మంచి కవిత్వానికి నికషోపలాలు రెండు....
ఒకటి: భావనలో మన స్వంత ఊహ అనిపించే కొత్తదనం! అది మూలశక్తి! రెండు: మాటల్లో బలంగా హత్తుకొనేలా చెప్పే సందేశం, ఆలోచన! అక్కడ నైపుణ్యం. వాటినే "శక్తిర్నిపుణతా" అని కలిపి కవితాప్రతిభని నిర్వచించారు పూర్వులు !
పై రెంటికంటే మరొకటి అతి ప్రధానమన్నారు--అది: రసాత్మికత!
అంటే అనుభూతిని పొంది, పొందించగలిగే శక్తి! మాటల్లో అనుభూతిని పండించగలిగే ప్రతిభ!!
పై మూడూ ఉన్నదే మంచి కవిత్వం! పేరున్నవారు రాసేదే కవిత్వం కాదు, పేరుతో నిమిత్తం లేకుండా పై మూడింటి పేర్మిని చూపేది కవిత్వం! మిత్రులు రామానుజరావుగారి ఈ కవితాసంపుటిలో ఆ మూడూ పుష్కలంగా ఉన్నాయి.
" హింస ఒక వ్యసనమైతే
బోధివృక్షాల వేళ్ళు తెగుతాయి
చంపడమొక నాగరకత అయితే
సబర్మతీతీరాలు, స్వాతంత్ర్యాలు అనర్హమౌతాయి.."
ఇందులోని రెండో కవితలోనే కనిపించే పంక్తులు ఇవి...చదివిన వెంటనే గుండెల్లో గుచ్చుకొనేలాటి బాధాతప్త అనుభూతి; భావనలో, దాన్ని వ్యక్తబరిచే ప్రతీకల్లో స్వంతదనం; అన్నిటికీ మించి అక్కడ నిలిపి ఆలోచింపచేసే పదును----- పైన పేర్కొన్న మూడు అంశాలు ఒక్కచోట అగుపిస్తాయి. మంచి కవిత చదివామనే తృప్తి కలిగిస్తాయి.
రసజ్ఞులయిన పాఠకులకు కావలసింది అవే! కవి పేరు, పెంపులు కాదు! తరచూ ఎవరు రాశారా అన్నది చూస్తూ, ఎలా రాశారా అన్నది పట్టించుకోని కాలంలో ఉన్నాం మనం! ఈ కవితలు రాసిన రామానుజరావు గారు, దగ్గరగా తెలిసినవారికి సుందరం గారు కవిలోక ప్రసిద్ధులు కాదు. ప్రసిద్ధులంటే పదే పదే రాస్తూ, పది సంపుటాలు వేసుకొన్నవారనీ, ప్రసిద్ధులు కానివారంటే అప్పుడప్పుడు తమకోసం మాత్రమే తాము రాసుకొంటూ అరా కొరాగా ప్రచురించేవారు, మిత్రులతో పంచుకొనేవారనీ నా భావం. ఇంతకాలం అలా పంచుకొన్నవాటిని ఇప్పుడు ఈ-పుస్తక రూపంలో పెడుతున్నారు సుందరంగారు!!
చిన్నప్పుడే అన్నగారితో కలిసి సాహితీసాధన మొదలుపెట్టినా, తర్వాత జీవితంలో బ్యాంకు ఉద్యోగంలో చేరినందుకు కాబోలు దాన్ని అలా ఫిక్సెడ్ లో పెట్టి, రిటైరయ్యాక ఇప్పుడు తీరిగ్గా కవితాపింఛను డ్రా చేసుకోవడం మొదలెట్టారు, తుర్లపాటి సుందర రామానుజరావుగారు.
అప్పుడెప్పుడో ఫిక్సెడ్ చేసుకొన్నందుకు గుర్తుగా పిట్ట, చెట్టు, ఆకాశం, వసంతం వంటివి ఇందులోఉంటాయి. అయితే కవి భావన వాటి మీద వాలి అక్కడే ఆగదు. నేలమీదకు దిగి కటికరాళ్ళ నిజాల మీద నడుస్తుంది. నెత్తురోడే వాస్తవ విషాదాలను వినిపిస్తుంది. ఇందులో మొదటి కవిత పేరు "వసంతరాగం" . ఆ తర్వాత ఉన్న రెండోదాని పేరు " గుజరాత్ గాయం" ! కాల్పనికత ('రమ్యాంతికత'--నా అనువాదం), వాస్తవికతల సమన్వయంలో, సమరసతలో అచ్చమైన కవితాశక్తి దాగుంటుంది. అనుభూతిని, ఆలోచనను పురివిప్పించే బలం ఒదిగి ఉంటుంది. ఆ రెండిటిని సమాంతరంగా స్వంత --కొత్త--పదచిత్రాలతో నడిపించే నేర్పు సుందరంగారికి సహజంగా, బలంగా ఉంది. అందుకే, కష్టపడి సృష్టించినట్లు కాకుండా, అలవోగ్గా, అప్రయత్నంగా జారిపడ్డట్లుంటాయి ఆ పదచిత్రాలు. ఉదాహరణకు " ఓ నిట్టూర్పుకు / గాలి వంకర్లు పోతుంది " అని మొదలయ్యే "సమాంతర రేఖ" అనే పేరున్న కవితే,
" కాలం ఒక స్కేలుబద్ద
సమాంతర రేఖ
గీస్తూనే ఉంటుంది "
--అని ముగుస్తుంది. ఈ చక్కటి మాటల్నే కొద్దిగా మారిస్తే , మంచి కవిత్వంలో ఎప్పుడూ ---
భావనస్కేలుబద్దయి/ కాల్పనికత, వాస్తవికతల మధ్య/
సమాంతర రేఖ / గీస్తూనే ఉంటుంది."
అలా సమాంతరాలుగా, మొదట పేర్కొన్న మొదటిరెండు లక్షణాలు జాలువారి రసాత్మకంగా పరిణామం పొందుతాయి. ఆ రసాత్మక పరిణామానికి మరో పేరే 'ఆర్ద్రత'! సుందరం గారి కవితల్లోని ప్రాణలక్షణం అదే! ఒక మంచి దృశ్యం చూసినా, మంచి శబ్దం విన్నా, మంచి పుస్తకం చదివినా ద్రవించిపోయే ఆర్ద్రత. మాటలు నేర్చిన మామూలు మనిషిని కవిగా మార్చే జీవలక్షణం ఆ ఆర్ద్రత!
--" ఎక్కడో (మొదలయ్యే) ఒక తీయని రాగం / ఏడురంగుల ఇంద్రధనుస్సుగా మారి/ రెప్పల దోసిళ్ళలో జారి/ తన్మయత్వంగా తడిసి / బాష్పమై మురుస్తుంది..." అని మొదలయ్యే " ఆర్ద్రత" అనే కవిత ఆయన ఈ కవితాలక్షణాన్ని:
-- " నా నరాల తీగెలను మీటే
ఆర్ద్రతే నా రస దృష్టి
అదే నాకసలైన స్ఫూర్తి " -- అని ప్రస్ఫుటంగా ప్రకటిస్తోంది. ఆపాదమస్తకం కదిలి కరిగించే ఆర్ద్రతను " నరాలతీగెలను మీటే " అనే మాటతో చిత్రించడం గొప్ప భావుక దృష్టి!
ఈ ఆర్ద్రత ప్రతి కవితలో అగుపించే జీవలక్షణమైనా దీనికి పరాకాష్ట పంక్తులు అమ్మానాన్నల మీద కవితల్లో మరింత సున్నితంగా కనిపిస్తాయి.
" నాన్న" అనే కవిత ముగింపు......
--- " తలచుకొంటే చాలు
నా కళ్ళ నిండే నీళ్ళు
కన్నతండ్రి ఆనవాళ్లు " -- చాలా సరళంగానే అయినా, పరమార్ద్రంగా ఉంది! ఇలాటి చోట్ల పదచిత్రాల ప్రదర్శన కవిత్వమనిపించు కోదు, ఇలా సహజంగా పలికే ఆర్తే కవిత్వమౌతుంది! ప్రతి కవితలోనూ దాదాపు ఆ ఆర్తినే సహజ సుందరంగా పలికిస్తారు సుందరం గారు. స్వంత కవితైనా సరే! "భర్తను కోల్పోయి", "ఒక దుఃఖగీతం" వంటి అనువాద కవితలైనా సరే!
ఈ సంపుటి ఓ కదంబం లాటిది. ఇందులో 27 తెలుగు కవితలున్నాయి, 12 ఆంగ్ల కవితలున్నాయి. తెలుగులో నాలుగైదు అనువాద కవితలు. ఏవీ అనువాదంలా ఉండవు. అలా అగుపడనివ్వని సుగుణం, ఆ ఆర్ద్రతా లక్షణమే! కుష్టు యువతి అనువాదంలో కలిసిపోయే అనువాదకుడి లలితార్ద్ర హృదయ ధర్మానికి, కవితా సామర్థ్యానికీ అదో మచ్చుతునక. ఆంగ్లంలో కూడా అదే లక్షణం స్పృశిస్తుంది.
వీరసైనికుడు కవిత మరో పార్శ్వాన్ని మిగిలినవాటికంటే బలంగా ఆవిష్కరిస్తోంది .
నాలుగు కాళ్ళను తానే తగిలించుకుని
రేపటి ఆశల చేతులు చాపి
అతడి వదనాన్ని నిమురుతూ
ఆమె
విజయ సారధిగా
రోజూ మా ఇంటి ముందు
సాగి పొతుంది.
ప్రతీక అసలైన శక్తి శోభించేది, ఒక నియత సందర్భంలోకి కుదించకుండా, దాన్ని 'ఓపెన్' గా ఉంచినప్పుడే! కవిత్వంలోని అసలు శక్తి సాందర్భికతలో కాదు, సార్వత్రికతలో ప్రజ్జ్వలిస్తుంది! ముంబైలో జరిగిన ఓ సంఘటన సందర్భంగా రాసిన " పారేనదికి పొగ ఎందుకన్నా " అనే ఓ కవిత ఇందులో ఉంది. ఆ సందర్భంతో నిమిత్తం లేకుండా, దాన్నో ప్రతీకాత్మక కవితగా చూస్తే, నేల ఎల్లల శప్తుడు ఎక్కడున్నా అతడి వేదనకో అద్భుత అభివ్యక్తిగా ధ్వనిస్తుంది!
" మాకున్న ఆస్తి నాస్తి
ఈ దేశంపై మమకారం జాస్తి
పొరుగుతల్లి అరువు బిడ్డలనొద్దు
ఉన్న ఊరు వదిలి పొమ్మనద్దు
... ... ...
గంగ అన్నా, గోదావరి అన్నా
పారే నదికి పొగ ఎందుకన్నా! "
మంచి కవిత్వం నుంచి, కళ నుంచి కోరుకొనేది, ఈ అర్థవంతమైన సాంత్వన, సందేశం, స్ఫూర్తి!
వాటినే తన నిరాడంబరమైన మాటల్తో ఆర్ద్రంగా ఇందులో అందిస్తున్నారు సుందర రామానుజరావుగారు!