పాపాలు చేసినవారు నరకానికి వెళ్లుతారని, పుణ్యాలు చేసిన వారు స్వర్గానికి వెళ్లుతారని అనేకుల నమ్మకం! చనిపోయిన తర్వాత లభిస్తాయని భావించే స్వర్గ, నరకాల ప్రసక్తిని కాసేపు పక్కన పెడుదాం! అసలు పాప పుణ్యాలు అంటే ఏమిటో అవి ఎందుకు చేస్తున్నామో ఆలోచిద్దాం!
“శ్రూయతాం ధర్మ సర్వస్వం యదుక్తం గ్రంథకోటిభిః
పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనమ్"
అని వ్యాసమహర్షి పాపపుణ్యాలను గురించి ఒక్క శ్లోకపాదంలోనే చెప్పాడు. అనేక గ్రంథాల్లో, శాస్త్రాల్లో చెప్పబడిన సారాంశం కూడా ఇదేనన్నాడు. సాటివారికి మేలు చేస్తే అది పుణ్యం, కీడు చేస్తే అది పాపం అని క్లుప్తంగా, సమగ్రంగా చెప్పాడు మహర్షి! గత జన్మలో జీవులు చేసిన పుణ్య, పాప కర్మలనుబట్టే ప్రస్తుత జీవితంలో సుఖ, దుఃఖాలు కలుగుతాయని, ఈ జన్మలో చేసిన కర్మల ఫలితాన్ని ఆగామి(రానున్న) జన్మలో అనుభవించాలని పెద్దలు చెప్తున్నారు. పునర్జన్మలు ఉంటాయా ? స్వర్గ, నరకాలున్నాయా? అనే వాదులాటలు ఎప్పటికీ ఉండొచ్చు! అందరూ వాటిమీద ఏకాభిప్రాయానికి రాకపోవచ్చు! కానీ పరోపకారం ఆచరించతగినదనీ, పరపీడనం త్యజించతగినదనీ అందరూ ఒప్పుకోవాల్సిందే! ఈ ఆలోచనే మనకు ఉత్తమ సంస్కారాన్ని ఇస్తుంది. వేదాలలో, ధార్మిక గ్రంథలలో నిర్దేశింపబడిన విధి, నిషేధాలకు ఈ పుణ్య, పాపాలే Basics. ఇవి సమాజ శ్రేయస్సుకు కూడా ముఖ్యం! ఏది పాపమో ఏది పుణ్యమో, దేన్ని స్వీకరించాలో, దేన్ని త్యజించాలో మన అంతరాత్మ స్పష్టంగా చెబుతూనే ఉంటుంది. దుష్ట నిర్ణయం బలీయమైతే మనమేమీ చేయలేం!మనసా, వాచా, కర్మణా ఎవరినీ బాధపెట్టకుండా ఉండటమే పుణ్య కార్యం. “ఆత్మనః ప్రతికూలాని, పరేషాం న సమాచరేత్" అని పెద్దలు చెప్పారు. మనం ఏఏ విషయాలను కఠినంగా భావిస్తామో, అవి ఇతరుల పట్ల కూడా ఆచరించకూడదు! మనకు ఏది అవసరమో సమాజానికి కూడా అదే అవసరమని భావించాలి! అంతటా భగవంతుడు ఉన్నాడని భావించే వారు ఇతరులకు ఎప్పటికీ బాధలు కలిగించరు, పైగా ఇతరులకు చేతైనంత ఉపకారం చేస్తుంటారు!
“యేనకేన ప్రకారేణ యస్య కస్యాపి దేహినః
సంతోషం జనయేత్ప్రాజ్ఞః తదేవేశ్వర పూజనమ్"
విజ్ఞుడు ఏదో ఒక విధంగా ఇతరులకు సంతోషాన్ని కలిగించాలి. ఈశ్వర పూజ అంటే ఇదే – అని ఈ శ్లోకానికి అర్థం. దైనందిన జీవితంలో పాప, పుణ్య విచక్షణను పాటించాలి. పాపం పట్ల భయం, పుణ్యం పట్ల మోహం పెంచుకోవాలి. ఎట్టి పరిస్థితులలోనూ తప్పుడు పనులు చేయకుండా చూడమని ఆ దైవాన్ని ప్రార్ధించాలి!స్త్రీ, పురుషుల సంయోగమే మానవజన్మకు మూలకారణం. నిజానికి ఇది భౌతిక పరమైన జవాబే కానీ, సరైనది కాదు. చేసుకున్న పాప, పుణ్యాల, కర్మ ఫలాల అనుభవం కోసమే ఈ జన్మ అనేది నిజమైన జవాబు. అందరినీ వెంటనే వేధించే ప్రశ్న ఏమిటంటే, ఈ కర్మ ఫలాల అనుభవం ఎంతకాలం అనుభవించాలని! చేసిన పాప, పుణ్యాల ఫలాన్ని అనుభవించి తీరవలసిందే. అయితే, ఈ సమాధానం అందరికీ తృప్తిని ఇవ్వకపోవచ్చు! దీనికి సరైన జవాబు చెప్పే సామర్థ్యం భగవద్గీతకు మాత్రమే ఉంది.
కర్మణ్యే వాధికా రస్తే మా ఫలేషు కదాచన ।
మా కర్మ ఫల హేతురభుహ, మాఁ తే సంగోత్స్వ కర్మణ్యే। (భగవద్గీత- సాంఖ్య యోగము) అని భగవద్గీత చెబుతుంది. దీని వివరణ ఏమిటంటే, కర్మలు చేయటంలోనే మనకు అధికారం ఉంది. కానీ ఆ కర్మ
ఫలాలపైన ఎన్నటికీ ఉండదు. కర్మ ఫలానికి మనం కారకులం కాకూడదు. అలాగని కర్మలు చెయ్యటము మానకూడదు. ప్రతి కర్మకి ప్రతిఫలం ఉంటుంది. దాన్ని అనుభవించి తీరాల్సిందే .ఒక్కొక్కసారి సత్కర్మల వల్ల కూడా దుష్ఫలితాలు వస్తాయి! సంతానం కావాలని నోములు, వ్రతాలు చేసినప్పటికీ దుష్ట సంతానం కలగవచ్చు! ప్రతి జీవి మరల తిరిగి జన్మించడానికి అసలు కారణము ఆ జీవి అంతకు ముందు చేసిన కర్మ ఫలాలే. పాపానికి దుఃఖము, పుణ్యానికి సుఖము అనుభవించాలి. కర్మ సిద్దాంతాన్ని నాస్తికులు, భౌతికవాదులు నమ్మరు. అబ్రహమిక్ మతాల (క్రైస్తవ మతం, ఇస్లాం మతం) ప్రకారం మనిషి చేసే ప్రతి చర్య భగవంతుని నిర్ణయాలే. భగవంతుడే అవి చేయించాడని వారి నమ్మకం. విధిరాతనే వారు కర్మగా భావిస్తారు. కానీ హిందూ మతం ప్రకారం కర్మలు చేయటమే మన విధి. కానీ వాటి ఫలితాలను అనుభవించటం మాత్రం దైవ నిర్ణయం! మనిషి ఆధీనంలో కర్మ , భగవంతుని ఆధీనంలో కర్మఫలం ఉంటాయి. ఎవరు చేసిన పాప పుణ్యాలు వారే అనుభవించాలి. తల్లితండ్రులు చేసిన పాపం పిల్లలకు సంక్రమిస్తుందనడంలో నిజం లేదేమో! ఈ కర్మలు మూడు రకాలు(త్రివిధ కర్మలు). అవి-- సంచిత కర్మలు అంటే పూర్వ జన్మలో చేసినవి, ప్రారబ్ధ కర్మలు అంటే ఈ జన్మలో చేసేవి, ఆగామి కర్మలు అంటే ముందు జన్మలలో చేసేవి.'చేతులారా చేసుకున్న జీవితం' అని తెలిసో తెలియకో పండిత పామరులు వేదాంతాన్ని యధార్థంగా చెబుతుంటారు. ఈ జీవితం భగవంతుడిచ్చిందే
అయినప్పటికీ పాప పుణ్యాల విచక్షణాధికారం మాత్రం మన చేతుల్లోనే ఉంది.
బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః |
లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా || (భగవద్గీత 5-10)
ఈ శ్లోకం వివరణ ఏమిటంటే, ఎవరైతే తాము చేస్తున్న కర్మలను పరమాత్మకు సమర్పించి, ఆ కర్మలయందు ఆసక్తిని విడిచి ఆచరిస్తారో, అటువంటి వారిని తామరాకు మీద నీటి బిందువు లాగా పాపం అంటుకోదు. కర్మఫలం మీద ఆసక్తిని గాని … కోరికను గాని … లేకుండా కర్మలు చేస్తూ ఉంటే … కర్మతో బంధం ఏర్పడదు. కర్మతో బంధం ఏర్పడకపోతే కర్మఫలితాలు అయిన పాప, పుణ్యాలు మనల్ని అంటుకోవు. ఈ భౌతిక ప్రపంచంలో పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే సంసారంలో నివశిస్తూ కూడా జ్ఞాని అయినవాడు తాను ఆచరించే ‘ నిష్కామ కర్మాచరణ’ విధానం ద్వారా పాపపుణ్యాలు … మొదలైన ద్వందాల నుండి విముక్తుడై, స్వేచ్ఛగా జీవితాన్ని గడుపుతాడు. మానవుడు అనేక జన్మల నుండి ఈ లోకానికి వచ్చినవాడే. కర్తగా, భర్తగా, తల్లిగా అనేక పాత్రలలో నివసిస్తూ ఉంటాడు. బాటసారి సినిమాలో భానుమతి, జిక్కీ గార్లు పాడిన ఒక పాటలో సృష్టిలోని వైరుధ్యాలను గురించిన ప్రస్తావన ఉంది. వెలుతురును ఇచ్చిన దేవుడే చీకటినెందుకు సృష్టించాడు? చూపును ఇచ్చిన దేవుడే అంధులను ఎందుకు సృష్టించాడు? ఇలా వేదాంత ధోరణిలో ఆ పాట సాగుతుంటుంది. అవన్నీ కూడా సృష్టి రహస్యాలు. వాటిని గురించి అన్వేషించి కూడా ప్రయోజనం ఏమీ ఉండదు. ఇచ్చిన జీవితాన్ని ఆనందంగా గడపటమే జీవిత పరమావధి కావాలి! సృష్టిలో ఏ లోపం ఉండదు. ఉండేదంతా మన దృష్టిలోనే! లోకంలో ఎవడు ఎటువంటి కర్మ ఆచరించాడో వాడు ఆ కర్మఫలం అనుభవింపక తప్పదు. ‘‘అవశ్య మనుభోక్తవ్యం కృతా కృత కర్మఫలం’’ అనే సూక్తి నూటికి నూరు పాళ్ళు నిజం!
తామరాకు మీద నీటిబొట్టులాగా జీవించటమే కర్మయోగం!