సుపుత్రుడు - 1
శ్లోకం:
ऐकेनापि सुवृक्षेण पुष्पितेन सुगन्धिना ।
वासितं तद्वनं सर्वं, सुपुत्रेण कुलम् यथा।।
ఏకేనాపి సువృక్షేణ పుష్పితేన సుగన్ధినా ।
వాసితం తద్వనం సర్వం సుపుత్రేణ కులం యథా ॥
సంధి విగ్రహం
ఏకేన, అపి, సువృక్షేణ, పుష్పితేన, సుగన్ధినా,
వాసితం, తత్, వనం, సర్వం, సుపుత్రేణ, కులం, యథా.
శబ్దార్థం
ఏకేన అపి = ఒకటైనా, సువృక్షేణ = మంచి చెట్టు చేత, పుష్పితేన = పుష్పించిన, సుగన్ధినా = సువాసనచేత లేదా పరిమళము చేత, తత్ వనం = ఆ వనము లేదా ఉద్యాన వనము లేదా అడవి, సర్వం = అంతయూ, వాసితం = వాసించును లేదా శోభించును, సుపుత్రేణ = సర్వలక్షణ శోభితుడైనటువంటి సుపుత్రుని చేత, కులం = మొత్తము కులము అంతా, యథా = (ఏ విధముగా వృద్ధిచెందునో) ఆ విధముగా.
Meaning
In a garden or a forest where there are many trees and among them even if there is one good tree which blossoms with flowers of beautiful fragrance, that mesmerizing fragrance spreads to the entire garden giving pleasantness to the atmosphere there in. It is, just as one good noble son gets name and fame to the entire clan and because of whom the complete family gets benefitted.
భావార్థం
ఉద్యానవనమంతా అనేక రకాలైన చెట్లతో నిండియున్నప్పటికీ అందులో ఏదేని ఒక చెట్టు సుగంధ సువాసన భరితమైన పుష్పాలతో విరబూసినచో, ఆ సుగంధ సుమనోహరమైన సువాసనలు ఆ వనమంతా వ్యాపించి ఆ పరిసర ప్రాంతమంతటినీ ఆహ్లాదపరచే వాతావరణాన్ని కలుగజేస్తుంది. వనములో ఉన్న జనులకి, వాహ్యాళికి వచ్చిన వారందరికీ కూడా మనోల్లాసాన్ని, ఉత్తేజాన్ని కలగ జేస్తుంది.
తెలివితేటలు, సత్ప్రవర్తన, ధర్మ పరాయణత్వము, పరోపకార బుద్ధి కలిగిన సకల విద్యాపారంగతుడు అయినట్టి, సర్వలక్షణ శోభితుడైనట్టి సుపుత్రుడు కలిగినచో ఆ కుటుంబము అంతా ఎంతగా వృద్ధి చెందునో, ఆ వంశానికి ఎంత పేరు ప్రఖ్యాతులు వస్తాయో అదే విధముగా సుగంధ పరిమళ భరితమైన ఒక్క పుష్పించిన చెట్టు వలన వనమంతా ఆహ్లాద భరితమౌతుంది. ఆ వనములో సంచరించే వారందరికీ మనోల్లాసాన్ని కలిగిస్తుంది.
---------- ॐ ----------
సుపుత్రుడు -2
శ్లోకం
वरमेको गुणी पुत्रो न च मूर्खशतान्यपि ।
एकश्चन्द्रस्तमो हन्ति न तारगणोऽपिच ॥
వరమేకో గుణీ పుత్రో న చ మూర్ఖ శతాన్యపి ।
ఏకశ్చంద్రస్తమో హన్తి న తారణోऽపి చ ॥
సంధి విగ్రహం
వరం, ఏకో, గుణీ పుత్రః, న చ మూర్ఖ శతాని, అపి,
ఏకః, చంద్రః, తమః, హన్తి, న, తారణాః, అపి, చ.
శబ్దార్థం
గుణీ = గుణవంతుడైన, పుత్రః = కుమారుడు, ఏకః = ఒక్కడు ఉండుట, వరం = అదృష్టం, మూర్ఖ శతాని = మూర్ఖులైన వంద మంది సంతానం, న అపి చ = ఏ మాత్రమూ కాదు, ఏకః చంద్రః = ఒక్క చంద్రుడు, తమః = చీకటిని, హన్తి = నాశనం చేస్తాడు, తారణాః = నక్షత్రాలు, న అపి చ = ఏ మాత్రమూ కాదు.
Meaning
One good and noble son is better than a hundred fools. Only one moon lights the sky, where as the stars do not. Similarly, one noble son brings fame and respect to family than hundred fools.
భావార్థం
సుగుణవంతుడు, విద్యాధికుడు, జ్ఞాన సంపన్నుడు, సన్మార్గ ప్రవర్తనుడు, ధర్మ వర్తనుడు, పరోపకార పరయణత్వము కలిగిన వాడు, సచ్ఛీలవంతుడు అయిన ఒక్క కుమారుడు కలిగి ఉండడమే ఒక వరము, ఒక అదృష్టము.
మూర్ఖులు, అజ్ఞానులు, దుర్మార్గులు, లోక కంటకులు, విద్యా గంధము లేని వారు, పరులకు అపకారము చేయు వారు అయిన వంద మంది కుమారులేల? కౌరవ సంతానము వలె!! అటువంటి వారు ఉండిననూ దండగే.
సువిశాలమైన ఆకాశములో కాంతులీనుచుండే ఉండే ఒక్క పున్నమి చంద్రుడు చాలును ఆకాశమునంతటినీ స్వచ్ఛమైన కాంతులతో నింపడానికి, చూపరులకి ఆహ్లాదాన్ని కలుగజేయడానికినీ మనస్సులను ఉత్తేజ పరచుటకునూ. మరియూ ఈ భూమిని అంతటినీ వెలుగులతో నింపి మనో రంజకం చేయుటకునూ. ఆకాశములో మిణుకు మిణుకుమని ఉండే అనేకమైన నక్షత్రాల వలన ఏమి ప్రయోజనము? ఈ భూమండలము పైన వాటి కాంతులు కూడా ప్రసరింపవు. అవి పూర్ణ చంద్రుని వలె ఏ రకమైన ఉత్తేజాన్ని, ఉల్లసాన్ని కలుగజేయవు. అవి నిష్ప్రయోజనము. నిష్ఫలము.
---------- ॐ ----------