సరిగ్గా ఏడాది తరవాత......
కమీషనర్ కార్యాలయానికి ఫోన్ వచ్చింది,హోటల్ గ్రాండియోర్ పక్కన ఉన్న స్లమ్స్ అన్నింటిని బలవంతంగా తొలగిస్తున్నారని.వెంటనే మునిసిపల్ కమీషనర్ శివకుమార్ కారులో గ్రాండియోర్ కి బయలు దేరాడు.దారిలో ఇంకో ఫోన్ వచ్చింది,మిత్రా అక్కడ ఉన్నాడని,పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా వెళ్ళద్దని.
"మిత్రానా? ఈ మిత్రా ఎవరు?"అడిగాడు శివకుమార్ ఫోన్లో అవతలి వ్యక్తిని,మిత్రా పేరు వినగానే డ్రైవర్ షేక్ అవడం గమనిస్తూ."సరే పోలీసులని స్పాట్ కి రమ్మనండి" చెప్పి ఫోన్ కట్ చేశాడు"మిత్రా ఎవరో నీకు తెలిసినట్టుందే?" అడిగాడు డ్రైవర్ని శివకుమార్.
"హోంమినిస్టర్ గూండా సార్ వాడు.మనిషిని చంపడం వాడికి టీ తాగినంత తేలిక అని అంతా అనుకుంటూ ఉంటారు సార్"డ్రైవర్ చేత్తో మొహం తుడుచుకున్నాడు.దారిలో పోలీస్ స్టేషన్ దగ్గర ఇద్దరు పోలీసులు ఎక్కారు. వాళ్ళని అదే విషయం అడిగాడు శివకుమార్. వాళ్ళు కూడా అదే విషయం చెప్పారు.ఇంకొక విషయం ఏడ్ చేశారు.వాడి దృష్టిలో పడడం మంచిది కాదని చాలామంది పోలీసులు రావన్నారట. చివరికి సిఐ ఫోర్స్ చేసి పంపించాల్సి వచ్చిందట. మిత్రామీద మర్డర్ కేసులు, ఎసాల్ట్ కేసులు చాలానే ఉన్నప్పటికీ హోమ్ మినిస్టర్ డైరెక్ట్ ఇన్వాల్మెంట్ వల్ల పోలీసులు ఏమీ చేయలేకపోతున్నారంట. వాడిమూలంగా హోమ్ చాలా ఆస్తులు సంపాదించాడని ఆ ఆస్తులన్నింటికీ మిత్రాయే బినామీ అని పోలీసుల కథనం. స్లమ్స్ దగ్గర కారు ఆగింది. కొద్దిగా దూరంలో గ్రాండియోర్ హోటల్ కనబడుతోంది. కారు దిగారు అందరూ. స్లమ్ అంతా హడావుడిగా ఉంది. గుడిసెల్లోంచి సామాను తీసుకుని అందరూ అక్కడే ఉన్న లారీ వైపు వెళుతున్నారు. గుడిసెలే కాకుండా కొన్ని పక్కా ఇళ్ళు కూడా ఉన్నాయి అక్కడ. వాళ్ళ ఇండ్ల ఎదురుగుండా కూడా carriage auto లు, carriage van లు నిలబడి ఉన్నాయి.
"వాడే సార్ మిత్రా" పోలీస్ చూపించాడు శివకుమార్ కి. చూసిన శివకుమార్ కి, బ్లాక్ Audi car బాయ్నెట్ మీద బ్లాక్ జీన్స్, రెడ్ టీ షర్ట్ , కళ్ళకు గాగుల్స్ తో విలాసంగా కూర్చుని ఇళ్ళు ఖాళీ చేస్తున్న అందరికీ సూచనలు ఇస్తున్న మిత్రా కనబడ్డాడు. వెంటనే చక చక అడుగులు వేశాడు. వెనకాలే పరుగెత్తారు పోలీస్ లిద్దరు. దూరంనుంచి తనవైపు వేగంగా వస్తున్న వాళ్ళని చూసిన మిత్రా బాయ్నెట్ మీదనుంచి దిగాడు.
"దగ్గరుండి దర్జాగా ఖాళీ చేయిస్తున్నావే" మిత్రా కళ్ళలోకే చూస్తూ అడిగాడు శివకుమార్
"ఖాళీ చేయించట్లేదు సార్, ఖాళీ చేస్తున్నాను "కూలింగ్ గ్లాస్ సద్దుకుని అమాయకంగా ఫేస్ పెట్టి మాట్లాడాడు మిత్రా"అయినా ఇక్కడి సీన్ అంతా మీకు ఖాళీ చేస్తున్నట్టు అనిపిస్తోందా? తెలుగు సినిమాలు చూడరా మీరు. గిన్నెలు తపేళాలు బయటకు విసిరేయడం, జెసిబిలతో షాపులు, ఇళ్ళు కూల్చేయడం ఇలాంటివేవీ ఇక్కడ జరగట్లేదే ఇక్కడ"
"ఆడి కారులో తిరుగుతున్నావ్. నువ్వు ఈ స్లమ్ లో ఉంటున్నావా?"వ్యంగంగా అడిగాడు శివకుమార్.
"నా కారు కాద్సార్ ఇది.మినిస్టర్ గారిది. ఇల్లు ఖాళీ చెయ్యాలి, కొన్ని ఇంపార్టెంట్ ఐటెమ్స్ ఉన్నాయి .అని రిక్వెస్ట్ చేస్తే ఇచ్చారు"
"ఏంటా ఇంపార్టెంట్ ఐటెమ్స్? హోమ్ గారి బినామీ కదా నువ్వు. ఆ బినామీ ప్రోపర్టీస్ డాక్యుమెంట్సా?"
చటుక్కున కళ్ళజోడు తీసి నవ్వాడు మిత్రా.
"పెద్దవాళ్ళు ప్రూఫ్ లు లేకుండా మాట్లాడకూడదు సార్"
"ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా?"పక్కన పోలీస్ కలగ జేసుకున్నాడు
"తెలుసు. ద గ్రేట్ మునిసిపల్ కమీషనర్ శివకుమార్ గారితో. నలభై ఏళ్ళ వయసు. సినిమా స్టార్ లు, స్పోర్ట్స్ స్టార్ ల ఆటోగ్రాఫ్స్ కోసమే ఎగబడే ఈ నగర ప్రజలు ఈయన అటోగ్రాఫ్ కోసం, కమీషనర్ ఆఫీస్ ముందర, ఎక్కడ కనబడితే అక్కడ ఆటోగ్రాఫ్ కోసం గుమిగూడిపోతారని తెలుసు. ట్రాన్స్ కో సిఎమ్ డి తో మాట్లాడి, సిటీ రద్దీ రోడ్లలో ఎలెక్ట్రిక్ పోల్స్ అన్నీ తీయించి, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ లైన్స్ వేసి, సిటీ అండర్ గ్రౌండ్ ఎలెక్ట్రికల్ సిస్టమ్ ప్రారంభానికి తొలి అడుగు వేసిన మొదటి కమీషనర్. హోమ్ గారు కూడా మిమ్మల్ని కలవమని చాలాసార్లు చెప్పారు, సార్"
ఈ లోపల నెత్తిమీద పెద్దమూట ఏదో మోస్తూ ఇంకొక చేత్తో ఒక పిల్లాడ్ని పట్టుకుని నడిపిస్తున్న ఒక మధ్యవయసామె శివకుమార్ ని ఢీ కొట్టింది. పక్కనున్న పోలీస్ వెంటనే ఆమెను చెయ్యెత్తి కొట్టబోయాడు.
"ఆగు"మిత్రా కంఠం గర్జించింది"చూడలేదు. తెలియట్లేదా?"ఆ కంఠంలో ధ్వనించిన ఆగ్రహానికి వణికిన పోలీస్ చెయ్యి గాల్లోనే ఆగిపోయింది.
"సమించండయ్యా, సూసుకోనేదు" సెప్పిందామె
"ఏయ్ లక్ష్మీ,ఎందుకు ఖాళీ చేస్తున్నావో సారుకి చెప్పు"సైగ చేశాడు మిత్రా
"ఇదంతా మంతి గారి స్థలం అయ్యా, మేం అంతా ఇంతకాలం అక్కమంగా ఉండిపోయినాం. ఇప్పుడింక హాస్పటల్ కట్టిస్తున్నారంట మంతిగారు, అందుకని అందరినీ ఖాళీ చేయమన్నారు. మాకు ఏరే చోట ఇళ్ళు సూపించారయ్యా"చెప్పేసి ముందుకు వెళిపోయిందామె, ఇంకొక సారి క్షమాపణ చెప్పి.
"బాగా చదువుకున్న వాడిలా మాట్లాడుతున్నావే"అన్నాడు శివకుమార్
"మినిస్టర్ గారు కూడా అలాగే అంటారు సార్. కానీ ఈ పోలీస్ లు మట్టుకు రౌడి రౌడి అంటారు సార్. చాలా కేసులు కూడా పెట్టారు. మీరు కొంచెం చెప్పండి సార్ వీళ్ళకి"
శివకుమార్ వెనక్కి తిరిగి వచ్చి కార్లో కూర్చున్నాడు. పోలీసులతో అన్నాడు
"వీడు చాలా ముదురు. హోమ్ మినిస్టర్ సపోర్ట్ ఉన్నంత కాలం వీణ్ణి మీరేం చేయలేరు. వీడికి తెలియని విషయం ఒకటుంది. వీడి అవసరం లేదని హోమ్ అనుకున్న రోజు మీచేతే వీడ్ని ఎన్కౌంటర్ చేయిస్తాడు. అంతవరకే వీడి లెవలు. ఆఫీస్ కి పోనీ"చెప్పాడు డ్రైవర్ తో. ఇంతలో కారు తలుపుమీద ఎవరో చేత్తో కొట్టిన శబ్దం వినబడింది. తలతిప్పి అద్దంలోంచి చూశాడు శివకుమార్. మిత్రా. తలుపు తీశాడు.
"మీ పర్స్ సార్, ఇందాక ఒకామె మిమ్మల్ని ఢీ కొట్టింది కదా, అప్పుడు పడిపోయుంటుంది" పర్సు శివకుమార్ చేతికిచ్చాడు మిత్రా. అప్రయత్నంగా పర్సు ఓపెన్ చేసి చూశాడు శివకుమార్. "ఇక్కడ డబ్బులెవరూ తీయరు సార్"
"నేనెప్పుడు పర్సులో అంత ఎక్కువ డబ్బులేమీ పెట్టను.డబ్బు కోసంకాదు"అంటూనే పర్సులో వెతుకుతున్నాడు శివకుమార్.
"ఈఫోటో కోసమా సార్"మిత్రా చేతిలో ఒక ఫోటో ఉంది. చూస్తూనే "అవును "అంటూ ఫొటో తీసుకున్నాడు శివకుమార్
"క్రింద పడుంది. ఇక్కడ వాళ్ళందరి సంగతి నాకు తెలుసు. వాళ్ళెవ్వరికి సంబంధించినది కాదు. మీదే అయి ఉంటుందని తీశాను"
"థాంక్స్. "చెప్పాడు శివకుమార్. కారు స్టార్ట్ అయింది. ఫొటో పర్సులో తిరిగి పెట్టేముందు ఒకసారి కళ్ళు మూసుకున్నాడు మునిసిపల్ కమీషనర్ శివకుమార్ భక్తిపూర్వకంగా
ఆ ఫోటో ......ద్రోణాచార్యది.
కారు స్పీడ్ గా కమీషనర్ ఆఫీస్ వైపు దూసుకుపోయింది.
* * * * * * * * *
సరిగ్గా ఇంకొక ఏడాది తరువాత.........
సమయం సుమారు తెల్లవారు ఝాము నాలుగు గంటలయి ఉంటుంది. శివకుమార్ ఇంట్లో గాఢ నిద్రలో ఉన్నాడు. హై వాల్యూమ్ లో పెట్టడం వల్లనేమో సెల్ ఫోన్ గట్టిగానే మోగింది. శివకుమార్ ఉలిక్కి పడి నిద్ర లేచాడు. సెక్రెటరి ఫోన్ లో మాట్లాడుతున్నాడు
"సారీ టు డిస్టర్బ్ యు ఎట్ దిస్ అవర్ సార్. గ్రాండియోర్ హోటల్ బ్లాస్ట్ అయిపోయింది. హోటల్ మొత్తం కూలిపోయింది. హోమ్ మినిస్టర్ ఇది టెర్రరిస్ట్ ఏక్ట్ అంటున్నారు."
"ఎవరైనా చనిపోయారా?"
"లేదు సార్. ఫైర్ సేఫ్టీ ఎక్విప్ మెంట్ సరిగ్గా లేదని,బిల్డింగ్ డిజైన్ లో కూడా మార్పులు చేయాలని అవన్నీ కంప్లై అయిన తరువాతే హోటల్ తెరవాలని మనం ఇచ్చిన ఆర్డర్స్ వల్ల హోటల్ ఇప్పుడు మార్నింగ్ జరుగుతున్న కనస్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్ వర్క్స్ కోసం తప్ప రాత్రంతా మూసే ఉంటోంది. అందువల్లనే ఒక్క ప్రాణనష్టం కూడా సంభవించలేదు సార్"
"దట్స్ గుడ్. దట్స్ రియల్లీ గుడ్"
"హోమ్ మినిస్టర్ మార్నింగ్ ఎనిమిదింటికి మీటింగ్ పెట్టారు సార్. డిజిపి తో బాటు మిమ్మల్ని కూడా అటెండ్ అవ్వమని చెప్పారు సార్"
"మిత్రా.. మిత్రా మాటేమైనా వినబడుతోందా?"
"మిత్రా రెండు రోజుల్నించి కనబడటం లేదంటున్నారు సార్. అంతే కాదు.ఆ బినామీ డాక్యుమెంట్స్ ఏవీకూడా కనబడటంలేదని హోమ్ ఇంటి వార్త సార్"
"ఓకె.ఐ విల్ అటెండ్ ద మీటింగ్"ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు శివకుమార్ అతని మొహం ఒక్కసారిగా గంభీరంగా మారింది. మెదడులో మహాభారత శ్లోకం ధ్వనించింది
ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః I
మామకాః పాండవశ్చైవ కిమకుర్వత సంజయ II
(సశేషం)