"గోపీ : ఒక్క క్షణం ఆగరా :" అంటూ వాడిచేతిలో పుస్తకాలుంచి - గుడిలోపలికి వెళ్ళాను.
తిరిగి వచ్చేదాకా వాడక్కడే నిలబడి - నా వంక హేళనగా - విసుగ్గా చూస్తూ అన్నాడు.
"ఏమంటున్నాడు నీ దేవుడు, కులాసానా?"
ఇలా రోజూ ఏదో కామెంట్ చేయటం గోపాలంకీ, - విని నవ్వి వూరుకోవటం నాకూ అలవాటే అయినా ఇవాళ వూరుకోలేకపోయాను.
"ఆయనకేం లోటని? కులాసా లేకపోవటానికి...."
"అయితే ... పాపం ఇప్పుడు నీకే పెద్ద లోటొచ్చిపడిందన్నమాట :"
"వ్యంగం చేయకు. నాకదోతృప్తి. ఈ మహా విశ్వానికి అధినేత దేవుడు. అయన సృష్టిలో మనం ఇసుకరేణువుకు కూడా సరిపోలం. అట్లాంటి తేజస్సంపన్నుడిని స్తుతించడంలో తప్పేంవుంది.?"
"కావాల్సినంత వుంది?"
పలకని - వులకని ఆ రాయికి బదులు - ఏ మనిషికి మ్రొక్కినా ఫలం వుంటుంది"
"కానీ - నేను ఫలం కోరుకోవటం లేదు."
"ఓహో ... ఏ ప్రతిఫలం కోరుకోనప్పుడు ఈ దండాలూ - దస్కాలూ ఎందుకోయ్?"
"ఆయన సృష్టిపట్ల - మేదస్సుపట్ల మన విజయాన్ని చూపటం అనుకోరాదూ?"
"మన నిత్యజీవితంలో ఏ ఆపదలకూ - అవసరాలకూ అక్కరకురాని దేవుడిపట్ల వినయం ఎందుకు చూపాలి? అసలు దేవుడున్నాడా? వుంటే ఎవరైనా చూశారా? మన సైన్సు గ్రంథాలు తిరగవేయ్ ఈ సృష్టి పరిణామం ఎలా మొదలైందీ తెలుస్తుంది. అందులో దేవుడిపాత్ర ఎక్కడైనా కనిపిస్తే చెప్పు, అప్పుడు ఒప్పుకుంటాను."
"ఏ దేవుడూ -ఏ మహత్తర శక్తీలేనిదే ఈ గ్రహాలూ - గోళాలూ గతులు తప్పకుండా ఎట్లా పరిభ్రమిస్తున్నాయి? వీటన్నిటి వెనుక ఏదో అజ్ఞాత శక్తి, దివ్యహస్తం వుండి తీరాలి. అది నా నమ్మకం:"
"నీ నమ్మకాలన్నీ - నీ మూఢవిశ్వాలమీద నిలిచినవి. అవి అప్పుడు కూలిపోక తప్పదు."
"ఆ మాటే నేనూ అంటాను :"
"మంచిది. చూద్దాం వేచి. కాలం ఎవర్ని ఏ పరిధుల్లోకి తీసుకెళ్తుందో..."నేను మౌనం వహించాను.
గోపాలం - నేను హైస్కూల్‍లో చదువుకునే రోజుల్నించి ప్రాణస్నేహితులం. మా ఇద్దరిమధ్యా అనేక విషయాల్లో ఏకత్వం వుండటంవల్ల మంచి స్నేహితులమయ్యాము. ఒక్క దేవుడి విషయంలోనే మేమిద్దరం ఉత్తర దక్షిణ ధ్రువాలం ఒకరి నమ్మకాల్ని మరొకరం మార్చలేక మధ్యమధ్య ఇలా వాగ్వివాదపడటం మా కలవాటే.
మాకిద్దరికీ బాడ్‍మెంటన్ ఆడటం సరదా. రోజూ కాలేజీ అవగానే కాస్సేపు ఆడుకుని ఇంటిముఖం పడ్తాం. చాలా చక్కగా ఆడతాడు గోపాలం.
శలవు రోజుల్లో - తీరిక సమయాల్లో లైబ్రరీకి వెళ్ళి - పుస్తకాలు తిరగేసి - వాటిల్లోని విషయాల గురించి అనేకసార్లు గంటలతరబడి వాదించుకోవటం మా కిష్టం.
నిజానికి గోపాలం మంచి తెలివైనవాడు. ఆటల్లోనేకాదు. మాటల్లోనూమేటి. మాటల్లోనే కాదు - ఆచరణలోనూ చూపిస్తాడు. అతని మేదాశక్తి అపూర్వం అన్పించి అబ్బురపడ్తూంటాను. తను వాదించే విషయాన్ని నా చేతకూడా ‘ ఔను ’ అన్పించేంతటి నేర్పరి. నేను అతనిలోని ఆ శక్తికే మిక్కిలి ఆకర్షితుడనౌతాను.
టెన్తులో మంచి మార్కులు తెచ్చుకున్న గోపాలం - ఇంటర్‍లో వాడికిష్టమైన బై.పి.సి. గ్రూప్ తీసుకున్నాడు.
అత్తెసరు మార్కులొచ్చిన నేను ఎం.పి.సి. తీసుకున్నాను.
మా గ్రూప్స్ వేరైనా కాలేజీ ఒకటే అవటంనుంచి - మా స్నేహానికి ఏ విఘ్నమూ వాటిల్లలేదు. మేం పెరుగుతున్న కొద్దీ మా స్నేహం మరింత పటిష్టం కాజొచ్చింది. మా అభిప్రాయాలూ మరింతగా బలపడినయ్.
అయినా-
నేను గుడి కన్పించినప్పుడల్లా - లోపలికెళ్ళి నమస్కరించటం - గోపీ వెక్కిరించటం మానలేదు. అదీ మా దినచర్యలో ఒక భాగమైపోయింది.
కాలేజీ జీవితం ముగిసింది. నేను బి.ఏ. అన్పించుకున్నాను. గోపాలం బి.యస్సీ. లో యూనివర్సిటీ ఫస్టు వచ్చాడు.
గోపాలం తన కిష్టమైన డాక్టర్ కోర్సు కెళ్ళాడు.
మా ఇద్దరిమధ్యా ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతూనే వున్నాయి.
నా చదువు పూర్తయి వున్న ఊళ్ళోనే హైస్కూల్లో టీచర్‍గా చేరాను.
గోపాలం ఎం.బి.బి.యస్ లో డిస్టింక్షన్ తెచ్చుకుని - ఫారెన్ స్కాలర్ షిప్‍మీద రీసెర్చికై జర్మనీ వెళ్లాడు.
నేను మామూలు బడిపంతులు ఉద్యోగంలో - పెద్దవాళ్ళు కుదిర్చిన పద్మను పెళ్లిచేసుకుని - సంసార తాపత్రయంలో పడ్డాను.
జర్మనీ వెళ్లాక - మెదట్లో లెటర్స్ వ్రాసిన గోపాలం - క్రమంగా తగ్గించేశాడు. నేనూ సంసారపు గొడవల్లో తాత్కాలికంగా గోపాలం మాట విస్మరించాను.
రేసు గుర్రాల్లా రోజులు దూసుకుపోతున్నాయ్.
ఓ ఆదివారం - ఉదయంపూట తీరిగ్గా లెక్కల పేపర్లను ముందేసుకుని దిద్దుతూ కూర్చున్నాను.
వాకిట్లో కారు ఆగిన శబ్దమైంది. మా ఇంటి కెవరు వస్తారన్న నిర్లక్ష్యంతో పట్టించుకోలేదు.
బూట్లశబ్దానికి తలెత్తిచూసిన నేను ఆశ్చర్యానందాలతో ఉక్కిరిబిక్కిరయ్యాను. వున్నపాటుగా లేచి గోపాలానికి ఎదురెళ్లాను.
అప్యాయంగా కౌగిలించుకుంటూ - "ఇంకా నీకీ గోపీ గుర్తున్నాడురా?" అన్నాడు గోపాలం:
"అంత నిష్టూరం వేయకు గోపీ : నిన్ను మర్చిపోవటమా ?" అన్నాను, ఏదో మాటలకందని అనుభూతి నా గొంతునిండా తొణికిసలాడగా:
గోపాలాన్ని కుర్చీలో కూర్చోమని - లోపలికి పరిగెత్తి - పద్మతో కాస్త కాఫీగట్రా చేయమని పురమాయించి వచ్చాను.
గోపాలం గది నలుమూలలా, కలయజుస్తూ "ఊఁ ... పక్కా సంసారి వయ్యావన్నమాట :" అన్నాడు నవ్వి .
"నా సంగతికేంలే... నీ విషయాలు చెప్పు ఎప్పుడొచ్చావ్ ఇండియా? రిసెర్చి పూర్తిచేశావా? పెళ్లిచేసుకున్నావా? పిల్లలెంతమంది?" అన్నాను గబగబా.
"పుల్ స్టాప్. నీలాగా నేను బుద్ది లేని గాడిదవనుకున్నావారా? నీకు ఆహ్వానం పంపకుండా చేసుకోవటానికి?"
"సారీరా గోపీ : అనుకోకుండా జరిగిపోయింది. కనీసం ఇన్విటేషన్ అన్నా పంపలేకపోయినందున రియల్లీ సారీ...."
"నెవర్ మైండ్ ... నేను ఇండియా వచ్చి వారం అయింది. ఇక్కడికి రాత్రే వచ్చాననుకో ... రాగానే నేను మొదటి పని నిన్ను వెదుక్కుంటూ రావడమే ... రీసెర్చి పూర్తిచేసుకునే వచ్చాను - ఇక ప్రాక్టీస్ పెట్టటానికి ఏర్పాటు చూసుకోవాలి :"
గోపాలం బాగా తెల్లబడ్డాడు. కళ్లకు జోడు రావటంతో మనిషికి నిండుదనం వచ్చింది. మాటలో - చూపులో ఓ రకమైన హుందా. రత్నాన్ని సానబెట్టినట్లు ఇప్పుడు మరింత కళకళలాడి పోతున్నాడు.
పద్మ ఉప్మా ప్లేట్లతో వచ్చింది.
ఇద్దరికీ పరిచయం చేశాను.
"ఇప్పుడెందుకమ్మా ఇవన్నీ ?" అన్నాడు మొహమాటంగా.
"నోరు మూసుకొని తినరా : నా పెళ్లి కెలాగూ రాలేదు. ఇవాళ మా యింట్లోనే నీ భోజనం. తిక్కవేషాలు వేయక :" అన్నాను.
మొదట్లో ఏవో అభ్యంతరాలు చెప్పినా - మా భార్యభర్తల బలవంతంలో వుండిపోయాడు.
కాఫీల్తాగాక వక్కపొడి అందించబోయాను. నిరాకరించాడు.
సిగరెట్ ఆఫర్ చెయబోయాను. సారీ చెప్పాడు.
"వాటెవండర్ : స్టేట్స్ కెళ్లినా నువ్వు తెలుగు మర్చిపోలేదు. ఏ బాడ్ హాబిడ్స్ లేవంటే నమ్మలేకపోతున్నాను" అన్నాను ఆశ్చర్యంగా.
"మన బలహీనతలు బైటపడవేసుకోవటానికి స్టేట్స్ కే వెళ్లనక్కరలేదు. ఎక్కడున్నా అవి మనిషిని లోబరుచుకుంటూనే వుంటాయి. వాళ్లనుంచి మనం నేర్చుకోవాల్సింది ఇలాంటి హాబిట్స్ కాదు. నిజాయితీ - క్రమశిక్షణ. కానీ మనసులో చాలామంది అదేం దౌర్భాగ్యమో అవిమాత్రం వదిలేసి - మిగతావి వెంటబెట్టుకొస్తారు :"
గోపాలం అక్కడి ఆచార వ్యవహారాలు - వాళ్ళు సాధించిన విజయాలు - అక్కడ చూడతగిన ప్రదేశాలు అన్నీ వివరంగా చెప్తూ కూర్చున్నాడు. అవన్నీ ఆసక్తిగా వింటూ చూస్తున్నంత అనుభూతి చెందాను.
"ఆ సాయంత్రందాకా మా ఇంట్లోనే వున్నాడు గోపాలం. వెళ్లబోయేముందు కారులోంచి ఓ పేకెట్ తోసుకొచ్చి నా చెతుల్లో పెట్టాడు.
"ఏంట్రా ఇది?" అన్నాను ఆశ్చర్యంగా.
"తీసి చూడు. నీకోసం ప్రత్యేకంగా తెచ్చాను. ఇంతకంటే విలువైంది - నాకేదీ కన్పించలేదు."
విప్పాను.
మూడు కోతులు : సజీవంగా వున్నట్లే భ్రమగొల్పుతున్న మూడు కోతులు.
చెడు చెప్పకు - వినకు - చూడకు, అన్న సందేశాల్తో వున్న మూడు కోతులు.
"థ్యాంక్స్ రా :" అన్నాను.
"రా : ... అలా మన కాలేజీవైపు వెళ్ళొద్దాం" అన్నాడు కార్లో కూర్చుని.
ఇద్దరం బైల్దేరాము.
మాతో చదువుకున్న వాళ్లు ఏవిధంగా సెటిలయ్యిందీ చెప్పుకున్నాం. కాలేజీ ఆవరణలోకి వెళ్ళాక - విచిత్రమైన అనుభూతి కల్గింది. ఒకప్పటి మా కాలేజీ : ఇప్పుడు మాకేం కాదు. అయినా పుట్టిపెరిగిన వూరిమీదా చదువుకున్న విద్యాలయాలమీదా ఏళ్ళ తరబడి వుంటున్న ఇంటిమీదా మనిషికి ఎంత మమకారమో :
తిరిగి వస్తూ _ దారిలో గుడి దగ్గర ఆపాడు కారు గోపాలం నా అలవాటు ఎంత గుర్తో అన్పించింది. నేను గుడి లోపలికి నడిచాను. గోపాలం అభిప్రాయం మారలేదన్నమాట :
నేను తిరిగి వచ్చేసరికి గోపాలం కారును ఆనుకుని నిలబడి - గాలి గోపురంవైపు చూస్తున్నాడు.
దగ్గరగా వెళ్లినా - అతనట్లాగే వుండటంచూసి-
"ఏవిఁటంత పరిశీలన ? శిల్పకళనేనా చూసేది ?" అన్నాను - నేనూ చూపులు ఆటే త్రిప్పి.
"కాదు : భగవంతుడ్ని :" అన్నాడు నిదానంగా.
పక్కలో బాంబుపడ్డట్టు అదిరి పడ్డాను.
"ఒరే గోపీ : ... నువ్వేనా మాట్లాడేది ?" అన్నాను ఆశ్చర్యంగా.
"ఎందుకంత ఆశ్చర్యం?"
"అయితే నువ్వు మారిపోయావన్నమాట?: " అన్నాడు సంతోషంగా.
"కానీ - నువ్వనుకుండే మర్పు కాదు."
"నాకర్థం కావటంలేదు."
"చెప్తాను... అదిగో ఆ గాలిగోపురం మీద ఏం వున్నాయి?"
"శిల్పాలు:"
"ఇంకా?"
"పావురాళ్ళు?"
"ఇంకా?"
"కోతులు:"
"అవే : నే నన్న భగవంతుడు:"
"కోతులా:"
"అవును : కారెక్కు - అర్థం అయేలా చెప్తాను."
ఎక్కి కూర్చున్నాను - కదిలింది కారు
"అనాధినుంచీ మానవజాతికి అనేక ప్రాణులు - అనేక విధాలుగా ఉపయోగిస్తూ వచ్చాయి. అన్ని ప్రాణులలోకీ ఈ కోతులు తనకు ఎన్ని విధాలా ఉపకరిస్తున్నాయో తెలుసా ? వాటివల్ల మనకు కల్గుతున్న మేలు తెల్సుకుంటే వాటిని భగవంతుడని ఎందుకన్నానో తెలుస్తుంది."
నేను మౌనంగా వింటూ అర్థంచేసుకోవటానికి ప్రయత్నించసాగాను.
"మనిషికి - కోతికీ దగ్గర పోలికలున్నాయి. కోతినుంచే మానవుడు రూపాంతరం చెందాడు. ఈనాడు మనం ఎన్నో రోగాలనుంచి - నివారణ పొందుతున్నామంటే అదంతా కోతుల చలవే.
ఈనాడు కోతులు శాస్త్రజ్ఞుల పరిశోధనలకు ఎంతో ఉపకరిస్తున్నాయి. ఎన్నో ప్రయోగాలు వాటిపై జరిపి - వాటి రియాక్షన్ గమనించి - దాన్నిబట్టి మందులు తయారుచేస్తున్నారు. ఏ మనిషికైనా తమ వృత్తికి ఎంతో ఉపకరించే వాటిని దైవం అంటాను నేను.
దైవం అన్నది మన మాటల కతీతమైనది అని అర్థం. ఒక మనిషి చావుబ్రతుకుల మధ్య చేయూతనిచ్చి - జీవితాన్ని చూపించే డాక్టరు ఎంతో ఉన్నతుడనీ - దేవుడనీ ఆకాశాని కెత్తేస్తారు. కానీ ఏ డాక్టరుకైనా మందులనే ఆయుధం చేతిలో లేనిది ఏమీ చేయలేడన్నది జగద్విదితం.
ఈ మందులు ఏట్లావచ్చాయి? ఎలాంటి పరిశోధనవల్ల ? అని ఆలోచొస్తే - పేరుపొందిన ప్రతి మందు వెనుక - అనేక జీవాల ప్రాణ త్యాగాలున్నాయి. ఉదాహరణకి పోలియో వాక్సిన్ కోతులపై పరిశోదనలుచేసి వుండకపోతే - ఈనాడు మనకు అందుబాటులో వుండేదికాదు.
మానవుని శరీర ధాతునిర్మాణంలో సారుప్య - సాహిత్య ధర్మాలుగల కోతులపై పరిశోదనలే ఇతమితమైనవి కావటంచేత - శాస్త్రజ్ఞులు వీటినే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
కొందరు శాస్త్రజ్ఞులు శస్త్రచికిత్సలోనూ తమ విధానాలకై కోతులపై పరిశోదనలు జరుపుతున్నారు. కొందరు శాస్త్ర వేత్తలు - మెదడులో లైంగిక కార్యకలాపాల కేంద్రాన్ని గుర్తించటానికై విద్యుత్తు ప్రవహించే సూదుల్ని మెదడులో గుచ్చుతారు.
ఇలా రకరకాలుగా చిత్రహింసల పాల్జేస్తూ - కోతుల్ని ఉపయోగించుకుంటోంది - మా వైద్య శాస్త్రం అందుకే నాకు కోతుల్ని చూస్తే హృదయం ద్రవిస్తుంది.
వాటిపట్ల నా మనసు కృతజ్ఞతతో నిండిపోతుంది. చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది. మన ప్రగతికోసం - అవి బలైపోతున్నాయన్న నిజం నన్ను కదిలిస్తుంది .. మనం వున్నాం ఎందుకూ ? తోటి మనిషి బాగుపడినా - సుఖంగావున్నా సంతోషించలేని మానవులం మనం. మన తెలివితేటలు - మనం సద్వినియోగపర్చుకోవటమే అరుదు."
డ్రాయింగ్ రూంలో కూర్చున్నాక కోతుల్ని గురించిన సమాచారాన్ని ప్రకటించిన పత్రిక చేతుల్లో పెట్టాడు.
అదంతా చదివాక - గోపాలం నాకు బహుకరించిన కోతుల బొమ్మల ఆంతర్యం అర్థమైంది నాకు :