వీక్షణం-42 వ సమావేశం ఫిబ్రవరి 14, 2016 తారీఖున, అనగా రథసప్తమి నాడు, క్యుపర్టీనో నగరములోని పాలడుగు శ్రీ చరణ్ గారి స్వగృహమున జరిగినది. ఈ సభకు ప్రముఖ రచయిత, వీరేశలింగంగారి జీవిత చరిత్ర పరిశోధన కర్త అయిన అక్కిరాజు రమాపతి గారు అధ్యక్షత వహించారు.
ఈ సభలో సరికొత్త ముఖ్యాంశం ప్రపంచ వ్యాప్తంగా తెలుగు రచయితల పూర్తి వివరాలను, రచనలను, వారి శ్రవణ, దృశ్య మాలికలను పొందు పరిచేందుకు "తెలుగు రచయిత" అంతర్జాల స్థావరము (వెబ్ సైటు) ను డా॥ గీతా మాధవి గారు ప్రకటించారు. అధ్యక్షులు అక్కిరాజు రమాపతి గారిచే ఈ బృహత్ కార్యక్రమము ఆవిష్కరించబడినది. తెలుగు రచయితల గురించి సంపూర్ణ వివరములన్నీ భావి తరాలకు అందుబాటులో ఉండే విధంగా ఒక చోట భద్రపరచడం ధ్యేయంగా తనకు వచ్చిన ఆలోచనను ఒక ఉద్యమముగా రూపొందించడానికే ఈ ప్రయత్నము అని గీత గారు వివరించారు. అధ్యక్షులు రమాపతి గారు "తెలుగు రచయిత" ప్రణాళికనీ, ధ్యేయాన్ని అభినందిస్తూ "ఇది చాలా పెద్ద కార్యక్రమము. ఏ పెద్ద యూనివర్శిటీ వారో, సంస్థ వారో చేయవలసిన పనిని గీత చేస్తోంది. పైగా ఆడియో, వీడియో లను కూడా పెడుతున్నారు. ఈ ప్రయత్నము చాలా గొప్పది, దీనిని అందరూ ప్రోత్సహించ వలసినదే" అని తెలిపారు.
అధ్యక్షులు అక్కిరాజు రమాపతి గారి ప్రారంభోపన్యాసము: "నేను వయసులో పెద్దవాడిని. ఇక్కడ ఉన్న వారిలో పాత తరము ప్రముఖ రచయితలతో పరిచయము కలిగిన వాడిని ప్రస్తుతము నేనేనేమో. నాకు ఇప్పటి వరకు చాలా మంది ప్రముఖులతో పరిచయము కలిగింది. దేవులపల్లి కృష్ణ శాస్త్రి, మామిడిపూడి వెంకట రంగయ్య, కంభంపాటి రామ శాస్త్రి (హరిజన బాలికను పెండ్లి చేసుకున్న సంఘ సంస్కర్త), దామెర్ల వెంకట్రావు (దామెర్ల రామారావు గారి పిన తండ్రి కొడుకు), తారకం, వేముల కూర్మయ్య, అయ్యదేవర కాళేశ్వర రావు గారితో మంచి పరిచయముండేది. నేను బహుశా కలవని ఆనాటి ప్రముఖులు శ్రీ పాద సుబ్ర హ్మణ్య శాస్త్రి, అడివి బాపిరాజు గారు మాత్రమే.
రఘుపతి వెంకటరత్నము నాయుడు గారు నిజంగానే బ్రహ్మర్షి. ఒకసారి ఆయన బెజవాడ నుండి మద్రాసు ప్రయాణం చేస్తున్నప్పుడు పొన్నేరి రైల్వే స్టేషన్లో దిశ మొలలతో తిరుగుతున్న ఇద్దరు అనాధ బాలికలు కనిపించారు. వారు మద్రాసు చేరుకోగానే పట్టాభి సీతారామయ్యగారిని పంపించి ఆ ఇద్దరు బాలికలను తన దగ్గరకు తెప్పించి, చదువు చెప్పించి ప్రయోజకులను చేసారు. పట్టాభి గారిని పిల్లలు ఎత్తుకుపోతున్నారని ముందు పోలీసులు అడ్డగించారట. కానీ, తరువాత రఘుపతి వెంకటరత్నం గారు తీసుకురమ్మన్నారని తెలిసిన తరువాత అభ్యంతరం తెలుపలేక పోయారట.
నేటి తరం ఆనాటి మహనీయులను మరచిపోవటం నిస్పృహని కలిగిస్తున్నది.
తరువాత వెంకట నాగ సాయి గారు "అదిగో అల్లదివో --" అన్నమచార్య కీర్తనతో సభను అలరింప చేసారు.
మొదటి ప్రసంగం మహమద్ ఇక్బాల్ గారిది. వారు ఏనుగుల వీరాస్వామయ్య గారు 200 సంవత్సరముల క్రితము వ్రాసిన "కాశీ యాత్రా చరిత్రము" నుండి కృష్ణా, గోదావరి మధ్య దేశపు వివరాలను వివరించి, ఇక్బాల్ గారి చిన్నతనములో కర్నూల్ నుండి హైదరాబాద్ వరకూ వారు ప్రయాణించిన దారి సాపేక్షతను చూపారు. కాలం మారినా ఆ దారి, దారిలోను, హైదరాబాద్ నగరములోని అంగళ్లు నేటికి కూడా పెద్ద మార్పులు లేకుండా కనబడుతున్నాయని వివరించారు.
వీరాస్వామయ్య గారిని ట్రావెలాగ్ వ్రాయమని సి.పి. బ్రౌన్ గారు ప్రోత్సహించారని అధ్యక్షులువారు రమాపతి గారు తెలిపారు.
ఇక్బాల్ గారి ప్రసంగ విశేషాలు: ఏనుగుల వీరాస్వామయ్య గారి కాశీ యాత్ర చరిత్రము తెలుగులో మొదటి ట్రావెలాగ్. వీరాస్వామయ్య గారు ఈ పుస్తకములో ఆనాటి దేశ, కాల, పర్యావరణ పరిస్థితులని విపులంగా వర్ణించారు. వీరాస్వామయ్య గారు మద్రాసులో అదాలత్ కోర్టులో మొదటి ద్విభాషా అధికారి. అనగా తెలుగు, ఆంగ్ల భాషలలో కోర్టు వ్యవహరాలను నడిపినవారు. ఆయన ఆ రోజులలో 5000 మందికి ఏకాదశి భోజన సంతర్పణ చేసేవారు.
ఆయన వ్రాసిన చరిత్రలో ఒంటిమిట్ట పోతన గారి విగ్రహము దగ్గరనుండి, దారిలో ఒక బండరాయి పైన ఇంకొక బండరాయి నిలబడడము దాక చక్కని వర్ణన. అవి అన్నీ నేటికీ కనబడతాయి. ఆయన జడచర్ల, శంసాబాదు, బేగంబజారు, కార్వాన్, చంద్రఘట్టం, శాలిభండ మొదలయినవి పేర్కొన్నారు. నేటి హైదరాబాద్ లోని ఇంగ్లీషు వారి దండు (Military Cantonment) గురించి, తురకల జపశాల (అనగా మక్కా మసీదు), ముర్గీ చౌక్, గుజ్రీ అంగడి, నిజాం దేవిడీ మొదలైనవి పేర్కొన్నారు. ప్రతి ప్రదేశము గురించి విపులంగా పేర్కొన్నారు. ఉదాహరణకి గుజ్రీ అంగడిలో 200 సంవత్సరముల క్రితము పాత సామాన్లు అమ్ముతున్నారని చెప్పారు. నేటికి కూడా గుజ్రీ అంగడిలో పాత సామాన్లు (పాత్రలు, బుత్తలు మొదలైనవి) అమ్మటము చూడవచ్చు. చార్మినార్ పరిసర ప్రాంతాలలో ఆయుధాలే భూషణములుగా ధరించి తిరిగేవారిని పేర్కొంటూ, వారితో వ్యవహరించటానికి "వాక్ పౌరుష్యము" కావాలని చెప్పారు. నేటి టాంక్ బండ్ పై జాతులవారిని (తెల్లవారిని) తప్ప వేరెవరినీ ఎక్కనిచ్చే వారు కాదని పేర్కొన్నారు. ఇంకా గోలకొండ, నిజాము దేవిడి దగ్గరి బగీచా లో పైకి లేచే జలధారలు (Fountains) గురించి వర్ణించారు. నిజాము రాజ్యం కుంపిణీకి (East India Company) నెలకు 3 లక్షల రూపాయలు చెల్లించేదని వివరించారు.
రమాపతి గారు ఆనాటి విశేషాలు చెపుతూ, "ఒకసారి మంధురాంతకం రాజారావు గారిని ఒక పెద్దాయాన మీరు ఆరోగ్యం బాగా చూసుకోండి అని చెప్పేరట. అప్పటికి రాజారావు గారికి వయసు పైబడింది. రాజారావు గారు, "ఏమీ ఫర్వాలేదు, నా ఆఖరి రచన అయ్యేదాకా నా ఆరోగ్యానికి డోకా లేదు" అని చెప్పారు. వెంటనే మొదటి పెద్దమనిషి, "అయితే మీరు ఆఖరి రచన చెయ్యబాకండి" అని సలహా ఇచ్చాడట." అని అన్నారు.
తరువాతి కార్యక్రమము "తెలుగు రచయిత" కు శంఖారావము. ఈ కార్యక్రమంలో తెలుగు రచయిత ప్రకటన పత్రం ఆవిష్కరణ అధ్యక్షులు రమాపతిరావు గారు, శ్రీ వేమూరి, శ్రీ కిరణ్ ప్రభ, శ్రీ వేణు ఆసూరి, శ్రీ సుభాష్, డా॥కె.గీత ల చేతుల మీదుగా జరిగింది. గీత గారి ప్రసంగం తర్వాత తెలుగు రచయిత కమిటీ సభ్యులు వేణు ఆసూరి, సుభాష్ గార్లు కార్యక్రమ ఇతర వివరాలు తెలియజేసారు. ఈ బృహత్ కార్యక్రమానికి తొలి ఆమోద ముద్ర "తానా" నించి రావడం ముదావహమని మొదటి చెక్కు ఇచ్చి ఆర్థిక సహకార ప్రారంభం చేసిన శ్రీ చరణ్ అన్నారు. ఇందులో మూడు విధాలుగా సహాయం చెయ్యవచ్చని గీత గారు ప్రకటించారు. 1) రచయితలు తమ పూర్తి సమా చారాన్ని అందజెయ్యవచ్చు. 2) రచయితలు తమకు తెలిసిన రచయితల సమాచారాన్ని లేదా గత రచయితల రచనలూ, వివరాలూ, ఫోటోలూ, ఆడియో, వీడియో టేపులూ వివరాలు తెలియజెయ్యవచ్చు. 3) ఆర్థిక సహాయం చెయ్యవచ్చు. 'రచయితల పరిచయ పత్రం' మొ.న వివరాలకు ఈ మెయిల్ telugurachayita@gmail.com ద్వారా సంప్రదించవచ్చని అన్నారు.
కవి సమ్మేళనం విశేషాలు:
1. రథసప్తమి సందర్భముగా వేణు ఆసూరి గారు శ్రీ కృష్ణార్జున యుద్ధం లో ఘంటశాల గారు పాడిన శ్లోకాన్ని, శ్రావ్యముగా పాడారు.
నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః |
జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః
జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః |
నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః
అక్కిరాజు సుందర రామకృష్ణ గారు పంపిన సందేశాన్ని, వారు వ్రాసిన ఈ కింది పద్యాన్ని కూడా చదివి వినిపించారు.
వర గుణు డైన"మారుతి"కె వ్యాకరణంబులు నేర్పినట్టి,స
ద్గురుడు,ప్రచండ తేజు డయి గొప్పగ దోచెడు పద్మ మిత్రుదౌ
గరిమను ,పండితా ళియు ఘనంబుగ మెచ్చ,వచించి నట్టిశ్రీ
చరణుని,"విశ్వ బంధు"నిగ సల్పును గావుత సర్వ దేవతల్!
అవని సురులకు గాయత్రి "అమ్మ" యనుట
"కల్పకం"బనుటలవి నిక్కంబు గాదు!
సత్య మరయంగ "గాయత్రి "సకలురకును
కన్న తల్లియే! ఒక్కింత మిన్న గూడ!
2. పాలడుగు శ్రీ చరణ్ గారు రథసప్తమి సందర్భముగా మయూరుని సూర్య శతకము గురించి చదివిన శ్లోకము, వివరణ:
శ్రీ చరణ్ గారు రధసప్తమి సందర్భముగా చేసిన ప్రసంగం:
మయూరుడు సూర్యాష్టకము, సూర్యశతకము రచించినాడు. మయూరిడికి కుష్ఠు వ్యాధి వచ్చినప్పుడు రోగ నివారణ కొరకు సూర్యుడిని స్తుతించుతూ ఈ సూర్య శతకము చెప్పినాడు. ఈ స్తుతితో సూర్యుడు ప్రత్యక్షమై మయూరిడికి రోగ విముక్తి కలిగించాడు. ఇది అత్యుత్తమమైన కవిత్వము. ఈ వర్ణన ఎంత గొప్పగా ఉన్నదంటే, శ్రీనాధుడు కాశీఖండములో సూర్య స్తుతి కోశము మయూరిడి శ్లోకాలని యథాతథముగా అనువదించాడు.
రాజశేఖరుడు అనే కవి మయూరిడి ప్రతిభ గురించి ఈ విధముగా వర్ణించాడు:
దర్పం కవి భుజంగానామ్ గతా శ్రవణగోచరమ్
విశ్వవిద్యేవ మయూరి మయూరి వాన్ నికృంతతి
దర్పముతో కూడిన నాగులకు (భుజంగములకు) మయూర శబ్దముతో గర్వము ఎలా నశించుతుందో
దర్పంతో కూడిన దుష్కవులకి మయూరుని పాండిత్యము వలన నాశనము కలుగుతుంది.
3. వెంకట నాగ సాయి గారు "బ్లాండు కన్య" అంటూ చక్కని హాస్యముతో కూడుకున్న పద్యాలని వినిపించి అందరినీ కడుపుబ్బ నవ్వించారు.
4. డా ॥ కె. గీత గారు అరుణ్ సాగర్ నివాళి గా రాసిన "మంత్ర పుప్పొడి" కవిత్వ పఠనం చేసారు.
కొన్ని పంక్తులు:-
కవికి మరణం ఉందేమో కవిత్వానికి మరణం లేదు కదూ!
రచయిత కాల గర్భంలో కుంచించుకు పోతున్న
నీటి బొట్టు చివరి ఊపిరి చిత్రం నన్ను మెలకువలోనూ వెంటాడుతూంది.
అనుభవైక వేదననీ అనుభూతుల వెల్లువని
అనుక్షణం అక్షరీకరించే కవి హృదయాన్ని
ఇక సజీవీకరించవలసిందే-
5. కూరపాటి భాస్కర్ మాట్లాడుతూ తమ వంటి ఆరునెలల అతిథులకి వీక్షణం కార్యక్రమాలు ఉపిరినిస్తున్నాయని అన్నారు. కార్యక్రమాలకు కొన్ని సూచనలు ఇచ్చారు.
వీక్షణం కార్యక్రమములో అందరూ ఎంతగానో ఎదురు చూస్తూ , ఆహ్లాదముగా పాల్గొనే కిరణ్ ప్రభ గారి క్విజ్ కార్యక్రమము ఎంతో ఆసక్తిగా కొనసాగింది. సభలో తెలుగు పండితులు, కవులు చాలా మంది ఉన్నారు. శ్రీమతి వందన, శ్రీమతి సాయిబాబా, శ్రీమతి భాస్కర్, శ్రీమతి & శ్రీ కొండారెడ్డి, శ్రీమతి లత వెంపటి, శ్రీమతి తాయిబా , శ్రీ మన్సూర్, శ్రీ ప్రసాద్ నల్లమోతు, శ్రీ లెనిన్, శ్రీ గోపాల స్వామి, శ్రీ చుక్కా శ్రీనివాస్ మొ.న పలువురు ఇందులో పాల్గొన్నారు.