ఒక శ్రమజీవి శరీరం విడిచి దివ్యాత్మ స్వరూపంతో భగవంతుని ముందు నిలుచున్నాడు.
సూటిగా భగవంతుని ఇలా ప్రశ్నించాడు, "వృద్ధాప్యం ఎందుకు సృజియించావు? నీవే ఇచ్చిన శారీరకమైన దృఢత్వాల్ని ఒకదాని తరువాత ఒకటిగా ఎందుకు లాగేసుకుంటావు? మాలోని శక్తినీ, శరీరపుష్టిని, సృజనశీలతను, కర్మ చేయగలిగిన లాఘవాన్ని అన్నిటినీ క్షయింపజేసి బలహీనమైన, కృంగిపోయే దేహానికి తీసుకొస్తావు ఆఖరుకు, ఎందుకలా?"
సృష్టికర్త చిరునవ్వుతో బదులిచ్చాడు.
"చిన్నివాడా, వృద్ధాప్యం శాపం కాదు, వరం. మీకు నేనిచ్చిన గొప్ప వరమది. వయసు పెరిగే కొద్దీ మరింత పరిపక్వమై, తెలివిమంతమై, నేను ఈ దేహం కాదు, ఇదెప్పటికైనా వదిలిపెట్టాల్సిందే, అసలు ఈ ప్రపంచమే నాది కాదు. దీనిని వదిలి అనంతలోకాలకు పయనం తప్పదు. మీ తండ్రినైన నన్ను చేరడమే చివరి లక్ష్యం అని మీరు తెలుసుకునేటందుకే జీవిత చరమాంకంలో వృద్ధాప్యాన్ని జోడించాను."
"ఎంత అద్భుతం! మాలో ఎందరికి ఇది తోస్తుందో మరి?!!"
"ఇంతేనా, మీరు గుర్తించకుండా విస్మరించే అద్భుతాలు ఎన్నో. ఒక్కసారి హృదయకవాటాలు తెరచి చూడండి. మీ చుట్టూ ఉన్న అద్భుతాలను గమనించండి.
ప్రకృతిలో ప్రతిదీ అద్భుతమే.
చిన్న విత్తనం పెద్ద మర్రి వృక్షం కావడం అద్భుతం కాదా!?!!
గొంగళిపురుగు సీతాకోకచిలుకగా మారడం అద్భుతం కాదా?!!
గర్భాలయంలో ఒక కణం మరొక కణంతో జతకూడి ఒక ప్రాణిగా పురుడు పోసుకోవడం అత్యంత అద్భుతం కాదా?!!
కళ్ళ ముందే కన్నీటిని మిగిల్చి మరణమనే పేరుతో దేహం చలనరహితమై పంచభూతాల్లో కలిసిపోవడం మరింత అద్భుతం కాదా?!!
ఏనాడైనా గమినించావా ఇవన్నీ?
చుట్టూ ఉన్న చెట్టుచేమలను మనసు పెట్టి చూచావా? వాటిలోని ఎదుగుదలను, ప్రాణశక్తిని గుర్తుపట్టావా?
అనంతమైన ఆకాశం అద్భుతం!
దిగంతాలను చుంబించే మహాసముద్రాలు అద్భుతం!
సూర్యుని వెచ్చదం అద్భుతం, చంద్రుని చల్లదనం అద్భుతం!
చూడగలిగే మనసుంటే ప్రకృతంతా అద్భుతాలమయమే. అనంతమైన శక్తిని అందిస్తూనే ఉంటుంది. ఎల్లప్పుడూ సానుకూల పవనాలు వీస్తూనే ఉంటాయి. ఇన్ని అద్భుతాల మధ్య విసుగు అనే మానవుడి మనోస్థితి ఎలా పుట్టుకొచ్చిందో నాకు చిత్రంగా ఉంటుంది. నా సృష్టిలో లేని విపరీతం అది.
శ్వాస తీసుకున్న ప్రతిసారీ భగవంతుని సృష్టితో నేనూ ఒక లంకె వేసుకుంటున్నట్లు ఎందుకు భావించవు?
నీవెప్పుడూ ఆ ప్రకృతిలో భాగమని ఎందుకు గుర్తించవు?
గుర్తించి ఎందుకు ఆ అనుభూతిని అనుభవించవు?
అనుభవించి ఎందుకు ఆనందించవు?!!"