ఈ క్రింది "ప్రశ్న"కు పద్య రూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖులోపలపంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేటతెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము.
ఈ మాసంప్రశ్న:
(సమస్య) తక్కువ డబ్బున్నవాడె ధనవంతుడిలన్
గతమాసం ప్రశ్న:
ఫిబ్రవరి 16 శ్రీకృష్ణదేవరాయలు జయంతి. ఆయన గౌరవార్ధము ఈ నెల పూరంచవలసిన సమస్య:
'దేశభాషలందు తెలుగు లెస్స'
ఈ ప్రశ్నకు మాకు అందిన క్రమములో పూరణలు ఇలా వున్నాయి.
రాజేశ్వరి నేదునూరి, న్యూజెర్సీ
మంచు జిలికి నట్లు మధుర రాగములీను
జీవ మొలుకు నంట జిలుగు వెలుగు
నితర దేశ మందు మితిమీరి పొగడంగ
దేశ భాష లందు తెలుగు లెస్స
సూర్యకుమారి వారణాసి, మచిలీపట్టణం
సీ.
తెలుగు భాష ఘనత తెలిపిరి శ్రీ కృష్ణ
దేవరాయలు నాడె దివ్యముగను
తెలుగు భాషను పండితులు పామరులు గూడ
పంచామృత ప్రాయ మంచు నెంచు
తెలుగు భాష సొగసు తెలుసుకొన్న మనసు
తేలిపోవును పూల తేరు పైన
వినసొంపగు తెలుగు విధిగ నేర్చిన మేలు
భాష సౌందర్యము పట్టు పడును
ఆ.వె.
తీయనైన భాష తెలుగన్నది నిజము
ప్రతిపదార్థ ముండు ప్రతిపదముకు
నాణ్యముగను వెలసి నానార్థములునొప్పు
దేశ భాషలందు తెలుగు లెస్స
కృష్ణ అక్కులు
(1)
తెలుగు పలుకు మోము వెలుగు నందముగను
తెలుగు పదము వినగ కలుగు హాయి
పిలవగా తెలుగున వేల్పులు దిగిరారె
దేశభాష లందు తెలుగు లెస్స
(2)
'సరిగమప'లలోన చక్కగా నొదుగునె
కూచిపూడి జతులకు జత యగునె
తెలుగు పదము, హాయి కలుగ జేయగ, కాదె
దేశభాష లందు తెలుగు లెస్స
డా. రామినేని రంగారావు యం.బి.బి.యస్, పామూరు, ప్రకాశం జిల్లా.
తూర్పు భాషలందు తుల్యంబు ఇటలీకి
ద్వర్ధ్యి కావ్యములకు తానె నెలవు
ఆద్య భాష యిదియె అవధానముల కెల్ల
దేశ భాషాలందు తెలుగు లెస్స
చావలి విజయ, సిడ్నీ
భాష తెలుపు జనుల భావము ,వీనుల
విందు తె లుగు , పలుక వీలు, రాత
కుదురు మె చ్చ బుధులు , గోముగా ననిరంత
దేశ భాషలందు తెలుగు లెస్స.
సుమలత మాజేటి, క్యూపర్టీనో
తెలుగ దేల యన్న దేశంబు అమెరికా
తెలుగు వాడ నేను దెలిసి కొనుడు
తెల్ల వారు వినగ తెలుప గోరుచుబల్క
' దేశభాషలందు తెలుగు లెస్స'
టేకుమళ్ళ వెంకటప్పయ్య, విజయవాడ
ఆంగ్ల బాష జదివి 'అమ్మ 'ను మరచెను
తెలివి పెరిగి తాను తెలుగు మరచె
కమ్మ దనపు తెలుగు కలలోనె మనకింక
దేశభాషలందు తెలుగు లెస్స!
గండికోట విశ్వనాధం, హైదరాబాదు
సీ.
ఏ భాషలో మాట లేదేశ వసతైన
మురిపించి తెలిగించు ముచ్చటలను
ఏ భాషలో పాట లింపార సొంపార
స్వరముల రసహేల సంతరించు
ఏ భాషలో యాస లెందేని వినిపించ
ఏ ప్రాంత వాసులో ఎరుక పరచు
ఏ భాషలో పద్య మేయింట పఠియించ
తెలుగింటి వారంచు తెలియ బరచు
ఆ.వె.
అట్టి సరస మధుర సాహిత్య సంగీత
ఆశు కవితల కలితావధాన లలిత
మాట పాటలందు మేటియై మెప్పించు
దేశ భాషలందు తెలుగు లెస్స.
ఇంద్రగంటి సతీష్ కుమార్, చెన్నై
(1)
తెలుగు పలుకు నోట తేనెలొలుకు ఊట,
తెలుగు భాష గొప్ప తెలియ జెప్ప,
భరత భూమి నున్న భాషలె గాక వి
దేశ భాష లందు తెలుగు లెస్స!
(2)
చెప్పె రాయలపుడు చెఱగని మాటను,
తెలుగు వారమిపుడు తెలియ జెప్ప
వచ్చు గర్వముగను, వసుధ మీద సకల
దేశ భాష లందు తెలుగు లెస్స!