మహాశివరాత్రి !
భారతీయుడి మహా పర్వ దినాలలో ప్రముఖమైనది.
ఆసేతుశీతాచల పర్యంతమూ భక్తజనం చేసుకొనే మహాశివరాత్రి ప్రాముఖ్యత, జాగరణ అంతరార్థం, లింగోద్భవ కాలం అంటే ఏమిటి? ఈ నియమాలను ఏర్పరచడం వెనుక మన పూర్వ ఋషుల ఉద్దేశ్యం ఏమిటి? ఆ సత్యాలను తెలుసుకోవడం, తెలుసుకొని ఆచరించడమే వారికి మనమివ్వగల ఘన నివాళి. అదే ఈ వ్యాస పరమార్థం!
ప్రతి నెల అమావాస్యకు ముందు రోజును మాసశివరాత్రి పర్వదినంగా మన ఋషులు గుర్తించారు. ప్రముఖంగా ఫాల్గుణ మాసంలో వచ్చే శివరాత్రిని మహా శివరాత్రిగా ప్రస్తుతించారు.
మహా శివరాత్రి పర్వదినం మనకు జ్ఞప్తికి తెచ్చేది పగలంతా ఉపవాసం, రాత్రంతా మేల్కొని జాగరణ చేయడం, ఇంకా అర్ధరాత్రి అవుతుండగా శివాలయాలలో లింగోద్భవ కాలాన్ని సూచిస్తూ బిల్వ పత్రాలతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఇలా ఎన్నో అర్చనా నీరాజనాలు!
శివాలయాలలో మాత్రమే కనబడే మరో విశిష్టత, అక్కడ అర్చింపబడే మూర్తి. రాముడు, విష్ణువు, కృష్ణుడు, వినాయకుడు ఇలా అన్ని ఆలయాలలో పూజలందుకొనే మూర్తుల పూర్వ రూపాలు మానవాకారం పోలి ఉంటే ఒక్క శివాలయాలలో మాత్రమే లింగాకారం అర్చించబడుతుంది. ఒక లింగ ఆకృతి, కింద ఒక పాను వట్రం, పైన జలధార - ఇది మనకు అక్కడ కనిపించే చిహ్నం.
ఇతే ఒక చిహ్నాన్ని పరమ శివుడిగా ఎందుకు గుర్తు పెట్టారు? దీనిలో ప్రత్యేకత ఏమిటి?
మూర్తి త్రయంలో సృష్టి కర్త బ్రహ్మ, ఆ సృష్టిని కొనసాగించే స్థితికారుడు విష్ణువు, లయకారుడు శివుడు. ఒక్కటే అయిన చైతన్య స్థితి ఘన, ద్రవ, వాయు రూపాలతో కూడిన ఈ విశ్వంగా ఏర్పడటమే బ్రహ్మ. అలా ఏర్పడిన విశ్వం కొనసాగడం విష్ణు. అదే విశ్వం మళ్ళీ పూర్వ స్థితి అయిన చైతన్యంలోకి లయించిపోవడం శివ. ఈ మూడూ ప్రతి క్షణం అలుపెరగక సాగుతూ ఉండే ప్రక్రియలు. అంటే మనందరి జీవితాలు ఎందులో లయించిపోతాయో అదే శివ. అట్టి పరమ శివుడికి రూపం కల్పించడం అర్థరహితంగా తోచి ఉండవచ్చు మన మహర్షులకు. సర్వం లయించిపోయి, నామ రూపాలు లేకుండా పోయి పూర్వ స్థితిలోకి జారుకొనే అత్యద్భుత స్థితికి రూపం ఏర్పరచడం అసంబద్ధం అని వారి ఉద్దేశ్యం కావచ్చు.
మరి లింగాకారానికి ఉన్న విశిష్టత ఏమిటి?
పంతొమ్మిదవ శతాబ్దానికి చెందిన మోనియర్ విలియమ్స్, వెండీ డోనిగర్, గస్టవ్ అప్పర్ వంటి ఐరోపా, జపాను దేశానికి చెందిన పాశ్చాత్యులు లింగాకారానికి నీచోపమానాలు కల్పింప చూసారు.
అయితే ఆ కాలంలోనే ఉద్భవించిన స్వామి వివేకానంద, స్వామి శివానంద, క్రిస్టోఫర్ ఐషర్వుడ్ వంటి మహానుభావులు దానిని ఖండించి లింగాకారం వెనుక ఉన్న అంతరార్థాన్ని వివరించారు.
పారిస్ లో జరిగిన మతాలు, వాటి చరిత్రలకు సంబంధించిన సమావేశాలలో స్వామి వివేకానంద ఇలా వివరించారు.
"యూపస్తంభమనే స్తంభాన్ని గురించి అధర్వవేద సంహితలోని ప్రసిద్ధ స్తవం శివలింగపూజకు మూలం. ఆ స్తవంలో ఆద్యంతాలు లేని స్తంభాన్ని గూర్చి వర్ణన ఉంది. శాశ్వత బ్రహ్మ స్థానంలో ఈ స్తంభం ఉంచబడింది. యఙ్ఞంలోని అగ్ని, ధూమం, భస్మం, జ్వాలలు, సోమలత, యఙ్ఞానికి సమిధలు చేరవేసే వృషభం - వీటి నుండి శివుని తనుకాంతి, జటలు, నీల కంఠం, వృషభం మీద శివుడు స్వారి చేయటం మొదలైన భావాలు ఉత్పన్నమైనాయి. క్రమంగా యూపస్థంభం శివలింగానికి చిహ్నంగా పరిణమించింది"
ఇక మహా శివరాత్రికి సంబంధించిన పురాణ కథలు అనేకం. పురాణ కథలను వాటి అంతరార్థంతో కలిపి అవగాహన చేసుకుంటేనే సంపూర్ణత చేకూరుతుంది. లేకపోతే మూఢనమ్మకాలుగా, అంధ విశ్వాసాలుగా మిగిలి పోతాయి.
మహాస్మశానంగా పేరు గాంచిన కాశి నగరంలో ఒక వేటగాడు ఉండేవాడు. ఒకనాడు వేటాడి, అలసిపోయి అతడు ఇంటికి తిరిగివస్తున్నాడు. దారిలో ఒక పులి కనిపించడంతో అతడు దాని నుండి తప్పించుకోచుకోవడానికి ఒక చెట్టు పైకెక్కి కూర్చున్నాడు. పులి ఆ చెట్టు కిందకే వచ్చింది. ఎంతకీ అది వెళ్ళటం లేదు.
అలసిపోయిన ఆ వేటగాడు ఆ రాత్రి అక్కడే గడపవలసి వచ్చింది. నిద్రకు తూలి కింద పడతానేమోనని భయంతో, అతడు ఆ రాత్రంతా ఆ చెట్టు ఆకులు తెంపి కిందకి వేయసాగాడు. ఆ విధంగా అతడు రాత్రంతా నిద్ర మేల్కొన్నాడు. అతడు మరణించగానే, యమ దూతలకు బదులు శివ గణాలు వచ్చారు.
తనకు శివ లోకం ప్రాప్తించిందని తెలిసి ఆశ్చర్యపోయిన ఆ వేటగాడు వారిని ప్రశ్నించాడు."అయ్యా, నేను జీవితమంతా వేటాడి జీవించాను. ఒక్క పుణ్య కార్యమూ చేయలేదు. నాకెలా శివసాయుజ్యం లభించింది?" అనడిగాడు.
"నీవు జన్మంతా చేసిన చెడ్డ పనులన్నీ ఒక్క రాత్రి భయ భక్తులతో చేసిన శివ పూజలతో సమసిపోయాయి. అందుకే నీకు శివలోకం ప్రాప్తించింది"
"రాత్రి నేనేమి శివ పూజ చేశాను? పులి బారి నుండి తప్పించుకోవడానికి చెట్టెక్కి కూర్చున్నాను".
"అయ్యా, నిన్న మహాశివరాత్రి. నీవు ఎక్కిన చెట్టు బిల్వ వృక్షం. రాత్రంతా నిద్ర మానుకొని, జాగారం చేసి, బిల్వ పత్రాలతో ఆ చెట్టు కిందున్న శివలింగాన్ని అర్చించావు. అదే నీకు పుణ్యఫలం సాధించిపెట్టింది.".అని చెప్పి అతడిని శివ సన్నిధికి కొనిపోయారు.
ఈ కథ వెనుక ఉద్దేశం .. “ శ్రద్ధలేక, అదేమిటో కూడా తెలియకుండా, పూజలు చేసేస్తే శివ సాన్నిధ్యం లభిస్తుందని అర్ధం చేసుకోమని కాదు”!
అటువంటి అసంకల్పిత చర్యకే అంతటి ఫలితం ఉంటే చిత్త శుధ్ధితో, బుధ్ధిపూర్వకంగా చేసే సాధనకు మరెంత ఫలితముంటుందో గుర్తించమని భావం.
మరొక కథనం ప్రకారం మహేశ్వరుడు శివ తాండవం ఆడిన పర్వదినం మహాశివరత్రి.
శివ తాండవం అంటే ఏమిటో తెలియచేయాలంటే అది అనుభవించిన వాడే చెప్పగలడు. అట్టి అనుభవానికి జాతి, కుల, మత, దేశ కాల నియమాలు లేవని తెలియ చేయడానికే ఒక పాశ్చాత్యుని అనుభవం ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.
డా. ఫ్రిట్జ్ ఆఫ్ కాప్రా అమెరికాలో నివసించే భౌతిక శాస్త్రవేత్త. డెబ్బయ్యవ దశకంలో ఉన్న కాప్రా వయోవృధ్ధుడే కాదు; అభివృధ్ధుడు, ఙ్ఞాన వృధ్ధుడు కూడా. ఙ్ఞానికి, చైతన్యానుభవానికి దేశ కాలాలు అడ్డుకావని చెప్పడానికి ఒక సజీవ ఉదాహరణ డా.కాప్రా. అతడు తన 'తావో ఆఫ్ ఫిజిక్స్' అనే గ్రంథం ఉపోద్ఘాతంలో పొందుపరిచిన అనుభవం ఇది:
"ఐదు సంవత్సరాల క్రితం కలిగిన అద్భుతమైన అనుభవం నన్ను ఒక కొత్త మర్గంలో నడిపించి, ఈనాడు ఈ గ్రంథ రచనకు ప్రేరణగా నిలిచింది.
ఒకనాటి ఎండాకాలం సాయంకాలం సముద్రపు ఒడ్డున వచ్చి పోయే అలలను చూస్తూ, నా శ్వాసనిశ్వాసల లయబద్ధతను గమనిస్తూ కూర్చొని ఉన్నాను. ఉన్నట్టుండి నా అంతరంగానికి ఈ చుట్టూ ఉన్న వాతావరణమంతా ఒక గొప్ప నృత్యంలో భాగంగా నాట్యం చేస్తున్నట్టు గోచరించసాగింది.
ఒక శాస్త్రవేత్తగా ఈ ఇసుక, రాళ్ళు, నీరు, గాలి - అన్నీ కదుల్తున్న అణు, పరమాణువుల చేత చేయబడినవని తెలుసు. అలాగే భూమి యొక్క వాతావరణమంతా పదార్థ రాశి నిర్మింపబడడానికి అణుపరమాణువుల మధ్య జరిగే నిరంతర సంగ్రామాన్ని ఒక భౌతిక శాస్త్రవేత్తగా గ్రాఫ్లు ,బొమ్మలు, సూత్రాల ద్వారా మాత్రమే ఎరిగి ఉన్నాను.
కానీ ఈనాడు చల్లని ఈ సయం సంధ్య నా పుస్తక ఙ్ఞానికి ప్రాణం పోసింది.
శక్తి తరంగాలు ఆకాశం నుండి దిగిరావడం నేను చూశాను.
లయబద్ధంగా ఆ శక్తి తరంగాలు పదార్థ రాశిగా మారడం, తిరిగి శక్తిగా లయించిపోవడం నేను చూశాను.
పదార్థంలోని పరమాణువులను నేను దర్శించగలిగాను.
నా శరీరంతో సహా సర్వంలోనూ ఉన్న ఆ అణుపరమాణువులు ఒక మహా శక్తి తరంగ నృత్యంలో భాగాలుగా నర్తించటం చూశాను.
ఆ లయను నేను గుర్తించాను.
ఆ శబ్దాన్ని నేను విన్నాను.
ఆ క్షణంలో నేను అనుభూతి చెందింది హిందువులు నటరాజుగా పూజించే పరమశివుని తాండవంగా తెలుసుకొని పరవశంతో నన్ను నేను మరచిపోయాను.
సజల నయనాలతో కాలం తెలియని అలౌకిక స్థితికి తీసుకెళ్ళిన ఆ అనుభూతిని, కాదు అనుభవాన్ని ఏమని వర్ణించగలను?!!
ఈ అనుభవమే నా గమ్యాన్ని, గమనాన్ని మార్చే దిక్సూచి అయింది. నా అడుగులు తూర్పు దేశాలలోని అద్భుత విద్య వైపు కదిలేలా చేసింది. ఎందరో మహనీయులను దర్శించే అవకాశం కలిగించింది".
చివరగా జాగరణ ఎలా ఉండాలో వివరిస్తాను..
సినిమలు చూస్తూనో, కబుర్లు చెప్పుకుంటూనో నిద్ర మేల్కోవడం జాగరణ అనిపించుకోదు. జాగరణ స్వరూపం ఎట్టిదో అరుణాచల మహర్షి, భగవాన్ శ్రీ రమణ మహర్షి అనుభవపూర్వకంగా రుచి చూపారు. టి.కె సుందరేశ అయ్యర్ వ్రాసిన "ఎట్ ది ఫీట్ ఆఫ్ భగవాన్" అనే గ్రంథంలో పొందుపరిచిన సంఘటన ఇది.
"ఆనాడు మహా శివరాత్రి. రాత్రి ఎనిమిది గంటలు. భగవాన్, భక్తులు భోజనాలు ముగించుకొని, ధ్యాన మందిరంలో ఆసీనులయ్యారు. ఒక సాధకుడు లేచి, రమణ మహర్షికి నమస్కరించి, "భగవాన్, ఈ రోజు మహాశివరాత్రి. దక్షిణామూర్తి స్తోత్రానికి అర్థం చెప్తే మీ ద్వారా వినాలని ఉంది" అని అడిగాడు. "అలాగే తప్పకుండా" అన్నారు మహర్షి. అందరూ శ్రద్ధగా మహర్షి ఏం చెప్తారో అని వారి వైపు చూస్తున్నారు. మహర్షి కదలక, మెదలక, కన్నార్పక నిశ్చల చిత్రంలా కూర్చొని ఉన్నారు. మాటలు లేవు. కదలిక లేదు. ఉన్నదంతా మౌనమే . క్షణాలు దొర్లిపోతున్నాయి. ప్రతివారు మహర్షి వైపు, మహర్షి శూన్యంలోకి చూస్తున్నారు.
బరువుగా గడియారం గంట కొట్టింది. తెల్లావారు జాము నాలుగు అయింది.
"అదీ దక్షిణా మూర్తి స్తోత్రం అంతరార్థం " అన్నారు మహర్షి. అందరిలో ఒక్కసారి చలనం వచ్చింది. అంతవరకూ అన్ని గంటలపాటు ప్రపంచం తెలియక, ఒకానొక అలౌకిక స్థితిలో నిలిచిపొయిన అనుభూతి, అనుభవం వారి గుండెల్లో పదిల పరుచుకొని నిత్యకృత్యాలకు ఉపక్రమించారు."
జాగరణ అంటే అది!
అధ్యాత్మికంగా పురోగమించాలని సాధన చేసే ప్రతి వారికీ ఈ శివ రాత్రి అత్యంత ముఖ్యమైనది. శాస్త్రీయంగా ఈ రాత్రికి ఒక ప్రత్యేకత ఉంది. ఫల్గుణ మాసంలో అమావాస్యకు ముందు రోజు భూగోళపు ఉత్తరార్థం మానవుడిలోని శక్తి ఉత్థానంగా ఉండేలాగా కక్ష్యలో అమరుతుంది. వెన్నెముక నిటారుగా ఉంచి, శ్వాస మీద నియంత్రణ ఉండేవారు తమలోని శక్తి ఊర్ధ్వముఖంగా మారడాన్ని సూక్ష్మంగా గమనించగలరు. ఆ కొద్దిసేపు వారి శ్వాస నాసిక రెండు వైపులా సమాంతరంగా సాగుతుంది!
కనుక అధ్యాత్మికత మానవ శ్రేయస్సుకై ఉద్దేశించిన పురోగమన శాస్త్రమని, అందులో భాగంగానే మహా శివరాత్రి వంటి పర్వ దినాలు చిరస్మరణీయాలైనాయి.
ఈ ప్రపంచమందుండు మహనీయులందరి అనుగ్రహాశీస్సులు సదా మనను కాపాడుగాక!