షణ్ముఖానందస్వామి రంగాపురంలో పదిరోజుల నుంచీ అనర్ఘళంగా ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తున్నాడు.
రామాయణ, భారత, భాగవతాలు, అష్టాదశపురాణాల నుంచి రోజుకో అంశాన్ని ఎంచుకుని వినేవాళ్ళ మనసుని హత్తుకునే విధంగా శ్రావ్యంగా చెబుతున్నాడు.
అయితే ఆయన ప్రతి ప్రసంగంలో భగవంతుడున్నాడని, ఆయన ఉనికిని మనం తెలుసుకోగలిగితే అదే ముక్తిమార్గమని చెప్పడం పదహారేళ్ళ శ్రవణ్ కి నచ్చలేదు. యువ రక్తం కావడం వల్ల భగవంతుడనేవాడు లేడని, లేనిదాన్ని ఉన్నట్టుగా మాటలతో మాయచేస్తూ స్వాములు, సన్యాసులు తమ పబ్బం గడుపుకుంటారని అతని నమ్మకం. అందుకే ఆ రాత్రి ఆయనతో వాదించి, తను గెలవాలని మనసులో గట్టిగా నిశ్చయించుకున్నాడు.
ఎప్పట్లా ఆ రాత్రి ప్రసంగం పూర్తయ్యాక షన్ముఖానంద స్వామి అందరివంకా ఓ మారు ప్రశాంతంగా చూసి "మీకేమైనా సందేహలున్నాయా? ఉంటే నా దగ్గరకి వచ్చి అడిగి తీర్చుకోండి"అన్నాడు.
ఆ అవకాశం కోసమే ఎదురుచూస్తున్న శ్రవణ్ లేచి నిలబడి వడి వడిగా నడుస్తూ ఆయన దగ్గరకి వెళ్ళాడు.
"చెప్పు నాయనా నీ సందేహమేమిటి" అన్నాడు చిరునవ్వుతో.
"దేవుడనేవాడు లేడు. కానీ మీలాంటి వాళ్ళు ఉన్నాడని నమ్మిస్తూ, మీ కాలం మా కాలం వృధాచేస్తుంటారు"అన్నాడు కాస్త చిరాగ్గా.
ఆయన అతని వంకోసారి నిశితంగా చూసి "మీ అమ్మ అంటే నీకిష్టమేనా?"అన్నాడు.
"ఆఁ"అన్నాడు.
"ఎందుకు?"
"నన్ను కనీ పెంచి పెద్దచేసింది. ఇప్పటికీ..నేనింతవాడినైనా నాకేమన్నా అయితే తల్లడిల్లిపోతుంది. అందుకే అమ్మంటే నాకిష్టం"అన్నాడు.
"మీ అమ్మని నేను దేవుడంటే నీకేమైనా అభ్యంతరమా?"
"లేదు.."
"సరే..మరి మీ నాన్నంటే?"
"ఇష్టమే..ఎందుకంటే పెంచి పోషిస్తున్నాడు. నా కావలసినవన్నీ అందిస్తున్నాడు. ఆయన్ని దేవుడన్నా నాకు అభ్యంతరం లేదు"టకటక చెప్పేశాడు.
"సరే..మరి మన జన్మకి కారణం ఈ ప్రకృతి అంటే అమ్మ, అలాగే మనని పళ్ళతో, పంటలతో, నీళ్లతో ఇంకా అనేకానేక వనరులతో పోషిస్తోంది కాబట్టి ప్రకృతి మన తండ్రి కూడా అవునా? అంటే దేవుడేగా"అని ఆగాడు.
"ఒప్పుకుంటాను..కానీ"
"నన్ను చెప్పనీ బాబూ, అబద్ధాలు ఆడటాన్ని, అన్యాయం చేయడాన్ని, అధర్మాన్ని నువ్వు ఇష్టపడతావా? లేదుకదా..అవి కూడా దేవుడి రూపమే అనుకుందాం, అలా అనుకుంటే నీకు అభ్యంతరం లేదుగా"
"ఊహూఁ"
"దేవుడంటే నాలుగుగోడల మధ్యా ఉండే రాతిబొమ్మ అనుకుంటేనే వస్తుంది చిక్కల్లా. మంచితనం, మానవత్వం, రుజువర్తనల పర్యాయపదం దేవుడంటే ఎవరికీ ఇబ్బంది ఉండదు. ఆధ్యాత్మిక ప్రసంగాల్లో పురాణాలని ఎందుకు ప్రస్తావిస్తామంటే, అవి అందరకూ తెలుసుకాబట్టి. నీ కథ, నా కథ ఎంతమందికి తెలుస్తుంది? చెప్పు. ఆధ్యాత్మిక గ్రంథాల్లో మంచి మనస్తత్వాలతో అలరారే దేవుళ్ళుంటారు. దుష్టత్వానికి కొమ్ముకాచే రాక్షసులుంటారు. ఆ రెంటి మనస్తత్వాలని విడమరచి చెబితే మన మనసు మంచి వైపు మొగ్గుతుంది. ఇప్పటి సైకాలజిస్టులు చేసేదదే. పురాణాలు కేవలం కాలక్షేపానికి కాకుండా, అందులోని మంచి లక్షణాలు పుణికి పుచ్చుకుంటే మనమూ దేవుళ్ళమే! దైవం మానుషరూపేనా అన్నది నువ్వు వినేవుంటావు! సమాజాన్ని తప్పుడు మార్గం పట్టకుండా సరైన దారిలో నడిపించేది ఆధ్యాత్మికత్వం. అది కేవలం మంచిని బోధిస్తుంది. మానవత్వాన్ని ప్రేరేపిస్తుంది. అంతేకాని వర్గ వైషమ్యాలకు కారణమవదు. కుల మతాల విభజన చేయదు. ఈ అంతరార్థం తెలియక మిడి మిడి జ్ఞానంతో కొంతమంది తమ స్వార్థానికి ఆధ్యాత్మికవాదాన్ని ఆలంబన చేసుకుంటున్నారు. తులసి మొక్కలున్న చోట గంజాయి మొక్కలూ ఉంటాయి. ఎంచుకోవడంలోనే మన విచక్షణ బయటపడేది" అన్నాడాయన చిరునవ్వుతో.
"అర్థమైంది స్వామీ"అని మనస్ఫూర్తిగా ఆ పెద్దాయన కాళ్ళకి దణ్ణం పెట్టుకున్నాడు శ్రవణ్.