సారస్వతం - కుంతి మాట
అహింస
- కుంతి

అహింసాపరమో ధర్మ: తధాహింసా పరంతప:
అహింసాపరమం ఙ్ఞానం,అహింసాపరమార్జవమ్

అహింసయే పరమధర్మము. అహింసయేగొప్పతపస్సు. అహింసయేఙ్ఞానము, ఋజుత్వము అవుతుంది.
ఇది వేదోపనిషత్ ప్రోక్తమ్. మనిషి తాను సకల జీవరాశులను కాయిక, వాచిక, మానసిక హింసలకు గురి చేయకపోవడమే అహింస. మహాభారతము అనుశాసనిక పర్వములో భీష్మ, ధర్మజ సంభాషణలో హింసాహింసల గూర్చి చర్చించబడెను. అందులో యేవి హింస లేక యేవి అహింసలో తెలుపబడెను. ఇవి నేటికీ ఆచరణీయాంశములే. అతిధిని భోజనానికి పిలిచి పెట్టకుండుట, అనగా అతిధులకమర్యాదచేయిట, ఆవులు నీరుత్రాగడానికి వచ్చినపుడు వానిని మరలగొట్టుట, వికలాంగుల ధనమునపహరించుట, కోపించి పురమునకు, వనమునకు నిప్పంటించుట, పాపబుద్ధితో అసత్యమాడుట, చక్కనివరుడికి కాక, తన యిచ్చ వచ్చిన వానికి కన్యను ఇచ్చుట మొదలగునవి హింసలుగా చెప్పబడినవి.

పూర్వకాలములో యఙ్ఞయాగాదులలో, కర్మకాండలలో విపరీతమైన హింస ఉండేది. ఈ విషయము పై దేవీ భాగవతములో జనక, శుక సంవాదము నందు చర్చించబడినది. శుకుడు జనకుడిని ఇలా అడుగు
తాడు." రాజా! వేదధర్మాలు హింసను బోధిస్తున్నాయి. హింస అధర్మము కదా. అలాంటప్పుడు వేదోక్త ధర్మము ముక్తిప్రదము ఎలా అవుతుంది. శాస్త్రాలలోచెప్పబడిన సోమపానము, పశుహింస ,మాంసభక్షణము, సూరాగ్రహణము, ద్యూత క్రీడలు మొదలైన అనాచారాలుమోక్ష హేతువులంటే నమ్మేదెలా? దానికి జనకుడు ఇలా అంటాడు. "మునీంద్రా! యఙ్ఞకర్మల హింస ఉపాధి చేత హింస కాదు. అది అహింసయే. తడి కట్టెలు వేస్తే నిప్పులో పొగ సంభవిస్తుంది. అదితీస్తే పొగ ఉండదు. విరక్తుడు ధర్మ నిరతితో చేసే హింస, హింసకాదు, భోగకాంక్షతో రక్తుడైనవాడు చేసేది హింస. విరక్తుడు ఫలాపేక్ష లేకుండా అహంకారవిరహితంగా చేసే కర్మను వేదవిదులు అకృతంగానే నిర్ధారించారు. యాగీయమైన హింస హింస కాదు గృహస్థులు భోగేచ్చతో చేసేది హింస. జీవాత్ములు ముముక్షువులు నిరహంకారంగాచేసేది అహింస.

మహాభారతములో సక్తుప్రస్థోపాఖ్యానమున వైశంపాయనుడు జనమేజయుడితో " హింసాత్మకమైన యఙ్ఞము కంటే అహింసామహితంబైన తపోయఙ్ఞంబధికమని" తెలిపెను.

అయితే సత్యాచారి, అహింసామార్గి తన దైనందిన జీవితములో అనేక సంధిగ్ధతలను ఎదుర్కుంటాడు. ఒక్కొక్కసారి విపత్తిలోపడి యేధర్మాన్ని అచరించాలో తెలియని ద్వంద్వములో పడతాడు. భారత, భాగవతాదులు ఒకే విషయాన్ని తేల్చాయి. రెండు ధర్మాలు విప్రతిపన్నములైనప్పుడు అందేది పరమధర్మమో అది ఆచరించాలి. రెండవ ధర్మానికి హాని కలిగిననూ అది ధర్మమే అన్నాయి. ఆచరణసాధ్యముకాని అహింస వంటి ఆదర్షములను అనుష్ఠాన వేదాంతములోకి అనివదించినది భారతము. సలిలము, ఉర్వి, ఆకసము సర్వము జంతుమయము, హాలికుడు దున్నుచున్నప్పుడు ,మానవుడు నీరుత్రాగుతున్నప్పుడు, గాలి పీల్చుచున్నప్పుడు అనేక ప్రాణకోటులు నశించటము తధ్యము. అందుచే హింసచేయనివాడు లేడిజ్జగమున. ఓపినంత వరకు హింసకెడ కల్గి బ్రతుకుటే అహింస యని భారత సమన్వయము. మహాభారతము నందు ఒక చక్కని కధ ఉంది. అది ఒక ఋషి వాటిక. అక్కడ ఒక ఋషిపుంగవుడు. ఆ ఋషి వాటికననుసరించి యున్న అరణ్యములో ఒక గృహస్థుప్రయాణిస్తున్నాడు. అతడిని దొంగలు వెంబడింఛారు. ఆ గృహస్థు దొంగలనుండి తప్పించుకొని ఋషి వాటికను చేరుకున్నాడు. దొంగలు అక్కడికి వచ్చి ఋషిని ఆ గృహస్థు గురించి ప్రశ్నించారు. ఋషి సత్యపాలన ఛేసిన అహింసచెడును. ఇప్పుడు ఋషికర్తవ్యం? పంచమవేదము పరిష్కారము చూపినది. "భూతహితంబుగాపలుకుబొంకును సత్యఫలంబునిచ్చు" అంటుంది. అహింస పురుషులకాదిగా చెప్పుకొనదగిన ధర్మంబని చెప్పుకోవచ్చు.

ఇంతమహత్తుకలిగినది కనుకనే ధర్మరాజంతటి చక్రవర్తి, పాండవులు తమకు జరిగిన అపకారమును ,అధర్మాన్ని పక్కనపెట్టి యుద్ధము వల్ల జరిగే అహింసను వ్యతిరేకించారు

" మనకేటి రాజ్యమొండొక జనపధమునకేగి భైక్ష్యచర్యావిధి జీవనము నడుపుకొనియుండద మనఘా! యిట్లయిన సుఖులమవుదుము సుమ్మీ!"

మహాభారతములో ఆనుశాసనిక పర్వములో భీష్ముడు ధర్మజునకు అహింసా స్వరూపమును చక్కగా తెలిపినాడు.

"దంతియడుగులోన దక్కిన జంతు చయము నడుగులెల్లనడిగియుండు
నట్ళు ధర్మ కోటులన్నియు లోనగు నిద్ధగుణ! యహింసకింతనిజమ!"

ధర్మరాజా! ఏనుగు అడుగులో అన్ని జంతువుల అడుగులు ఇమిడి ఉండే తీరున అహింస అనేధర్మములో సర్వధర్మాలు లోబడి ఇంటాయి.

" అరయగ నాలుగువిధముల బరగు జతుష్పాదవృత్తి బరిగినగోవున్
దొరయుచునందొక డెడలిన , నరవర! సద్ధర్మవర్తనము కుంటువడున్!"

రాజా! నాలుగుకాళ్ళనడక గల ఆవు వలె ఆ అహింసకూడా నాలుగు తీరులతో ఉంటుంది. అందులో యేఒక్కటి లోపించినా శ్రేష్ఠమైన ధర్మపు సాగుదల కుంటుపడుతుంది.

"మనసునను వాక్కునను గాయమునను హింస నడవు మాంసంబుదినుటతో నాలుగయ్యె
దెరుగులవి సువ్వె హింస వర్తింపచేయు గానకడు గీడు మాంసభక్షణము దలప"

కాయిక, వాచిక, మానసిక హింసలతో పాటు మాంసము తినడము అనేదానితో కలిసిఆ పద్ధతులు నాలుగు అయినాయి. కనుక మాంసభోజనము చాలా పెద్ద దోషము. " కావున మాంసముపై దగులే విధముననుడుగుటయ యహింసారూపంబై వఱలుజుమీ!" - కనుక యేవిధంగా నైనా సరే మాంసము మీద ప్రీతి వదులుకోవడమే అహింసగా ఒప్పుతుంది.

మహాత్మాగాంధీ గారు సత్య శోధన అనుగ్రంధములో అహింస పై చాలా చర్చించాడు. తాను అహింసా మార్గములోకి ఎలా వచ్చాడో తెలిపే ఉదంతం కూడా అందులో ఉంది. గాంధీగారు చిన్నప్పుడు తన పదమూడవ యేటా సిగరెట్లకై పదిహేనవ యేట మాంస భక్షణకై దొంగతనము చేశాడు. మరియు ఒకసారి అన్నగారి మురుగునుండి బంగారము దొంగిలించి చేసి అంతవరకు చేసిన అప్పులు తీర్చాడు. కానీ చేసిన తప్పుతో అతడి మనసు శాంతించలేదు. తండ్రిగారికి చెప్పాలనుకున్నాడు. సాహసము చేయలేకపోయాడు. వారు దండిస్తారనే భయము కలుగలేదు. విషయము చెబితేమనస్తాపముతో కృంగిపోతారని భయము కలిగింది. ఏది ఏమైనా దోషము అంగీకరిస్తేనే బుద్ధి కలుగుతుంది అన్న విశ్వాసము కలిగింది. చివరికి ఒక చీటి మీద చేసిన తప్పును వ్రాసి క్షమించమని అడగడానికి నిష్చయించుకున్నాడు. ఇంత తప్పు చేసినందుకు తనను తగిన విధముగా శిక్షీంచమన . యిక ముందు దొంగతనము చేయనని శపధము చేస్తూ చీటి వ్రాసి అతడి తండ్రికి యిచ్చాడు. అతడి తండ్రికి చీటీ చదవగానే, కళ్ళలో నీళ్ళు తిరిగాయి. కనుల నుండి రాల్చిన నీటితో చీటీ తడిసిపోయింది. ఆపై వారు చీటీ చించేశారు. ఒక్కసారి కనులు మూసుకొని యేదో ఆలోచించాడు. అప్పటికే వ్యాధి పీడితుడై బాధపడుతున్న అతడు తిరిగి పడుకున్నాడు. దానితో తండ్రికి కలిగిన వేదన గ్రహించిన గాంధీ గారికి ఏడుపు వచ్చింది.

రామబాణము మహిమ ఆబాణము తగిలిన వాడికే తెలిసినట్లుగా తండ్రిగారి స్పందన గాంధీ గారికి సూటిగానే తగిలింది. అ ఘట్టమే తనకు మొదటి అహింసా పాఠమంటాడు. అహింస అంతటా వ్యాప్తమైనప్పుడు దాని స్పర్ష తగలకుండా ఉండదు.దాని శక్తి అమోఘము అంటాడు. ఈ ఘట్టము శాంతి తత్వము, అహింసాధోరణి యెంతటి వారలనైనా కరిగింపచేస్తుండని తేటతెల్లమవుతుంది. ఈ గ్రంధములోనే మరొక చోట " అహింస వ్యాపకమైన వస్తువు. హింసావలయములో చిక్కుకు పోయిన పామర ప్రాణులము మనము. తోటి జీవులపై ఆధారపడి జీవించాలన్న సూక్తి సరియైనదే. మనిషి బాహ్య హింస చేయకుండా ఒక్క క్షణమైనా ఉండ లేడు. తెలిసో తెలియకో హింస చేస్తుంటాడు. అట్టి హింసనుండి బయటపడేందుకు కృషి చేయడము, మనసు పూర్తిగా కరుణతో నిండి ఉండటము అహింసాపూజారిలక్షణము అట్టివాని ప్రవృత్తి సంయమము వైపు పయనిస్తుంది. అతనిలో సదా కరుణ నిండి ఉంటుంది." అని తెలుపుతాడు.

మహాభారతములోని ఆనుశాసనిక పర్వములో శివపార్వతీ సంవాదము నందు శివుడు పార్వతికి అహింస గూర్చి ఇలాతెలుపుతాడు."నేలపై పిపీలికాదులను, ఆకసాన మశకాదులను, మరియు పేను, నల్లి వంటి వానిని చంపక యెవ్వరికి కుదరదు కావున ఫలములు, దళమును తొడిమను వీడుటచే రాలగా వానిని గొనుచు, గోక్షీరము లాంటివానిని గైకొనుచు వెలి బుద్ధులు లేక నిశ్చలముగ చిత్రరూపుల వలె నుండు శమము గల పుణ్యాత్ములే అహింసాపరులు".

" దానమును దపంబుధర్మంబు యఙ్ఞంబు శౌచ మంత్ర తంత్ర సత్యములును
బుధులహింసరూపములు గాగచెప్పుట నెల్లకల్మిసుమ్మ హింసకలిమి"

వివేక వంతులు దానము, ధర్మము, తపస్సు, అహింస, యఙ్ఞము, పరిశుద్ధత, మంత్రము, అనుష్ఠానము, ,సత్యము ఇవన్నీ అహింసారూపాలే అని చెప్పుట చేత, అహింస అనే సంఫద ఉంటే అన్ని సంపదలు ఉన్నట్లే.

కావున మనుష్యకోటి కోటి సంపదలకు నెలవైన అహింసా సంపద ఆర్జించి, అహింసా పరమధర్మము అను మాటను నిలబెట్టుదురుగాక.

శంనోఅస్తుద్విపదే, శంచతుష్పదే


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)