దాదాపుగా గత పది సంవత్సరాలనించీ, ఇక్కడ అమెరికాలోనూ, అక్కడ భారతదేశంలోనూ జరిగిన, జరుగుతున్న రాజకీయ, సాంఘిక పరిణామాలు చూస్తుంటే రెండూ కొంచెం దగ్గరగా కనిపిస్తున్నాయి. రెండిటికీ వున్న సమాంతరాలు పరిశీలిస్తే, రెండూ దాదాపు ఒకటిగానే వుండటంతో ఆశ్చర్యం వేసింది. ఆ ఉత్సాహంతో ఇంకా కొంచెం సూక్ష్మంగా పరిశీలిస్తే నాకు కనిపించిన ఆ సమాంతర రేఖలు మీకూ చూపిద్దామని ఈ వ్యాసం వ్రాస్తున్నాను.
భారతదేశ చరిత్ర చూస్తే, ముందుగా ఎన్నో సామ్రాజ్యాలు, రాజులూ, తరాజులూ, తర్వాత తురకల ఆక్రమణ, విస్తరణ, మళ్ళీ బ్రిటిష్ వాడి ఆక్రమణ, విస్తరణ. ఇవన్నీ అయాక రెండు వందల సంవత్సరాలకి భారతదేశ స్వాతంత్ర సమరం.
మన స్వాతంత్ర సమరంలో ఎంతో ముఖ్యమైన పాత్ర వహించినది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ. నా వయసులోని వారికి తెలిసిన రోజుల్లో, ఎన్నో గొప్ప త్యాగమూర్తుల పేర్లు విన్నాం. మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, గోపాలకృష్ణ గోఖలే, బాలగంగాధర తిలక్, మౌలానా అబ్దుల్ కలాం అజాద్, టంగుటూరి ప్రకాశం, జవహర్లాల్ నెహ్రూ, సరోజినీ నాయుడు మొదలైన వారు ఎందరో, తమ ప్రాణాలకు తెగించి మనకి స్వాతంత్రం సంపాదించి పెట్టారు. వీరు అందరూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే ఈ స్వరాజ్య పోరాటం జరిపారు. అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, సావర్కార్, కట్టబొమ్మన మొదలైన వారు కూడా, ఏ పార్టీ సంబంధం లేకుండా వారి జీవితాలని త్యాగం చేసి వ్యక్తిగతంగా పోరాడిన వారే! కానీ ఈ వ్యాసం ఉద్దేశ్యం వేరే వుంది కనుక, ఈ దేశభక్తుల గురించి ఒకసారి గుర్తు చేద్దామని వారి పేర్లు ప్రస్తావించాను. అంతే!
అలాగే భారతదేశానికి స్వతంత్రం వచ్చాక, కాంగ్రస్ పార్టీకి ఎదురులేకుండా పోయింది. ప్రతి వ్యక్తీ మహాత్మా గాంధీగారి ఫోటోకి నమస్కారం పెట్టి, తమ ఓటు కాంగ్రేస్ పార్టీకి వేయటం, నా చిన్న వయసులోనే నేను గమనించిన విషయం. నాకు ఇంకా ఎంతో బాగా గుర్తున్న విషయం. ప్రతి భారతీయుడిలోనూ (ఆడా, మగా, కులం, మతం, ప్రాంతం, భాష - ఇలాటివేమీ పట్టింపులేకుండా) దేశభక్తి ఉప్పొంగిపోయిన గొప్ప రోజులు అవి. స్వాతంత్ర రాకముందు మూడు సంవత్సరాలే ముందు పుట్టినా, పసివాడిగా బ్రిటిష్ సామ్రాజ్యంలోనూ, ఆ తర్వాత పెరిగే వయసులో స్వతంత్ర భారతదేశంలోనూ, నేను చూసిన, అనుభవించిన, అనందం, పులకరింపు మరువలేనివి.
ఆ తర్వాత భారతదేశం కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎంతో ప్రగతి సంపాదించింది. ముఖ్యంగా ఆనాటి ప్రధానమంత్రి నరసింహారావుగారి నాయకత్వంలో ఎన్నో రంగాల్లో ఎంతో ముందు నిలిచింది.
౦ ౦ ౦
భూగోళానికి పూర్తిగా ఇంకొక దిక్కున ఆనాటి అమెరికాలో, పదహారవ శతాబ్దంలోనే స్పైన్ దేశీయులు వచ్చి, స్థానికులని బలహీనులని చేసి, ఈ భూభాగాన్ని ఆక్రమించారు. దరిమిలా ఫ్రెంచ్, బ్రిటిష్ వారు కూడా తమ యధాశక్తి ఆక్రమణలు జరపటం, చాప క్రింద నీరులా బ్రిటిష్ వారు పాకి, అందరినీ తమ చేతి క్రిందకు తీసుకురావటం, అది నచ్చని ప్రజలు ఎదురు తిరిగి స్వాతంత్ర పోరాటం జరిపటం, అమెరికా దేశం స్వాతంత్రం తెచ్చుకుని బ్రిటిష్ వారి పాలనని అంతం చేయటం, అమెరికన్ చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయం. తర్వాత 1789లో జార్జి వాషింగ్టన్ అమెరికా దేశానికి మొట్టమొదటి అధ్యక్షుడిగా ఎన్నికయాడు. అప్పటినించీ అమెరికా ఒక దేశంగా ఎదగటమే కాకుండా, ఎంతో చక్కగా తయారుచేసిన రాజ్యాంగంతో ప్రజాస్వామ్యానికి నిదర్శనంగా నిలిచింది. లింకన్ లాటి మహానుభావుల చేతిలో, బానిసత్వాన్ని నిర్మూలించటానికి నాంది పలికింది. తర్వాత ఎందరో అధ్యక్షుల హయాంలో, అమెరికా దేశాన్ని ప్రపంచ దేశాలన్నింటికన్నా ముందు నిలబెట్టారు. అమెరికా ఒక కాందిశీకుల, వలసవీరుల దేశంగా ఆనాటి నించీ, ఈనాటి దాకా అభివృద్ది చెందుతూనే వుంది. ప్రపంచంలో ఏ దేశంవారికైనా అవకాశాల కోసం అమెరికా రావాలనే ఆశల దేశంగా పేరు తెచ్చుకుంది. సాంకేతిక, వైజ్ఞానిక, విద్యా, వ్యాపార, క్రీడారంగాలతో సహా, ఎన్నో రంగాల్లో ప్రప్రధమ స్థానంలో వుంది. ఇలాటి ఎందరో గొప్ప అధ్యక్షులు చాలా మంది, ఒకే పార్టీకి చెందినవారు. అదే జి.ఓ.పి. అంటే గ్రాండ్ ఓల్డ్ పార్టీ, అదే రిపబ్లికన్ పార్టీ.
౦ ౦ ౦
దేనిలోనయినా మంచీ చెడూ కలిసే వుంటాయి. మంచి కన్నా చెడు మరీ ఎక్కువ పాళ్ళు వుంటే, ఏ మనిషయినా, దేశమయినా, తమ వినాశనానికి తామే కారణమయి నాశనమయిపోయే అవకాశముంది. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి సరిగ్గా అదే జరిగింది.
ఎక్కువ శాతం చదువుకున్న ప్రజలు ఓట్లు వేయకపోవటం వల్ల, ఓట్లు వేసే ప్రజల అజ్ఞానంతోనూ, నిరక్షరాస్యతతోనూ, బాలెట్ పెట్టెల, ఆఫీసర్ల, ఓటర్ల కొనుగోలుతోనూ, పదవీ ధన వ్యామోహాలతోనూ, వంశాల, కులాల, మతాల, ప్రాంతాల విభేదాలతోనూ, లంచాలలోనూ ముణిగి పోయిన కాంగ్రెస్ పార్టీ, అహంకారంతో తన గొయ్యి తానే తవ్వుకున్నది. ఏమాత్రం సమర్ధత, విలువలు, నైపుణ్యం లేని నాయకత్వంతో తన చావుని తనే కొని తెచ్చుకుంది. ఏమీ చదువూ, సంస్కారం, న్యాయం, ధర్మం లేని, దేనికీ పనికిరాని మనుష్యులు, ఈ రోజుల్లో భారతదేశంలో సులభంగా చేరగలిగేవి, రెండే రెండు రంగాలున్నాయి. ఒకటి రాజకీయాలు, రెండు సినిమాలు. దేశాన్ని ముందుకు నడిపించవలసిన రాజకీయ నాయకులు, ఏ పార్టీకి చెందిన వారయినా, ఇలాటి దోపిడీ మూక వస్తే దేశం ఎక్కడికి వెడుతుందో మనందరికీ తెలుసు. అలాటిది రాజకీయాల్లోకూడా తమ మానవతా విలువలు మరచిన సిగ్గూ ఎగ్గూ లేని ఇలాటి వారి కడుపుబ్బరం మనం రోజూ చూస్తూనే వున్నాం.
అంబేద్కర్ మహాశయుడు స్వతంత్రం వచ్చాక పదేళ్లు మాత్రమే కుల ప్రాతిపదిక మీద రిజర్వేషన్లు ఇచ్చి, తర్వాత ఆర్ధిక పరిస్థితుల్ని బట్టి రిజర్వేషన్లు చేయమని వ్రాసినది, తమ ఓట్ల కోసం ఏడు దశాబ్దాలు అవుతున్నా మార్చక, ఎందరో సమర్దులైన పేదలను కులం కారణంగా విస్మరించి, వారి భవిష్యత్తుని, దేశ ప్రగతిని మట్టిపాలు చేస్తున్నారు. ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు, స్థానిక పార్టీలతో సహా, కుల ప్రాతిపదిక మీదే నడుస్తున్నాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ అగ్ర కులాలను, ఒక కులం మీద ఇంకొక కులాన్ని ప్రయోగించి కులక్షేత్ర యుద్ధం చేయించింది. విద్రోహశక్తులని బహిరంగంగా సమర్ధించే మతాలవారిని, మత కలహాలని తమ స్వార్ధం కోసం వాడుకునే వారినీ, కేవలం వారి ఓట్ల కోసం నెత్తిన పెట్టుకుని పూజిస్తున్నారు. ఇది అన్ని పార్టీలకూ వర్తించినా, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ విషయంలో ఇంకా ఎక్కువగా వర్తిస్తుంది. చివరికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమయింది?
భూస్థాపితానికి దగ్గరలో వుంది.సామాన్య ప్రజలు నిరసించే విధంగా వుంది. అసహ్యించుకునే విధంగా వుంది. ఆనాడు మనకి స్వరాజ్యం సంపాదించి పెట్టిన త్యాగధనుల పార్టీ, ఈనాడు సమాధికి దగ్గరవుతున్నది. అదే నా ఆవేదన!
౦ ౦ ౦
అదే రకంగా ఇక్కడ అమెరికాలో కూడా, ఆనాటి గ్రాండ్ ఓల్డ్ రిపబ్లికన్ పార్టీ ఎలా వుందో చూద్దాం.
మనం చరిత్రలో చదివిన విషయాలని ఒక పక్కా, మేము ఆమెరికాలో నివసిస్తున్న 35 సంవత్సరాల్లో
ఇక్కడ రాజకీయ రంగంలో జరుగుతున్న మార్పులూ పరిశీలిస్తే, ఆ తేడాలు చాల స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అమెరికా చరిత్రలో నేను చదివిన విషయాలు సూక్షంగా పైన వ్రాశాను. ఇప్పుడు ఇక్కడ నా అనుభవాలు, ప్రత్యక్షంగా చూసిన, చూస్తున్న పరిణామాలు ఎలా వున్నాయో చెబుతాను.
1980 దశాబ్దం మొదట్లో మేము అమెరికాకి వచ్చినప్పుడు రిపబ్లికన్ పార్టీకి చెందిన రోనాల్డ్ రీగన్ దేశానికి అధ్యక్షుడిగా వుండేవాడు. ఆయన అంతకు ముందు సినిమా నటుడు కనుక, ఆయన ఆ గ్లామర్ వల్లా, మాటల నైపుణ్యంతోనూ చాల మంచి అధ్యక్షుడిగా పేరు సంపాదించాడు. కానీ అంతర్లీనంగా దేశ ఆర్ధిక పరిస్థితి దిగజారింది. దానికి ఒక కారణం ఆయన అధ్యక్షుడిగా వున్న ఎనిమిదేళ్ళలో ఎక్కువ ప్రభుత్వ ధనం యుధ్ధాల మీద ఖర్చు పెట్టటమే అనే విమర్శ వుంది. అదీకాక ఆయనకి ‘స్పెన్డింగ్ ప్రెసిడెంట్’ అనే పేరు కూడా వుంది. కార్టర్ దగ్గరనించీ వచ్చిన 253 బిలియన్ డాలర్ల లోటు (Deficit) నించీ, రీగన్ దాన్ని 1.412 ట్రిలియన్ డాలర్ల లోటు దాకా తీసుకువెళ్ళాడు. ఆతర్వాత రీగన్ ప్రభుత్వంలో ఉపాధ్యక్షుడిగా వున్న పెద్ద బుష్ 1988లో అధ్యక్షుడయాడు. ఆ లోటుని పూర్తి చేస్తాడని అనుకున్న వారిని నిరుత్సాహ పరుస్తూ, రీగన్ లాగానే ఆయన ఎన్నో యుధ్ధాలకు కాలు దువ్వి, దేశ ధనాగారం ఖాళీ చేశాడు. కాకపొతే గుడ్డిలో మెల్ల అని, లోటు కొంచెం క్రిందకి దిగి, 1.036 ట్రిలియన్ డాలర్లయింది. 1992లో డెమొక్రాటిక్ పార్టీకి చెందిన అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఆ లోటుని, తన ఎనిమిది ఏళ్ల పాలనలో 2000వ సంవత్సరానికి పూర్తిగా భర్తీ చేసి, 280 బిలియన్ డాలర్ల మిగులుతో (Surplus) తన పదవీ కాలం పూర్తిచేశాడు. 2000లో రిపబ్లికన్ జార్జి బుష్ అమెరికా అధ్యక్షుడయాడు. అప్పుడే 9/11 తీవ్రవాద చర్య రావటంతో, దేశం అల్లకల్లోలమయింది. అప్పటి ఉపాధ్యక్షుడు డిక్ చేనీ దేశాన్ని పూర్తిగా తప్పు దారి పట్టించి, తీవ్రవాదుల్ని వదిలి, 9/11తో ఏమీ సంబంధం లేని ఇరాక్ మీద యుద్ధానికి వెళ్లాడు. అన్ని తీవ్రవాదాలకూ కారణమైన పాకిస్తానుతో సహాయం కోసమని చేతులు కలిపి, అక్కడ ఎన్నో బిలియన్ డాలర్లు ముషారఫ్ చేతుల్లో పోశాడు. దానికి కారణాలు చాల వున్నాయి అని చెబుతారు. ఆ యుద్ధం వల్ల, తన వ్యాపారరంగంలోని ఎన్నో కంపెనీలకు కాంట్రాక్టులిచ్చి డబ్బు చేసుకున్నాడు అనేది ఒకటి. నిజానిజాలు మనకి తెలియదు. కానీ ఇరాఖ్లో ప్రపంచాన్నే మట్టు పెట్టే మారణాయుధాలు (Weapons of Mass Destruction) లేకపోయినా వున్నాయనీ, 9/11 తీవ్రవాద చర్యకు ఇరాఖే కారణమనీ అబద్ధాలు చెప్పి, ప్రజలలో భయం చొప్పించి తీవ్రవాదానికి అసలు కారణమైన పాకిస్తానులో బిలియన్లు కుప్పించటం, సియైయే వారి సమాచారాన్ని పక్కనబెట్టి, తన స్వంత మాటలతో ప్రజలనీ ప్రభుత్వాన్నీ నమ్మించి, మోసం చేయటం మాత్రం క్షమించలేనిది.
చేనీని పూర్తిగా నమ్మి, బుష్ పేరుకి మాత్రం అధ్యక్షుడిగా మిగిలిపోయాడు. ఇది సరిగ్గా మన ఆనాటి భారత ప్రధాని, కాంగ్రెస్ అధ్యక్షురాలి చెప్పుచేతల్లో వుండి, దేశ పరిస్థితిని గాలికి వదిలేసినట్టుగా అనిపించింది నాకు.
అధ్యక్షుడు క్లింటన్ అందించిన మిగులు ధనాన్ని పూర్తిగా ఖర్చు పెట్టటమే కాకుండా, బుష్ - చేనీ జంట అధ్యక్షడు ఒబామాకి, 1.413 ట్రిలియన్ డాలర్ల లోటుని బహుమతిగా ఇచ్చారు!
ఇది అమెరికన్ చరిత్రలోనే ఎన్నడూ కనీవినీ ఎరగనంత లోటు!
ఈ అనవసరపు వ్యర్థ యుద్ధం వల్ల, అమెరికా ఆర్ధిక పరిస్థితి 1929నాటి గ్రేట్ డిప్రెషన్ కన్నా ఘోరంగా తయారయింది. అంతేకాదు, ప్రపంచ ఆర్ధిక పరిస్థితిని కూడా ఆ సుడిగుండంలోకి తీసుకువెళ్ళింది.
సరిగ్గా అదే సమయంలో అమెరికా తన మొట్ట మొదటి నల్ల అధ్యక్షుడిని ఎన్నుకున్నది. విపరీతమైన మెజారిటీతో ఎన్నికయిన అధ్యక్షుడిని, రిపబ్లికన్ పార్టీ ప్రముఖులు, ఆయన్ని మనసా వాచా అంగీకరించలేదు. ఆయన అసలు అమెరికన్ కానే కాదన్నారు. పుట్టిన సర్టిఫికేట్ చూపించమన్నారు. ఆయన ముస్లిం అన్నారు. తీవ్రవాది అన్నారు. కమ్యూనిస్టు అన్నారు. ఇంకా ఎన్నో అన్నారు. ఆయన ఏ బిల్ ప్రవేశపెట్టినా, కాంగ్రెస్లో తిప్పికొట్టారు. అరడజను రిపబ్లికన్ భీష్ములు, ‘మేము ఆయన ఏ బిల్ ప్రవేశపెట్టినా, మేము అది చూడను కూడా చూడం. దాన్ని తిప్పి కొడతాం. ఎందుకంటే అది ఆయన ప్రవేశపెడుతున్నాడని’ అని బహిరంగంగా తమ ‘తెల్లతనాన్ని’ టీవీలోనే చాటుకున్నారు. అమెరికా చరిత్రలోనే అతి తక్కువ బిల్స్ పాస్ చేసిన కాంగ్రెసుగా, ఈ రిపబ్లికన్ కాంగ్రెస్ ఘనత వహించింది. ఆఖరికి సుప్రీం కోర్టు జడ్జిగా ఎంతో సమర్దుడయిన వ్యక్తిని కూడా, కేవలం ఈయన ప్రతిపాదించాడనే కారణంతోనే, అదీ పక్కన పెట్టిన మొనగాళ్ళు వీళ్ళు!
అయినా ఈ ‘కృష్ణ పక్షం’ అధ్యక్షుడు దేశ ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరచటమే కాకుండా, అర్థం పర్ధం లేని ఏ అనవసరపు యుద్దాలకీ వెళ్ళకుండా, బీద ప్రజలకి కూడా మెడికల్ ఇంష్యూరెన్స్ అందుబాటులోకి వచ్చేలా, ఎన్నో కార్యక్రమాలు అమలు పరచి దేశవిదేశాల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. నిరుద్యోగాన్ని దాదాపు ఎనిమిది శాతం నించీ, మూడున్నర శాతానికి దగ్గరగా తీసుకువచ్చాడు. 2008లో, 2012లో రెండుసార్లు అత్యధిక మెజారిటీతో అధ్యక్షుడిగా ఎన్నికయాడు.
ఇప్పుడు అమెరికాలో మళ్ళీ ఎన్నికలల సమయం!
ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల జోరు చూస్తుంటే, నాకు మళ్ళీ భారతదేశ రాజకీయాలతో ఎన్నో సమాంతరాలు కనపడుతున్నాయి. ఇవి ఎందుకు చెబుతున్నానంటే, నేను నా ముపై ఐదు ఏళ్లుగా చూసిన ఏ అమెరికన్ ఎన్నికలలోనూ ఇలాటివి నేను ఎన్నడూ చూడలేదు.
ఈ ఎన్నికలలో రిపబ్లికన్ అభ్యర్ధి వాడుతున్న ట్రంప్ కార్డులు:
1. ‘మెక్సికన్లు అందరూ రేపిస్టులు. మాదక ద్రవ్యాల అమ్మకందారులు’
2. ‘మెక్సికో సరిహద్దు గోడలు కట్టించి, దాని ఖర్చు మెక్సికో ప్రభుత్వం దగ్గర తీసుకుంటాను.’
3. ‘నల్లవాళ్ళు అందరూ నేరస్తులు. దొంగలు. పని చేయరు.’
4. ‘ఇండియన్స్ మన ఉద్యోగాలు తీసేసుకుంటున్నారు. వాళ్ళనీ, మిగతా ఇమ్మిగ్రంట్సునీ వెనక్కి పంపించేస్తాను.’
5. ‘ఆడవాళ్ళు బలిసిన పందులు. మగవాళ్ళతో ఎన్నడూ సమానం కారు. వాళ్లకి సమానంగా జీతాలు ఇవ్వను.’
6. ‘వికలాంగుల జన్మ వృధా. వాళ్ళు బ్రతకటం ఎందుకో అర్ధం కాదు.’
7. ‘నాకే అన్నీ తెలుసు. నేనొక్కడినే అన్నిటినీ సరి చేస్తాను.’ (ఇది ప్రజాస్వామ్యమా?)
8. ‘అమెరికన్ మిలటరీ జనరల్స్ అంతా దేనికీ పనికిరారు!’
9. ‘యుద్ధం చేస్తూ శత్రువులకు పట్టుబడ్డ సైనికులు అంటే నాకు అసహ్యం’
10. అమెరికాకి ఈనాడు కూడా పెద్ద శత్రువు అయిన ‘రష్యా కమ్యూనిస్టు నాయకుడు పూటిన్ చాల సమర్ధుడైన నాయకుడు, ఆయనతో చేతులు కలుపుతాను!’
ఇలాటివి చాల వున్నాయి. అన్నిటిలోనూ మనకి కనపడేది ‘తెల్లతనం’. అహంకారం, ధన మదం. అమెరికా వలస వచ్చిన వారితోనే పుట్టిందనీ, అలాగే ఇంకా పురోగమిస్తున్నదనీ మరచిపోవటం, ఇవేమీ నేను కల్పించి వ్రాసినవి కాదు. యూట్యూబులో ఆయన మాటలకి ప్రత్యక్ష నిదర్శనంగా ఎన్నో విడియోల్లో ఆయన మాటలు ఆయన నోటితోనే మీరే వినవచ్చు. గూగులమ్మ సాక్ష్యం!
ఇక ఆయనకి మద్దతుగా నిలిచిన పెద్ద మనుష్యులు ఎవరయ్యా అంటే:
1. కేకేకే (తెల్లవాళ్ళే అమెరికా దేశంలో వుండాలనీ, మిగతా అందరినీ, ముఖ్యంగా ఎందరో నల్లవాళ్ళని సజీవంగా తగలబెట్టిన సంస్థ కూ క్లస్ క్లాన్) నిర్వాహకులు, వాళ్ళల్లో ప్రప్రధమంగా డేవిడ్ డ్యూక్ అనే కేకేకే నాయకుడు.
2. అమెరికాలో ‘తుపాకుల్ని ప్రతి పౌరుడి చేతిలోనూ పెట్టాలనే’ లక్ష్యంతో వున్న ఎన్నారే.
3. ఎందరో రిపబ్లికన్ గవర్నర్లు, కాంగ్రెస్ మెన్, సెనేటర్లు. కొందరు రిపబ్లికన్లు అయితే, ఆయన అంటే మాకు ఇష్టం లేదు, అయినా ఆయనకే మేము ఓటు వేస్తాం అని కూడా పైకే చెప్పుకున్నారు.
ఇక్కడ ఇంకొక విశేషం ఏమిటంటే, ఎంతోమంది రిపబ్లికన్ నాయకులు, ఇద్దరు పాత ప్రెసిడెంట్లు పెద్ద బుష్, చిన్న బుష్, బార్బరా బుష్, ఇంతకుముందు సెక్రటరీ ఆఫ్ స్టేట్ కాలిన్ పావల్ మొదలైన వారు... ఈయన పాలసీలు నచ్చలేదనీ, ఆయనకి ఓటు వేయమనీ బహిరంగంగా చెప్పటం ముదావహం!
ఈ ఎన్నికలలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అని చెప్పటం కాదు ఈ వ్యాసం ఉద్దేశ్యం.
ఇండియాలో ఎన్నో దశాబ్దాలుగా ఎంతో ఘనమైన కాంగ్రెస్ పార్టీ పతనానికీ, అమెరికాలో కొన్ని శతాబ్దాలుగా ఎంతో ఘనమైన రిపబ్లికన్ పార్టీ ప్రస్తుత పరిస్థితికీ ఎంత దగ్గరగా సామీప్యాలు వున్నాయో అవి చూపించటమే నా ఉద్దేశ్యం.
ఆనాటి కాంగ్రెస్ పార్టీ అభిమానిగా ఇప్పుడు నాకు ఎంత ఆవేదన కలిగిందో, మళ్ళీ అంత ఆవేదన ఇక్కడ రిపబ్లికన్ పార్టీ ద్వారా రాకూడదనే నా కోరిక. అమెరికాలో రెండు పార్టీల వ్యవస్థ పడిపోకూడదనీ, ఈ రెండు పార్టీల మధ్యా ఆరోగ్యకరమైన పోటీ వుండటం అమెరికా దేశానికేకాక, ప్రపంచానికే ఎంతో అవసరమనీ భావించే కోట్లాది మందిలో నేనూ ఒకడిని కదా మరి!
౦ ౦ ౦