(గత సంచిక తరువాయి)
కం. అత్యాశ్చర్యం బచ్చట
సత్యముగా నంబి లేడు - సాక్షాత్తుగ నే
ప్రత్యయముగ వినుతించెడు
నిత్యారాధ్యుడగు ఆంజనేయుండుండెన్.
ఉ. కాంచితి నేత్రముల్ చెదర, క్రాలి శరీరము భ్రాంతిజెంద, నా
కాంచన వర్ణ దేహుని, వికస్వర శోణ ముఖాంబుజున్, మహో
గ్రాంచిత విగ్రహున్, శతసహస్ర విభాకర కాంతిమంతు, నా
సంచిత పూర్వ పుణ్య ఫల సంపద రూపము నొందెనో యనన్.
తే.గీ. అంశుమంతుని లే వెల్గు లాననమున
సోకినందు వలన గాదు శోణకాంతి
తోచె మున్ను చూచినపుడు - తోరమైన
అంజనాసుతు వక్త్రంపు హరువు గాని.
కం. ప్రియముగ నేనట నిలబడి
క్షయించుచు నపుడు పిపీలకము వలె కుఱుచై,
నయమున తలపైకెత్తితి
భయమును భక్తియు ముడివడి పరవశమొనరన్.
సీ. లేతసూర్యుని బోలు పూతమౌ మోముపై
కరుణారసంబు పొంగారువాని,
నలినీదళములట్లు నలువుగా శోభిల్లు
లోచనద్వయితోడ తోచువాని,
దొండపండ్లను బోలు మండిత ప్రభతోడ
మెఱపు దీపించు వాతెఱల వాని,
జీవరాశిని తన భావంబుతో కట్టు
అంగజునకు లొంగనట్టి వాని
తే.గీ. రాక్షస ధ్వాంత విధ్వంస రశ్మివంతు,
ఘనుని ధీమంతు, బలవంతు, కాతివంతు,
కీశసామంతు, నతిలోక కీర్తివంతు,
అవతరించిన హనుమంతు, నతులదాంతు.
చూచి తిలకించి పులపించి చోద్యమంది,
భక్తి ప్రభవించి చిగురించి పరిణమించి
పరగి ప్రసరించి ఫలియించి పరిఢవించి,
నతిని తలవంచి మదినెంచి నాడ నపుడు.
తే.గీ. చూచి తిలకించి పులచి చోద్యమంది,
భక్తి ప్రభవించి చిగురించి పరిణమించి
పరగి ప్రసరించి ఫలియించి పరిఢవించి,
నతిని తలవంచి మదినెంచి నాడ నపుడు.
మ. అనుకోనట్టి విధాన నా ప్రభువు వాతాత్మోద్భవుం డా విధిన్
కనిపించన్ మదిలోన సంతసిలి భాగ్యంబంచు స్పందించి నా
తనువుప్పొంగ మహోత్సుకంబునను సంధానించి సాష్టాంగముల్
వినయం బొప్పగ జేసి దండకముతో ప్రీతిన్ ప్రశంసించితిన్.
దండకం:
శ్రీ ఆంజనేయా! శితాంభోజ నేత్రా! మహా దివ్యగాత్రా! జగత్ప్రాణపుత్రా! మహోదగ్ర వేత్రా! సురద్వేష సీమంతినీ స్తోమ మాంగళ్య తంత్రీ లవిత్రా! పవిత్రా! గిరీశాంశ జాతా! నమో రామ దూతా! సుమిత్రాసుత ప్రాణదాతా! నమో బ్రహ్మ తేజా! - వివస్వంతు నంశోద్భవుండైన సుగ్రీవుకున్ మంత్రివై నీవు శ్రీ రామ భూజానితో సఖ్యమొప్పంగ జేయించి అవ్వానికిన్ బద్ధశత్రుండు సాజన్ముడున్ శూరుడౌ వాలి దున్మించి, కిష్కింధలో కీశ సామ్రాజ్య పట్టాభిషేకంబు చేయించి - శ్రీ రామరాజేంద్రు భార్యామణిన్ జానకీదేవినిన్ దైత్యుడౌ రావణుండెంతయో మాయతో మున్ను గొంపోవ, ఆ సాథ్వి అన్వేషణార్థంబు నీవంత శ్రీ రామునాజ్ఞానుసారంబుగా దక్షిణాంబోధి లంఘించి, శ్రీలంక వేజేరి, ఆ లంఖిణిన్ జంపి, ఆ దీవి గాలించి వైదేహినిన్ గాంచి, హస్తాంగుళిన్ గుర్తుగా నామె కందించి "నీ భర్త వైళాన వేంచేసి దైతేయులన్ దున్మి గొంపోవు ని" న్నంచు ధైర్యంబు కల్పించి - లంకేశు గర్వంబు నిర్మూలముం జేయ సీతమ్మ బందీగ నున్నట్టి ఆరామమున్ గూల్చి ఆ తోట రక్షించు యోధాళినిన్ మొత్త, కోపించి దైత్యేంద్రు డస్తోక సైన్యంబుతో పుత్రుడౌ అక్షునిన్ బంప, దర్పించి నీవంత దోర్వీర్య మొప్పంగ నీ ముష్టి బంధంబుతో వారి తాటించి, ఘట్టించి, మర్చించి, ఘాతించి సంహారమున్ జేయ - వాలంబు నల్గంగ బుస్సంచు వే లేచు నాగంబు బోలంగ రక్తారుణోదగ్ర నేత్రాననుండౌచు ఘూర్ణిల్లి అక్రోశముల్ పల్కి పౌలస్త్యుడా ఇంద్రజిత్తైన ఆత్మోద్భవున్ మేఘనాదున్ జయోత్సాహు నీపైకి బంపంగ, నీవున్ దశగ్రీవు నీక్షింపగా గోరి, స్వచ్ఛంద మార్గాన బ్రహ్మాస్త్ర బద్ధుండవై రావణాస్థానమున్ జేరి ఆ రాక్షసాధీశుతోడం, "కులస్త్రీని మోహించి బంధించుటల్ పాపమే గాక, నీ ప్రాణముల్ దీయు, నీ వంశ నాశంబు తథ్యంబు శ్రీ రామ బాణాగ్నిచే గాన భూపుత్రియైనట్టి సీతామహాదేవినిన్ భర్తయౌ రామభూపాలు కర్పించి ఆ స్వామి పాదంబులన్ దాకి రక్షింపగా వేడి జీవింపుమా" యంచు ధర్మంబు బోధింప, వాడల్గి నీ తోకకున్ నిప్పు ముట్టించ, నీ వంతలో శృంఖలల్ ద్రెంచి, గర్జించి జృంభించి నీ వాలమున్ ద్రిప్పి జ్వాలల్ రగిల్పించిలంకాపురిన్ చైత్యముల్, హట్టముల్, కోష్టముల్, గోపురంబుల్, నిశాంతంబులున్, కుద్యముల్, కుట్టిమంబుల్, చతుశ్శాలలున్, ఆయుధాగారముల్, పానశాలల్, గజాశ్వాది వాసంబులున్, రాజ హర్మ్యంబులున్, రాణివాసంబులున్ వీతిహోత్రాహుతిన్ జేసి, సంతృప్తితో వేగ సంద్రంబునున్ దాటి, నీ మిత్రులున్, భృత్యులున్, సైనికుల్ మెచ్చ శ్రీ రామునిన్ జేరి, సీతమ్మ క్షేమంబు వాక్రుచ్చి, ఆపైన నాదేవి చూడామణిన్ గుర్తుగా నిచ్చి, సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువౌ రామ సర్వంసహా భర్తకున్ నీవు సంతోషభూతుండవై ప్రీతిపాత్రుండవై, స్వామి దాసానుదాసుండవై మించు నిన్నెంచి కీర్తింతు నో అంజనాదేవి పుత్రా! మహాత్మా! మదీయాత్మ సంవాస! ప్రీతిన్ నమస్కారముల్ జేసి అర్థించి, పూజించి, సేవించు భక్తాళినిన్ సాకి, వారిన్ చిరంజీవులన్ జేసి, ఆరోగ్య సౌభాగ్య భాగ్యంబులన్ గూర్చు సౌజన్య మూర్తీ! సదాబ్రహ్మచారీ! నమో రామభక్తోపకారీ! దశగ్రీవ గర్వాపహారీ! ననుంబోలు మూఢాత్ములన్ క్షాంతి వీక్షించి రక్షించి కాపాడుమయ్యా ప్రభూ! దేవ దేవా! ప్రణామంబులయ్యా మహావీర! ఓ సుందరాకార! ఓ దుష్ట సంహార! ఓ దివ్య రూపా! నమస్తే! నమస్తే! నమస్తే! నమ:!