అమెరికాలో తెలుగు భాషాసేవకై కృషి చేస్తున్న సిలికానాంధ్ర మనబడి తెలుగు కార్యక్రమంలో భాగంగా ఏటేటా ఉపాధ్యాయుల, సమన్వయకర్తల ప్రశిక్షణ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ ఏడాది ఈ సదస్సులు మూడు ప్రాంతాలలో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రెండవ సదస్సు ఈ వారాంతం ప్రిన్స్ టన్, న్యూజెర్సీ లో జులై 24-26లలో జరిగింది. మనబడి విస్తరణ విభాగ ఉపాధ్యక్షులు శరత్ వేట నేతృత్వంలో, ప్రశాంతి & మహేష్ మారం రెడ్డి, రత్న వేట, శ్రీధర్ & మాధురి కొండగుంట, రాజేశ్వరి రామానంద్, కిరణ్ దుద్దాగి, సునీల్ వేమురెడ్డి, శ్రీనివాస్ కొరిటాల, సోమేష్ వీరమనేని, ప్రసాద్ మానికొండ, ప్రత్యూష వెంపరాల మరియు ఇతర న్యూజెర్సీ బృందం ఈ కార్యక్రమాన్ని అత్యంత సమర్ధవంతంగా, విజయవంతంగా నిర్వహించారు. చేయూతనిచ్చి, ఒక చక్కటి కుటుంబ వాతావరణం కలిపించి అతిథులందరినీ ఆత్మబంధువుల్లాగ ఆదరించి వీడ్కోళ్ళు సమయంలో కళ్ళు చెమరింపజేసేలా నిర్వహించారు. కనెక్టికట్, ఫ్లోరిడా, జార్జియా,ఇండియానా, మేన్, మేరీల్యాండ్, మాసాచుసెట్స్, మిషిగన్, న్యూ జెర్సీ, న్యూయార్క్, నార్త్ కెరొలినా, ఒహాయో, పెన్సిల్వేనియ, టెన్నెస్సీ, వర్జీనియా తదితర రాష్ట్రాల నుండి; సౌత్ ఆఫ్రికా, స్కాట్లండ్, కెనడా వంటి ఇతర దేశాల నుండి కూడా మనబడి ఉపాధ్యాయులు, సమన్వయకర్తలూ మరియు కీలక బృందంలోని సభ్యులు, మొత్తం నూట ముప్పైమంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రణాళిక విభాగపు మూల స్థంభాలలో ఒకరైన వేణు ఓరుగంటి తమ అమూల్య సలహాలనందించారు. అందరు స్వచ్చంద భాషాసైనికులని ఒకచోటికి తెచ్చి, వారి అనుభవాల ద్వారా, వివిధ కార్యాచరణ అంశాలని క్రోడీకరించి వాటిని భవిష్యత్ వ్యూహరచనలో పొందు పరుచడం, జట్టుబలం పెంచి “భాషాసేవయే భావితరాల సేవ” అన్న స్పూర్తితో ఎక్కువమంది పిల్లలు తెలుగు నేర్చుకోవాలన్న లక్ష్య సాధనే ఈ సదస్సుల ప్రధాన ఉద్దేశ్యం అని, మనబడి డీన్ మరియు అధ్యక్షులు చమర్తి రాజు తెలిపారు.
ఈ సదస్సులలో ముఖ్యభాగంగా "ఉపాధ్యాయ ప్రశిక్షణ" విధానాన్ని, ప్రాచీన భాషనుంచి ప్రపంచభాషగా తెలుగును తీసుకువెళ్ళే ఆశయం, పాటించవలసిన శిక్షణాప్రమాణాల గురించి పాఠ్యప్రణాళిక ఉపాధ్యక్షురాలు కూచిభొట్ల శాంతి, రాయవరం విజయ భాస్కర్, ఓరుగంటి వేణుగోపాల కృష్ణలు వివరించారు. ఇంకొక ప్రధానాంశం, విద్యాసంవత్సరం చివరిలో నిర్వహించిన అభిప్రాయసేకరణలో దాదాపు వెయ్యిమంది తల్లిదండ్రులు ఇచ్చిన స్పందనని విశ్లేషించి చర్చించడం. అత్యంత కీలకమైన ఈ చర్య మనబడి దిశానిర్దేశానికి ఎంతగానో ఉపయోగపడుతుందని, ప్రాచుర్యం విభాగం ఉపాధ్యక్షులు రాయవరం విజయభాస్కర్ చెప్పారు.
శుక్రవారం 23వ తేదీన సభ్యుల జట్టుకట్టు, పరిచయాలతో మొదలయి శనివారం కార్యక్రమ అభివృద్ధి, ప్రాచుర్యం, పాఠ్యప్రణాళిక, అంతర్జాల సేవలు, అమెరికాలోని పాఠశాలలో తెలుగుకు అధికారిక అన్యభాషా గుర్తింపు మొదలయిన విభాగాలను నిర్వహిస్తున్న సభ్యులు తమ ప్రయత్నాలను అందరితో పంచుకున్నారు. ఆదివారం వివిధ అంశాలపై మేధోమథనం సాగించారు. ఉపాధ్యాయ ప్రశిక్షణ కార్యక్రమం, భాషాభిమానంతో పిల్లలకి తెలుగు నేర్పడానికి ముందుకు వచ్చేవారికి పాఠ్యప్రణాళికపై సరైన అవగాహన వచ్చి, మనబడి లక్ష్యాల సాధనలో దోహదపడుతుందని, కూచిభొట్ల శాంతి తెలిపారు. దేశవ్యాప్తంగా, ఎక్కడ పది తెలుగుకుటుంబాలు ఉంటాయో అక్కడ మనబడి ప్రారంభిస్తామని శరత్ వేట తెలిపారు. అనేక ఆర్ధికపరమైన అంశాల గురించి మరియు వినియోగాల గురించి ఆర్ధిక విభాగ ఉపాధ్యక్షులు దీనబాబు కొండుభట్ల చక్కని వివరణ ఇచ్చారు. మనబడి పోర్టల్ గురించి కొట్ని శ్రీరాం, ప్రపంచభాష గుర్తింపు మరియు పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయ పరీక్ష, స్నాతకోత్సవాల గురించి గంటి శ్రీదేవి, సాంస్కృతికోత్సవాలపై వేదుల స్నేహ, తెలుగు మాట్లాట గురించి నిడమర్తి శ్రీనివాస్ ప్రసంగించారు. శతావధాని, “కళా వాచస్పతి”, “అవధానశిరోమణి” శ్రీ నరాల రామరెడ్డి ఈ సమావేశాలకు ప్రత్యేకాతిథిగా విచ్చేసి కీలకోద్దేశ ప్రసంగం చేసారు. శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులవారి అమ్మాయి పుట్టపర్తి నాగపద్మిని అతిథిగా పాల్గొన్నారు.