అన్నమాచార్యుని రచనల్లో ఆధ్యాత్మిక కీర్తనలకన్నా శృంగారకీర్తనలే ఎక్కువ. ఇవి లీలా పదములు. శ్రీవేంకటేశ్వరుని ఆనంద లీలావిహారములే ఈ కీర్తనలలోని వర్ణ విశేషములు. భక్తుల దృష్టిలో భగవంతుని సర్వసాధారణ లీలావిన్యాసానందమే పరమానంద భరితం. భగవంతుని లీలలు బహుముఖాలు. భగవంతుని అనవరత లీలాభావనా సంబంధ స్థాపనాదికముచే తత్ప్రాప్తి నాసించి కైవల్యము నొందుటయే భక్తుని పరమావధి. అన్నమయ్య లో ఆ లీలారసానుసంధానము లీల గాన రూపసాధనగా సాక్షాత్కారం జరిగింది. అన్నమయ్య అందువలననే శృంగార సంకీర్తనలను భగవంతుని బాల, కిశోర, యవ్వన లీలలాను అనంతముగా వూహించి విశద విస్తృతిలో వర్ణించి తనదైనా ఒక భావనా మయ రసప్రపంచాన్ని వెలయించాడు.
భరతాచార్యుడు చెప్పిన విధంగా ఈ ప్రపంచం లో ఏది పవిత్రమో, శ్రేష్టమో, ఉజ్జ్వలమో, దర్శనీయమో అదే శృంగారము. అలాంటి పరమ పవిత్రమైన, భగవన్నిష్టమైన శృంగారము భక్తిపూతమైతే సర్వోత్కృష్టమని వేరు చెప్పనక్కరలేదు. అన్నమాచార్యుని శృంగార కీర్తనలు భక్తి భావ బంధురాలై, లౌకిక వాసనలకు బహుదూరమై, అలౌకిక ప్రపంచపుటంచులలో సాగినవి. విశిష్టాద్వైతియైన అన్నమయ్య జీవాత్మ పరమాత్మలకు "అపృధక్ సిద్ధసంబంధ" మంగీకరించి విశ్వసించి, ఉద్దామ విరహ కల్పనలకే ప్రాధాన్యమిచ్చెను తప్ప, విరవిరహ వర్ణనలజోళికి పోలేదు. అన్నమయ్య కీర్తనలలో ఆధ్యాత్మిక కీర్తనలలో "ప్రపత్తిని" శృంగార కీర్తనలలో "స్వీకృతిని" దర్శించి తరిద్దాం.
నాయకులలో దక్షిణ నాయకుని తర్వాత "ధృష్ట నాయకుని" అన్నమయ్య కీర్తించిన విధం పరిశీలింపదగ్గది. పరవశింపదగ్గది. ధృష్ట నాయకుని రామరాజభూషణుడు తన కావ్యాలంకారసంగ్రహంలో "అన్యాంగనా భోగరూప, శృంగారాపరాధము చేసిన నాయకుడు, ఆ యపరాధమును గప్పి పుచ్చుకోడానికి కల్లలాడే విధముగా వర్ణిచాడు. సాహిత్య దర్పణములో
శ్లో. కృతాగా అపి నిశ్శంక స్తర్జితోపి, నలజ్జిత:
దృష్టదోషోపి మిధ్యావాక్కధితో ధృష్ట నాయిక:" అని చెప్పబడింది. అంటే..అపరాధము చేసినా జంకూ గొంకూ లేని వాడు, తర్జింపబడిననూ, లజ్జింపనివాడూ, తన దోషం కంటికి కట్టినట్టు కనిపిస్తున్నా ఇంకా ఏవో మాయమాటలు జెప్పి నచ్చజెప్పలనే ధోరణి కలవాడు ధృష్ట నాయకుడు. అలాంటి ధృష్ట నాయకుని అన్నమయ్య తన కీర్తనల్లో ఏవిధంగా వర్ణించాడో చూద్దాం.
పల్లవి: మనసులో తమకము మాకునిట్టే కానరాగా
ననునెంత తేలించేవు నాటకుడ నీవు
చ.1. పువ్వు వంటి జవ్వనము పొద్దొక వింతై రేచీ
రవ్వలు సేయక ఇట్టే రావయ్యా నీవు
వువ్విళ్ళూరీ జెమటలు వూటలై నీ మేనను
నవ్వులేమి నవ్వేవు నాతో నింకా నీవు ||మనసు||
చ.2. కొడిసాగి కోరికలు గుంపులుగా నల్లుకొనె
అడియాసలేల విడె మందియ్యవయ్యా
కడగి నివ్వెరగులు కానవచ్చె నీవల్ల
వొడియాల పట్టి పాడే వూరకే నీవు ||మనసు||
చ.3. చిమ్మిరేగిన సిగ్గులు చిడుముడి సందడించె
నెమ్మది గూచొండవయ్య నీవు నావద్ద
యిమ్ముల శ్రీవేంకటేశ ఇట్టె నన్నునేలితివి
నమ్మికలెన్నిచ్చేవు నయాననే నీవు || మనసు ||
(రాగం: ఆహిరి; శృం.సం.సం.28; రాగి రేకు 1851; కీ.సం.296)
నాయిక నాయకునితో పలికే పలుకులు మనమూ ఆలకిద్దాం. ఓ స్వామీ నీ నాటకాలన్నీ మాకు విదితమై పొయ్యాయిలే. ఇంకా కల్లబొల్లి మాటలు చెప్పవద్దు. నీ మనసులోనున్న కోరికలు మాకు తెలీదనుకున్నావా? అంటూ ఆటపట్టిస్తోంది ధృష్ట నాయకుని నాయకి. ఆవ్యవహారం సవివరంగా తెలుసుకోవలసిందే..
పల్లవి: మనసులో తమకము మాకునిట్టే కానరాగా
ననునెంత తేలించేవు నాటకుడ నీవు.
స్వామీ! పరనాయకి పై తమకున్న మోహము, కాంక్ష మేము ఇట్టే పసిగట్టగలం సుమా! నీమోములో ఎన్ని విషయాలు దాగిఉన్నా గ్రహించగలను. నన్ను ఎన్ని మాయమాటలతో నాటకాలాడి తేలించినా నీ గుట్టంతా మాకు ఎరికే స్వామీ అంటొంది నాయకి.
చ.1. పువ్వు వంటి జవ్వనము పొద్దొక వింతై రేచీ
రవ్వలు సేయక ఇట్టే రావయ్యా నీవు
వువ్విళ్ళూరీ జెమటలు వూటలై నీ మేనను
నవ్వులేమి నవ్వేవు నాతో నింకా నీవు ||మనసు||
పువ్వులాంటి యవ్వనముతో ఉన్నాను. ఎన్ని పొద్దులు నీకై పరిపరివిధాలుగా వేచి చూసేను స్వామీ...నాకు అపకీర్తి రాకుండా చూడు. ఇంకా ఏమిటి చూస్తున్నారు స్వామీ... ఇటురండి స్వామీ మొదట. మీ శరీరంపై చెమటలు చూడండి కోరికల తహతహలతో వూటలై ధారలుగా కారుతున్నాయి. ఇంకా ఈ హాస్యాలు ఏమిటి? ఎందుకు నవ్వుతున్నారు? వేషాలు ఎందుకు వేస్తారు? చెప్పండి మాకు అన్నీ తెలుసు అంటొంది నాయిక. స్వామి అసలే ధృష్టనాయకుడు గా మూర్తీభవించి ఉన్నాడు. అపరాధాలు చేసినా ఏమాత్రం సిగ్గుపడనివాడాయె!
చ.2. కొడిసాగి కోరికలు గుంపులుగా నల్లుకొనె
అడియాసలేల విడె మందియ్యవయ్యా
కడగి నివ్వెరగులు కానవచ్చె నీవల్ల
వొడియాల పట్టి పాడే వూరకే నీవు ||మనసు||
అంతకంతకూ వర్ధిల్లే కోరికలు గుంపులు గుంపులుగా నన్ను అలుముకొంటున్నాయి స్వామీ.. నా కోరికలను ఎందుకు అడియాసలు చేస్తావు? తాంబూలం అందియ్యండి. ఇంకా ఆలశ్యం ఎందుకు చేస్తారు రంగంలోకి దిగండి అని నాయకి స్వామిని వేగిరపరుస్తోంది తమకంతో. చివరకు నీవలన నాకు అదో భయం లాంటిది కలుగుతోంది. నన్ను ఒడిసిపట్టి వూరకే పాటలు పాడుతున్నారు. తగదు స్వామీ మీకు ఈ హాస్య ధోరణి అంటొంది నాయిక.
చ.3. చిమ్మిరేగిన సిగ్గులు చిడుముడి సందడించె
నెమ్మది గూచొండవయ్య నీవు నావద్ద
యిమ్ముల శ్రీవేంకటేశ ఇట్టె నన్నునేలితివి
నమ్మికలెన్నిచ్చేవు నయాననే నీవు || మనసు ||
సిగ్గు విపరీతంగా విజృంభించి వస్తోంది. తొందరపాటుతో నా మనసు వశం తప్పుతోంది. ఇలా రా స్వామీ నెమ్మదిగా నా చెంత ఆశీనులుకండి. నాతోకూడి ఉండే శ్రీనాధా! శ్రీవేంకటేశ్వరా! నన్ను ఏలినవారు మీరే! నన్ను లాలించి పాలించి ఎన్ని నమ్మికలిచ్చేవు స్వామీ..రా.స్వామీ నన్ను పరిగ్రహించండి అని కోరుతోంది నాయిక.
ముఖ్యమైన అర్ధములు
తమకము = కాంక్ష, మోహము; నాటకుడ = బూటకము, మోసము; రవ్వ = నింద, అపకీర్తి; వువ్విళ్ళు = ఆశ, తహ తహలు; వూట = తరగనిది; కొడిసాగు = కొనలుసాగు, వర్ధిల్లు; నివ్వెరగు = మిక్కిలి భయము, నిశ్చేష్టత; ఒడి = నేర్పు, ఒడుపు; చిమ్మిరేగు = మిక్కిలి విజృంభించు; చిడుముడి = వ్యాకులత,తొందర; ఇమ్ముల = వశించు, కాపురముండు; నయాన = సముదాయించు.