ఈ క్రింది "ప్రశ్న"కు పద్య రూపములో జవాబు పంపాలి. మీజవాబులు విద్యుల్లేఖద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖులోపలపంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేటతెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము.
ఈ మాసంప్రశ్న:
(మత్తకోకిల) గోటితో సరిపోవుదానికి దానికి గొడ్డలేటికి? వద్దురా!
గతమాసం ప్రశ్న:
ఈ క్రింది పద్యాన్ని 'చంపకమాల' ఛందస్సులో తిరిగి వ్రాయాలి.
అక్కఱకు రాని చుట్టము
మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమునఁ దా
నెక్కినఁ బాఱని గుఱ్ఱము
గ్రక్కున విడువంగ వలయుఁ గదరా సుమతీ !
ఈ ప్రశ్నకు మాకు అందిన క్రమములో పూరణలు ఇలా వున్నాయి.
వారణాసి సూర్యకుమారి, మచిలీపట్నం
అవసర కాల మందున సహాయము జేయని బంధువైననూ
సవినయ విన్నపమ్ము వినజాలని వేల్పును యుద్ధ రంగమున్
వ్యవధిగ నిల్చి సాగని హయంబును వెంట నె వీడ వచ్చునీ
సవివరణంబు చూసినను చాలును చేసిన మేలు సన్మతీ
డా.రామినేని రంగారావు యం,బి,బి,యస్,.పామూరు,ప్రకాశం జిల్లా.
(1)
అవసరమైన వేళలను ఆదుకొనంగను రాని చుట్టమున్
దివిజుల మ్రొక్కి కొల్చినను దీవెన లివ్వని యిష్టదైవమున్
జవమున నెక్కి తోలినను సాలుగ సాగని స్వారి గుర్రమున్
తెవడుచు వీడగావలెను తీరుగ జీవన యాత్ర సాగగన్
(2)
ఇడుముల చిక్కుకున్నపుడు యేమని చేరని మిత్రబృందమున్
కడు ధనమిచ్చికొన్న నవ కారదిమొండిగ సాగకుండినన్
విడువక అర్జి లిచ్చుచును వేడిన పల్కని నాయకాధమున్
విడిచిన ధన్యమౌదుమిల వీరి తెరం గది యెంచి చూడగన్
గండికోట విశ్వనాధం, హైదరాబాద్
అదనున సాయమేమియు నొనర్పగ జాలని యట్టి చుట్టమున్
ముదమున భక్తితోడ మది మొక్క వరంబిడ లేని వేల్పునిన్
కుదురుగ నెక్కినన్ కదలకుండగ మొండిగ నుండు గుర్రమున్
వదలగ నొప్పు శీఘ్ర గతి వాదములేల? సుధీర ధీనిధీ !
జంధ్యాల కుసుమకుమారి, హైదరాబాదు.
ఇడుములలోన నాదుకొన నెన్నడు వెన్కకు బోవు భాంధవున్
తడలని భక్తి తోడ తగు తంస్తుతి చేసినగాని కామితం
బిడని వరిష్ట దైవమును భీకర సైన్యధళంబు తొచ్చు టన్
వడిగ చరింప లేని తన వాజిని చెయ్యన పోనిడం డబున్
పుల్లెల శ్యామసుందర్, శాన్ హోసే, కాలిఫోర్నియా
అడిగిన వెంటనే మనను ఆదుకొనంగగ రాని బంధువున్
ఇడుములలోన మ్రొక్కినను ఏమివరంబులు ఈని దైవమున్
వడివడిబోవ ఎక్కినను బాయని గుర్రము గొప్పదైననూ
విడువగ నుత్తమంబగు వివేకముతో మనమెంచి జూచినన్