‘కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టింది అనేది సామెత. మధ్యలో ఈ మేసే గాడిద ఎక్కడినించీ వచ్చింది. ఎవడు నీకు తెలుగు నేర్పింది?’ అని రావి కొండలరావులా కోప్పడకండి. నాకు కూడా తెలుసు ఆ సామెత. గాడిదలు తమకు తెలిసిన గార్ధభ స్వరంలో కూస్తే వినలేమని తెలుసు కనుక, ఈ వ్యాసంలో కూసే గాడిదల జోలికి వెళ్లటం లేదు. ఈసారికి మేసే గాడిదల సంగతి చూద్దాం. అలా అని నేను మన రాజకీయ నాయకుల గురించి అస్సలు వ్రాయటం లేదు. ప్రామిస్!
నేను రోజువారీ ఉద్యోగంలో నించీ విశ్రాంతి తీసుకుని, పదవీ విరమణ తర్వాత కన్సల్టింగ్ ఉద్యోగం మొదలుపెట్టాక, కొన్ని పెద్దా చిన్నా కంపెనీల్లో టెక్నికల్ ట్రైనింగ్ కార్యక్రమాలు కూడా చేస్తున్నాను. వాటిల్లో ఒకదాని గురించి సరదాగా వ్రాద్దామనిపించి వ్రాస్తున్నాను.
ఉద్యోగాల్లోనే కాక, మామూలుగా బయట కూడా, మనుషుల్లో రెండు రకాలవాళ్ళు వుంటారు. ‘ఎలా చేయాలి?’ అని ఆలోచించే వాళ్ళు ఒక తెగ. ‘ఎలా చేయకుండా తప్పించుకోవాలి?’ అని చూసే వాళ్ళు ఇంకొక తెగ. అంటే (అ)ప్రాచ్య భాషలో, ‘How to do’ అని ఆలోచించే వాళ్ళు, ‘How not to do’ అని చూసే వాళ్ళూ అన్నమాట.
గాడిదల్లో కూడా - బరువులు మోయటం గాడిదలు చేస్తాయి కనుకా, గాడిద బరువు అనే పేరు కూడా అందుకే వచ్చింది కనుకా, మేసే గాడిదలతో పాటు, మోసే గాడిదల గురించి కూడా వ్రాస్తున్నాను. అంటే పైన చెప్పిన వాళ్ళల్లో బాధ్యతతో పని చేసే వాళ్ళని మోసే గాడిదలుగానూ, పని దొంగలను మేసే గాడిదలు గానూ సరదాగా చెప్పుకుందాం.
‘మళ్ళీ అదేమిటి? మనుషుల్ని గాడిదలతో పోలుస్తావా? ఎవడు నీకు తెలుగు నేర్పింది?’ అని మళ్ళీ రావి కొండలరావులా కోప్పడకండి. వసుదేవుడంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు. అందువల్ల అలా చెప్పటం వారిని తక్కువ చేయటం కానేకాదు. ఇక అసలు కథలోకి వెడదాం.
మనుష్యుల్లో కూడా ఏ పనయినా చేయటానికి ముందుకు ఉరికి చక్కగా పని చేసేవారు, నిజంగా ఉత్సాహవంతులైన పనివాళ్ళు. ఏమయినా సాధించగలిగే వాళ్ళు. Positive thinking వున్నవాళ్ళు. ఆశావాదులు. రెండవరకం ‘వినరా సుమతి’ గారు చెప్పినట్టు, తప్పించుకు తిరిగే ధన్యులు. అంటే ఎడ్డెం అంటే తెడ్డెం అనే బాపతు. సాధించుకు తినేవాళ్ళు. Negative thinking వున్నవాళ్ళు. నిరాశావాదులు.
ఇక ఈ రెండు రకాల వారి గురించీ ఈ వ్యాసంలో చెప్పుకుందాం. వసుదేవుడిగారిని ఎంత మనసులో పెట్టుకుని సర్దుకుపోతున్నా, మాటిమాటికీ గాడిదలు అంటుంటే అంత బాగాలేదు కనుక, ఇక నించీ మోసే గాడిదలని ఆశావాదులనీ, మేసే గాడిదలని నిరాశావాదులనీ అందాం.
మా వైస్ ప్రెసిడెంట్ సేల్స్ గారు, జపాన్ దేశం నించీ నెలకి అర మిలియన్ డాలర్లు లాభం వచ్చే ఒక కొత్త ప్రాజెక్ట్ పట్టుకువచ్చాడు. ‘భలే మంచి చౌక బేరమూ..’ అని పాడుతూ వచ్చి మా కాన్ఫరెన్స్ గదిలో, ఆ ప్రాజెక్ట్ విశేషాలు ఎంతో ఉత్సాహంగా చెబుతున్నాడు.
‘ఏమంటారు.. ఇంత మంచి ప్రాజెక్ట్ మనకే వచ్చింది. కొంచెం కష్టమూ, క్లిష్టమూ, ఎక్కువ సమయం తీసుకునేదే అయినా, మనమంటే ఇష్టపడి మనకే ఇచ్చారు. మన కంపెనీని నాలుగు కాలాల పాటు గట్టిగా నిలబెడుతుంది. జాగ్రత్తగా చేస్తే, సులభంగా ఎన్నో లాభాలు తెస్తుంది. ఏమంటారు?’ అని అడిగాడు.
అతను చెబుతున్నప్పుడే అక్కడ వున్న మేనేజర్లు, డేమేజర్లు బల్ల మీదకి వంగి నెమ్మదిగా గుసగుల భాషలో మాట్లాడుకుంటున్నారు. కొందరయితే మిగతా వాళ్ళకి అర్ధం కాకుండా ‘కా’ భాషలో భాషిస్తున్నారు.
వారిలో నిరాశావాది, ‘ఇది చాల కష్టమైన ప్రాజెక్ట్ అంటున్నారు. హాయిగా వున్న ప్రాణాలకి ఈ తద్దినం ఎందుకు. వద్దులెండి వైసుగారూ!’ అన్నాడు.
మా వైసు అసలే తెల్లవాడేమో, ఇంకా తెల్లబోయాడు. ‘అదేమిటి’ అన్నాడు.
నిరాశావాదుల మేనేజర్, ‘ఇది చాల కష్టమైన ప్రాజెక్ట్ అని మీరే చెప్పారుగా. హాయిగా వున్న ప్రాణాలకి ఈ తద్దినం ఎందుకు చెప్పండి. ఇంకేదన్నా చిన్న ప్రాజెక్ట్ చేసుకుందాం. వద్దులెండి సేల్సుగారూ!’ అని మళ్ళీ అన్నాడు.
ఆశావాది మేనేజర్ అన్నాడు. ‘అట్టే.. అట్టే.. అదేమిటి. ఇంత లాభం వున్న ప్రాజెక్ట్ వదులుకుంటే ఎలా. కష్టమైనది కాబట్టే మనం చేయగలమని, ఇది మనకి ఇచ్చారు. కష్టమైతే, ఏది ఎలా చేయాలో అందరి బుర్రలు కలిపేసి, అలోచించి ఒక చక్కటి ప్లాన్ తయారుచేద్దాం’ అని.
‘కష్టమే కాదు, ఇది క్లిష్టమైనది అని కూడా అన్నారు మీరు’ అన్నాడు నిరాశావాది.
‘క్లిష్టమైతే.. వదిలేస్తామా! చిన్న చిన్న వివరాలు కూడా వదిలేయకుండా, జాగ్రత్తగా చేద్దాం. మనిషిని చంద్రమండలం మీద దించిన వాళ్ళం, దీనికే భయపడితే ఎలా’ అన్నాడు ఆశావాది.
‘ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టటానికి ఎక్కువ సమయం తీసుకుంటుందని కూడా మీరే అన్నారు, యవరానర్!’ అన్నాడు నిరాశావాది.
‘అందుకని మానేస్తామా? మంచి ఆదాయం వస్తుంది కనుక, ఇంకో ఇద్దరో ముగ్గురో కొత్త ఇంజనీర్లకు ఉద్యోగాలు ఇస్తే సరి! మంచి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వుంటుంది’ అన్నాడు ఆశావాది.
‘కొత్తవాళ్లకు ట్రైనింగ్ ఇవ్వటానికి నాకు సమయం లేదు’ అన్నాడు నిరాశావాది.
‘సమయం లేకపోవటం అంటూ వుండదు. రోజుకి పది గంటలు, వారానికి ఐదు లేదా ఆరు రోజులు పని చేయవచ్చు. మనం చేసే పనులకి ఇచ్చే ప్రాముఖ్యాన్ని బట్టి వుంటుందది. మీ చిన్న ప్రాజెక్టులని, మన బ్రౌను దొరగారికి ఇచ్చి, ఆ మిగిలిన సమయాన్ని దీనికి వాడండి’ అన్నాడు ఆశావాది, నన్ను చూస్తూ.
‘ఈ కష్టమరు కాకపొతే, ఇంకొకడు వస్తాడు. ఎదగటానికి ఎందుకు అంత తొందర?’ అన్నాడు నిరాశ.
‘మన వైసుగారు ఎంతో కష్టపడి ఈ కష్టమరుని పట్టుకున్నారు. మనమంటే ఎంతో ఇష్టపడుతున్న కష్టమరుని వదిలేస్తే, ఆయన కష్టపెట్టుకోడూ. చేతిలో వున్న ఒకటీ, బుష్ గారి దగ్గర వున్న రెండు కన్నా మంచిది అనే సామెత వినలేదూ! ఎందుకూ అనవసరంగా వదులుకోవటం?’ అన్నాడు ఆశ.
‘ఏమో.. నా ఎడమ కన్ను అదురుతున్నది. ఈసారికి దీన్ని వదిలేద్దాం’ అన్నాడు నిరాశావాది.
‘ఇందాక మన వైసు భలే మంచి చౌక బేరమూ అనే ఈలపాట పాడలేదూ. అంత మంచి ప్రాజెక్టుని వదులుకోవటానికి మీకు మనసెలా వచ్చింది. ఇదో గొప్ప మహత్తర అవకాశం’ అన్నాడు ఆశావాది.
‘ఇలాటి ప్రాజెక్ట్ చేయటానికి, మనకి వున్న సాంకేతిక గ్నానం చాలదు’
‘గ్నానం కాదు. జ్ఞానం. మనకి అది చాలా వుంది. చాలకపోతే అప్పు తెచ్చుకుంటాం. అద్దెకు తెచ్చుకుంటాం. మరీ అవసరమైతే దాన్ని కోనేస్తాం’
‘సరేనయ్యా.. చేద్దాం. ఇంతకు ముందు ఒకసారి ఇలాటిదే చేయబోయి బోర్లా పడ్డాం కదా. మళ్ళీ ఎందుకు అనవసరంగా బోర్లా పడటం’ అన్నాడు నిరాశ, మోచేతులు రుద్దుకుంటూ.
‘పడ్డవాడే పైకి లేస్తాడు అనే సామెత విన్నారా మీరు. పైకి లేస్తాం. ఆ అనుభవంతో ముందుకి వెడతాం. పదండి ముందుకు అనే సామెత కూడా వాళ్ళ భాషలో వుందని మన బ్రౌను దొరగారు చెప్పారు కదూ ఒకసారి’
‘ఇలాటి ప్రాజెక్టులు మనం ఎందుకు చేయాలో నాకు అర్ధం కావటం లేదు!’ అన్నాడు నిరాశావాది.
‘ఎందుకా.. ఇలాటి ప్రాజెక్టులు చేస్తేనే.. మనకీ మన శత్రు కంపెనీలకీ ఎంతో తేడా కనిపిస్తుంది కనుక!’
‘అయినా సరే.. ఈ ప్రాజెక్టులో నేను వుండను’ అన్నాడు నిరాశావాది.
‘ఉంటే వుంటావు, లేకపోతే వుండవు’ అన్నాడు ఆశావాది.
‘అంటే?’ అడిగాడు నిరాశావాది.
‘అంటే మన ఆంగ్లమున ఒక సరళమైన సామెత వుంది. If you are not in, you are out అని. అదే మన ప్లస్సుగారు చెబుతున్నది. మేసే గాడిదలు కూడా, మోస్తేనే బాగుంటుంది. ఇవాళ ఇంటికి వెళ్లి ఒకసారి ఆలోచించుకో, రేపు ఆఫీసుకి రావాలా వద్దా అని. రావాలనుకుంటే ఈ ప్రాజెక్ట్ చేయటానికి సిద్ధపడి ఆఫీసుకి రా. వద్దనుకుంటే వచ్చే ఏడు జన్మల్లో మళ్ళీ ఎప్పుడైనా ఇంకోసారి కలుద్దాం’ అన్నాడు పక్కనే కూర్చుని అంతా వింటున్న ప్రెసిడెంట్.
చదువరులారా: ఈ వ్యాసంలో ఇలాటి రెండు వ్యక్తిత్వాల మధ్యా వుండే తేడాలు పది వున్నాయి. అవేమిటో విశ్లేషించి, తెలుసుకోండి! మీ వ్యక్తిత్వ వికాసానికీ, మీరు చేసే ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తాయి!
అవేమిటో తెలుసుకోలేకపోతే ఈ వ్యాసం మళ్ళీ చదవండి. నన్ను అడిగితే, కన్సల్టింగ్ ఫీజు ఇచ్చుకోవాల్సి వస్తుంది మరి!