మే 29 రెండవ రోజు వేడుక రాగయుక్తమైన కీర్తనలతో, నాట్య రూపాకాలతో నిండిపోయింది. కోశాధికారి రవీంద్ర కూచిభొట్ల నేతృత్వంలో దేవాలయ ప్రాంగణాన్ని మరపించే స్థాయిలో నిర్మించిన సభావేదికపై ఉదయం 8 గంటలనుండి 'మనోధర్మ' పిల్లల సంగీత పోటీలు మొదలయ్యాయి. కేటాయించిన అయిదు నిమిషాల్లో ఒక కీర్తనలో రాగాలాపన, నెరవెల్, స్వరకల్పన, ముక్తాయింపు మొదలైన మెళకువలు ప్రదర్శించాలి. న్యాయనిర్ణేతగా వ్యవహరించిన కర్ణాటక సంగీతంలో పేరొందిన హైద్రాబాద్ బ్రదర్సు లో ఒకరైన కళారత్న దారూరి శేషాచారి వేసిన క్లిష్ఠమైన సవాలులకు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. పిమ్మట కూచిపూడి, భరతనాట్యాల్లో పిల్లలకు పోటీలు జరిగాయి. నాలుగింటి వరకు పేరొందిన కళాకారులు అన్నమాచార్య కీర్తనలతో బృంద నాట్యాలు, గానాలు చేసారు.
సాయంత్రం అయిదు గంటలనుండి కర్ణాటక సంగీట కచ్చేరీలు ప్రారంభమయ్యాయి. మొదటగా సంగీత కళాతపస్వి శేషయ్యశాస్త్రి తమ సుమధుర గాత్రంతో అన్నమాచార్యుని కీర్తనలతో 'నాద నీరాజనం' చేసారు. అనూరాధ శ్రీధర్ వయోలిన్, రవీంద్ర భారతీ మృదంగ సహకారం అందించారు. ప్రముఖ సంగీత విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ తనయుడు, స్థానికంగా టెక్నాలజీ రంగంలో పనిచేస్తున్న గరిమెళ్ల అనిల్ కుమార్ గంటకు పైగా అన్నమయ్య కీర్తనలను ఆలాపించి సభికులను కట్టిపడేసారు. శశిధర్ వయోలిన్, రవీంద్ర భారతీ మృదంగ సహకారం అందించారు. చివరగా, కళాప్రవీణ నేమాని సోమయాజులు 'జల తరంగం' పేరిట పింగాణీ పాత్రల్లో నీరుపోసి, చిన్న కర్రలతో మీటుతూ రాగ తాళ యుక్తంగా అన్నమయ్య కీర్తనలను ధ్వనింపజేసారు. వీరికి శశిధర్ వయోలిన్, రవీంద్ర భారతీ మృదంగం, రవి గూటాల తబలా సహకారం అందించారు.
పిల్లలచే బృందగానం |
మనోధర్మలో పాల్గొన్న బాలబాలికలు |
విశ్వశాంతి సంస్థ నాట్యాభినయం |
శేషయ్య శాస్త్రి సంగీత కచ్చేరి |
గరిమెళ్ళ అనిల్ కుమార్ కచ్చేరీ |
నేమాని సోమయాజులు జలతరంగిణి |
ప్రేక్షకులతో నిండిన సభ |