''ఉద్ధతులు కారు బుధులు సమృద్ధి చేత'' అన్న భర్తృహరి సుభాషితానికి నిలువెత్తు నిదర్శనం ఆ సోదరీ ద్వయం మలయమారుతం వీస్తుంది. మల్లియ పూస్తుంది. మత్తకోకిల మనోజ్ఞంగా గానం చేస్తుంది. లోకం యావత్తూ పులకించి మైమరుస్తుంది. కాని మారుతం, మల్లియ, మత్తకోకిల ఏం హడావుడి చెయ్యవు. తమదారిన తాము అత్యంత సహజంగా తమ పనిని తాము చేసుకుంటూ పోతాయి. సరిగ్గా అదే వైఖరి ఆ సోదరీమణులది.
వారి సంగీత పరిజ్ఞానం అపారపారావారం. ప్రదర్శనా ప్రతిభ అసమానం. శిష్యవాత్సల్యం అనుపమానం. బోధనాచాతుర్యం అనితరసాధ్యం. వారే మా గురుయుగళం హైదరాబాద్ సోదరీమణులుగా పేరుపొందిన లలితా హరిప్రియగార్లు.
సంగీత కుటుంబంలో పుట్టిన ఈ సోదరీమణులు బాల్యం నుంచీ సంగీత నేపధ్యంలోనే పెరిగారు. తల్లి శ్రీమతి సరోజగారు కర్ణాటక సంగీతంలో సుశిక్షితులైన గాయని, తండ్రి ప్రభుత్వంలో ఉన్నతస్థాయి ఉద్యోగి. సంగీత ప్రియులు. ఎనిమిది మంది అక్కచెల్లెళ్ళు. అందరూ సంగీతంలో నిష్టాతులే. ఇద్దరు సోదరీమణులు టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణులు.
మంచి సంగీత నేపధ్యంలో పుట్టి పెరిగినా బాల్యంలో వీరికి సంగీత శిక్షణ అంత ఇష్టంగా ఉండేదికాదట. ఒక శిక్షగా భావించేవారట. తోడి పిల్లలందరూ హాయిగా ఆడుకుంటూంటే వీళ్ళు సీరియస్‌గా పాడుకుంటూ (సంగీతభ్యాసం) ఉండవలసి వచ్చేది మరి. వీరు క్రమశిక్షణతో సంగీతాభ్యాసం చేయడానికి కారణం వారి తల్లి సరోజమ్మగారు. ఇప్పటికీ వారు ఈ సోదరీమణులకు సంగీతం విషయంలో సూచనలిస్తూంటారు. ''మా అమ్మను మెప్పించడం అంత సులభమయిన విషయం కాద'' అంటారీ సోదరీమణులు.
హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన ఈ సోదరీమణులు రోజరీ కాన్వెంట్‌లో ప్రాథమిక విద్యనూ కోఠీ విమెన్స్ కాలేజ్‌లో ఉన్నత విద్యనూ అభ్యసించారు. లలితగారు ఆర్ట్స్ విద్యార్థిని కాగా హరిప్రియగారు బి.ఎస్.సి. చదివారు. చదువులో కూడా చురుకుగా ఉండేవారు. హరిప్రియగారికి మెడికల్ కాలేజ్‌లో సీటు వచ్చినా వారి తండ్రిగారు మెడిసిన్ చదవడానికి ఒప్పుకోలేదట. ప్రతి సంవత్సరం దేశంలో వందలకొద్దీ డాక్టర్లు తయారవుతారు. అదే సంగీత కళాకారుల విషయానికొస్తే సుశిక్షితులైన విద్వాంసులను వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. సంగీత సరస్వతీ కటాక్షం అందరికీ దొరకదు. దొరికిన ఆ వరాన్ని సార్థకం చేసుకోవడం నీ బాధ్యత అని నిర్దేశించారట. చాలా మంచి పని చేసారాయన. లేనిపక్షంలో మనం ఒక అద్భుత మయిన సంగీత కళాకారిణిని ముఖ్యంగా గురువును కోల్పోయి ఉండేవాళ్ళం.
ఎనిమిది మంది తోబుట్టువుల్లో లలిత గారు పెద్దవారు. హరిప్రియగారు రెండవవారు. ఇద్దరికీ వయసులో తేడా ఒకటిన్నర సంవత్సరాలు. సంగీతంలో వీరిది అలత్తూరు సాంప్రదాయం. వీరి గురువులు శ్రీ టి.జి. పద్మనాభంగారు. వీరు అలత్తూరు వెంకటేశంగారికి ప్రత్యక్ష శిష్యులు. వీరు వీరి గురువుగారైన టి.జి. పద్మనాభన్ గారి వద్దనేకాక, వివిధ శాఖలలో పేరొందిన వారి వద్ద కూడా రకరకాలైన రచనలను అభ్యసించారు. వారిలో పాపనాశం శివన్‌గారి ప్రత్యక్ష శిష్యులైన శ్రీ సత్తలపతి బాలసుబ్రహ్మణ్యం గారి వద్ద తమిళంలో కీర్తనలను శ్రీ ఎమ్.ఎస్. సుబ్రహ్మణ్యంగారి వద్ద అపురూప కీర్తనలను శ్రీ ఎన్.ఎస్. శ్రీనివాసన్ వద్ద, శ్రీ టి. విశ్వనాథన్ గారి వద్ద అభ్యసించారు. వీరికి సంగీత కళానిధి శ్రీ పినాకపాణిగారు స్వయంగా ఎన్నోసార్లు ఎన్నో కృతులను బోధించడం జరిగింది.
కర్ణాటక సంగీతంలో నిష్ణాతులై పేరు ప్రతిష్టలు సంపాదించాక హిందూస్తానీ సంగీతం మీద మక్కువతో ఆ శాఖను కూడా అభ్యసించారు. వీరికి హిందుస్తానీ సంగీత గురువు శ్రీ యు.వి. రాజూర్కర్‌గారు.
కలిసి సంగీతాభ్యాసం చేసిన ఈ సోదరీమణులిద్దరూ ప్రతిభావ్యృత్పత్తులలో సమ ఉజ్జీలు. 14 సంవత్సరాల ప్రాయంలోనే లలితగారు ఆల్ ఇండియా రేడియో నిర్వహించిన శాస్త్రీయ సంగీత పోటీలలో ప్రథమ బహుమతి పొందితే మరుసటి సంవత్సరమే హరిప్రియగారు దానిని సాధించారు. రూపురేఖలలో మరీ అంత ఎక్కువ పోలికలు లేకపోయినా ఇష్టాయిష్టాలు మాత్రం వీరిద్దరికీ ఒకటే. కాకపోతే లలితగారు ప్రతి మధ్యమరాగాలు ఇష్టపడితే హరిప్రియగారు శుద్ధమధ్యమ రాగాలను ఎంచుకుంటారు. కలిసి ప్రదర్శనలిచ్చే వీరు కచేరీలలో రాగాలాపన కూడా కలిసి (ఒక ఫ్రేజ్ ఒకరు పాడితే మరొకటి ఇంకొకరు పాడతారు.) చేయడం విశేషం. అపూర్వరాగాలలో నెరవల్ గానం - పంచ నడపల్లవి - నాలుగు కళలచౌకపల్లవులు వీరి ప్రత్యేకతలు. వీరి కచేరీలలో ప్రేక్షకులు సమ్మోహితులు కావడం సర్వసాధారణం. వీరి గానంలోని ప్రత్యేకత సంగీతజ్ఞులకే కాక సంగీత విద్యార్థులు కూడా అర్థం చేసుకోగలిగే సులభ రీతిలో ఉండడం. వీరికి సంగీతంపట్ల అకుంఠిత దీక్ష అంకిత భావము ఆదర్శప్రాయము. అందరూ (విద్యార్థులు) అనుసరించదగినది.
ఆకాశవాణి 'టాప్ ఎ గ్రేడ్' కళాకారిణులైన ఈ సోదరీమణులు జంట నగరాలలోని ప్రభుత్వ సంగీత కళాశాలలో అధ్యాపకులుగా పనిచేసి వేలకొద్దీ శిష్యులను తయారుచేసారు. లలితగారు 2009లో పదవీ విరమణ చేయగా హరిప్రియగారు త్వరలోనే రిటైర్ కాబోతున్నారు. వెయ్యిమందికి పైగా శిష్యులున్న గురువులను మహామపాధ్యాయులంటారట. ఆవిధంగా చూస్తే వీరిద్దరూ ఆ బిరుదును ఎప్పుడో పొందారు. సంగీత శిక్షకులుగా వీరిది చాలా ప్రత్యేకమయిన శైలి. విజయానికి నిరంతర కృషి - సాధన తప్ప అడ్డదారులు లేవని వీరి నమ్మిక. తమకు తెలిసిన విద్యనంతా శిష్యులకు నేర్పాలన్న తపన స్పష్టంగా కనిపిస్తుంది. పాఠాలను ఫార్ములా పద్ధతిలోగాక కూలంకుషంగా నేర్పుతారు. పాఠం మొదలయితే అలా సాగుతూనే ఉంటుంది. ఇన్ని గంటలే నేర్పాలన్న నియమంలేదు. (గంటలను రూపాయల్లో కొలిచే అలవాటులేదు.) అధిక ప్రసంగాలూ అనవసర ప్రసక్తులూ అసలే ఉండవు. ప్రతి పాఠం సంగీత సరస్వతీ పాదార్చనకు ఒక మంత్ర పుష్పం అన్నట్టు సాగుతుంది. వీరి శిష్యరికం లభించడం నిజంగా పూర్వజన్మ సుకృతం.
మద్రాసులో ప్రతి ఏటా డిశంబర్ నెలలో జరిగే సంగీతోత్సవాలలో పాడడానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆహ్వానాన్నందుకునే కొద్దిమంది సంగీత విద్వాంసులలో తప్పనిసరిగా ఈ సోదరీమణులు ఉంటారు. ఈ సంగీతోత్సవాలలో ఇతరుల కచ్చేరీలకు తప్పనిసరిగా వీరు హాజరుకావడం మరో విశేషం.
భారతదేశంలోని ప్రసిద్ధమయిన సంగీత సభలన్నిటిలోనూ ఈ సోదరీమణులు కచేరీలు చేసారు.
ఇక పురస్కారాల విషయానికి వస్తే - మొట్టమొదటిసారిగా వీరికి ''నాదభగీరధ'' అన్న బిరుదప్రదానం చేసినది పారుపల్లి రామకృష్ణయ్య సంగీత సభ - విజయవాడవారు. తరవాతి కాలంలో మద్రాస్ మ్యూజిక్ అకాడమీ నుంచి రాజా అన్నామలై అవార్డు - తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ''సప్తగిరి సంగీత విద్వస్మణి'' కృష్ణగానసభ, చెన్నై నుండి ''సంగీత చూడామణి'' బిరుదలను పొందారు. ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంవారు రాజీవ్ ప్రతిష్టా పురస్కారంతో ఈ సోదరీమణులను సత్కరించారు.
ఒకవిధంగా కర్మయోగులు వీరు. దూషణ భూషణలను మనసుకు పట్టనీయరు. పాడడం వారి ప్రవృత్తి కనక పాడతారు. నేర్పడం వారి వృత్తి (ఇష్టం కూడా) కనక నేర్పుతారు. అంతకుమించి వారికే ప్రమేయంలేదు ప్రాపకం అంతకన్నాలేదు. ఆంధ్రప్రదేశం సంగీత ప్రపంచానికిచ్చిన రెండు అనర్ఘరత్నాలు ఈ సోదరీమణులు.