట్ పాత్ మీద. ఈయన చెప్పడం ప్రకారం తప్పు మీదే. ఓ నెల రోజుల క్రితం ఇక్కడ మద్రాసులో రూల్స్ మారేయి. మీరెవరో ఎక్కడ్నుంచి వస్తున్నారో నాకు అనవసరం. మరో విషయం ఏమిటంటే ఈయన పెద్దాయన. మీకు దెబ్బలు తగల్లేదు కదా, ఎందుకొచ్చిన గొడవ? ఆయన వయస్సు చూసి వదిలేయండి. అలా కాదూ అంటారా? ఈ పక్క సందులోనే పోలీస్ స్టేషన్ ఉంది. వెళ్దాం రండి."

పోలీస్ స్టేషన్ అనేసరికి నేవీ కుర్రాళ్ళు ఏ వంకనున్నారో కానీ, గొణుక్కుంటూ ముందుకి కదిలేరు.

గర్వంగా కాలరెత్తుదాం అనుకునేలోపున బర్రుమని 12-బి వచ్చింది. అప్పుడే సినిమా వదిలారు కాబోలు బోల్డు జనం ఎక్కడానికి. అందర్నీ తోసుకుంటూ ఎక్కేడు ఆనంద రావు. "వళ్ళ పో అమ్మా, తల్లీ ఉళ్ళ పో అమ్మా" అనే కండక్టర్ కేకల్తో తోసుకోవడమే తప్ప ఒక్క మిల్లీ మీటర్ కూడా ఖాళీ లేదు ఎక్కడా. పానగల్ పార్క్ దాటుతూంటే చిన్నగా కలకలం. ఓ పెద్దాయన కుర్రాడి చెవి పట్టుకుని అంటున్నాడు "రాస్కల్ ఎంత ధైర్యం రా నీకు, నా జేబు లోంచి పర్సు కొట్టేస్తావా?" ఆనందం అప్పుడే బస్ స్టాపులో ఓ గొడవ కుదిర్చిన ఆనందంలో ఉన్నాడేమో, వెంట వెంఠనే ముందుకెళ్ళిపోయి కుర్రాడి కేసి చూశాడు, ఏడవడానికి తక్కువ. అమాయకంగా మొహం పెట్టి, "ఇల్లే ఇల్లే" అనడమే కానీ నోటమ్మట మాట రావట్లేదు. క్షణంలో ఆనందరావుకి అర్ధం అయింది. కుర్రాడికేసి తిరిగి "తమిళ్ తెరియుమా?" "తమిళం వచ్చా?" అంటూ తమిళంలోనూ తెలుగులోనూ ప్రశ్నలు గుప్పించేడు. "తమిళ్ తెరియాదు" అని, "నేను కాదు సారు. ఆయన పర్సు కిందపడిపోతే తీసి ఆయనకే ఇస్తున్నాను. ఈలోపున నేను కొట్టేసానని అంటున్నారు." అన్నాడు కుర్రాడు.

వెంఠనే ఆనందరావు లోపలి హీరో బయటకొచ్చేడు, "ఏమిటండీ ఇది? ఇలా కుర్రాళ్ళని కసురుకుంటున్నారు? ఇతను మీకు హెల్ప్ చేద్దామని చూస్తూంటే?" అన్నాడు.

"ఏం? నువ్వూ వాడూ తోడు దొంగలా?" పెద్దాయన అడిగేడు.

కుర్రాడ్ని తన వెనక్కి లాక్కుని, పెద్దాయనతో చెప్పేడు గట్టిగా, "ఒళ్ళు దగ్గిరపెట్టుకుని మాట్లాడండి సార్. నేను పని చేసేది సెంట్రల్ స్టేషన్ లో. నేను రైల్వే ఉద్యోగస్తుణ్ణి. ఊరికే నోరుంది కదా పారేసుకుంటే కేసు అవుతుంది మరి. ఈ కుర్రాడు అమాయకంగా ఉన్నాడని నేను చెప్తూంటే నన్ను దొంగ అంటున్నారే?"

పెద్దాయన కాస్త మెత్త బడ్డాడు. బస్సు కోడంబాకం హై రోడ్డులోకి మలుపు తిరగ్గానే వచ్చిన స్టాపులో కుర్రాడు "నేనిక్కడ దిగాలి" అంటూ దిగిపోయి జనంలో కల్సిపోయేడు. కోడంబాకం బ్రిడ్జ్ తర్వాత వచ్చే మీనాక్షీ కాలేజీ స్టాపు లో బస్సంతా ఖాళీ అయింది.

సీటు దొరికితే కూర్చుని వచ్చే ప్రసాద్ స్టూడియోస్, వడపళనిలో జనం చూస్తూ కూర్చున్నాడు. పండగ నాడు చేసిన రెండు మంచిపన్లూ ఆనందానికి ఎంతో హాయినీ గర్వాన్నీ ఇచ్చాయి. ఈ రోజైనా కాస్త ఇద్దరికి సహాయంచేసాను కదా అనుకుంటూంటే కండక్టర్ అరుపుల్తో ఆఖరి స్టాపులో దిగేడు. ఇంటికి ఒక్క పది నిముషాలు నడక.

రూము తలుపుతీసి లోపలికెళ్ళేక బట్టలు మార్చుకుంటూంటే అప్పుడు తెల్సింది - వెనకజేబులో ఉండాల్సిన పర్సు లేదు. బస్సు టికెట్ చొక్కా జోబులో పెట్టడం అలవాటే. కానీ పర్సు కూడా చొక్కా జేబులో పెట్టాడేమో అని చూసాడు. ఎక్కడా లేదు. కోడంబాకం వస్తూనే "నేనిక్కడ దిగాలి" అంటూ కంగారుగా దిగిపోయిన కుర్రాడి మొహంలో పెదాల మీద సన్నటి జీరగా నవ్విన నవ్వు ఆనందరావుకెందుకో గుర్తొచ్చింది.



మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)