అక్టోబర్ నెల వచ్చేసింది. ఈ నెల 2వ తేదీకి భారతదేశ చరిత్రలో ఒక విశేషముంది.
అదే జాతిపిత జన్మదినం.
మన జాతిని పరాయి పాలనాశృంఖలాల నుండి విముక్తం చేసిన శాంతి యోధుడు, అహింసా సాధకుడు, సత్య శోధకుడు అయిన మహాత్ముడు అవతరించిన పవిత్ర దినమది.
మహాత్మా గాంధీ జీవిత సంగ్రహమో లేక కాలానుక్రమణమో నేనిప్పుడు చెప్పబోవడం లేదు. ఆధ్యాత్మికంగా ఆయన అంతరంగాన్ని పరిచయం చేయ ప్రయత్నమే ఈ చిన్ని వ్యాసార్థం.
"గత 30సంవత్సరాల నుండి జీవితంలో నేను చేసిన కార్యాలన్నీ ఆత్మదర్శనం కోసమే. ఈశ్వర సాక్షాత్కారం కోసమే. మోక్షం కోసమే. నా రచనా వ్యాసంగమంతా అందుకోసమే. రాజకీయరంగంలో నా ప్రవేశం కూడా అందుకోసమే." 1925 నవంబర్ 25న శబర్మతి ఆశ్రమంలో గాంధీగారు చెప్పిన మాటలివి.
ఈ మాటలు వింటే ఆశ్చర్యం కలుగక మానదు. మోక్షం కోసం, ఈశ్వర సాక్షాత్కారం కోసం పూజలు చేయడం, ధ్యానం చేయడం, తపస్సు చేయడం, ఏకాంతంలో జీవితం గడపడం వంటివి విన్నాం, చూశాం కానీ రాజకీయాల్లో ఉండటం, జనాల్లో తిరగడం, రచనలు చేయడం అందుకోసమే అంటే ఆశ్చర్యం కాక మరేం కలుగుతుంది?!!
నిజమే.
కానీ అదే నిజం.
ప్రపంచం మనలోకి రానంత వరకూ మనం ఎంతగా ప్రపంచంలో ఉంటూ, ప్రపంచంతో కలిసి పని చేస్తున్నా అది మనను అంటుకోదు. గాంధీ విషయంలో జరిగింది కూడా అదే.
మరి గాంధీని నడిపిన శక్తి ఏమిటి?
"సత్యం"
గాంధీకి సంబంధించినంత వరకు సత్యమే భగవంతుడు; సత్యమే మోక్షము; సత్యమే పరమార్థము. తన జీవితమంతటినీ సత్యమనే ఒకే తాటి మీద నడిపించాడు.
మనం ఏదైనా నిర్ణయం తీసుకునేప్పుడు పరిస్థితిని బట్టి, వ్యక్తులను, వారితో మనకున్న సంబంధ బాంధవ్యాలను బట్టి, ఇంకా లోతుగా చెప్పాలంటే మనకు అనువుగా ఉండే విధంగా నిర్ణయించుకుంటాము. అలాగే ధనము, స్థితిగతులు, దేశకాలాలు ఇలా అనేక అంశాలు ఆ నిర్ణయాన్ని ప్రభావితం చేయడం మనం ఎరుగుదుము. కానీ గాంధీ ఎప్పుడు, ఎట్టి సమస్యకైనా, ఏ పరిస్థితిలోనైనా, ఎటువంటి కాలంలోనైనా, ఏ దేశంలోనైనా సత్యమనే ఒకే అంశాన్ని ఆధారం చేసుకుని నిర్ణయించుకున్నాడు.
గాంధీ తన జీవితంలో ఎదురయ్యే ప్రతి చిన్న సంఘటనను, పరిస్థితిని, సమస్యను కూడా ఒకే విధంగా ఎదుర్కొన్నాడు. కేవలం తాను సత్యనిష్టుడిగా ఎంతవరకు నిలబడగలడో సరిచూసుకొనే కొలమానంగా మాత్రమే వాటిని స్వీకరించాడు.
దాని వలన ఆయన ఎన్నో పర్యాయాలు ఆత్మీయులకు దూరమయ్యాడు; మితృలే ఆయన పట్ల విరోధం వహించారు; కుమారులే కసాయివారిలా ప్రవర్తించారు; జీవిత భాగస్వామి కూడా వ్యతిరేకించే పరిస్థితులు ఎదుర్కొనాడు. అయినా తన అంతరంగం మాత్రం వీటి వలన ఏమాత్రం ప్రభావితం కాకుండా చుసుకొన్నాడు.
"సత్యాన్ని విడిచి వీటిలో దేనిని పట్టుకున్నా అది నాకు ఇప్పటికంటే మరింత దుఃఖాన్నే కలిగిస్తుంది. అన్ని సమస్యల కంటే అంతరాత్మ చెప్పిన దానికి వ్యతిరేకంగా నడుచుకోవలసి రావడమే అత్యంత బాధాకరం." అని చెప్పాడు.
"ఆత్మసాక్షాత్కారానికి మార్గం ఏమిటి?" అని భగవాన్ శ్రీ రమణ మహర్షిని దేశవిదేశీయులెందరో ప్రశ్నించారు. దానికి ఆయన సమాధానం ఒక్కటే. "నిన్ను నీవు గమనించుకో. అప్పుడు నీవెవరివో తెలుస్తుంది. అదే ఆత్మసాక్షాత్కారానికి మూలం."
సరిగ్గా గంధీ చేసింది కూడా ఇదే. ఆయన అనుక్షణం తనను తాను గమనించుకుంటూ ఉన్నారు. జ్ఞాన మార్గాన్ని నిష్కామ కర్మ యోగంలో సమ్మిళితం చేసి ఒక దేశ భవిష్యత్తును నిర్దేశించిన మహాత్ముడు గాంధీ.
అది గృహ సమస్య ఐనా, గ్రామ సమస్య ఐనా, దేశ సమస్య ఐనా సరే తనలోని త్రికరణ శుద్ధత్వానికి భంగం కలుగకుండా వ్యవహరించారు. అందుకే ఆయన సూచించిన పరిష్కారాలు, తీసుకున్న నిర్ణయాలు అంతటి ప్రభావం చూపి, చారిత్రాత్మకంగా నిలిచిపోయాయి.
గాంధీలోని సాధకుడు, సత్య శోధకుడు యుద్ధం చేసిన మరొక కోణం ప్రస్తావించుకుని తీరాలి. ఆహార, నిద్ర, భయ, మైథునాలని చెప్పబడే కలి లక్షణాల మీద తీవ్రమైన పోరటం చేశాడు గాంధీ. రసనేంద్రియాన్ని అదుపులో ఉంచుకోవడానికి గాంధీ చేసినన్ని ప్రయోగాలు మరెవ్వరు చేసి ఉండరు. ఉపవాసాలు, ఏకాహాలు, కేవలం ఫలాలు, వేరుశెనగ పప్పు, ఎండు ద్రాక్ష, ఖర్జూరం వంటివి సేవించడం, కొన్నాళ్ళు అన్నాహారం మాత్రమే తీసుకోవడం, జీవ హింసను నిరసిస్తూ పాలు, పాల పదార్థాలు తీసుకోకపోవడం ఇలా రకరకాల ప్రయోగాలు చేసి జిహ్వను చాలావరకు జయించగలిగాను అంటారు గాంధీ.
1906 నుండి 1948 వరకు ఆజన్మాంతం బ్రహ్మచర్య వ్రతాన్ని చేపట్టారు గాంధీ. "బ్రహ్మచర్యాన్ని సరిగ్గా పాటించడమంటే బ్రహ్మదర్శనం చేసుకోవడమే. ఈ జ్ఞానం నాకు శాస్త్రాలు చదవడం వల్ల కలుగలేదు. నాకు అనుభవమైన తర్వాతనే అది సత్యమని శాస్త్రాలలో చదివాను. బ్రహ్మచర్య వ్రతధారణం వల్ల శరీర రక్షణ, బుద్ధి రక్షణ, ఆత్మ రక్షణ కలుగునను సత్యం బ్రహ్మచర్య వ్రతం ఆరంభించిన తరువాత రోజురోజుకీ నాలో అధికంగా అనుభవం కాసాగింది. మొదట్లో ఇది ఘోర తపశ్చర్యగా అనిపించినా, తరవాతి కాలంలో ఎంతో రసమయంగానూ, ఆనందమయంగానూ ఉన్నది.దీని బలం వల్లనే అనేక పనులు జరుగుతూ ఉన్నాయి." అని బ్రహ్మచర్యం యొక్క వైశిష్ట్యాన్ని, అది ప్రసాదించే సామర్థ్యాన్ని వివరించాడు గాంధీ.
దీనికంతటికీ గాంధీకి తోడుండి నడిపిన జీవన సహచరి భగవద్గీత.
గాంధీ జీవితాన్ని సూక్ష్మంగా పరిశీలిస్తే ఒక చిత్రం కనిపిస్తుంది. భగవద్గీతలోని రెండు పాత్రలైన కృష్ణార్జునులిద్దరూ గాంధీలోనే దర్శనమిస్తారు. భగవానుడైన కృష్ణుడే అంతరాత్మ ప్రబోధం రూపంలో సూచనలివ్వగా, శరణాగతుడైన అర్జునుడిలా ఆ సూచనలందుకుని నిష్కామ కర్మ యోగి వలే గాంధీ వాటిని పాటించేవాడు.
ఒక చిన్న ఉపసంహారంతో ముగిస్తాను.
గాంధీ పుట్టింది అక్టోబర్ 2, 1869లోనే కానీ, వాస్తవానికి మనమంతా ప్రేమించి, ఆరాధించే మహాత్మా గాంధీ జన్మించినది మాత్రం 1893, జూలై 7న, దక్షిణ ఆఫ్రికా, పీటర్ మాటిజ్ బర్గ్ రైల్వే స్టేషన్లో!
అన్యాయంగా, అక్రమంగా, పశుబలంతో ఒక జాతిపై మరొక జాతి చేసిన దురాగతానికి ప్రారంభమైన ప్రతిస్పందనయే గాంధీ మహాత్ముడిగా రూపొందడానికి కారణం. కనుక ఆనాడే గాంధీ మహాత్ముని నిజమైన జన్మదినం.
మన జాతిపిత జన్మించినది ఆ రొజే!!
జాతిపిత జననానికి కారణమైన దక్షిణ ఆఫ్రికాలోని ఆ స్టేషనుకు మహాత్మా గాంధీ రైల్వే స్టేషన్ అని నామకరణం చేయబడింది.
సామన్యులుగా పుట్టి అసామాన్యులుగా ఎదిగి, అనన్య సామాన్య ఘనకార్యాలు సాధించే కృషినారంభించేందుకు కారణమైన దివ్య క్షణమే నిజమైన జన్మదినం.
"నేను పర్యటనా కాంక్షతో, భారతదేశంలో ఎదురౌతున్న కుట్రలు, అవమానాల నుండి తప్పించుకోవటం కోశం దక్షిణ ఆఫ్రికా చేరాను. కానీ ఇక్కడే నేను ప్రజా సేవలో లీనమై, తద్వారా ఈశ్వరాన్వేషణ, ఆత్మదర్శనమందు లీనమైపోగలిగాను." అన్న గాంధీ మాటలలో కూడా అదే భావం కనిపిస్తుంది.
"ఓ నా ప్రియతములారా! నా భావం చదివారా! జీవి యొక్క నిజమైన జన్మదినం జీవితం సార్ధకమయ్యే కృషి ప్రారంభమైనా అమృతక్షణాలేనని విశ్వసించి, మనమంతా మహాత్ముని వలే మన బ్రతుకు శిల్పాన్ని మలచుకునే కృషికి సమాయత్తమైతే ఈ నా వ్యాస ప్రయోజనం నెరవేరినట్టుగా భావిస్తూ, ఎల్లరకు మహాత్మా గాంధీ జయంతి శుభాకాంక్షలు."