నాకునచ్చిన కథ
పువ్వుల జడ
కథారచన - అపర్ణ మునుకుట్ల గునుపూడి
శీర్షిక నిర్వహణ: తమిరిశ జానకి

పెద్ద క్లాసులకి వచ్చిన మంజుల స్కూలు నుంచి ఉత్తరం వచ్చింది. ఏమిటి అయ్యుంటుందా అని తల్లి శ్యామల తెరిచి చూస్తే స్కూల్లో కౌన్సిలింగ్ సర్వీసెస్ ఉన్నాయి. పిల్లను తీసుకుని కౌన్సిలర్ ని చూడమని, ఫలాన తేదీకి రమ్మని ఉంది. పిల్ల గురించి కౌన్సిలింగ్ ఏమిటి? కూతురు ఏం కొంప ముంచిందో అనుకుంటూ భర్త రాజుతో చెప్పింది. రమ్మన్నారు కనక వెల్లడమే అన్నాడు రాజు. కౌన్సిలింగ్ అనగానే కొంచెం ఖంగారు కలగడం వల్ల ఆ రోజు కోసం కాస్త ఆదుర్దాగా ఎదురు చూసింది. ఎదురు చూసిన రోజు రానే వచ్చింది.

ముగ్గురూ కలిసి స్కూలుకి వెళ్ళేరు. ఏం చెబుతుందో అనుకుంటూ మిస్ మార్షల్ ని కలిశారు. పరిచయాలు అయ్యేక ఆవిడ మెల్లగా పదమూడేళ్ళనించి పదహారేళ్ళ వయసు పిల్లలని ఎలా పెంచాలి, వాళ్ళు ఎలాంటి ఇబ్బందులని ఎదుర్కొంటారు, అబ్బాయిల గురించి, వాళ్ళ ప్రేమల గురించి, వాళ్ళ మనసులో ఏముందో, ఎలా తెలుసుకోవాలో, వాళ్ళతో ఎలాగ మాట్లాడాలో, ఆ మాట్లాడడంలో సంబంధాలు తెగిపోకుండా ఎలా ఉంచుకోవాలో వివరంగా చెప్పింది.

ఆవిడ చెప్పినవన్ని విని బయటకి వస్తూ ఉంటే, తన చిన్నప్పటి విషయాలు గుర్తొచ్చాయి.

తన స్కూలునించి ఇంటికి వచ్చేటప్పటికి ఓ పన్నేండేళ్ళ పిల్ల అమ్మ దగ్గరికి వచ్చి

" అత్తయ్యగారు, రేపు నాకు పువ్వుల జడ వెయ్యరూ? ఏం పువ్వులు కావాలో చెబుతే రేపు మానాన్న తెచ్చిపెడతానన్నారు" ప్రాధేయపడుతూ అంటోంది.

"ఇప్పుడు పువ్వుల జడ ఎందుకే పావని?" అడిగింది, అమ్మ.

"మరేమో మొన్న గుడికి వెళితే అక్కడ ఒక అమ్మాయి వేసుకుని కనిపించింది. నేనేమో మా అమ్మని నాకు కూడా వెయ్యమని అడిగేను. అమ్మేమో మన పేటలో ఎవరికి పువ్వుల జడ కావాలన్నా కమలత్తయ్య గారే వెయ్యాలి. ఆవిడకి ఎపుడు వీలో కనుక్కో, అప్పుడు ఏం కావాలో అడిగినాన్నని తెమ్మందాం అన్నది. అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను" అంది పావని.

"అదా సంగతి, సరే ఇప్పుడు నీకేం జడ కవాలనుకుంటున్నావు?" పిల్ల జడలకేసి చూస్తూ అడిగింది అమ్మ.

పావని తడుము కోకుండా "మల్లెపువ్వుల జడ కావాలంది."

"అబ్బో! మల్లెల జడే, మల్లెలంటే వేసంకాలం అయితే మంచి జడ మల్లెలు దొరుకుతాయి. ఇప్పుడు ఆస్వీజ మాసం వచ్చిందికదా. చామంతులయితే బాగుంటాయి" అన్నది అమ్మ.

"ఓ అలాగే, చామంతులు తెమ్మని మా నాన్నకి చెప్పనా!" సంతోషంగా అంది పావని.

"ఆగుపిల్లా, మామూలు చామంతులు కాదు. ఒకటిన్నర శేరు నక్షత్ర చామంతులు తెమ్మని చెప్పు. చామంతులకి మాచిపత్రి ఆకులు అందంగా ఉంటాయి. వాటి సువాసన చక్కగా జుట్టుకి పడుతుంది. అవో గుప్పెడు తీసుకుని రమ్మను. స్కూలు అవంగానే వచ్చేయి. జడగంటలు ఉన్నాయా?"

"ఉన్నాయండి."

"అయితే అవి పట్టుకుని మరీ రా" అంటూ లోపలికి వెళ్ళిపోయింది.

పావని వాళ్ళమ్మగారు చెప్పినట్టు ఊళ్ళో ఎవరికి పువ్వుల జడ కావాలన్నా మా అమ్మ దగ్గరకే వచ్చేస్తారు. అమ్మకి పిల్లలకి పువ్వుల జడలువెయ్యడం మహా సరదా. పువ్వుల జడ సరంజామా అంతా ఒక బుట్టలో జాగ్రత్తగా పెట్టి అటక మీద పెట్టుకుంది. ఎవరికైనా జడ గంటలు లేనివళ్ళకోసం ఒక ఉమాగోల్డ్ జడ గంటలు, బారుగా జుట్టులేని వాళ్ళ కోసం రెండు సైజుల్లో సవరాలు, రంగు రంగుల దారాలు, పెద్ద సూదులు తనే కొనుక్కుని పెట్టుకుంది.

మర్నాడు అనుకున్నట్టు పావని పువ్వులూ, జడగంటలూ, అన్నీ తీసుకొని వచ్చింది. నాకు పనేం లేకపోతే అమ్మకి సాయం చెయ్యమనేది. పదేళ్ళ పిల్లని, నాకేం పనుంటుంది? కనక, అమ్మకినేనే ఎప్పుడూ సహాయకురాలిని. పువ్వులకి సమానంగా తొడిమలు తుంపడం, వాటిని సైజు వారీగా పెట్టడం, అలాంటి పనులు చేసేదాన్ని. అమ్మ పనులన్నీ ముగించేసుకుని తయారుగా ఉంది. పావని రాగానే

" పావని పువ్వులన్నీ ఇక్కడ పెట్టి పెరట్లోకి వెళ్ళి కాళ్ళూ చేతులూ, మొహం కడూక్కుని రామ్మా" అంటూ

"శ్యామలా పావనికి పెరట్లో స్నానాలగది చూపించవే" అని నన్ను పంపించింది.

పావని రాగానే "ఇలా వచ్చి కూచో, ఓ గంట పడుతుందమ్మా, బుద్ధిగా కూచుంటావా" అంది అమ్మ. అలాగేనన్నట్టు తలూపింది, పావని.

ముందు జడ వెయ్యడానికి తల దువ్వూతూ స్కూల్లో ఎలా చదువుతున్నావూ" అని అడిగింది.

"బాగానే చదువుతున్నానండీ."

"బాగా అంటే ఏమిటీ? సరిగ్గా చెప్పు. నీకేమిటి ఇష్టం?"

"నాకు సాంఘీకం, తెలుగు చాలా ఇష్టం అత్తయ్యగారూ."

"ఇష్టం అంటే ఏం లాభం? పరీక్షల్లో మంచి మార్కులు వస్తున్నాయా?"

"ఆ రెండిట్లలో నాకే ఫస్టు మార్కులండి." అంది.

"మరి మిగతావేం చేద్దాం?" నవ్వుతూ అంది అమ్మ.

"మిగతావాట్లల్లో విశాలాక్షి అని ఒక అమ్మాయికి వస్తాయి. దానికి ఇంగ్లీషులో ఫస్టు మార్కు వచ్చిందని ఎంత గీరో" అంది. జడ వేస్తోంది కనక అమ్మకి పావని మొహంలో భావం కనిపించడం లేదు.

"గీరంటే ఏమిటి పావని?"

"గీరంటే తెలీదాండీ అత్తయ్యగారూ? తనే అందరికన్నా తెలివైనదని అనుకుంటుంది. ఆటలాడుకుంటే అందరూ తను చెప్పినట్టే ఆడాలి. తను చేసింది ఇంకెవ్వరూ చెయ్యకూడదు."

"మరి నువ్వేం చేస్తావు? నీకూ ఫస్టు మార్కులు వస్తున్నాయిగధా"

"నాతో సరిగ్గా మాట్లాడదు. నా స్నేహితురాళ్ళందరినీ నాతో మాట్లాడనివ్వకుండా చేస్తోందండీ. నేను వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళలో వాళ్ళు ఏదో మట్లాడుకుని నా వైపు చూసి గేలి చేసినట్టు నవ్వుకుంటున్నారు. నాకు ఏడుపు వచ్చినంత పనయ్యిందండి" అంది ఉక్రోషంగా.

"మరి వెళ్ళి ఎందుకని అడగక పోయేవా?"

"ఏమో నాకు భయం అత్తయ్యగారూ."

"నీకేం భయం పావని? లక్షణంగా ఉన్నావు. సుభ్రంగా తెలివి తేటలున్నాయి. నిన్ను ఎగతాళి చేస్తే వాళ్ళకే నష్టం కాని వాళ్ళు నిన్నేంచేస్తారు. ఏమైనా చేస్తే పంతులుగారున్నారు. వాళ్ళు కాకపోతే మరొకళ్ళు లేరా? వాళ్ళ మాటలు, చేష్టలు పట్టించుకోక. నువ్వు నీ పని చేసుకుని రా. నువ్వు బుద్ధిగా చదువుకోమ్మా."

"కాదు అత్తయ్యగారు. వాళ్ళందరికి చాలా తెలుసట. నేనేమో చిన్నపిల్లనిట. నాకేం తెలీదన్నట్టు మాట్లాడుతారు. క్రితం పరీక్షల్లో హిందీలో, సైన్సులో కూడా నాకే ఫస్టు మార్కులు వచ్చాయి. ఒక్క ఇంగ్లీషులోనే రెండు మార్కులు పోయేయి."

పిల్ల చెప్పడం చూస్తే అమ్మకేదో అర్థం అయినట్లు, "ఆ పిల్లలంతా ఎంత పొడుగున్నారు పావని," అనడిగింది.

"నాకంటే పొడుగే ఉంటారు."

"చూడమ్మా పావని, ఈ వయసులో ఒక్కొక్కళ్ళూ ఒక్కక్కలా ఎదుగుతారు. వాళ్ళు నీకంటే పొడుగ్గా ఉన్నారని చాలా ఎదిగేం అనుకుంటున్నారు. వాళ్ళ మాటలు, చేష్టలు పట్టించుకోకు"

అంటూ పావనితో ఏవో కబుర్లు చెబుతూనే జడ కుట్టడం ముగించింది. ఇంతమందికి ఇన్ని పూల జడలు వేసే అమ్మ దగ్గర నిలువుటద్దం లేకుండా ఉంటుందా?

జడ ముచ్చటగా కుదిరిందే, పద అద్దంలో చూద్దుగాని అంటూ తలుపుకి అద్దం బిగించి ఉన్న చెక్క బీరువా దగ్గరకి తీసుకెళ్ళి జడ వేపు దానికేసి నించోబెట్టి, చిన్న అద్దం పిల్ల చేతికిచ్చి "చూడు, నచ్చిందా" అంది అమ్మ. పావని మురిసిపోతూ బగుందన్నట్టు తల ఊపింది. "కుందనపు బొమ్మలా ఉన్నావు. వెళ్ళి మీ అమ్మ, నాన్నకి చూపించి తర్వాత ఆడుకో" అన్నది అమ్మ. అలాగేనంటూ అక్కడినుంచి తన సంచీ అవీ తీసుకుని బయలుదేరింది పావని.

ఇది జరిగిన కొన్ని రోజులకి కృష్ణవేణి "పిన్నీ, మా యింటికి మా అత్తయ్యా వాళ్ళూ వచ్చేరు. అత్తయ్య వాళ్ళ ఊళ్ళో మొగలిపూలు విరివిగా దొరుకుతాయట. కొన్ని పట్టుకొచ్చింది. నాకు మొగలి జడ వెయ్యరూ?" అంటూ వచ్చింది. కృష్ణవేణికి పద్దెనిమిదేళ్ళు పైనే ఉంటాయి. రెండిళ్ళవతల ఉండే ప్రసాదరావుగారి అమ్మాయి. చిన్నప్పటి నుంచీ పిన్నీ, పిన్నీ అంటూ వెనకాలే తిరగడం కమలకి అలవాటే. పిల్ల పలచగా, జడ బారుగా ఉంటుంది. "తప్పకుండా!" అంటూ "చుట్టాలెప్పుడు వచ్చేరే కృష్ణవేణీ?" అంది అమ్మ.

"ఇవాళ పొద్దున్న రైలుకి దిగేరు పిన్నీ"

"ఇవాళేనా! అయితే ఫరవాలేదు. పువ్వులు రేపటిదాకా ఉంటాయి. రేపు మధ్యాహ్నంగా వేస్తాను. సరేనా! పువ్వులకి తడిగుడ్డ చుట్టి చల్లని ప్రదేశంలో పెట్టు" అంది. "సరే పిన్నీ" అంటూ వెళ్ళిపోయింది.

మర్నాడు జడ వేస్తూ "కృష్ణవేణీ, ఉట్టి మొగలిపూలేనా లేక మొగలిపువ్వంటి మొగుణ్ణి కూడా తెచ్చిందే మీ అత్త?"

ముందు కొంచెం సిగ్గుపడ్డా రెండు నిముషాలయ్యాక మాట్లాడ్డం మొదలెట్టి

"మా అత్తయ్యకేమో నన్ను కోడలిగా చేసుకోవాలనే ఉంది. కాని..."

" ఊ.. అయితే మరేమిటాలస్యం?"

" ఊహూ! మానాన్నకి ఇష్టం లేదు"

"ఎందుకట!"

"ఏమో మరి. నన్ను వాళ్ళింటికిస్తే, కోరి కష్టాఆల్లోకి తోసినట్టే, అంటుంటారు"

"మీ నాన్న సంగతి సరే. నీ సంగతి చెప్పు. నీకు మీ బావని చేసుకోవాలనుందా!?"

"ఏం పిల్లా! జవాబు రాదేం? మీ బావంటే నీకు ఇష్టంమేనా?"

"ఇష్టమే. కాని మా నాన్న చెప్పినట్టు మా అత్తయ్య బాధలు పెడితే?"

"మీ అత్తయ్యని వదిలేయ్. మీ బావ ఏవంటాడూ!"

"బావకి నేనంటే పంచ ప్రాణాలు"

"మరి నువ్వూ మీ బావా మాట్లాడుకున్నారా?"

"ఆ.. బావేమో" ’అత్తయ్యకి నేనంటే ఇష్టం. మీ నాన్నని నువ్వు ఒప్పిస్తే, ఒక వేళ అత్తయ్య తర్వాత ఏదైనా ఇబ్బంది పెట్టినా మనిద్దరం కలిసి ఎదుర్కోవచ్చును’, అంటాడు. నాన్నని ఒప్పించి చేసుకుని, ఆ తర్వాత బాధపడితే ఎలాగా అనీ ఉంది. ఏం చెయ్యాలో తెలీడం లేదు."

"తర్వాత కష్టాలు వస్తాయని ఎందుకనుకుంటున్నావు. నీకు మంచి మనసుంటే అంతా మంచే జరుగుతుంది కృష్ణవేణీ. నువ్వు చిన్న పిల్లవి కావుగా. నీకూ వ్యక్తిత్వం ఉంది. నువ్వంతగా ఆలోచించగలవు. ఇపుడు ఉన్న పరిస్థితులకి నీకు సమంజసమనిపించిన నిర్నయం తీసుకుంటావు. ఆపైన భగవంతుడున్నాడు. ఒకటి మాత్రం గుర్తుంచుకో. ఒక నిర్ణయానికి వచ్చేక దానిమీద స్తిరంగా ఉండాలి. అటువంటి గుణాలు కలిగినవాడు కనకే శ్రీరాముడు దేవుడయ్యేడు. నువ్వు మళ్ళీ కనక మనసు మార్చుకున్నావంటె నీకు నువ్వే కోరి ఇబ్బందులు తెచ్చుకున్నట్టే. నీ నిర్ణయానికి దృడంగా కట్టుబడి ఉన్నావంటె బయటవాల్లెవరూ నిన్ను ఇబ్బంది పెట్టలేరు. దాంతో వచ్చే కష్టనిష్టూరాలకి తట్టుకోగల శక్తి నీకే వస్తుంది. అరే! మాటల్లోనే జడ అయిపోయింది. మొగలి జడ రెండు మూడు రోజులదాకా బాగా ఉంటుంది. నువ్వు విప్పకుండా ఉంచుకున్నావంటే, ఆ వాసకి జుట్టుకి పట్టి, వారం పదిరోజుల దాకా ఘుమఘుమలాడుతుంది. అంత లోపల మీ బావ మళ్ళీ బోలెడు పూలు తెస్తాడేమో!"

"పో పిన్నీ" అని సిగ్గుపడుతూ అంది కృష్ణవేణి.

"ఆ అలాగే. ఎవరు పోతారో తొందరలోనే తెలుస్తుందిలే" చిలిపిగా చూస్తూ అంది అమ్మ.

***

అప్పటి మధురమైన రోజులు తలచుకుంటూ ఈ నాడు పదిహేనేళ్ళ వయసొచ్చిన తన కూతురుకి జడ వేయించుకునేంత జుట్టూ లేదు, ఆప్యాయంగా పువ్వులజడ వేసేవాళ్ళూ లేరని వాపోయింది శ్యామల.

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)