డాలస్ సెప్టెంబర్ 4, 2016.
“మా తెలుగు తల్లికి _____ దండ. ఏ పూల దండో చెప్పండి?” అని తియ్యటి తెలుగుదనం నిండిన ప్రశ్నకి “మల్లెపూదండ" అని చక్కటి జవాబులతో అమెరికాలో పిల్లల్లు సిలికానాంధ్ర మనబడి తెలుగు మాట్లాట నాలుగవ జాతీయ ఆటలు ఆడి విజయవంతం చేసారు. వివిధ అమెరికా సంయుక్త రాష్ట్రాలలో, 25 కేంద్రాలలో ఏప్రిల్ నుండి జూన్ వరకు జరిగిన ప్రాంతీయ పోటీల విజేతలు, 70 మంది పిల్లలు ఈ వారంతం డల్లస్ వచ్చి పదరంగం, తిరకాటం ఆటలు బహుమతులు గెలుచుకున్నారు.
తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యం, ఉభయ తెలుగు రాష్ట్రాల చరిత్ర ఇలా ఎన్నో అంశాలతో ఉన్న తిరకాటం ఆటలకి ధీటుగా సమాధానాలు చెప్పిన పిల్లలు, నాలుక తిరగని, పెద్దలు కూడా వ్రాయడానికి తడబడిన పదాలను పదరంగం ఆటలలో అవలీలగా వ్రాసిన పిల్లలు -- మన భాషని ముందుతరానికి నడిపించే తారలుగా నిలిచారు.
“2007లో మొదలైన సిలికానాంధ్ర మనబడి ఇప్పుడు 6000 మందికి పైగా పిల్లలకు తెలుగు నేర్పుతోందని”, సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు, కూచిభొట్ల ఆనంద్ గారు మాట్లాడుతూ “ఈ తెలుగు మాట్లాట కార్యక్రమం పిల్లలలో ఆటలపటిమ, ఆడుతూ తెలుగు నేర్చుకోవడానికి భాషపై ఆసక్తి, పిల్లలలో బహుమతులు నెగ్గుదామనే పట్టుదల, తద్వారా తెలుగుపై పదును, ఇలా ఎన్నో ఆశయాలతో తెలుగు భాషను ప్రపంచభాషగా ముందుకు తీసుకు వెళ్తున్నామన్నారు.
తెలుగు మాట్లాట సమన్వయకర్త, నిడమర్తి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ “1200 పైగా పిల్లలు ప్రాంతీయ ఆటలలో పాల్గొన్నారు, ఇది క్రితం ఏడాదితో పోలిస్తే 30% పెరిగిన స్పందన -- అంతా పిల్లలనుండి వారి తల్లిదండ్రులనుండి ఈ ఆటలపై పెరుగుతున్న ఆదరణ. అంతే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఈ ఆటలు వ్యాప్తం చేయమని మంచి స్పందన వస్తోంది. పిల్లలు ఇచ్చేస్ఫూర్తితో, తెలుగుపై మమకారం ఉన్న తల్లిదండ్రుల, దాతల ఆశీస్సులతో అంతర్జాతీయ తెలుగు మాట్లాట తొందరలోనే సాధ్యమని” అన్నారు.
ఈ జాతీయ పోటీల కిరీటాలు అందరికి స్ఫూర్తినిస్తున్న పిల్లలు:
బుడతలు వయోవిభాగం (5 నుండి 9 ఏళ్ళు):
తిరకాటం: మొదటి బహుమతి) - మానికొండ సుధా స్రవంతి రెండవ) - కొల్లు మన్విత్
పదరంగం: మొదటి బహుమతి) - మానికొండ సుధా స్రవంతి రెండవ) - పంత్ర యశ్వంత్
సిసింద్రీలు వయోవిభాగం (10 నుండి 14 ఏళ్ళు):
తిరకాటం: మొదటి బహుమతి) - ఇంద్రగంటి సిరివెన్నెల రెండవ) - ఘంటసాల శ్రీవైష్ణవి
పదరంగం: మొదటి బహుమతి) - కస్తూరి ప్రణవ్ చంద్ర రెండవ) - కొల్ల అరుల్
ఈ మాట్లాట సఫలీకృతం కావడానికి ఎందరో తెలుగు భాషాభిమానులు, స్వచ్చంద సేవకులు “భాషాసైనికులు" చేతులు కలిపి పనిచేసారు. అంతేకాక Bytegraph సాంకేతికంగా audio-visuals, live-telecast సదుపాయం అందించారు.
సిలికానాంధ్ర మనబడి ఆధ్వర్యంలో ఈ ఆటలు ఇంకా ఎంతో పైకి ఎదగాలని, ఈ ఆటలు పిల్లలకు తెలుగు నేర్చుకోవడంపై మమకారం పెంపొందించాలని, వారి ప్రతిభా పాటవాలు మరిన్ని అద్భుతాలు సృష్టించాలని కోరుకుందాము.