(గత సంచిక తరువాయి)
ఊరునుండి తిరిగిరాగానే యామిని తానూ అడవికి వస్తున్నట్లు బాసుకి చెప్పింది. అమర్ తెరిపినపడిన మనసుతో గాఢంగా నిట్టూర్చాడు. అది మొదలు ప్రయాణ సన్నాహాలు జోరందుకున్నాయి. వంట భ్రాహ్మడైన అవధాని చెప్పిన లిస్టులోని సరుకులు కొన్ని హైదరాబాదులో కొన్నా, కొన్ని దారిలోని ఊళ్ళలో కొనడానికి నిశ్చయించారు. పాలకు ప్రత్యామ్నాయంగా ఉండడంకోసం పాలపొడి, మిల్కుమెయిడ్ పాలడబ్బా లు కొన్నారు. టీ, ఇనిస్టెంట్ కాఫీ పొడి ఐన నెస్కేఫ్, పంచదార మొదలైనవన్నీ కొన్నారు. ఇంకా ఎన్నెన్నో కొన్నారు. రెండు పెట్రోమాక్సు లైట్లు కూడా సామానులో చేర్చారు. ఇలా అవసరమైనవన్నీ అమర్చుకోడం సాగించారు. తీసుకెళ్ళడానికని పోగేసిన సామానుని చూసి," ఇవన్నీ వేన్లో సద్దగలమా - అని భయపడింది యామిని.
ఇంక రేపు ప్రయాణమనగా శశిధర్ వచ్చి, అకస్మాత్తుగా తన తల్లి జబ్బుపడిందనీ, పెద్దామె సంరక్షణకూ, పిల్లల్ని సాకడానికీ తాము ఉండిపోక తప్పదని చెప్పి వెళ్ళాడు. వేన్లో ఇద్దరు మనుష్యుల ఖాళీ ఏర్పడింది. అంతవరకూ అనుకోకపోయినా, ఆఖరు క్షణంలో రాజుకి వేన్లో చోటూ దొరికింది. పదహారేళ్ళ పసి - వయసులో ఉండే సహజమైన ఉత్సాహంతో సంతోషంగా, ఇట్టే ప్రయాణమైపోయాడు వాడు. సామాను ఎక్కువగా ఉండడంతో మరో సీటు ఖాళీ అన్న విషయం ఇంక ఎవరూ పట్టించుకోలేదు. మంచిరోజు చూసి వెంకట్రావుగారు ప్రయాణానికి ముహూర్తం తానే నిర్ణయించారు.
శశిధర్, అతని భార్య రాకపోడం అన్నది యామినికి అపశకునంలా అనిపించి ఖిన్నురాలయ్యింది. వల్లీయమ్మతోడు ఉంటుందిగాని, ఆమెతో మాటాడాలంటే తనకు తమిళం రాదు కదా - అని బాధపడింది. "నేను కూడా మానేస్తేపోదా" అన్న ఆలోచన కూడా వచ్చింది ఆమెకు. కాని, చిన్నప్పటినుండీ మనసులో పీఠం వేసుకుని కూర్ఛున్న, అడవుల్ని చూడాలన్న కోరిక ఆ ఊహను బలపడనీయ లేదు. మనసులో కొంచెం ఇబ్బందిగా అనిపించినా, చివరకు తాను ప్ర్రయాణం మానుకోలేకపోయింది ఒక ట్రావెల్ బాగ్ లో సామాను సద్దుకుని శారదాంబతో ఎస్కర్షంకి వెడుతున్నట్లు చెప్పి బయలుదేరింది. "నా సంగతి నేను చూసుకోగలను" అని యామిని అన్న మాటకు కోపం తెచ్చుకున్న శారదాంబ, సదాశివం ఇంక ఆమెను మరే ప్రశ్నలు వెయ్యకుండానే శలవిచ్చి ఫంపేశారు.
సరైన సమయానికి, ఫోర్వీల్ డ్రైవింగ్ కెపాసిటీ ఉన్న వేనుని తీసుకుని, అమరేంద్ర కోరుకున్నట్లుగానే ఒక మళయాళీ డ్రైవర్ వచ్చాడు . అతడు కేరళలో పుట్టినా, పెద్దవాడైనాక పనిని వెతుక్కుంటూ ఎప్పుడో హైదరాబాదుకి వచ్చి చేరాడు. చాలా రోజులు నేషనల్ పర్మిట్ ఉన్న లారీకి డ్రైవరుగా పనిచేసినవాడు. అతని తెలుగు మళయాళం యాసతో తమాషాగా ఉంది. తన పేరు గోవిందు - అని చెప్పాడు.
వేన్ రాగానే సామానంతా వేన్ ట్రంకులో సద్దేశారు. ఇంకా కొంత మిగిలి ఉంటే దాన్ని వెనకసీటు దగ్గర పేర్చారు. డ్రైవర్ పక్కన రాజు, వెనకసీట్ళొ విమలాచార్య, అతని భార్య ఎక్కితే, మధ్యలో ఉన్న రెండు సీట్లలో ఒకదానిలో యామిని ఎక్కికూర్చుంది.
ఆఫీసు బాధ్యత వెంకట్రావుగారికీ, శశిధర్ కీ అప్పగించి, జాగ్రత్తలు చెప్పి వచ్చి, వేన్ ఎక్కి ఖాళీగా ఉన్న సీట్లో కూచున్నాడు అమరేంద్ర. వారిని సాగనంపడానికి వెన్ దగ్గరకి వచ్చినవారందరి శుభాకాంక్షలతో వేన్ బయలుదేరింది.
పాపం, వెంకట్రావుగారు కీళ్ళనొప్పులవల్ల నైతే, శశిధర్కి తల్లి అనారోగ్యంవల్ల వెళ్ళడం కుదరలేదు. తాము వెళ్ళలేకపోతున్నందుకు బాధగానే ఉన్నా కూడా, వాళ్ళు వెడుతున్నవారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్పారు, "దేర్ మే బి ఎ స్లిప్ బిట్వీన్ ది కప్ అండ్ ది లిప్" అనుకుని, నిట్టూర్చి మనసు సరిపెట్టుకున్నాడు శశిధర్.
వేన్ తిన్నగా బెంగుళూర్ హైవే వైపుగా నడిచింది. హైవే ఎక్కాక వేగం పెంచి బెంగుళూర్ దిశగా ప్రయాణం సాగించాడు డ్రైవర్. రాత్రికి వాళ్ళు బెంగుళూర్ చేరుకోగలరని అంచనా. ప్రయాణం తొలిదశలో ఉన్నారేమో అందరిలోనూ ఉత్సాహం ఉరకలు వేస్తోంది. మధ్యమధ్య కొంచెం సేపు ఆగి, మళ్ళీ ప్రయాణమౌతూ, మొత్తానికి ఆ రాత్రికి వాళ్ళు బెంగుళూరు చేరుకున్నారు.
రాత్రికి హోటల్ రూముల్లో మకాం చేసి, మరునాడు ఉదయమే మళ్ళీ ప్రయాణమై గమ్యంవైపుగా సాగారు. హోటల్లో ఉన్నప్పుడే "రోడ్ మేప్" తీసి, డ్రైవర్ తో చర్చించి, తాము ప్రయాణం చెయ్యవలసిన రూట్ వివరాలన్నీ తెలుసుకున్నాడు అమరేంద్ర. ఆ ప్రాంతంతో పరిచయమున్న డ్రైవర్ సూచించిన దారి వెంట వెళ్ళడమే మంచిదనే నిర్ణయానికి వచ్చాడు. అదే గమ్యానికి దగ్గర దారిట!
"దక్షిణాదిని బెంగుళూరు చాలా అందమైన ప్రదేశం అంటారు. సామానుతో నిండి ఉన్న ఈ వ్యాన్ తో ఊరు చుట్టిరావడం కన్నా, తిరిగివచ్చేటప్పుడు ఆగి చూడడం మంచిది - అనుకుంటున్నా. మళ్ళీ వచ్చేటప్పుడు గుర్తుచెయ్యండి" అన్నాడు అమరేంద్ర.
బెంగుళూర్ ని విడిచి హైవే వైపుగా ముందుకు సాగింది వేను. హైవే మీద కొంత దూరం వెళ్ళాక పక్కదారికి మళ్ళింది. అక్కడనుండి చాలా ఊళ్ళనూ, పల్లెల్నీ దాటుకుంటూ వెళ్ళి ఘాట్ రోద్దు ఎక్కింది ఆవేను. అది మొదలు ప్రకృతి అందాలు క్షణ క్షణానికీ పెరగసాగాయి. కొండలూ, లోయలూ, చెట్లూ, పిట్టలూ, చెరువులూ, చెలమలూ - ఇలా, ఎన్నో కనిపించసాగాయి. కొండల మీది నుండి విలాసంగా దుమికే కొంటె జలధారలు ఎండపడి, కరిగించి పోసిన వెండి ధారలులా మెరుస్తున్నాయి. ఒకటేమిటి, ఎన్నెన్నో ప్రకృతి సోయగాలు కనువిందు చెయ్య సాగాయి. ఆ సొగసుని చూడాల్సిందేగాని, వర్ణించే శక్తి భాషకు లేదు. ఎగిరే పిట్టల కువకువలూ, విరిసే పూవుల ఘుమఘుమలూ వాటికి జత కలవడంతో, భావుకుల హృదయాలకు అది స్వర్గధామమే అనిపిస్తుందనడం అతిశయోక్తి కాదు.
ఆ ప్రదేశపు అందం చూసి మైమరచి పోయిన అమర్, "నేనీ కెమెరా తెప్పించడం మంచిపనే అయ్యింది. ఇదినాకు, నా జీవితకాలం గుర్తుండిపోయీ అనుభవం" అనుకున్నాడు. కెమేరాను సెట్ చేసి, అందమైన దృశ్యం కనిపించినప్పుడల్లా ఫొటోలు తియ్యడం మొదలుపెట్టాడు. అతని వైపు కళ్ళు విశాలం చేసుకునిమెప్పుగా చూసింది యామిని.
"ఈ ప్రదేశం ఇంత మనోజ్ఞంగా ఉంటుందని నేను ముందే ఊహించగలిగాను . అందుకే నా మిత్రుడు సురేష్ అమెరికా నుండి వస్తూంటే ఈ కెమేరాను నాకు తెచ్చిపెట్టమన్నా. ఈ ట్రిప్ నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే విషయం!" అంటూ కెమేరాని యామిని చేతికి ఇచ్చాడుఅమరేంద్ర.
"జూం లెన్సు"తో ఉండడమే కాకుండా, దేనినైనా సహజమైన రంగుల్లో ఉన్నది ఉన్నట్లుగా ఫొటో తీసే కెమేరా అది.
అటూ ఇటూతిప్పి చూసి యామిని, "కెమేరా చాలా బాగుంది. ఖరీదుకూడా బాగానే ఉంటుందనుకుంటా" అంది.
"ఔను! ఇది కొనడానికి నా నెలజీతం చాలలేదు. ఐనా ఫరవా లేదు. వర్తిట్! ఈ అనుభవం మళ్ళీ మళ్ళీ వచ్చేది కాదు కదా" అన్నాడు అమర్, కెమేరావైపు మురిపెంగా చూస్తూ. అపురూపమైన ఏ దృశ్యం కనిపింసినా అతడు ఫొటోలు తీస్తూనే ఉన్నాడు, కెమేరాలో రీలుమా ర్చి రీలు వేస్తూ.
కొన్నిచోట్ల కారు అపి దిగికూడా ఫొటోలు తీశాడు అమరేంద్ర . వేన్లో జనం, చుట్టుపక్కల కనిపిస్తున్న మనోహర ప్రకృతిని చూసి సంతోషంతో కేరింతలు కొడుతూన్నా, అనుభవజ్ఞుడైన డ్రైవర్ మాత్రం రోడ్డుమీదే దృష్టి నిలిపి భద్రంగా డ్రైవ్ చేస్తున్నాడు. ఘాట్ రోడ్డు ఎక్కగానే కారు వేగం బాగా తగ్గించేశాడు. కొండవాలు, లోయలూ, మైదానాలూ గుండా సాగుతున్న ఆ రోడ్డు మీదుగా గంటకు ముఫ్ఫై మైళ్ళ వేగంతో, కొండల్ని ఎక్కుతూ, దిగుతూ నడుస్తోంది వేను. ఎగుడుదిగుడుగా ఎత్తుపల్లాలతో ఉంది ఆ రోడ్డు. ఆ రోడ్డువెంట నడిచివెళ్ళే జనం అరుదుగా కనిపిస్తున్నారు. రోడ్డుకి ఒక వైపు కొండ, రెండవ వైపున లోతైన, అగాధం లాంటి లోయ ఉంది చాలాచోట్ల! అలాంటి చోటుల్లో డ్రైవర్ ఏమాత్రం ఏమరినా ప్రమాదమే! చక్రం స్లిప్పై వేను అగాధంలోకి జారిపోతుంది.
కచ్చారోడ్డు కావడంచేత, వేన్ ముందుకుపోతూంటే, వెనకాల పెద్ద ఎత్తున ధూళిమేఘం లేస్తోంది. ముందుకు వెడుతున్నకొద్దీ అడవులు దట్టమౌతున్నాయి. కొండవాలుల్లో, పద్ధతిగా పెంచబడిన తేయాకు తోటలు, పచ్చపట్టూ పరుపు పరిచినట్లుగా గడ్డిమైదానాలూ, దారి కిరువైపులా పరుచుకుని ఉండి కనువిందుగా కనిపిస్తున్నాయి. వేన్ హోరుకి, చెట్లమీది పిట్టలు కువకువ లాడుతూ ఎగిరిపోతూంటే, కొమ్మలమీదున్న కోతులు, కిచకిచలాడుతూ ఒక కొమ్మ మీదనుంది మరో కొమ్మమీదకి దూకుతూ అరిచి, గడబిడ చేస్తున్నాయి.
అంతలో వేన్, "క్రీచ్" మని పెద్దగా చప్పుడుచేస్తూ సడెన్ బ్రేకుతో ఆగింది. అక్కడకి ఒక ఇరవై గజాల దూరంలో, లేళ్ళ గుంపు ఒకటి, మెరుపు వేగంతో వచ్చి, రోడ్డునుదాటింది. వేన్ లోని జనం వాటినే రెప్పవాల్చకుండా ఆశ్చర్యంగా చూస్తూండగా అవి ఒక లిప్తకాలంలో రోద్దును ఈ వైపునుంది ఆవైపుకి దాటి వెళ్ళిపోయాయి. క్షణంలో గండం తప్పినందుకు అందరూ సంతోషించారు. డ్రైవరు తెరిపినిపడ్డ మనసుతో హాయిగా నిట్టూర్చాడు. సమయస్ఫూర్తితో బ్రేకు నొక్కి ప్రాణులను కాపాడినందుకు, డ్రైవర్ని అభినందించాడు అమరేంద్ర.
వేన్ ముందుకు సాగింది. సరైన సమయానికి కెమేరా చేతిలో లేకుండా పోయినందుకు బాధపడ్డాడు అమర్. కాని అతనికి అంతలోనే గుర్తొచ్చింది, ఆ లేళ్ళ వేగాన్ని ఫొటో తీసే శక్తి ఆ కెమేరాకి లేదని.
కొంతదూరం వెళ్ళి ఒక మలుపు తిరగ్గనే వేన్ మళ్ళీ ఆగవలసివచ్చింది. రెండు కొండమేకలు, కబుర్లు చెప్పుకుంటున్నట్లు ఎదురెదురుగా, ఒకదాని పక్కన ఒకటి, రోద్దుకి అడ్డంగా పడుకుని నెమరువేస్తున్నాయి. వాటికి ఏది అడవో, ఏది రోడ్డో తెలిసి ఉన్నట్లు లేదు. కారు శబ్దానికి కూడా అవి లేవలేదు. అమర్ క్రిందకుదిగి, వేన్ చాటుచేసుకు నిలబడి, తనివితీరా వాటి ఫొటోలు తీశాడు. అమర్ వేన్ ఎక్కాక దాన్ని నెమ్మదిగా మేకలకు దగ్గరిగానడిపి గట్టిగా హారన్ మ్రోగించేసరికి అవి భయంతో లేచి చెరోవైపుకీపారిపోయాయి. అడ్డుతీరడంతో వేన్ ముందుకు సాగింది.
యామిని మనసంతా ఉత్సాహంతో నిండిపోయింది. "బాస్ రమ్మని కోరారు, నాన్న వెళ్ళమన్నారు! వాళ్ళ ఇద్దరి పుణ్యమా - అని నేనిలా ఈ అడవి అందాలు చూడగల్గుతున్నాను. ఎంత అదృష్టం! ఇంకా నయం, శశిధర్, అతని భార్యా రావడం లేదని నేనుకూడా మానెయ్యాలనుకున్నాను. కాని, మానకపోడం మంచిదయ్యింది. ఇంకా ఇంకా ఎన్నెన్ని సొగసులు ఉన్నాయో ఈ అడవిలో" అనుకుంది ఉబలాటపడుతూ. ఆమె మనసంతా అమర్ పట్ల కృతజ్ఞతతో నిండిపోయింది. .
"ఏ కవితలూ వర్ణించలేని కమనీయ దృశ్యాలనీ, కవుల వర్ణనలకు అతీతమైన సహజ సౌoదర్యాన్నీ నా కళ్ళ ఎదుట నిలబెట్టిన మీకు నా కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలియడంలేదు సర్" అంది అమర్ని ఉద్దేశించి నెమ్మదిగా.
అతడు చిన్నగా నవ్వి, "కృతజ్ఞతలు అని, ప్రత్యేకం నువ్వు నాకేమీ చెప్పవలసినపని లేదు. క్షణక్షణం సారూ, సాంబారూ - అంటూ నన్ను అనుక్షణం ఉడికించకుండా ఉంటే చాలు, నేనే నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటా" అన్నాడు.
"అదేమిటి సర్! బాస్ ని సబార్డినేట్ స్టాఫ్ మరి ఏమని పిలవాలిట?"
"ఇక్కడ నేను నీకు బాసునీ కాను, ఇది ఆఫీసూ కాదు. "స్నేహం సాప్తపదీనం" అన్న మాట నువ్వు వినే ఉంటావు. మనం ఇప్పటికి ఏడేమిటీ, ఏడువందల అడుగులైనా కలిసి నడిచి ఉంటాము. ఇంకా మనిద్దరమూ స్నేహితులం కాలేకపోయామంటే ఏమనుకోవాలి? ఏది ఏమైతేనేమిలే, ఇక్కడైనా నువ్వు నన్ను, నా తక్కిన మిత్రులందరిలాగే "అమర్" అని పిలిస్తే సంతోషం" అన్నాడు.
"అలవాటు మార్చుకోడం కష్టం సర్! అది మీరనుకుంటున్నంత తేలికేమీ కాదు!"
" ఇకనుండీ నేను నీకు బాస్ మాత్రమే కాదు, ఒక ఫ్రెండుని కూడా ....., "
అంతలో చక్రo గుంటలో పడడంతో వేన్పెద్దగా కుదిపింది. సామాను ఒకదానికి ఒకటి కొట్టుకుని చప్పుడు చేశాయి.
కారు కిటికీలోంచి బైటికి చూస్తున్న అమర్, అకస్మాత్తుగా "అరరే" అన్నాడు. రాజు తృళ్ళి పడి బయటికి చూశాడు. "ఏమయ్యింది" అంటూ కంగారుపడింది యామిని. విమలాచార్య దంపతుల్లో ఏ చలనం లేదు. వాళ్ళు ఏవేవో కుటుంబ సమస్యల్ని గురించి మాటాడుకుంటూ తన్మయులై ఇతర ప్రపంచాన్ని మర్చిపోయారు. డ్రైవర్ మరేమీ పట్టించుకోకుండా, దృష్టినంతటినీ బండి నడపడం పైనే కేంద్రీకరించి, బాధ్యతగా వేన్ డ్రైవ్ చేస్తున్నాడు.
రోడ్డుకి ఒకవైపుగా ఉన్న కొండ వాలున ఉన్నఅడవిని మొత్తం, చెట్లని పడగొట్టి దుంఘలుగా మార్చేశారు. అక్కడ దుంగలను లారీల్లోకి ఎక్కిస్తూ మనుష్యులూ ఏనుగులూ కూడా పనిచేస్తున్నారు. చూస్తూండగా ఆ చోటుని దాటుకుని వెళ్ళిపోయింది వేను.
"అయ్యో! అడవిని ఎంతమేర ఖాళీ చేసేశారో! పెద్దపెద్ద చెట్లనెన్నిటినో పడగొట్టి వాటిని దుంగలుగా మార్చేశారు కదా! నూరు సంవత్సరాలు పెరిగిన చెట్టునైనా మూడు నిముషాలలో "ఎలక్ట్రిక్ సా" తో నరికి పడగొట్టవచ్చు. కాని, మళ్ళీ ఏ చెట్టు అంత పెద్దదిగా పెరగడానికైనా, నిండు నూరేళ్ళూ కావాల్సి ఉంటుంది. అంటే ఒక మనిషి జీవితకాలం చాలదనేగా అర్థం! ఇలాగైతే నేల బోసిగా మారిపోడానికి ఎక్కువ కాలం అక్కరలేదు" అంది యామిని దిగులుగా.
"ఇలా మనం మాటాడితే జనం నవ్వుతారు. చెట్ల మరణాన్ని ఆశ్రయించుకునే మనం హాయిగా బ్రతకగల్గుతున్నాము. మనం మనజీవిక కై ఎంచుకున్న బిజినెస్ చెట్ల నాశనంతో ముడిపడి ఉన్నదేకదా! "జీవో జీవస్య జీవనం" అన్న వాక్యం నువ్వు వినలేదా? జీవనగతి అలాగే సాగాలన్నది ప్రకృతి నిర్ణయం! సమతౌల్యం లోపించకుండా చూసుకోడం మనిషి బాధ్యత. మనిషి తన బాధ్యతని మరిచిపోతే,ఏదో ఒకనాడు మొత్తం అంతా విలయంలో లయమైపోయి సూన్యం మిగులుతుంది" అన్నాడు అమర్, వేదాంతిలా!
" మనిషి తన ప్రతిభతో ప్రకృతినంతటినీ లొంగదీసుకుని గర్వంతో హద్దులు మరిచిపోయి ప్రవర్తిస్తున్నాడు. అత్యాశతో ఎంత ఇచ్చినా చాలదంటూ, ప్రకృతిని నిలువునా దోచేస్తున్నాడు. అదే అభివృద్ధి అనుకుని ఉప్పొంగిపోతున్నాడు గాని, ఏదో ఒకరోజున యదార్ధం బయట పడక మానదు. అప్పుడు, తాగే నీరనే భ్రమలో పడి ఎండమావుల వెంట పరుగులు పెట్టి పెట్టి, చివరి క్షణంలో తనతప్పు తెలుసుకున్నా ప్రయోజనం కనిపించక భంగపడిన జింకల్లా, మనుష్యులు కూడా ఏదో ఒకనాడు తన తప్పును తామూ తెలుసుకుంటారు. కాని అప్పటికి సమయం మించిపోతుంది" అంటారు మా నాన్న!"
పాపం, రాజు! విమలాచార్యకు తోడుగా భార్య ఉంది. డ్రైవర్ కి రోడ్డు వుంది, బాసు, మేడం ఏవేవో మాటాడుకుంటున్నారు. కాని, రాజుకు తోడుగా ఎవరూ లేరు. వేన్ కిటికీ లోంచి చుట్టుపక్కల కనిపిస్తున్న అడవిని చూస్తూ; బాసు, మేడం చెప్పుకుంటున్న కబుర్లు విని అర్థం చేసుకునీ ప్రయత్నం చేస్తూ, పొద్దుపుచ్చుతున్నాడు వాడు.
ఇంచుమించు నిట్టనిలువుగా ఉన్న కొoడపక్కనుండి వెడుతోంది ఆ రోడ్డు. ఆ కొండవాలు అంతా చెమ్మగా నీటితో చితచితలాడుతోంది. రాతిలోని పగుళ్ళనుండి పుట్టినమొక్కలు క్రిందికంతా వేలాడుతూ నిండుగా పలురంగుల పూలతో కలకలలాడుతూ ఆ కొండకే అందాన్ని తెస్తున్నాయి. ఆ పూలమీద వాలి తేనెతాగుతూ, అటూ ఇటూ ఎగురుతున్నాయి ఎగిరే పూలలా ఉన్న పెద్దపెద్ద సీతాకోక చిలుకలు! కొండ చరియలో నీటి బుగ్గ ఉండడంవల్ల ఆ మొక్కలన్నీ ఏపుగా పెరిగి అందంగా ఉన్నాయి.
వేన్ ఆగింది అక్కడ. ఇంద్ర ధనస్సు వర్ణాలలో విరిసి ఉన్న ఆ పూలను ఫొటోలు తీశాడు అమరేంద్ర. యామిని కొన్నిపూలు కోసుకుంది. చుట్టుపక్కలనున్న చెట్లమధ్య ఎరురుతున్న రకరకాల పక్షుల్ని, పూతేనెలు జుర్రుకోడానికి వచ్చిన తేనె పిట్టల్ని కూడా ఫొటోల్లో బంధించాడు అమర్. ఆ ప్రదేశపు నిసర్గరామణీయకతకు పక్షుల కలరవాలు కూడా దోహదమౌతున్నాయి. చెప్పనలవికాని అందంతో ఉంది ఆ ప్రదేశం. వేన్లో ఉన్న అందరినీ దిగమని ఫొటోలు తీశాడు అమరేంద్ర. యామిని ఆ కొండ బేగ్రౌండుగా అమర్ కి ఫొటోలు తీసింది. వెన్ పక్కన నిలబడి కూడా అందరూ ఫొటేలు దిగారు.
ఆ ప్రదేశంలో కనిపిస్తున్న రకరకాల పిట్టల్ని చూస్తూ, వాటి కలరవాల్ని వింటూ తమవెంట తెచ్చుకున్న లంఛ్ ని అక్కడే తిన్నారు వాళ్ళు .
" సైట్ మాత్రమే కాకుండా సౌండ్ కూడా రికార్డుచేసే కెమెరా ఉంటే ఎంత బాగుండేదో! మనం ఫొటోలో పిట్టని చూడడమే కాకుండా దాని కూతను కూడా వినగలిగితే ఇంకా బాగుంటుంది కదా" అంది యామిని యధాలాపంగా.
అమరేంద్ర నవ్వాడు. మనిషి కోరే కోరికలకి హద్దుల్లేవు. సైటు, సౌండు మాత్రమే కాదు మువ్ మెంట్ కూడా ఉంటే బాగుంటుంది కదా అనిపించడంలేదా! టెక్నాలజీ శరవేగంతో ముందుకు సాగుతోంది. త్వరలోనే సైట్, సౌండ్ అండ్ మువ్మెంట్ - మొత్తం ఒకేదాంట్లో ఉన్న కెమేరా వస్తుందేమో - ఎవరు చెప్పగలరు " అన్నాడు అమర్.
" టెక్నాలజీ ఎంత పెరిగినా నేచర్ కున్న విలువ ఎంతమాత్రం తగ్గదు. ఆ బుజ్జి బుజ్జి తేనె పిట్టల్ని చూడండి, ఎంత ముద్దుగా ఉన్నాయో! పూలనుండి తేనె పీల్చుకుని, తమ చిట్టి పొట్టల్ని నింపుకుంటూ అవి గాలిలో ఎలా కదలకుండా ఆగి ఉంటున్నాయో చూడండి!. వాటిని జూంతో ఫొటో తియ్యండి, చాలా అందంగా బాగుంటుంది" అంది యామిని.
" ఎప్పుడో తీశా. కాని, వాటి రెక్కలవేగాన్ని ఈ కెమేరా కేచ్ చెయ్యలేకపోవచ్చు, చూద్దాం!"
కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాక వెన్ బయలుదేరింది.కొండ దిగువ రోడ్డు, రోడ్డుకి ఆవల అడవి! వేన్ ముందుకు సాగుతోంది. ఆ దారిపొడుగునా ఎన్నోటీ ఎస్టేట్లు ఉన్నాయి.దూరంగా తేయాకు తోటల నడుమ కట్టిన ఇళ్ళు చిన్న చిన్న బొమ్మరిళ్ళలా కనిపిస్తున్నాయి. సూర్యాస్తమయ సమయానికి వాళ్ళు దారి పక్కన ఉన్న ఒక టీఎస్టేటుని చేరుకున్నారు. డ్రైవరుకి ఆ ప్రాంతం కొత్తేంకాదు. అతను అక్కడికి ఇదివరకు, లారీ డ్రైవరుగా ఉన్నప్పుడు పని మీద చాలాసార్లు వచ్చి ఉన్నవాడు కావడంతో ఆప్రాంతం అతనికి ఒక మాదిరిగా తెలిసున్నచోటే!
" ఆ కనిపించేదే "వైభవ్" టీ ఎస్టేట్ సార్! మనకి కావలసినవేమైనా ఉంటే ఇక్కడే కొనుక్కోవాలి. ఇంకా ముండుకి వెడితే ఏమీ దొరకవు. ముఖ్యంగా ఆయిల్! టాంకునిండా కొట్టించి, ఇంకా కొంత స్పేర్ కూడా దగ్గర వుంచుకోవడం మంచిది" అన్నాడు. అతడు చాలాకాలం నుండి హైదరాబాదులో ఉండడంవల్ల తెలుగు మాటాడగలడు. అతని తెలుగు యాస తమాషాగా ఉంది. ఐనా ఫరవాలేదు, అతని భావం మనకి తెలిస్తే చాలు.
అక్కడ దిగి కావలసినవన్నీ కొనుక్కుని వచ్చేసరికి సందె పడింది. డ్రైవర్ ఇక ముందుకి వెళితే, చీకటి పడకముందు గమ్యం చేరలేమని చెప్పాడు. మలైక్కాడు ఫారెష్టు కేంపుకి వెళ్ళాలంటే, ఇంకా వెళ్ళాల్సిన దూరం కొంత ఉంది. బండి ఏటవాలుగా ఉన్న కొండ ఎక్కవలసి ఉంది. అడవి మధ్యనుండి ప్రయాణమేమో. అటూ ఇటూ పెరిగివున్న చెట్లవల్ల దారంతా చీకటిగా ఉంటుంది. దారిలో అడవి జంతువులు ఎదురుపడవచ్చు. ఇప్పుడు వెళ్ళడం అంత క్షేమకరం కాదు. రేపు చీకటితోనే బయలుదేరి వెళ్ళడం మంచిది - అని చెప్పాడు డ్రైవర్. పెట్రోల్ బంకు దగ్గర వాళ్ళు చెప్పిన మాటలుకూడా విన్నాక ఆ పూటకి అక్కడ ఉండిపోడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చేశాడు అమరేంద్ర కూడా.
అక్కడ, ఆ రాత్రికి ఎక్కడైనా బస దొరుకుతుందేమోనని కనుక్కుంటే, అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకునివున్న ఒక కుటుంబం వాళ్ళు, అతిధులకి డబ్బుతీసుకుని భోజనం, వసతి సౌకర్యం కల్పిస్తారని విన్న అమరేంద్ర ఆ సంగతి అందరికీ తెలియజేశాడు.
"యెస్ బాస్! ఇట్ ఈస్ ఎ గుడ్ ఐడియా, సర్" అంది యామిని అతని మాటని సమర్ధిస్తూ.
"యెస్ మేడం! బాస్ ఈజ్ రైట్! అది అంతే! గుడ్ ఆర్ బెడ్ - అతడు ఏమి చెప్పినా కూడా "బాస్ ఈస్ రైట్!" యా మై కరెక్టు" అన్నాడు అమర్ కొంచెం పరుషంగా.
యామిని ఖంగుతిని, తలెత్తి ఆశ్చర్యంగా చూసింది అతనివైపు. తనన్నదానిలో తప్పు ఎక్కడుందో ఆమెకు అర్థం కాలేదు. అతని కళ్ళు ఆమెనే చూస్తూ కొంటెగా నవ్వుతున్నాయి.. అప్పుడు అర్థమయ్యింది యామినికి తన తప్పు ఎక్కడ ఉందో .....!
యామినికి నవ్వొచ్చింది. "అమర్! యు ఆర్ అబ్సర్డు" అనేసింది అప్రయత్నంగా"
అతని పేరు అలా పలకడం ఆమెకు అదే మొదటిసారి కావడంతో సిగ్గు పడింది యామిని. ఒకవిధమైన గగుర్పాటు కలిగింది ఆమెకు. తడబాటుతో ఆమె ముఖం కందింది. గాలికి చెదిరిన ముంగురుల చాటునుండి, వింత కాంతితో మెరుస్తున్న ఆమె కళ్ళు, మేఘాలచాటునుండి మెరుస్తూ తొంగిచూసే నక్షత్రాలను తలపించాయి! ఆమెనే చూస్తున్న అమరేంద్ర వెంటనే ఆమెకొక ఫొటో తీశాడు. అతని మనసంతా ఆహ్లాదంతో నిండిపోయింది.
ఆ సాయంకాలం టీ ఎస్టేటంతా తిరిగిచూసి, ఆ రాత్రి అక్కడ దొరికిన బసలో గడిపి, మళ్ళీ తెల్లారకుండానే ప్రయాణమయ్యారు వాళ్ళు. అక్కడ కొన్న ఆయిల్, కూరగాయలు వగైరాలతో వేన్ బరువు ఇంకా పెరిగింది. కొండవాలు తక్కువ కావడంతో ఆ రహదారికి "హెయిర్పిన్ బెండ్సు" ఎక్కువగా ఉన్నాయి. వెళ్ళవలసిన దూరం తక్కువే ఐనా, గమనం మరీ క్లిష్టమైనది కావడంవల్ల ప్రయాణానికి సమయం ఎక్కువ కావలసి వచ్చింది. ఫారెస్టు గెష్టుహౌసు చేరే సరికి టైం తొమ్మిదయ్యింది.
* * *
అది మలైక్కాడు హిల్ స్టేషన్ కు సంబంధించిన గెష్టుహౌస్. అక్కడ ఎలిఫెంట్ కేంపు, చందనం దుంగల్ని దాచి ఉంచే గొడౌన్లు కూడా ఉన్నాయి. చందనపు కట్టెను కొనడానికి వచ్చే బేహారుల కోసం, ప్రభుత్వ అనుమతితో అడవి జంతువులను వేటాడడానికి వచ్చే షికారీల సౌకర్యం కోసం ఆక్కడ ఆ గెష్టుహౌసుని నిర్మించడం జరిగింది.
మలైక్కాడు హిల్ స్టేషన్లో చందనపు కట్టెను, అమ్ముడయ్యేవరకూ పదిలపరచే గొడౌన్లు ఉండడమే కాకుండా, అడవి ఏనుగుల్ని పట్టుకుని, వాటిని మచ్చికచేసి, రకరకాల పనులకు వాటికి తరిఫీదునిచ్చే ఎలిఫెంట్ క్యాంపుకూడా అక్కడ వుంది. వ్యాపార రీత్యా వచ్చేవారి సౌకర్యం కోసమే కాదు, ఆ అడవిలోని, పులులు, చిరుతలు, కృష్ణజింకలు, అడవి దున్నలు, కొండమేకలు మొదలైనవాటిని, నెమిళ్ళు, అడవికోళ్ళు మొదలైన పక్షుల్ని పర్మిట్ తీసుకునివచ్చి వేటాడే విదేశీ వేటగాళ్ళకోసం కూడా ఆ గెస్టుహౌసు నిర్మించబడింది. అక్కడి విషయాలు చూసుకునేందుకు ఫారెష్టురేంజర్ ఆఫీసు కూడా ఉంది అక్కడ. ముందుగానే బుక్ చేసుకుని ఉండడంవల్ల అమర్ అండ్ పార్టీ వచ్చేసరికి గెస్టుహౌస్ శుభ్రం చేసి సిద్ధంగా ఉంచబడింది.
రాజు, విమలాచార్య, డ్రైవరు కలిసి క్షణాలమీద సామానంతా లోపలకి చేర్చారు. అందరూ స్నానాలు చేసి వచ్చేసరికి వల్లియమ్మ కాఫీ, ఉప్మాలు సిద్దంగా ఉంచింది. కాఫీ,టిఫిన్ తీసుకోడం పూర్తీ అవ్వగానే అమరేంద్ర విమలాచార్యను వెంట తీసుకుని రేంజర్ ఆఫీసుకి వెన్ మీద బయలుదేరాడు.
అక్కడకు వెళ్ళాక తెలిసింది, రేపే అక్కడ "ఖెడ్డా" జరిపించి అడవి ఏనుగుల్ని పట్టబోతున్నారన్న విషయం. అక్కడ ఉన్న ఫారెస్టుగార్డుని, రేంజర్ని గురించి అడిగితే, మరో రెండు, మూడు రోజులవరకూ రేంజర్ని కలుసుకోడం కుదరదనీ, అయన ఖెడ్డా ఆపరేషన్ కి ఏర్పాట్లు చేస్తూ చాలా తొందరలో ఉన్నారనీ, రేపటి ఖెడ్డా పర్యవేక్షణకోసం ఇంకా కొందరు రేంజర్లే కాదు, సిటీ నుండి కన్సర్వేటరు ఆయన మితృలూ కూడా వస్తున్నారనీ, కావలసిన ఏర్పాట్లు చెయ్యడంలో రేంజరు సారు చాలా బిజీ కనక ఇప్పుడు ఆయనకు మాటాడే తీరిక లేదు అనీ నొక్కి చెప్పాడు ఆ ఫారెష్టుగార్డు..
చెప్పవలసిన మాటలు నాలుగూ చెప్పేసి, మాటాడకుండా మళ్ళీ తుపాకీ శుభ్రం చేస్తూ కూర్చుండిపోయాడు ఆ ఫారెష్టు గార్డు.
ఆ గార్డు మాటాడుతున్నది తమిళమో, కన్నడమో తెలియలేదు అమర్ కి. విమలాచార్య దుబాసిగా వ్యవహరించవలసి వచ్చింది. "చందనపుచెక్క కొనుగోలుకు మేము ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చాము. పనైతేగాని వెళ్ళం. ఖెడ్డా అయ్యీదాకా ఇక్కడే ఉంటాము. కాని, ఒక్కమాట! మేముకూడా ఖెడ్డా చూడడానికి వీలు కుదురుతుందా?" అని అడిగింఛాడు అమరేంద్ర .
ఎట్టకేలకు ఆ గార్డు ప్రసన్నుడయ్యాడు. సాయంకాలం ఆరు దాటాక రేంజర్ ఇంటికి వెళ్ళి, ఆయనను కలుసుకుని ఖెడ్డా చూడడానికి పర్మిషన్ తీసుకోమని చెప్పాడు. అంతేకాదు, అద్దెకు భద్రగజాలు దొరుకుతాయనీ, నేలమీద నడిచి వెళ్ళినకంటే ఏనుగుమీద వెళ్ళి ఖెడ్డా చూడడం క్షేమకరమని సలహా ఇచ్చాడు.
* * *
ఇంకా పూర్తిగా వెలుగురాకముందే, అడవిలో సందడి మొదలయ్యింది. అక్కడున్న ఆటవికజాతుల్లో కురుంబాలు, ఇరిలాలు ఎక్కువ మంది ఉన్నారు. అటవీ సంపదనే ఆధారంగా చేసుకుని బ్రతికే జనం వాళ్ళు. బీటు నడిపించడంలో, అడవి ఏనుగుల్ని ఖెడ్డాలోకి తోలడంలో, వీళ్ళు ప్రముఖపాత్ర వహిస్తారు. డప్పులు, తప్పెట్లు, తాళాలు, బాకాలూ మొదలైన మోత ఎక్కువగా ఉండే సామగ్రిని పట్టుకుని వాళ్ళు ఉషారుగా ఖెడ్డా ఉన్న తావుని చేరుకోడం కోసం ఉత్సాహంతో ఉరకలువేస్తూ వస్తున్నారు.
అడవి ఏనుగులను పట్టి బంధించడానికి వాడే దూలాలతో కట్టిన ఆవరణ పేరే "ఖెడ్డా!" కాని, బీటు చేసి, అడవిఏనుగుల్ని బెదిరించి వాటిని ఖెడ్డాలో ప్రవేశింపజేసి, ఆపై వాటిని బంధించి, మచ్చికచేసీ వరకూ జరిగే ప్రక్రియ నంతటినీ కూడా "ఆపరేషన్ ఖెడ్డా" అని వ్యవహరిస్తారు. దాన్ని బాగా కుదించి, మొత్త మంతటినీ సూక్ష్మంగా "ఖెడ్డా" అనెయ్యడం కూడా కద్దు.
వెనకటి రోజుల్లో, దక్షిణ భారతదేశంలో అడవి ఏనుగుల్ని పట్టడానికి వేరే పద్ధతిని ఉపయోగించేవారు. నేలలో పెద్ద పెద్ద గోతులు తవ్వి, వాటిపై వెదుళ్ళు పరిచి, గడ్డి, ఆకులు కప్పి ఉంచి, వాటివైపుగా ఏనుగుల్ని తోలి, ఆ గోతుల్లో పడీలా చేసి, ఆపై ఎంతో ప్రయాసతో వాటిని బంధించేవారు. అందులో ప్రమాదం ఎక్కువ! అందుకనే, అంతకంటే ఏంతో సులభమైన, ఉత్తరాది పద్ధతి అయిన ఖెడ్డాని దక్షణాన కూడా అమలు చెయ్యడం మొదలుపెట్టారు. దేశం మొత్తంలో మచ్చికైన ఏనుగులతో మావటీ మాటాడేది కూడా హిందూస్థానీయే కావడం విశేషం!
ఆ రోజంతా ప్రయాణపు బడలికతో ఉన్నారు అందరూ. సాయంకాలం ఆరు ఔతూండగా రేంజర్ ఇంటికని బయలుదేరాడు అమరేంద్ర. అదృష్ట వశాత్తు రేంజర్ అప్పుడే ఇంటికి వచ్చాడు. తాను వచ్చిన పని ఏమిటో చెప్పి, ఖెడ్డా అయ్యీవరకూ ఆగుతానని చెప్పాడు అమర్. రేంజర్ చాలా సంతోషించాడు. రెంజర్ దగ్గర, మరునాడు ఖెడ్డా చూడడానికి అనుమతి తీసుకుని, ఒక భద్రగజానికి అడ్వాన్సుగా అద్దె కొంత చెల్లించి, రసీదు తీసుకుని, గెష్టుహౌస్ కి తిరిగివచ్చాడు అమర్. తొందరగా భోజనాలు ముగించి, అందరూ ఆ రాత్రి శ్రమతీరా ఒళ్ళుమరచి నిద్రపోయారు.
* * *
ఇంకా వెలుగైనా సరిగా రాకముందే అందరూ లేచి, ఖెడ్డా చూడాలని తయారవ్వడం మొదలుపెట్టారు. ఎప్పుడు లేచిందో ఏమోగాని వల్లియమ్మ కాఫీ, టిఫిన్లతోపాటుగా లంచ్ కూడా తయారుచేసింది. విమలాచార్య, డ్రైవరు తొందరగా బయలుదేరి ఖెడ్డా జరిగే ప్రాంతానికి వెళ్లిపోయారు. యామిని, అమరేంద్ర తయారై వచ్చేసరికి ఏనుగుని తీసుకుని మావటీ వచ్చేశాడు.
ఏనుగుని, దాని మూపుమీద తాళ్ళతో కట్టబడిఉన్న చిన్న పెట్టెలాంటి హౌదానీ విస్తుబోయి చూసింది యామిని. ఆమెకు ఖెడ్డా చూడాలని ఉన్నది వాస్తవమే. ఆమె తన కోరికను ముందు రాత్రి అమరేంద్రకు చెప్పింది కూడా. అతడు ఆమెను కూడా తనతో తీసుకువెళ్ళడానికి ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఆమెకు ఆ చిన్న హౌదాలో ఒంటిగా అతనిపక్కన కూచుని వెళ్ళడానికి సంకోచంగా ఉంది. మ్లానమై ఉన్న ఆమె ముఖాన్నిచూసి, ఆమె సంకోచాన్ని అర్థం చేసుకున్నాడు అమరేంద్ర. అంతలో వాళ్ళ కోసం వల్లియమ్మ సద్ది ఉంచిన లంచ్ బాస్కెట్ పట్టుకుని అక్కడకి వచ్చాడు రాజు.
"అరే, రాజూ! నువ్వు వాళ్ళతో వెళ్ళలేదా? తొందరగా రా, నువ్వూ కూడా వద్దువుగాని మాతో" అన్నాడు అమర్.
మావటీ చెప్పగానే, ఏనుగు మోకరిల్లి కూర్చుంది. హౌదానుండి వేళాడుతున్న తాళ్ళనిచ్చన మీదుగా ఎక్కి హౌదాలో కూర్చున్నారు వాళ్ళు ముగ్గురూ. మావటివాని మాటపుచ్చుకొని లేచి నడవడం సాగించింది ఏనుగు.
ఖెడ్డా జరిగే ప్రాంతం అడవికి లోతట్టున ఉంది. ఆక్కడకి చేరడానికి కాలిదారి ఉంది. కాని అది మనుషులకు మాత్రమే, ఏనుగుకోసం కాదు. ఆ ఏనుగు అడ్డుగా ఉన్న పొదలను తొక్కుకుంటూ, అడ్డువచ్చిన తీగల్ని తొండంతో పట్టి తెంపుకుంటూ మావటి సైగల ననుసరించి, ఖెడ్డా జరిగే ప్రాంతానికి సూటిగా దారితీసింది. ఆ సరికే అక్కడ చాలామంది పోగడి ఉన్నారు. కొందరు చూడాలన్న కుతూహలంతో వచ్చినవారయితే, మరి కొందరు అక్కడి బాధ్యతలను నిర్వహించడానికి వచ్చినవారు. కేవలం ప్రేక్షకులుగా వచ్చిన కొందరు భద్రగజాలమీద ఎక్కి వస్తే, మరికొందరు చెట్లమీద ఎక్కి కూర్చున్నారు. ఇంకా కొందరు నేలమీద నిలబడి ఉన్నారు.
అక్కడి ఆటవిక జాతుల్లో ముఖ్యులు, ఇరిలాలు, కురుంబాలు. ఇప్పుడు జరగబోతున్న "ఆపరేషన్ ఖెడ్డా" లో ప్రముఖపాత్ర వారిదే! ఖెడ్డా నిర్మాణంలో, బీటు నడపడంలో, ఇంకా ఎన్నో చిన్న పెద్దా పనులలో చురుకైన పాత్ర వాళ్ళదే!
ఆ ప్రదేశంలోనే ఉంది బలమైన దుంగలతో కట్టబడిన ఆవరణ. అదే "ఖెడ్డా!" శ్వేఛ్ఛాజీవుల పాలిటి చెరసాల!! అడవిలో హాయిగా తిరిగే ఏనుగులను పట్టి బంధించి, మనిషి ఆజ్ఞకు లోబడి మసిలే బానిసల్లా వాటినిమార్చగలిగే చోటది! తనకు బానిసగా మారిన ఏనుగుకి మనిషి ఇచ్చిన గౌరవప్రదమైన పేరే "భద్రగజం! "
" ఆపరేషన్ ఖెడ్డా" మొదలయ్యే సమయం అవ్వగానే, ఈ ఆపరేషన్ అంతటికీ ఇన్ ఛార్జిగా ఉన్న రేంజర్ మెగా ఫోన్ అందుకుని చెప్పసాగాడు ....
"అయ్యలారా! అందరూ శ్రద్ధగా వినండి. ఇది ఆటకాదు, అడవి ఏనుగులతో భేటీ! వాటితో మనం ముఖాముఖీ తలపడినప్పుడు ఎటువంటి ప్రమాదమైనా జరిగే అవకాశం ఉంటుంది. ఖెడ్డా ఆపరేషన్ తో సంబంధం లేనివారందరూ, దయవుంచి వెంటనే ఇక్కడనుండి వెళ్ళిపోండి. మా మాట వినకుండా మీరు ఇక్కడే ఉంటే, మీ కేదైనా ప్రమాదం జరిగితే మాకుగాని మా ఫారెష్టు డిపార్టుమెంటుకిగాని ఎటువంటి పూచీ లేదు. మా మాటను గౌరవించి, వెళ్ళిపోండి, అది మీకే మంచిది."
అవే మాటలను ముమ్మారు చెప్పాడు రేంజర్ వాళ్ళకు తెలిసే భాషలో. అక్కడ చేరిన వారిలో చాలా మందికి, "ప్రమాదం" అన్నమాట నచ్చకపోడంతో కాబోలు, నెమ్మదిగా ఒకరొకరే జారుకోడం మొదలుపెట్టారు. క్రమంగా ఆ ప్రదేశం చాలావరకు ఖాళీ ఐపోయింది. ఏనుగులమీద ఉన్నవాళ్ళూ, చెట్లేక్కి కూర్చున్నవాళ్ళూ నిబ్బరంగా ఉండిపోయారు.
వేగు వెళ్ళిన వాళ్ళు తిరిగివచ్చి, అడవి ఏనుగుల గుంపు ఎక్కడ మేస్తోందో తెలియజేశారు. వెంటనే రేంజర్ ఆజ్ఞమేరకు ఫారెస్టుగార్డులు, బీటు నడపడంకోసం కూలికి పిలిచిన ఆటవికులందరికీ డప్పులు, డబ్బాలూ, వాటిని మోదేందుకు అవసరమైన కర్రలూ, కొమ్ముబూరాలూ వగైరా బాగా ధ్వనిని పుట్టించే సామగ్రిని అందించారు. బాగా మోతచేసే సీమటపాకాయలు, బాంబులు మొదలైన బాణసంచా కూడా వెంట నుంచుకున్నారు. ఫారెస్టుగార్డుల చేతుల్లో ఓల్డుమోడల్ తుపాకులు ఉన్నాయి.
బీటు చేసే జనాన్ని మూడు భాగాలుగా విభజించారు. ఒక్కొక్క గుంపు ఒక్కొక్క పక్కన ఉండేలా.- ఖెడ్డా ఉన్నవైపు ఖాళీగా వదలి, తక్కిన మూడువైపులా చేరి గోలచేస్తూ ఏనుగుల్ని భయపెడితే - అవి, ఏ శబ్దం లేకుండా, ఖాలీగా ఉన్న నాల్గవ దిక్కుకి ప్రాణ భయంతో పరుగుపెట్టి తెరిచి ఉన్న ఖెడ్దాలో జొరబడతాయి - అన్నది ప్లాను.
ఈ గందరగోళం ఏమీ తెలియని అడవి ఏనుగులు పాపం! మామూలుగా, ప్రశాంతంగా, తొండంతో పట్టి వంచి చెట్ల కొమ్మల్ని విరుచుకుని ఆకులు తింటూ, హాయిగా తిరుగుతున్నాయి. ఆ గుంపులో ఎనిమిది ఏనుగులు ఉన్నాయి. వాటిలో రెండు గున్నలు. అవి తల్లిని అంటి పెట్టుకుని ఉండి పాలుతాగుతూ, తల్లి చూపించిన లేత చిగుళ్ళను తొండంతో తెంపి నోట్లో ఉంచుకుని నములుతూ, సరదాగా ఒక దాని నొకటి కవ్వించుకుని పరుగులు పెడుతూ వినోదిస్తున్నాయి.
ఆ గుంపులో ఒక కొమ్ముటేనుగు ఉంది. పెద్దపెద్ద దంతాలతో రాచఠీవి ఉట్టిపడుతూ ఉన్న ఆ ఏనుగే ఆ గుంపుకి రాజు. మరో రెండు చిన్నదంతాలతో ఉన్నవి కూడా ఉన్నాయి. తక్కినవి ఆడఏనుగులు, పిల్లలు!. ఆఫ్రికా ఏనుగులకిలా, ఇండియాలో ఉన్నఆడ ఏనుగులకు దంతాలు ఉండవు. తేలికగా గుర్తుపట్టవచ్చు.
బీటు చెయ్యడానికి వచ్చిన జనం, నిశ్శబ్దంగా వచ్చి మూడువైపులా చుట్టుముట్టి, అప్పుడు తప్పెటలూ తాళాలూ మ్రోగిస్తూ, కొమ్ముబూరాలు ఊదుతూ, బాణసంచాని, తుపాకులనీ పేలుస్తూ, పెద్దగా కేకలుపెడుతూ గందరగోళం సృష్టించారు. భయంకరమైన ఆ శబ్దానికి బెదిరిన ఏనుగులు, ఆ శబ్దం లేని దిక్కుగా పారిపోవడం మొదలుపెట్టాయి.బీటుకూడా వెన్నంటి ఉండి, వాటిని ఖెడ్డా వైపుకే నడిపించింది.
బీటు నడుపుతున్న గార్డులు అనుకోకుండా, అందరూ కూడబలుక్కున్నట్లు ఒకేసారి తుపాకులు పేల్చడంతో, చెవులు పగిలేలా భయంకరమైన శబ్దం వెలువడింది. పెద్దపెద్ద చెవులున్న ఏనుగులకు ఆ శబ్దం మరింత పెద్దదిగా భయానకంగా వినిపించడంతో అవి, ఒళ్ళుతెలియని భయంతో వివశ మై దిక్కుతోచని భయంతో కకావికలై పరుగెత్తాయి. ఆ కంగారుతో కొమ్ముటేనుగు బీటుకి అడ్డంగా పరుగెత్తింది. దాని వెంట మరో రెండు ఏనుగులు పరుగెత్తాయి.. తమవైపుగా దూసుకువస్తున్న కొమ్ముటేనుగును చూసి, బేజారైపోయిన బీటు నడిపే జనం, చేతిలోని వస్తువులన్నీ కిందపారేసి, ఒకే ఇదిగా దౌడుతీసి కకావికలై పారిపోయారు.
కొన్ని ఏనుగులు మాత్రం సూటిగా పరుగెత్తుకుని వెళ్ళి ఖెడ్డాలో దూరిపోయాయి. వెనువెంటనే చాటున పొంచి ఉన్న జనం వచ్చి, దూలాలతో కట్టిన బలమైన తలుపుతో ఖెడ్డా ద్వారాన్ని మూసి, అది కదలకుండగా వైర్లతో, తాళ్ళతో బలంగా బిగించి కట్టేశారు. 5 ఏనుగులు మాత్రం ఖెడ్డాలో బందీలై ఉండిపోయాయి.
అక్కడ ఉన్న జనమంతా విజయోత్సాహంతో కేకలు పెడుతూ కేరింతలు కొట్టారు. ఇంతవరకూ అడవిలో, స్వేచ్చగా మసులుతూ, తమ దారిన తాము కుటుంబజీవితాన్ని గడుపుతున్న ఆ ఏనుగులు, మానవుని తెలివికీ, స్వార్ధానికీ లొంగి, ఖెడ్డాలో బందీలై, తమ స్వేచ్చా స్వాతంత్ర్యాలని పోగొట్టుకుని, శేషజీవితాన్ని మనిషికి బానిసలై బ్రతకనున్నాయి!
"ఆపరేషన్ ఖెడ్డా" సగం ముగిసింది. ఈ తరవాత జరిగేదంతా ఓర్పుతో నేర్పుతో కొనసాగించవలసిన పని. ఇక మనం చూడవలసింది ఏమీ లేదు ఇక్కడ. ఇక వెడదామా" అని అడిగాడు తమిళంలో మావటీడు. అమర్ "సరే" అనగానే ఏనుగు ఇంటి మొహం పట్టింది.
ఆ ఏనుగుల దుర్దశకు యామిని కళ్ళు చెమ్మగిల్లాయి. "అబ్బా! ఎంత ఘోరం" అనుకుంటూ బాధగా నిట్టూర్చింది.
"ఈ సృష్టి మొత్తం స్వార్ధమే ప్రాతిపదికగా సాగుతోందన్నది నిజమే! కాని, మరీ ఇంత ఘోరమా! హద్దులుదాటిన స్వార్ధం వినాశానికి హేతువౌతుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం శూన్యం. మనిషి తన తప్పు తాను తెలుసుకునీ లోగానే సమయం మించిపోవచ్చు" అనుకున్నాడు అమరేంద్ర.
వాళ్ళ మనసులు దు:ఖంతో బరువెక్కాయి ఒక విశేష విషయాన్నిచూశామన్న సoతోషం ఇద్దరికీ లేకపోయింది.
" మరలతో నడిచే క్రేన్లు,బుల్డోజర్లు లాంటివి ఎన్నో వచ్చాక ఇక ఈ ఏనుగులతో పనేముంది? ఇంకా వీటిని బాధపెట్టడం ఎందుకు" అని తమిళంలో అడిగాడు అమరేంద్ర మావటీని.
అతడు జవాబు చెప్పాడు, "నాగరికత ఎంత పెరిగినా సారూ ! మనిషికి ప్రకృతితో అవసరం ఉంటూనే ఉంటుంది. చెట్లను పడగొట్టి పెద్ద పెద్ద దూలాలుగా కోస్తారు. ఆ దూలాలను ఎత్తి లారీలకు ఎక్కించడానికి ఎందరో మనుష్యులు కావాలి. అదే పనిని ఏనుగు సునాయాసంగా చెయ్యగలదు. అంతేకాదు, చాలా చోట్ల నేల చిత్తడిగా, బురదతో నిండి ఉంటుంది. సాధారణంగా మరికొన్నిచోట్ల నేల ఎగుడుదిగుళ్ళతో రాళ్ళతో నిండి ఉంటుంది. ఉంటుంది. అక్కడకి ఏ బండీ రాలేదు. అటువంటిచోట కూడా ఈ ఏనుగులు పనిచేస్తాయి. దూలాల్ని రోడ్డుదాకా మోసుకొచ్చి, లారీల్లో ఎక్కిస్తాయి. ఒకసారి ఏనుగుని పట్టి మచ్చికచేసి, పని నేర్పితే, ఆ తరవాత మనిషికి విధేయంగా ఉండి, అవి మనకెంతో సాయం చేస్తాయి.. అంతేకాదు, ఏనుగుని పెంచడం మంగళప్రదమనీ, ఇది సిరికి చిహ్నమనీ మనవాళ్ళ నమ్మకం. అందుకే ధనవంతుల ఇళ్ళలో, దేవాలయాల్లో విధిగా వీటిని పెంచుతారు. ఇక సర్కస్ కంపనీవాళ్ళు సరేసరి! వీటి విన్యాసాలు వాళ్ళ ఆటకే శోభనిస్తాయి. ఇక కొంతలో కొంత జ్యూలలో కూడా వీటిని పెంచుతారు. విదేశీయులు కూడా వీటిని కొనుక్కుపోయి, వాళ్ళ జంతు ప్రదర్శన శాలల్లో ప్రదర్శించి డబ్బు సంపాదించాలని చూస్తారు. ఏనుగువల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కనకనే, అంతలా ప్రాణాలకు తెగించి వాటిని పట్టి మచ్చిక చేసి అమ్మీ, వాటిచేత పనిచేయించీ ప్రయోజనాన్ని పొందుతున్నాడు మానవుడు.
మావటీ తమిళంలో చెప్పినదంతా తెలుగులోకి మార్చి చెప్పాడు అమరేంద్ర. అదంతా విన్న యామిని మనసులో దుఃఖం సుళ్ళుతిరిగింది. " పులులు, సింహాలూ లాంటివాటిని కౄర మృగాలు - అంటారు. కాని అవి ఆహారంకోసం జంతువుల్ని చంపుతాయి. చచ్చిపోయిన జీవికి ఇక ఏ కష్టమూ అంటదు. అక్కడితో ఆ చాప్టర్ క్లోజయిపోతుంది. మనిషిని మించిన కౄరుడు మరెక్కడా ఉండడు. ఇండియా, ఆఫ్రికా, మలేసియా, సింహళం లాంటి ఉష్ణ ప్రదేశాల్లో ఉండే ఏనుగుల్ని, బలవంతంగా శీతలదేశాలకు తీసుకుపోయి చిన్న చిన్న గదుల్లో బంధించి ఉంచి, ఇంత తిండిపదేసి, తమబాధ్యత తీరిపోయింది అనుకునీ వాళ్ళని ఏమనాలి? తమదికాని వాతావరణంలో, చలికి ఒణుకుతూ, కదిలేందుకు చాలిన చోటు దొరకక చావుకంటే హీనంగా జీవఛ్చవాలుగా బతికే ఆ నిర్భాగ్య జీవుల్ని తలుచుకుంటే ఏడుపు ఆగడం లేదు. ఇంతకంటే ఘోరమైన దుర్మార్గం ఇంకేదైనా ఉందా!" అలా అనుకునీ సరికి యామినికి నిజంగానేదుఃఖం ఎగసి వచ్చింది. అంతలో ఏనుగు గెష్టుహౌస్ ని చేరుకుని మోకరించింది. ఎలాగో ఏడుపుని ఉగ్గబట్టి ముందుగా ఏనుగు దిగి, తన గదిలోకి పరుగెత్తింది యామిని.
అమరేంద్ర లోపలకువెళ్ళి తాము తినడం కోసం తెచ్చుకున్న అరటిపళ్ళలో కొన్ని తెచ్చి మావటీకి ఇచ్చి ఏనుగుకు పెట్టమని చెప్పాడు . ఏనుగు తిన్న తరవాత మావటీకి కొoత సొమ్ము బహుమానంగా ఇచ్చి పంపించాడు అమర్.
లంచ్ బాక్సు తెచ్చి వళ్ళీయమ్మ ముందు ఉంచాడు రాజు. అందులోని భోజనం ఎవరూ ముట్టుకున్న జాడ లేకపోడం చూసి ఆశ్చర్యపోయింది ఆమె. మంచి నీళ్ళు మాత్రం కొంచెంగా ఖర్చయ్యాయి, అంతే!
"ఆహా! ఆ హడావిడిలో తిండిమాట ఎవరికీ గుర్తు రాలేదు. ఇప్పుడు వడ్డించు, తింటాము" అంటూ బట్టలు మార్చుకునీందుకు వెళ్ళాడు అమరేంద్ర. అంతలో విమలాచార్య, డ్రైవరూ కూడా తిరిగివచ్చారు.
* * *
(సశేషం)