సారస్వతం
సాహిత్యంలో చాటువులు 20
-‘విద్వాన్’ తిరుమల పెద్దింటి. నరసింహాచార్యులు

(గతనెల వ్యాసం యొక్క రెండవ భాగం యిది. దీనితో ఈ శీర్షికని ముగిస్తున్నాను)

“ ఆలస్యం అమృతం విషం” అన్న వాక్యం కూడ తరచూ వాడుతుంటాం. దాని వివరణ--

౫. “సిద్ధమన్నం- ఫలం పక్వం – నారీ ప్రథమ యౌవనం/
కాలక్షేపం న కర్తవ్యం “ఆలస్యా దమృతం విషం”//

“వండిన అన్నాన్ని, పండిన పండుని, యవ్వనంలో ఉన్న స్త్రీని కాలక్షేపం అంటే ఆలస్యం చేయకుండా అనుభవించాలి. ఆలస్యం చేస్తే అన్నం పాడైపోతుంది, పండు కుళ్ళిపోతుంది, స్త్రీకి యవ్వనంపోయి వృద్దాప్యం వచ్చేస్తుంది.” అన్న సందర్భంలో ‘ఆలస్యం అయితే అమృతం కూడా విషంగా మారిపోతుంది’ అన్న వాక్యం వాడబడింది.

౬. “ రాజా రాక్షసశ్చైవ – శార్దూలాః తత్ర మంత్రిణ:/
గృధ్రాశ్చ సేవకాస్సర్వే – ‘ యథా రాజా తథా ప్రజాః”//

(రాజు మంచి వాడైతే మంత్రులు, సేవకులు, ప్రజలు మంచిగా ఉంటారు.) ఆ రాజే రాక్షసుడైతే – మంత్రులు పెద్దపులుల్లా, సేవకులు గ్రద్దల్లా వ్యవహరిస్తారు. అందుకనే ‘ రాజు ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారు’ అన్న నుడికారం పుట్టింది.

౭. “ అతి రూపాత్ హృతా సీతా – అతి దర్పాచ్చ రావణః/
అతి దానాత్ బలిర్బద్ధః – ‘ అతి సర్వత్ర వర్జయేత్’ “//

“ అతిగా తిన్నా, అతిగా నిద్రించినా, అతిగా మాటాడినా, అతిగా పని చేసినా ‘అతి సర్వత్ర వర్జయేత్’ అని పెద్దలు హెచ్చరిస్తారు”. ఇది అందరూ పాటించ వలసిన నియమం. అతి వల్ల ఎవరెవరు బాధ పడ్డారో వారిని తెలిపే సందర్భంలో పై వాక్యం చెప్పబడింది.

వివరణ-

“ మిక్కిలి అందంగా ఉన్నందువల్ల సీత రావణునిచే అపహరింప బడింది. “అప్సరసలను మించిన అందగత్తె సీత” అని శూర్పణఖ రావణుడితో చెపుతుంది. అందకే అపహరించి లంకకు తెస్తాడు. అదే రావణుడు ‘అతి గర్వం’ వల్ల నశిస్తాడు, ( నన్ను ఎవరూ జయించ లేరు అని రావణునికి గర్వం.) అలాగే అతి దానం వల్ల ‘బలిచక్రవర్తి’ అణచవేయ బడతాడు.” ( “వచ్చిన వాడు సాక్షాత్ విష్ణువు దానం ఇవ్వవద్దు” అని గురువు శుక్రాచార్యుడు చెప్పినా మూడడుగులు యిచ్చి, పాతాళానికి అణచి వేయబడతాడు.) కనుక ఏది అతిగా చేయకూడదు.అని పై శ్లోకం తెల్పుతుంది.

“ ఉద్యోగం పురుష లక్షణం” అన్న వాక్యానికి పూర్తి శ్లోకం. (ఇక్కడ ఉద్యోగం అంటే ‘ ప్రయత్నించడం’ అని అర్థం. అంతేకాని ఉద్యోగం పురుషులే చేస్తారా? స్త్రీలు చేయరా? అని భావించ రాదు.)

౮. “ అశ్వస్య లక్షణం వేగం – మదో మాతంగ లక్షణం/
చాతుర్యం లక్షణం స్త్రీణాం – ‘ ఉద్యోగం పురుష లక్షణం”//

“ గుఱ్ఱం యొక్క లక్షణం వేగంగా పరుగెత్తడం, మాతంగం అంటే ఏనుగు. దాని లక్షణం మదం స్రవించడం, చతురతతో మాటాడటం స్త్రీల లక్షణం, అలాగే ఏదైనా ప్రయత్నం చేయడం పురుషుల లక్షణం” దూరం తగ్గాలంటే అడుగు ముందుకు పడాలి అదే ప్రయత్నం. ఉన్నచోటే ఉంటే దూరం తరగదుకదా !?

౯. “ కర్మానుగో గచ్ఛతి జీవ ఏకః” కర్మ ఒక్కటే జీవిని అనుసరించును.

నావి అనుకోన్నవేవి మనవెంట రావు, మనం చేసిన మంచి,చెడుల కర్మ ఫలం ఒక్కటే మన వెంట వస్తుంది. అని తెల్పే మంచి సుభాషితం వంటి చాటువు యిది.

పూర్తిశ్లోకం చదవండి.----

“ ద్రవ్యాణి భూమౌ, పశవశ్చ గోష్టే, భార్యా గృహ ద్వారి, జన శ్మశానే,/
దేహశ్చితాయాం, పరలోక మార్గే ‘ కర్మానుగో గచ్ఛతి జీవ ఏకః” //

మనం మరణించి నపుడు – “ రాత్రి,పగలు కష్టపడి సంపాదించిన సంపదలు భూమి మీదనే ఉండి పోతాయి, పశువులు కోష్టం అంటే ‘పశువుల పాక’ అందులోనే ఉంటాయి, ఎంతో ప్రేమగా చూసుకొన్న భార్య ఇంటి ద్వారం వద్దే ఉండి పోతుంది, ( హిందూ సంప్రదాయం లో స్త్రీలు శ్మశానానికి రాకూడదు.) ఎంతో జాగ్రత్తగా పెంచి పోషించిన ఈ దేహం చితిలో కాలిపోతుంది. మనం చేసిన కర్మ ఫలం ఒక్కటే మనవెంట వస్తుంది.” కనుక మంచి కర్మలు(పనులు) చేసి ఉత్తమ గతులు పొందాలని పై శ్లోకం హెచ్చరిస్తుంది.తస్మాత్ ‘ జాగ్రత, జాగ్రత’.

౧౦. “న భూతో న భవిష్యతి” ఏదైనా గొప్ప సంఘటన జరిగి నపుడు, పెద్ద కష్టం వచ్చినపుడు, గొప్ప వ్యక్తులవిషయంలోను పై వాక్యం ‘ గతంలో కాని, భావిలో కాని లేదు’ లేక చూడ లేదు అన్న సందర్భంలో వాడుతాము. దీనిని కవి హాస్యంగా ఒక లోభి (పిసినారి) విషయంలో చెప్పిన ‘చాటువు యిది’

“ కృపణేన సమో దాతా ‘ నభూతో నభవిష్యతి’/
అస్ప్రుసన్నేవ విత్తాని యః పరేభ్యః ప్రయచ్ఛతి”//

“ కృపణుడు అనగా పిసినారి. పిసినారి కంటే మించిన దాత ఏ కాలంలోనూ ఇంకొకడు ఉండడు. ఎలా అంటే -వాడు బ్రతికినన్నిరోజులు ఖర్చుపెట్టకుండా, ధనాన్నితాక కుండా, దాచిఉంచి మరణించాక ఇతరులకి ఒప్ప చేపుతాడు.” అందుకనే పిసినారితో సమానమైన దాత “ భూతకాలంలో కాని, భవిష్యత్తు లో కాని” ఉండడు. అని వ్యగ్యంగా కవిచేప్పిన వాక్కు. అందరూ అలా ఉండకుండా బ్రతికి ఉన్నపుడే దానం చేయాలి అని సుభాషితకారుడి సూచన.

ఇంతటితో ఈ వ్యాస పరంపర ముగిస్తున్నాను. చివరిగా ‘ఆశీస్సులు’ తెలిపే ఒక చాటు పద్యంతో స్వస్తి పలుకు తాను.

“ సలిల విహారులిద్దరును – సంతత కాననచారు లిద్దరున్-
వెలయగ విప్రులిద్దరును – వీర పరాక్రమశాలు రిద్దరున్
పొలతుల డాయువాడొకడు- భూమిన పుట్టెడువాడు నొక్కడున్
చెలువుగ మీ కభీష్ట ఫలసిద్ది ఘటింతు రానంత కాలమున్!”

పై పద్యంలో దశావతారములు వర్ణన ఉంది.

భావం చూడండి----
“ సలిల = నీటిలో విహరించేవారు యిద్దరు. ‘ మత్స్యావతారం,కూర్మావతారం’.
కానన = అడవిలో తిరిగేవారు యిద్దరు.‘ వరాహం, నారసింహం’
విప్రులు=బ్రాహ్మణులు గా పుట్టిన వారు యిద్దరు. ‘ వామన,పరశురామ’
పరాక్రమ వంతులు యిద్దరు. ‘రామ, బలరామ’ (బుద్దుడు పూర్వం దశావతారాల్లో చెప్పబడలేదు)
పొలతులు=స్త్రీలతో ( గోపికలతో) తిరిగినవాడు ఒక్కడు. శ్రీకృష్ణుడు.
భూమిపై జన్మించిన వాడు ఒక్కడు. ‘ కల్కి’ అవతారం. ఇలా దశావతారాలు ఎత్తిన ఆ “ శ్రీమన్నారాయణుడు” మీ కోరికలను తీర్చి సదా మిమ్ము కాపాడు గాక. శుభం.

“ఓం శాంతి శాంతి శాంతి:”

“ సంస్కృతి సంప్రదాయాలకి నెలవైన ‘సిలికానాంధ్రా’ వారి పర్యవేక్షణలో వెలువడుతున్నఅంతర్జాల మాసపత్రిక సకల జన మనోరంజని ‘సుజనరంజని’ లో ప్రారంభ సంచిక నుండి ఇప్పటివరకు అనగా ఐదు వసంతాల నుంచి నారచలను ప్రచురిస్తూ, నన్ను ప్రోత్సహిస్తున్న సంపాదక వర్గానికి, ముఖ్యంగా ఇప్పటి ప్రధాన సంపాదకులు శ్రీ తాటిపాముల మృత్యుంజయడు గారికి నా ధన్యవాదాలు. చదివి ఆనందిస్తున్న చదువరులకు నా వందనాలు. యిరువది నెలలుగా ‘సాహిత్యంలో-చాటువులు’ శీర్షికతో వెలువడుతున్న వ్యాసాలలో ఇది చివరి వ్యాసం, “ సాహిత్యంలోచాటువులు” అనే వ్యాసాల రచనకి నాకు ఉపకరించిన ప్రాచీన గ్రంథ రచయితలకు, నమో వాకాలు, ముఖ్యంగా ‘ ఏరిన ముత్యాలు’ అనే గ్రంథం బాగా ఉపకరించింది ఈ గ్రంథ రచయిత శ్రీ టి.వి.కె.సోమయాజులు గారికి కృతజ్ఞతాంజలి. ఇది విరామమే కాని, విరమణం కాదు. మరల ఇంకొక శీర్షికతో మీ ముందుకు వస్తాను”. భవదీయుడు టి.పి.యన్. ఆచార్యులు.

 

సమాప్తం


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)