ఈ క్రింది "ప్రశ్న"కు పద్యరూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖ ద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేట తెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము.
ఈ మాసంప్రశ్న:
మిక్కిలి చక్కెరాయె మధుమేహపు రోగికి ఔషదమ్ముగా
గతమాసం ప్రశ్న:
దత్తపది: పివి(పీవీ), సింధు, సాక్షి, మాలిక్ పదాలను అన్యార్ధములతో వాడుతూ ఒలింపిక్ క్రీడలను వర్ణించాలి
ఈ ప్రశ్నకు మాకు అందిన క్రమములో పూరణలు ఇలా వున్నాయి.
డా. బులుసు వేంకట సత్యనారాయన మూర్తి, రాజమహేంద్రవరము
వీపివి నీవని పలుకగ
కోపము సుంతయును లేని కూసా! క్షితినిన్
తోపని వాసిం ధుర్యుడ
వోపవు మాలికల నంద యోడుచు నెపుడున్
కంది శంకరయ్య, వరంగల్
చూపి వివిధ క్రీడా ప్రతిభా పటిమను
ప్రేక్షక జన సింధువు ఘోష పెచ్చరిలగ
సకల క్రీడాభిమానమే సాక్షి కాగ
విజయ మాలికా ధారణ వేడ్క నొసఁగు.
డా. ఐ.యస్. ప్రసాద్, సైంట్ లూయిస్, మిస్సోరి
ఏ.పి. విజయ పతాకము నెగుర వేయ
సింధు దేశము ఖ్యాతిని అందుకొనగ
రజితమును మరియును బ్రాంజి సాక్షి
ఖ్యాతి బెంపొంద మాలిక్ గాజు గాత
సూర్యకుమారి వారణాసి, మచిలీపట్టణం
బంతులతి వేగముగ బంపి వీరులగుచు
సింధుభైరవి నాలపించి పరుగులిడి
పసిడి పతక మాలిక సాక్షి ప్రధములగుచు
కీర్తి గాంతురొలింపి క్కు క్రీడలందు
.
మల్లేశ్వర రావు పొలిమేర, కెల్లర్, టెక్సాస్
సింధునేమి నొలంపి కొచ్చెనను, రంగ
రంగ హంగుల మాలికారంభ మిచ్చి,
వివిధ దేశములు గలిపి విన్యసించు,
సాహసోపేత క్రీడల సాక్షి గాదె!
సింధునేమిన = భూమిన
శివప్రసాద్ చావలి,సిడ్నీ, ఆస్ట్రేలియా
చెలిమి కలిపి విరొధముల్‌చెరిపి తుదకు
పతక మాలికల్గొనుటకు పరిమితంబు
గాక గెలుపు పోరాటముకై నిలువగ
స్పూర్తియే వొలెంపిక్కులు! సూత్రధారి
సింధురవదనుని కటాక్ష సిద్ధి బడసె
నేమొ! సాక్షిగ నవియును నిలిచె నేడు!
చావలి విజయ, సిడ్నీ, ఆస్ట్రేలియా
క్రీడ చూపి విన్యాసమున్ గెల్వ పోటి
దేశ జనుల సాక్షి పరుగు తీసి స్వర్ణ
బిళ్ళ గెలిచె ఖాసిం! దుందుభిలు మొరయగ
పూలమాలికలొందె స్వభూమి యందు
మాజేటి సుమలత, క్యూపర్టినో, కాలిఫోర్నియా
సారసాక్షి నియుద్ధపు సమరమందు
చెలగి సింధువై వరుస మ్రోయించె గంచు
బంతి యాటల యందు పూబంతి యొకతె
వెండి వెలుగులు చిందుచు విహృతి సలిపె
భరత కీర్తి నిలిపి విశ్వ పటము నందు
విజయ మాలిక లొందిరి వెలదులటుల
ఘన యొలంపిక్ చరిత నయగారమిదియె