నాగపాశవిమోచనం
ఇట్లా సుషేణుడు చెపుతున్నాడో లేడో ఆకాశంలో మేఘాలను సంఛిన్నం చేస్తూనూ, సముద్రజలాలను సంక్షోభపరుస్తూనూ, భూమి అంతా సంచలింప చేస్తూనూ, లంకాద్వీపంలో మహావృక్షాలన్నిటినీ భూమినుంచి పెకల్చుకొని సముద్రంలో పడిపోయేట్లుగానూ, ఉన్న వృక్షాలు కొమ్మలన్నీ విరిగి బోడులుగా అయ్యేట్లున్నూ, భూమి మీద ఉన్న సర్పాలు, మహాజంతువులు సముద్రంలో దాక్కోవడానికి పోయి మునిగిపోయేట్లుగానూ చేస్తూ, ప్రచండప్రభంజనం వీచసాగింది. అప్పుడు కొంచెం సేపటిలో వినతాసుతుడు గరుత్మంతుడు అగ్నిదీప్తులతో అక్కడకు వచ్చాడు. ఆయన గాలి సోకగానే రామలక్ష్మణుల నాగపాశాలు పటాపంచలై పోయినాయి. గరుత్మంతు డప్పుడు తన రెక్కలతో వారి శరీరాలను ప్రీతిగా నిమిరాడు. అప్పుడు రామలక్ష్మణుల దేహకాంతి దీప్తమైంది. వాళ్లకు జవసత్త్వాలు ఇతోధికంగా వృద్ధిపొందాయి.
గరుత్మంతుడు వాళ్ళను లేవనెత్తి ఆలింగనం చేసుకున్నాడు. అప్పుడు శ్రీరాముడు గరుత్మంతుణ్ణి ప్రశంసించాడు. కృతజ్ఞతాభావం ఉట్టిపడగా, 'నీ అనుగ్రహంవల్ల ఇంద్రజిత్తు పెట్టిన గడవరాని కష్టం నుంచి మేము గట్టెక్కాము. నిన్ను చూస్తుంటే మా తండ్రి దశరథమహారాజును చూస్తున్నట్లుగా ఉంది' అన్నారు వాళ్ళు. 'ఈ వెవరవయ్యా మహానుభావా!' అని శ్రీరాము డడగ్గా సుపర్ణుడు తన వృత్తాంతం సంగ్రహంగా వాళ్ళకు చెప్పి 'ఈ నాగులు కద్రువ తనయులు, వాళ్ళను మీ మీద ఇంద్రజిత్తు ప్రయోగించాడు. నా గాలి సోకగానే ఈ సర్పాలు పారిపోయాయి' అని పలికి రామలక్ష్మణుల అనుజ్ఞ తీసుకొని వాళ్ళకు ప్రదక్షిణం చేసి, కౌగిలించుకొని ఆకాశమార్గాన ఎగిరిపోయినాడు.
అప్పుడిక వానరులు అత్యంత తేజోబలపరాక్రమ రూపసంన్నులైన రామలక్ష్మణులను చూసి ఉప్పొంగిపోతూ సింహనాదాలు చేశారు. భుజాలు చరచుకొన్నారు, తొడలు కొట్టుకున్నారు, గర్జించారు. లంకాపట్టణద్వారాలమీద పోయిపడ్డారు. ఆ కోలాహలధ్వనులు, ఆర్పులు, గర్జనలు విని రావణుడు విస్మితుడైనాడు. నాగపాశాలనుంచి రామలక్ష్మణులు విముక్తులైనారని భావించాడు. సమర్థులైన రాక్షసవీరులను విషయం తెలుసుకొని రావల్సిందిగా పంపించాడు. వాళ్ళు వచ్చి రామలక్ష్మణులు దివ్యతేజంతో యుద్ధసన్నద్ధులై ఉన్నారని చెప్పారు. రావణు డిక విచారగ్రస్తుడు, క్రోఢఘూర్జ మానమానసుడూ అయిపోయినాడు. వరదానపూర్వకంగా ఇంద్రజిత్తుకు లభించిన నాగపాశాలు వ్యర్థమైపోవడంతో రావణుడు భయాక్రాంతుడైనాడు.
అప్పుడు రావణాసురుడు ససైన్యంగా వెళ్లి రామలక్ష్మణులను హతమార్చవలసిందిగా యోధానుయోధుడైన ధూమ్రాక్షుణ్ణి ఆజ్ఞాపించాడు. అసంఖ్యాకంగా రాక్షసవీరులు ధూమ్రాక్షుడితో కదిలారు. ధూమ్రాక్షుడి రథం భయంకరారావంతో కదిలింది. హనుమంతుడు బద్దలు కొట్టడానికి ఉద్యమిస్తున్న లంక పశ్చిమద్వారం రక్షించడానికి ధూమ్రాక్షుడు అక్కడకు చేరాడు. ధూమ్రాక్షుడి కన్నీ దుర్నిమిత్తాలు, అపజయసూచనలు ఎదురైనాయి. అంతరంగంలో భీతి చెందినా పట్టుదలతో వానరసేనను ఎదిరించటానికి పూనుకున్నాడు ధూమ్రాక్షుడు. రాక్షసులంతా వాణ్ణి చూసి మహానందం పొందారు. అప్పుడు వానరులకూ, రాక్షసులకు మధ్య ఘోరయుద్ధం జరిగింది. వానరులెందరో హతులైనారు. అయినా వానరసేన వెనుకంజ వేయలేదు. రాక్షసులను చీల్చి చెండాడారు. వారి రథాలను నుగ్గునుగ్గు చేశారు. భయపడి రాక్షసులు పారిపోయేట్లు చేశారు వానరులు.
ధూమ్రాక్షుడికి పట్టరాని ఆగ్రహం వచ్చింది. రాక్షసులను రెచ్చగొట్టాడు. పోరు ఘోరమైంది ఇరుపక్షాల వారి మధ్య. అప్పుడు ధూమ్రాక్షుడు పకపక నవ్వుతూ వానరులపై శరపరంపర కురిపించాడు. వానరులు భీతితో పారిపోవటం చూసి హనుమంతుడికి పట్టరాని కోపం వచ్చింది. ఆయన కళ్ళు నిప్పులు రాల్చాయి. పెద్ద కొండశిలను ఆ ధూమ్రాక్షుడిపై విసిరాడు హనుమంతుడు. ఆ రాక్షసుడు భయపడిపోయి రథం మీదినుంచి నేలమీదికి దూకాడు. ఆ భయంకరశిల రథాన్ని చిందరవందర చేసింది. ఒక మహావృక్షాన్ని ఆయుధంగా చేసుకొని హనుమంతుడు అసంఖ్యాకరాక్షసులను చంపివేశాడు. హతశేషులు ప్రాణభయంతో లంకలోకి పారిపోయినాడు. ఇదంతా చూసి రెచ్చిపోయి పరిఘాయుధంతో హనుమంతుడు పోరుకు దిగాడు ధూమ్రాక్షుడు. ముళ్ళచీలల గదతో ధూమ్రాక్షుడు హనుమంతుడి మీద మోదగా చలించకుండా పెద్ద బండరాయితో ధూమ్రాక్షుణ్ణి కొట్టి చంపాడు హనుమంతుడు. వానరులంతా హనుమంతుణ్ణి ప్రస్తుతించారు, పూజించారు.
ధూమ్రాక్షుడి మరణం విని రావణాసురుడు కాలసర్పంలా బుసలు కొట్టాడు. శూరవరేణ్యుడైన వజ్రదంష్ట్రుణ్ణి వానరసేపై యుద్ధానికి పంపించాస్స్డు. పెద్దసైన్యంతో వజ్రదంష్ట్రుడు బయలుదేరాడు. రాక్షసులంతా భయంకరాయుధాలు ధరించారు. మేఘసమూహాలు భూమి మీద పరుగులు తీస్తున్నాయా అన్నట్లు ఆ రాక్షససేన వేగం పుంజుకొన్న దిక్కులు పిక్కటిల్లిపోయేట్లు హుంకారాలతో అంగదుడు ముట్టడించిన దక్షిణ ద్వారం దగ్గరకు ఈ రాక్షససేన పోయింది. వాళ్ళకప్పుడు అన్నీ అశుభసూచకాలైన అపశఖునాలు ఎదురైనాయి. ఆ ఉత్సాతాలను చూసి వజ్రదంష్ట్రుడు చలించిపోయినాడు. అయినా లక్ష్యం చేయలేదు. వజ్రదంష్ట్రుణ్ణీ, ఆ రాక్షస సేనావాహినినీ చూసి వానరసనేలు సింహనాదాలు చేశారు. రెండు పక్షాలవారూ తలపడగా పోరు ఘోరంగా సాగింది. ఆయుధాలన్నీ నుజ్జునుజ్జు అయిపోగా బాహువులతో యుద్ధం చేశారు రెండు పక్షాలవారూ. ముష్టిప్రహరణలతో ఒకరినొకరు చంపుకున్నారు. వజ్రదంష్ట్రుడు యముడిలాగా వానరసేనను భయకంపితులను చేశాడు. వానరసేనను వజ్రదంష్ట్రుడు అట్లా నిర్మూలిస్తూ ఉండటం చూసి అంగదుడు అగ్రహోదగ్రు డైనాడు. విజృంభిం,ఇ వృక్షాయుధంతో రాక్షసులను చావమోదాడు. యుద్ధంలో గుంపులు గుంపులుగా, గుట్టలు గుట్టలుగా రాక్షసులు నేలకూలారు.
ఆ యుద్ధరంగంలో రాబందులూ గద్దలూ కోలాహలంగా యథేచ్ఛగా విహరించాయి. వానరయోధుల చేతుల్లో ఇట్లా రాక్షసులు కుప్పలు కుప్పలుగా హతులైపోవడం వజ్రదంష్ట్రుడు సహించలేకపోయినాడు. చేతిలోకి మహాభయంకరమైన విల్లు తీసుకొని ఒక్కొక్కబాణానికి ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పదిమంది వానరులను హతమార్చసాగాడు. వానరయోధులు భయకంపితులై అంగదుణ్ణి ఆశ్రయించారప్పుడు. అప్పుడు అంగదుడు వజ్రదంష్ల్రుడితో ముఖాముఖి తలపడ్డాడు. వజ్రదంష్ట్రుడు కుపితుడై అంగదుడిపై అసంఖ్యాకబాణాలు ప్రయోగించాడు. అంగదుడు ఆగ్రహంతో ఒక వృక్షం ఆయుధంగా చేసుకొని ఆ రాక్షసుడిపై విసరివేశాడు. దాన్ని తప్పించుకోవటానికి వజ్రదంష్ట్రుడు నేలమీదికి దూకాడు. వృక్షాలతోనూ, పర్వతశిఖరపు పెద్ద పెద్ద శిలలతోనూ వాళ్ళిద్దరూ పరస్పరం పోరాడాడు. ఆ ఆయుధాలు వమ్మైపోవడంతో బాహాబాహి యుద్ధానికి దిగారు వాళ్ళు. అంగదుడు ఇక సహించలేక వజ్రదంష్ట్రుడి కంఠాన్ని తన మహా ప్రభావశీలమైన ఖడ్గంతో నరికివేశాడు. వికృతమైన కళ్ళతో వజ్రదంష్ట్రుడు తన మొండెమూ, తలా వేరు కాగా భూమి మీద పడి ప్రాణాలు కోల్పోయినాడు. రాక్షసులంతా పరమభీతులై లంకాపట్టణంలోకి పారిపోయినారు.
వజ్రదంష్ట్రుడు కూడా రణరంగంలో కూలిపోయినాడని విని రావణుడు రింత క్రోధోద్రిక్తుడైనాడు. ఆగ్రహంతో ఊగిపోతూ తన సైన్యాధ్యక్షుణ్ణి పిలచి అకంపనుణ్ణి ససైన్యంగా యుద్ధానికి పంపవలసిందిగా ఆజ్ఞాపించాడు.
అప్పు డిక అకంపనుడు యుద్ధానికి సన్నుద్ధుడై అపారమైన సేనను కూర్చుకొని యుద్ధరంగానికి చేరాడు. ఎప్పుడూ ఏ యుద్ధంలోనూ - అది దేవతలతో చేసిన యుద్ధమైనా కూడా - ఎంత మాత్రమూ కంపం పొందని, కలత చెందని మహావీర పరాక్రముడు కాబట్టే ఆ రాక్షసుడికి అకంపనుడు అనే పేరు వచ్చింది. అకంపనుడు మహా ఆటోపంతో వానరసేనతో పోరాడాలని సన్నద్ధుడై వచ్చాడు. 'సుగ్రీవుణ్ణి బంధించి తీసుకొని వస్తే మనకు జయం లభిస్తుది. ప్రతీకారేచ్ఛ తీరుతుంది' అని రావణుడు అకంపనుడికి బోధించాడు, ప్రోత్సాహపరిచాడు. అకంపనుడు మహారోషంతో అప్పుడే తనకు విజంయం లభించినట్లే విర్రవీగుతూ యుద్ధరంగానా నిలిచాడు. అకంపనుడికి కూడా ఉత్పాతాలెన్నో తోచాయి. కాని అతడు లెక్క చేయలేదు.
వానరులు, రాక్షసుల మధ్య పోరు మహాఘోరంగా సాగింది. వాళ్ళ పాదఘట్టనలకు భూమి కదిలింఇ. రేగిన ధూళితో ఆకాశం కన్పడకుండా పోయింది. తమవారినే తాము చాలామందిని చావగొట్టుకున్నారు. చంపుకున్నారు. ఘీంకారాలు చేశారు. సింహనాదాలు చేశాడు. కుముదుడూ, మైందుడూ, ద్వివిదుడూ ఈ రణరంగంలో విజృంభించి అనేక రాక్షసవీరవరులను చంపివేశారు. పీనుగుపెంటలతో రణరంగమంతా నింపివేశారు. దీనిని సహించలేక అకపంనుడు వానరులను అసంఖ్యాకంగా వధించాడు. తన శరపరంపరలతో వానరులకు మహాభయం సృష్టించాడు. వానరసేనలు తరిగిపోజచ్చాయి. అది చూసి హనుమంతుడు వానరసేనలకు సహాయం చేయటానికి వచ్చాడు. అకంపనుడికీ, హనుమంతుడికీ మధ్య ప్రత్యక్షంగా ఘోరయుద&ధం జరిగింది. మారుతి అకంపనుడిపై ప్రయోగించిన మహావృక్షాయుధాలను, పర్వతశిఖరపు పెనుశిలలను తన బాణప్రయోగంతో అకంపనుడు ముక్కలు ముక్కలు చేశాడు. పధ్నాలుగు బాణాలు ఒకేసారి హనుమంతుడి మహాకాయాన్ని చీల్చుకొని పోయేట్లు అకపంనుడు ప్రయోగించాడు. అప్పుడ ఆంజనేయుడు ఒంటిమీద రక్తధారలతో పూచిన అశోకవృక్షంలా భాసించాడు.
ఇక ఉపేక్ష చేయకుండా ఒక పెద్ద ఇనుమద్దిచెట్టును ఆయుధంగా ప్రయోగించి అకంపనుణ్ణి హనుమంతుడు నేలకూల్చాడు. అప్పుడు కైటభాసురుణ్ణి నిర్జించిన మహావిష్ణువులాగా కన్పట్టాడు ఆ మహాకపి. అప్పుడు దేవతలంతా హనుమంతుడికి కైవారాలు చేశారు. వానరు లాయనను ప్రస్తుతించారు. అర్చించారు.
అకంపనుడి చావు వార్త విని రాక్షసేశ్వరుడు ముఖం చిన్నపుచ్చుకున్నాడు. తన సమస్త రాక్షస సేనాధీశ్వరుడైన ప్రహస్తుణ్ణి పొగిడి యుద్ధసన్నద్ధుణ్ణి చేశాడు. ఇప్పుడు యుద్ధం విరమించి సంధిప్రయత్నాలు చేసినా నిరాకరించి వానరసేన మనలను తుదముట్టించడం తప్పదు అని నిర్ణయానికొచ్చాడు రావణుడు. ప్రహస్తుడి అభిప్రాయం కూడా అడిగాడు. ప్రహస్తుడు 'ఇదివరలోనే మనం సాధ్యాసాధ్యాలు, జయపరాజయా లను గూర్చి బాగా చర్చించే ఉన్నాము కాబట్టి మళ్ళీ ఇప్పుడు చర్చలతో పనిలేదు. యుద్ధం జరిగితీరవలసిందే' అని చెప్పాడు. 'నేను నీకోసం నా సర్వస్వం వదులుకుంటాను. భార్యాబిడ్డలను కూడా త్యాగం చేస్తాను' అని చెప్పాడు రావణుడికి నమ్మకంగా. ఆ తరువాత ప్రహస్తుడు సేనాదళాధిపతు లందరితో యుద్ధవ్యూహాలు చర్చించాడు. విజయం కోరి వాళ్ళంతా పూజాపునస్కారాలు నిర్వహించారు. అప్పుడు లకంలో మహాభయంకరంగా భేరి మోగింది.
చతురంగ బలాలను సమాయత్తం చేశాడు ప్రహస్తుడు. యుద్ధవాద్యాలు తుములంగా మోగింప చేశాడు. గొప్ప రథాన్ని సిద్ధం చేయించి ఆ రథాన్ని ఎక్కాడు ప్రహస్తుడు. తనవెంట నరాంతకుడూ, కుంభహనుడూ, మహానాదుడూ, సమున్నతుడూ అనే నలుగురు మంత్రులను యుద్ధరంగానికి తీసుకొనిపోయినాడు ప్రహస్తుడు. ప్రహస్తుడు విరచించిన యుద్ధవ్యూహాలతో రాక్షసులు ఏనుగుల మందలలాగా ఆయన రథాన్ని వెంబడించారు. ప్రళయకాలపు యముడిలాగా ప్రహస్తుడూ, సముద్రం పొంగి మహాప్రవాహాలుగా పొర్లిపోతున్నట్లు ఆ రాక్షససైన్యాలూ అప్పుడు కన్పట్టాయి. వాళ్ళ సింహనాదాలకు పక్షులు భయంతో తల్లడిల్లాయి. వికృతంగా అరిచాయి. లంకాపట్టణంలో భయంకరు దుశ్శకునాలు సంభవించాయి. ప్రహస్తుడి రాక్షససేనపై రక్తధారలు కురిసాయి. ప్రహస్తుడి రథసారథి చేతిలో కొరడా జారి నేలపాలైంది. అప్పుడు రాక్షసులకూ, వానరులకూ, మహాఘోరయుద్ధం జరిగింది. అగ్నిహోత్రం చూసి భ్రమసే మిడతలాగా ప్రహస్తుడు యుద్ధరంగంలోకి చొచ్చుకొనిపోయినాడు. 'ఈ కొండలాంటి యుద్ధపరాక్రమోత్సాహి ఎవరు? అని శ్రీరాముడు విభీషణుణ్ణి అడిగాడప్పుడు. 'వీడు ప్రహస్తుడు. రావణుడి మహాసైన్యాధిపతి. లంకలో ఉండే మూడోవంతు సేనకు వీడు అధిపతి, శూరాగ్రేసరుడు, అస్త్రశస్త్రవిద్యాకుశలుడున్నూ' అని విభీషణుడు శ్రీరాముడికి ఆ రాక్షసయోధుణ్ణి గూర్చి తెలియజేశాడు.
ప్రహస్తు డప్పుడు సుడిగాలిలాగా మహోత్సాహంతో రావడం చూసి అతడి కెదురుపోయి వానరవీరులు సింహనాదాలు చేశారు. సమస్త ప్రహరణాయుధాలు - కత్తులు, కటార్లు, ఈటెలు, బాకులు, గండ్రగొడ్డళ్లు, గదలు, పరిఘలు, ప్రసాలు ధరించి శత్రుపక్షాలు మహాఘోరయుద్ధం చేసాయి అప్పుడు. రాక్షసులు, వానరులు అసంఖ్యాకంగా హతులైపోయినారు. వానరులు రాక్షసులతో తలపడి కళ్ళు పీకేశారు. గోళ్ళతో వాళ్ళ శరీరాలు చీల్చి వేశారు. పళ్ళు పెకలించి వేశారు. అప్పుడు ప్రహస్తుడి వెంట వచ్చిన మంత్రులు విజృంభించి వానరసేనలను చీల్చి చెండాడసాగారు. దీనిని సహించలేక ద్వివిదుడు ఒక కొండకొమ్మును నరాంతకుడిమీదకు విసరడంతో నరాంతకుడప్పటికప్పుడు ప్రాణాలు వదిలాడు. దీంతో ప్రేరణ పొంది దుర్ముఖుడనే వానరవీరుడు ఒక మహావృక్షాన్ని విసరి సమున్నతుణ్ణి (అకంపనుడి మంత్రి) చంపివేశాడు.