కిందపడే పండుతో
భూమ్యాకర్షణ శక్తిని
కంటిముందు నిరూపించి
ప్రపంచాన్ని నివ్వెరపరిచిన
మేధావిని నేనే!
కనిపించని కారుచీకటిని
ఛేధించడానికో దీపం
దాన్ని వెలిగించడానికి
విద్యుత్తూ కనిపెట్టిన
ఘనుణ్ణి, ఔను నేనే!
లక్షల మైళ్ళ దూరానున్న
చంద్రుళ్ళో కుందేల్ని తాకుతూ
సగర్వంగా జెండా ఎగరేసి
విజయంతో తిరిగొచ్చిన
గొప్పవాణ్ణీ నేనే!
మారణాయుధం ప్రయోగించి
ఒక్క అణువిస్ఫోటనంతో
ప్రపంచాన్ని క్షణకాలంలో
మాడ్చి మసిచేయగల
కర్కసుడు మరెవరోకాదు నేనే!
నీళ్ళన్నీ వృధాచేసి
వనాలనీ జలచరాలనీ చంపుకుంటూ
వికట్టహాసంతో నాట్యం చేస్తూ
భావి తరాలకి సర్వనాశనాన్ని
అందించబోయేది; ఇంకెవరు నేనే!
వర్షాలన్నీ స్థంభించి నదులన్నీ ఎండినప్పుడు
ధృవ మంచు వెల్లువతో ముంచెత్తిన నాడు
మారణాయుధంతో నేలమట్టం జరిగిన రోజు
ప్రాణి అన్నది ప్రపంచంలోంచి అదృశ్యం చేసే
విలయానికి కారణం, మానవుడినైన నేనే!
కానీ …
జగత్సంహారం వెంటే విసుగులేని ప్రయాసతో
మరోసారి పచ్చదనం నింపడానికి
అట్టడుగు లోతుల్లోంచి పెరిగే మొలకలూ
వాటిని పైకి రప్పించే అవ్యక్త శక్తీ
సర్వనాశనం మాత్రమే చేతనైన నాదే?
అమోఘ శక్తిమంతుణ్ణని విర్రవీగిన
గడ్డిపరకని మొలిపించలేని
గరికపోచకి సాటిరాని మానవుణ్ణి
ఏదైనా చేయగలననుకునే నేనే?
నేనే? నే..నే? నేనేనా? నే..నే..నా?
మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)
|
|
గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)