ఆచార్యుడు, శాస్త్రజ్ఞుడు, రాజనీతిజ్ఞుడు మొదలైన బాధ్యతలను విజయవంతంగా పోషించిన మహనీయుడు, ఎ.పి.జె. అబ్దుల్ కలాం. భారతదేశ యువతకు ‘కలలు ( Dreams )’ ఎలా కనాలో నేర్పిన గురువు ఆయన. అత్యుత్తమ పురస్కారం ‘భారతరత్న’ బిరుదును పొంది, భారత పదకొండవ రాష్ట్రపతిగా విమర్శలకు అతీతంగా సేవలను అందించారు. ప్రథమపౌర పీఠానికే వన్నె తెచ్చారు. ఇరవై ఒకటవ శతాబ్దంలో భారతదేశం ‘అబివృద్ది చెందిన దేశం’ లా ఎదగడానికి దిశానిర్దేశం చేసిన దార్శనికుడు కలాం. సమాజాబివృద్ది కోసం, సామాన్య మానవుడి శ్రేయస్సు కోసం ఆయన పడిన తపనే శ్లాఘనీయం. క్రమశిక్షణ, కలలుగనే మనస్తత్వం, అసాధారణ కార్యాలను నిర్వర్తించడానికి కావాల్సిన ఆత్మస్తైర్యం, అపజయాలకు బెదరని ముక్కవోని ధైర్యం, ‘ మనిషి’ని ‘మనీషి’గా తీర్చిదిద్దుతాయనడానికి నిలువెత్తు నిదర్శనం ‘ డాక్టర్ అవుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం’.
అంతటి మహనీయుడు నిర్యాణం చెందిన శోకసమయంలో ‘సిలికానాంద్ర’ ఆశ్రుపూరిత నివాళులు అర్పిస్తున్నది.